Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నా ప్రేయసిని పట్టిస్తే కోటి

 

జరిగిన కథ: జర్నలిస్టు లహరి కోర్టుకు హాజరై తనిచ్చిన రిపోర్ట్‌ మీద త్యాగరాజన్‌కి వ్యతిరేకంగా స్టేట్‌మెంట్‌ యివ్వాల్సిన రోజు. అంతకు రెండ్రోజుల క్రితంనుంచే టివిల్లోను. పత్రికల్లోను జర్నలిస్టు లహరి సైదాపేట కోర్టుకు హాజరు కానున్న విషయాన్ని భిన్న కథనాలుగా వార్తలొస్తాయి. తొమ్మిది గంటలకే పత్రికా విలేకర్లు కోర్టుకు చేరుకుంటారురు. వివిధ ఛానళ్ళకు చెందిన రిపోర్టర్లు వీడియో కేమెరాలతో పరుగులెత్తుకొస్తారు. రచయిత్రి సహస్ర, జర్నలిస్టు లహరి ఒకరే  అని తెలిసి పోడంతో సిటీలోని ఆమె అభిమానులంతా లహరిని చూడాలని కోర్టుకి చేరుకుంటారు.. ఆ తరువాత... 

మునుసామి కదిరేశన్‌లు కూడా గెటప్‌ మార్చుకునే వచ్చారు. కావి పంచెలు లుంగీల్లా చుట్టుకొని చొక్కాలు ధరించారు. తలకి తుండు చుట్టుకొని చుట్ట దమ్ము కొడుతూ పల్లెటూరి పెద్ద మనుషుల్లా తయారై వచ్చారు. వాళ్ళ ననుసరించి సాధారాణ పౌరుల్లా ధర్మ మిత్ర బృందం మునుసామి కదిరేశన్‌ మనుషులు కోర్టు ఆవరణలోకి వచ్చారు. అందరికి దుస్తుల మాటున ఆయుధాలు సిద్ధంగా వున్నాయి. అవసరమైతే రంగంలోకి దిగిపోడానికి తగిన ఏర్పాట్లతో వచ్చినా ఎవరికి వారు సంబంధం లేనట్టు తామూ సాధారణ పౌరులతో కలిసి పోయి విడివిడిగా ఆవరణలోనే తిరగసాగారు.

‘‘ఏం చేద్దాం. హర్యానా షూటర్స్‌ ఇద్దర్నీ ముందు వేసేద్దామా?’’ కదిరేషన్‌ మునుసామి చెవిలో గొణిగాడు.

‘‘తొందరపడకు. కోర్టు ఆరంభించకుండానే గొడవ జరగటం మంచిదికాదు. బయట జనంలో ఆ పాండ్యన్‌ గాడి మనుషులూ మనలా కలిసిపోయి తిరుగుతున్నారు. గొడవ మొదలైతే అదిరణరంగమే. సహస్ర కోర్టులో ప్రవేశించే వరకు మనల్ని ఎట్టి పరిస్థితిలోనూ తొందర పడొద్దనీ విరాట్‌ చెప్పాడు. సహస్రకూడా ఫోన్‌లో అదే విషయం చెప్పింది. నాకెందుకో అనుమానంగా వుంది. సరిగా చూడు. మనలాగే పోలీసులు కూడా మప్టీలో జనంలో తిరుగున్నారు. మనం జాగ్రత్తగా ఉండాలి’’ అంటూ హెచ్చరించాడు మునుసామి. వీళ్ళంతా లోనకెళ్ళకుండా బయటే తిరుగుతూ పరిస్థితిని గమనించసాగారు.

ఇదిలా ఉంటే ఇక్కడ ఎవరూ వూహించని మరో విశేషం జర్నలిస్టు లహరి అభిమానులు ఎందరో ఆమెను చూడాలని ఆమె స్టేట్‌మెంట్‌ వినాలని ఆశేషంగా తరలి రావటం. దాంతో కోర్టు ప్రాంగణమంతటా ఎటు చూసినా జనం కన్పిస్తున్నారు. అప్పటికే లోన విజిటర్స్‌ గాలరీ జనంతో కిక్కిరిసిపోయింది. లోన చోటులేక అనేక మంది కోర్టు వరండాలోను బయటే ఉండిపోయారు. సాధారణ కానిస్టేబుల్స్‌ కొద్దిమంది ఉన్నారు. వాళ్ళే జనాన్ని అదలించి కంట్రోల్‌ చేసే ప్రయత్నం చేసారు.

