Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

చిత్రసమీక్ష

movie review
చిత్రం: కంచె 
తారాగణం: వరుణ్‌ తేజ్‌, ప్రజ్ఞా జైస్వాల్‌, నికితిన్‌ థీర్‌, శ్రీనివాస్‌ అవసరాల, గొల్లపూడి మారుతీరావు, పోసాని కృష్ణమురళి, రాజేష్‌, షావుకారు జానకి తదితరులు. 
చాయాగ్రహణం: వి.ఎస్‌. జ్ఞానశేఖర్‌ 
సంగీతం: చిరంతన్‌ భట్‌ 
దర్శకత్వం: క్రిష్‌ 
నిర్మాణం: ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ 
నిర్మాతలు: వై రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు 
విడుదల తేదీ: 22 అక్టోబర్‌ 2015 

క్లుప్తంగా చెప్పాలంటే 

రాయల్‌ ఇండియన్‌ ఆర్మీలో కెప్టెన్‌గా పనిచేస్తుంటాడు దూపాటి హరిబాబు. అదే రాయల్‌ ఇండియన్‌ ఆర్మీలో కల్నల్‌గా పనిచేస్తుంటాడు ఈశ్వర ప్రసాద్‌ (నికితిన్‌ థీర్‌). వీరిద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు. హరిబాబుని చంపాలని ఈశ్వరప్రసాద్‌ ప్రయత్నిస్తుంటాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్‌ ఆర్మీ తరఫున రాయల్‌ ఆర్మీకి చెందిన 75 వేల మంది సైనికులు వెళ్తారు. అందులో ఈశ్వరప్రసాద్‌, హరిబాబు ఉంటారు. ఇంకోవైపు రాచకొండ సంస్థానానికి చెందిన సీత (ప్రజ్ఞా జైస్వాల్‌)తో చదువుకునే రోజుల్లో ప్రేమలో పడతాడు దూపాటి హరిబాబు. అటు యుద్ధం, ఇటు ప్రేమ. వీటితోపాటు సొంత ఊళ్ళో సామాజిక పరిస్థితులు. ఇన్ని అంశాలతో యుద్ధం చేస్తుంటాడు హరిబాబు. తను ఎంతగానో ప్రేమించిన సీతను హరిబాబు దక్కించుకున్నాడా? ఈశ్వరప్రసాద్‌తో వైరంలో హరిబాబు విజయం సాధించాడా? ఊరిలోని సామాజిక పరిస్థితులేంటి? అనే ప్రశ్నలకు సమాధానాలు తెరపైనే దొరుకుతాయి. 

మొత్తంగా చెప్పాలంటే 

నటనలో ఎంతో పరిణతి చెందాడు వరుణ్‌ తేజ. షార్ప్‌ లుక్స్‌, అందులోనే అమాయకత్వం వరుణ్‌ తేజ ప్రత్యేకత. ఈ సినిమాలోని దూపాటి హరిబాబు పాత్రలో వరుణ్‌ తేజ ఒదిగిపోయాడు. ఈ పాత్రకు వరుణ్‌ తప్ప ఇంకొకర్ని ఊహించుకోలేమని దర్శకుడు క్రిష్‌, సినిమా నిర్మాణంలో ఎందుకు అన్నాడో సినిమా చూస్తే అర్థమవుతుంది. కమర్షియల్‌ హీరోయిజం తప్ప, కథకు అవసరమైన హీరోయిజం ప్రదర్శించే అవకాశం వరుణ్‌కి దక్కింది. ఆ రకంగా వరుణ్‌ అదృష్టవంతుడు.  హీరోయిన్‌ ప్రజ్ఞాజైస్వాల్‌ మంచి నటనతో ఆకట్టుకుంటుంది. క్యూట్‌గా ఉంది. ఆమె తెరపై కన్పించినంతసేపూ ఆహ్లాదంగా అనిపిస్తుందంటే, ఆమె అందం, ఆమె నవ్వు కారణమని చెప్పవచ్చు. విలన్‌ నికితిన్‌ థీర్‌ చాలా బాగా చేశాడు. విలన్‌ ఎంత స్ట్రాంగ్‌గా కనిపిస్తే, హీరో అంతకన్నా స్ట్రాంగ్‌గా అనిపిస్తాడు. దక్కిన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు నికితిన్‌. తెలుగులో ఇతనికి వరుసగా అవకాశాలువ వస్తాయనడం నిస్సందేహం.  