ఆ విధంగా కోర్టు ప్రాంగణమంతటా ఏ క్షణంలోనయినా బద్దలవటానికి సిద్ధంగా వున్న అగ్ని పర్వతంలా ఉంది, ఏ చిన్న గొడవ మొదలయినా అది రణ రంగానికి దారితీసి ఆ ప్రాంతం రక్తసిక్తమైపోతుంది. అటు త్యాగరాజన్‌ వర్గం ఇటు విరాట్‌ వర్గాలు రెండూ చాపకింద నీరులా చేరిపోయి అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా వున్నాయి. అటు గాలరీలో ప్రవేశించిన దీక్ష కింద కోర్టు హాల్లోని బోను కన్పించేలా ఆ చివర ఒకడు ఈ చివర  ఒకడుగా పౌరులతో కలిసిపోయి కూచున్న హర్యానా షూటర్స్‌ యిద్దర్నీ గుర్తించింది. పిల్లిలా ఒకడి వెనక్కి విరాట్‌ రెండోవాడి వెనక్కి ధర్మా చేరిపోయి ఏమీ తెలీనట్టు కూచున్నారు. ముగ్గురమ్మాయిలతో బాటు గాలరీ మధ్యలో ఒక చోట కూచున్నాడు చందూ.

ఇలా తలో చోట సెటలయి సిద్ధపడుతుండగా సమయం పది గంటలు కావచ్చింది. కోర్టు ఆరంభ సమయం దగ్గరపడుతోంది. ఇంకో అయిదు నిముషాల్లో పది కావస్తుందనగా ఒక ఓల్డ్‌ స్టాండర్డ్‌ వేన్‌ రణగొణ ధ్వనులు చేస్తూ దూసుకొచ్చి పార్కింగ్‌లో ఆగింది. ఆ వేన్‌ లోంచి ముందుగా సుమారు డెభ్బై సంవత్సరాల వయసుండే అయ్యంగారి బామ్మా ఒకావిడా దిగింది.

తమ కులాచారం ప్రకారం చక్కగా సాంప్రదాయంగా తొమ్మిది గజాల చేనేత చీర కట్టి కుచ్చిళ్ళు వెనక్కితీసి దోపుకుంది. అదేరంగు జాకెట్టు ధరించింది. వంటినిండా పైటతిప్పి తలమీదుగా మేలిముసుగు సరిచేసుకుంది.

ముగ్గు బుట్టలా తలపండిపోయినా వాలుజడ వేసుకుని శిగలో మందారపూలు తురిమింది. పాదాలకు మువ్వల పట్టీలు చేతుల నిండుగా రంగు గాజులు, ముఖాన అర్థరూపాయంత కుంకుమ బొట్టుతో చూడ్డానికి గుడి లోంచి కదిలివస్తున్న అమ్మవారిలా వుంది. ఆవిడ చత్వారం కళ్ళజోడు సరిచేసుకునేలోన వేన్‌లోంచి బిలబిలా పదహారు మంది పిల్లలు దిగారు. వాళ్ళంతా పదిహేను ఇరవై రెండు సంవత్సరాల మధ్య వయస్కులు. వాళ్ళలో కొందరు అమ్మాయిలూ వున్నారు. అమ్మాయిలు చక్కగా పట్టు పావడా ఓణీల్లో లేత గులాబీల్లా మెరిసిపోతున్నారు. కుర్రాళ్ళంతా బోడిగుండు నెత్తిన జానపిలక పంచకట్టి జంధ్యం వేసుకొని పైన చొక్కాలు ధరించారు. చూడ్డానికి వాళ్ళంతా అయ్యంగార్ల బామ్మగారు, ఆవిడ మనుమలు మనవరాళ్ళులా వున్నారు. ‘‘రండర్రా పిల్లలూ’’ అంటూ ఎడం చేయి నడుంమీద వుంచుకుని ముందు పోతుంటే పిల్లలంతా ఆవిడ్ని అనుసరించారు. పిల్లల కోడిలా ఆ పిల్లల్ని వెంటేసుకొని మెట్ల వైపు పోతున్న ముసలిబామ్మగార్ని అంతా తమాషాగా చూడసాగారు.

ఆవిడ కోర్టు మెట్లవద్దకి చేరుకునే సరికి అక్కడ పాండ్యన్‌ మనుషులు అయిదుగురు గుంపుగా చేరి మాట్లాడుకోవటం కన్పించింది బామ్మగారు వాళ్ళని చూస్తూ... ‘‘ఎవర్రా మీరు శుంఠల్లారా.... అడ్డగాడిదల్లా దారికడ్డంగా వుండి ఏంటిరా మీ సోది. కోర్టు టైమైంది లోనకెళ్ళాలి. కాసింత దారోదలండర్రా’’ అంది.

వాళ్ళంతా ఆవిడ్ని, ఆవిడ్ని చుట్టివున్న పిల్లల్ని తమాషాగా చూసారు. ఆవిడ మాటలకి కోపం రాకపోగా నవ్వేసారంతా ‘‘ఏంది బామ్మగారూ ఈ వయసులో మీకు కోర్టులో పనేంటి? మీరూ జర్నలిస్తు లహరిని చూద్దామనే?’’ అనడిగాడు వెక్కిరింపుగా ఒకడు.

ఆ మాటలకు ఏదో వింత వింటున్నట్టు బుగ్గలు నొక్కుకుని మరీ ఆశ్చర్యంగా చూసిందా అయ్యంగారి బామ్మ.

‘‘అదెవరు నాయనా లహరి? మాకేంతెలుసు? సీత కష్టాలు సీతవి. పీతకష్టాలు పీతవి అన్నట్టు ఉన్నకష్టాలు మాకు చాలవా ఏంటి? మాయదారి కోర్టులకి ఎప్పుడన్నా వచ్చినామా ఏంటి. మా ముసలాయన బుద్ధి తిన్నగా వుంటే ఇక్కడికెందుకొస్తాంలే’’ అంది

‘‘ఇంతకీ మీ కొచ్చిన కష్టం ఏంటి బామ్మా. ఈ వయసులో ఎవరు మీ మీద కేసుపెట్టింది?’’ కుతూహలం ఆపుకోలేక అడిగాడొకడు.

‘‘అయ్యోరామ. చెప్పుకుంటే సిగ్గు చేటు నాయనా. ఈ వయసులో ఇంకా నేను చిలకలు చుట్టి నోటికందించటం లేదనీ... ఏదీ.... మా ముసలాయన అలిగి నాతో విడాకులు కావాలంటూ కోర్టుకెక్కాడు. రాక తప్పుతుందా చూస్తున్నారుగా వీళ్ళంతా నా మనవలు మనవరాళ్ళు. ఈ వయసులో నాకీ కష్టం అవసరమా... రామా.. కృష్ణా...’’ అనుకుంటూ పిల్లలతో మెట్లెక్కి వెళ్తున్న బామ్మగారిని చూసి నిర్ఘాంతపోయారంతా.

‘‘కాలమేంటిరా యిట్టా మారిపోతోంది పడుచు జంటలు కీచులాడుకుని కోర్టుకెక్కారంటే అర్థం వుంది. వూరు పొమ్మంటుంది. కాడు రమ్మంటుంది అన్నట్టున్న ఈ ముసలాళ్ళకూ విడాకులు అవసరమా’’ అన్నాడొకడు ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ. అంతేగాని ఆ బామ్మగారి మీదగాని ఆవిడ మనుమలు మనవరాళ్ళమీదగాని ఒకింత కూడా అనుమానం రాలేదు. లోన కోర్టు హాల్లోకి పోడానికి దారిలేక పోటంతో వరండా లోనే జనాలకి ఇవతలగా నిలబడిపోయింది బామ్మగారి బృందం.

ఇంతలో కోర్టు సమయాన్ని చూచిస్తు గంట మోగింది. జడ్జిగారు తన సీటు వైపు రావటం చూసి ఎదురుగా టేబుల్స్‌ వెనక లాయర్లతో బాటు విజిటర్స్‌ కూడా లేచి నిలబడ్డారు. జడ్జిగారు కూచోగానే అంతా నిశ్శబ్ధంగా కూచున్నారు. కోర్టు అమీనా ఇవతలికొచ్చి... ‘‘జర్నలిస్టు లహరి `జర్నలిస్టు లహరి’’ అంటూ మూడుసార్లు పెద్దగా అరిచి పిలిచాడు.