అవసరాల శ్రీనివాస్‌ తన ట్రేడ్‌ మార్క్‌ కామెడీతో అలరించాడు. గొల్లపూడి మారుతీరావు తన పాత్రలో జీవించారని చెప్పడం సబబు. మిగతా పాత్రధారులంతా తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.  కమర్షియల్‌ కోణంలో ఆలోచించకుండా కథను, కథా గమనాన్ని ఎంచుకున్నందుకు దర్శకుడు క్రిష్‌ని అభినందించాలి. మాటలు చాలా బాగున్నాయి. చాలా సందర్భాల్లో వచ్చిన డైలాగులు ప్రతి ఒక్కర్నీ ఆలోచింపజేస్తాయి. మాటల రచయిత సాయిమాధవ్‌ బుర్రా తన పదునైన మాటలతో సినిమాకి ప్లస్‌ అయ్యాడు. సంగీతం బాగుంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాకి అవసరమైన మూడ్‌ని క్రియేట్‌ చేసింది, ప్రేక్షకుడు సినిమాలో లీనయ్యేందుకు బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఉపకరిస్తుంది. ఎడిటింగ్‌ చాలా బాగుంది. ఇలాంటి సినిమాల్లో 'సాగతీత' అన్న మాట తేలిగ్గా వినిపించేస్తుంది. కానీ, ఈ సినిమాకి అది జరగలేదంటే అది ఎడిటింగ్‌ పనితనమే. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌, కాస్ట్యూమ్స్‌ సినిమాకి ప్రాణం పోశాయి. వీటి కారణంగా చూసే ప్రేక్షకులు గొప్ప అనుభూతికి లోనవుతారు. సినిమాటోగ్రఫీ అద్భుతం. నిర్మాణపు విలువలు చాలా చాలా బాగున్నాయి. 

దర్శకుడు క్రిష్‌ ఎప్పుడూ తన పంధా వీడి, కమర్షియల్‌ పంథాలోకి వెళ్ళిపోవాలనుకోలేదు. 'గమ్యం' నుంచి ఈ సినిమా దాకా, నమ్మిన కథ చుట్టూనే అతని ప్రయాణం సాగింది, సాగుతోంది కూడా. సినిమాలో ప్రేక్షకుల్ని లీనం చేయగలిగాడుగానీ, ఇంకా గొప్పగా పాత్రల్ని తీర్చిదిద్దాల్సి ఉంది. కథ అంత పదునైనది. కమర్షియల్‌ హంగులు లేకపోవడంతో అవి ఇష్టపడేవారు నిరాశపడొచ్చుగానీ, సినిమా చూశాక మాత్రం ఖచ్చితంగా మంచి ఫీల్‌ లభించిందని ప్రతి ఒక్కరూ చెబుతారు. మాస్‌, కమర్షియల్‌ అనే మాటలు ఈ సినిమా వరకూ ఎవరూ ఉపయోగించకపోతేనే మంచిది. ఫస్టాఫ్‌ ఎంత స్మూత్‌గా సాగుతుందో సెకెండాఫ్‌ కూడా అంతే స్మూత్‌గా సాగుతుంది. ఫీల్‌, భావోద్వేగం, ప్రేక్షకులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యే యద్ధ సన్నివేశాలు అన్నీ అద్భుతంగా కుదిరాయి. ఖచ్చితంగా చూడదగ్గ సినిమానే ఈ 'కంచె'. 

ఒక్క మాటలో చెప్పాలంటే 

మంచి ఫీల్‌ ఈ 'కంచె' సొంతం 

అంకెల్లో చెప్పాలంటే: 3.5/5
మరిన్ని సినిమా కబుర్లు
interview