అప్పుడు వరండాలో వున్న బామ్మగారు వున్నట్టుండి కదిలింది. ఆమె కన్నాముందు కుర్రాళ్ళంతా అడ్డుగా వున్న వాళ్ళని పక్కలకు తోస్తూ ‘‘తప్పుకోండి’’ అనరుస్తూ దారిచేసి హడావుడిగా బామ్మగార్ని హాల్లోకి ప్రవేశపెట్టారు. లోనకొస్తూనే సరాసరి వెళ్ళి...

బోనులో నిలబడింది బామ్మ. పైన విజిటర్స్‌ గ్యాలరీలోని విరాట్‌ బృందానికి వచ్చిన బామ్మ ఎవరో అర్థమైంది. గాని మిగిలిన ఎవరికీ అర్థంగాక ఆశ్చర్యంతో చూడసాగారు. లహరి ఎవరో వయసులో అమ్మాయి డేరింగ్‌ డాషింగ్‌ రిపోర్టరనుకున్నారు గాని ఆ వృద్ధురాలు లహరి ఏమిటని ముఖ ముఖాలు చూసుకుంటున్నారు. జడ్జిగారికీ అంతుబట్టక విచిత్రంగా చూసారు.

‘‘బామ్మగారూ మీరెవరో పొరబాటున వచ్చినట్టున్నారు. మీ కేసు వాయిదా ఏ కోర్టులో వుందో అక్కడికి వెళ్ళండి. ఇక్కడ పిలిచింది జర్నలిస్టు లహరిని’’ అంటూ గుర్తుచేసాడు జడ్జి.

‘‘వచ్చింది కూడా జర్నలిస్టు లహరినే యువరానర్‌’’ అంటూ బోనులో నిలబడిన బామ్మ తల మీది విగ్గు తీసేసి పైట చెంగుతో ముఖాన ముసలి మేకప్‌ని తుడిచేసుకోగానే కోర్టు హాలంతా మరోసారి షాకయింది. ‘‘బామ్మ వేషంలో కోర్టుకొచ్చింది లహరి. జర్నలిస్టు లహరి ఈ అమ్మాయే’’ అనుకొంటూ విజిటర్స్‌లో ఒక్కసారిగా కలకలం రేగటంతో ‘‘సైలన్స్‌’’ అంటు హెచ్చరించాడు జడ్జిగారు.

‘‘మిస్‌ లహరి. కోర్టుకి మారు వేషంలో రావలసిన అవసరం ఏమిటి? మామూలుగా రావచ్చుగా!’’ కాజువల్‌గా అడిగారు జడ్జిగారు.‘‘వస్తే ప్రాణాలకి గ్యారంటీ లేదు. ప్రాణరక్షణకి మాకీ పాట్లు తప్పవు. మీరు ధర్మాసనంలో కూచుని తీర్పు చెబుతారు. కాని కోర్టు బయట ఏం జరుగుతోందో మీకు తెలీదు. న్యాయధర్మాలు కోర్టుకావల కిలోల లెక్కన అమ్ముడు పోతున్నా మీకు తెలీదు. తెలిసినా ఏమీ చేయలేరు. ప్రాణం పోతే పరిహారం ఇప్పించగలరు. కాని ప్రాణాన్ని తిరిగి తేలేరు’’ అంటూ సహస్ర ఆవేశంతో మాటాడుతుంటే కోర్టు హాలంతా చీమ చిటుక్కుమన్నా విన్పించేంత నిశ్శబ్ధంగా మారిపోయింది. సహస్ర మాటలు అందర్నీ ఆలోచింపచేస్తున్నాయి. క్షణం ఆగి తిరిగి మాట్లాడనారంభించింది సహస్ర.

‘‘మనకు చట్టాలున్నాయి. న్యాయ ధర్మాల్ని కాపాడే బలమైన రక్షణ వ్యవస్థ వుంది. అయినా న్యాయధర్మాలు నిలువనీడలేక నాలాగే ఒదిగిపారిపోతున్నాయి యువరానర్‌. కన్పిస్తే తరిమి తరిమి కోడుతున్నారు. ఉసురు తీసి పరిహసిస్తున్నారు. ఎందుకు? న్యాయం కోరటం తప్పా? నిజాల్ని బయట పెట్టడం తప్పా?

మధురై కోర్టు బయటే నామీద హత్యాప్రయాత్నం జరిగింది. తృటిలో తప్పించుకున్నాను. ఎవరు చేయించారో ఎందుకో చేయించారో అందరికీ తెలుసు. నాకోసం వాళ్ళు ఇంతకాలం గాలిస్తూనే వున్నారు. చట్టం ఏం చేయగలిగింది? ప్రభుత్వం ఏంచేయగలిగింది? నిస్వార్థంగా ప్రజలకోసం పెద్దమనుషుల అక్రమాల్ని కుంభకోణాల్ని కుండబద్దలు కొట్టడం ఈ దేశంలో నేరమా? ద్రోహమా? ఏమిటి నేను చేసిన తప్పు?

మధురై సంఘటన పునరావృతం కాకూడదనే నేనీ రోజు యిలా వేషం మార్చుకొని అందర్నీ ఏమార్చి కోర్టుకి రావలసొచ్చింది యువరానర్‌. నేరుగా వస్తే కోర్టు మెట్లముందే శవమై పడుండేదాన్ని. వ్యవస్థ మీరు అనుకుంటున్నట్టు ఏంబాగాలేదు యువరానర్‌. లంచం ఇస్తే ఎలాంటి కేసునయినా మాఫీ చేసే పోలీసు అధికారులున్నారు. లంచం యిస్తే బెయిలు మంజూరు చేసే జడ్జీలున్నారు. లంచం ఇస్తే చేసిపెట్టే కలక్టర్లున్నారు, ఎమ్వార్వోలున్నారు.  వారు వీరేమిటి అన్ని శాఖల్లోను అవినీతి లంచగొండితనం, బంధుప్రీతి అధికరించి కంపుకొడుతున్నాయి. వీటి నిర్మూలించాల్సిన మంత్రులే పెంచి పోషిస్తున్నారు. తమకు అనుకూలంగా ప్రభుత్వయంత్రాగాల్ని మలుచుకొని పటిష్టమైన వ్యవస్థల్ని కూడా నిర్వీర్యం చేసేస్తున్నారు. ఇంతమంది ఇన్ని విధాలుగా ధర్మంతప్పుతుంటే న్యాయధర్మాలకి చోటెక్కడుంది యువరానర్‌.

ఒకటా రెండా దేశంలో ఎన్నో కుంభకోణాలు....? అక్రమార్కులదే రాజ్యం. కొన్ని బయటికొస్తున్నాయి. కొన్ని రావటంలేదు. చెన్నైనుంచి వచ్చి మధురైలో కంపెనీలు స్థాపించుకున్న త్యాగరాజన్‌ అక్రమాల గురించి విని ప్రాణాలకు తెగించి ఎన్నో నిజాలు సేకరించాను. భూ కుంభకోణాల్ని బయట పెట్టాను. కేసును నిర్వీర్యం చేయాలంటే నేను చావాలి. కాబట్టి వాళ్ళు నన్ను చంపాలని చూస్తున్నారు.

ఒక్కసారి అలా కోర్టు బయటి కెళ్ళి చూడండి యువరానర్‌. నన్ను కడతేర్చాలని కంకణం కట్టుకున్న వర్గం ఒకటి, నా ప్రాణాలు కాపాడాలని ఒక వర్గం అక్కడ నివురు గప్పిన నిప్పులా సిద్ధంగా ఉన్నాయి. అంతదేనికి.... ఈ కోర్టులోనే... ఇక్కడే... ఇప్పుడో కాస్సేపటికో ప్రత్యర్థులు నన్ను కాల్చిచంపినా ఆశ్చర్యపోనక్కర్లేదు....’’

ఆవేశంతో...

అనర్గళంగా మాట్లాడుతూనే వుంది సహస్ర.

అంతలో విజిటర్స్‌ గ్యాలరీలో ఒక్కసారిగా కలకలం రేగింది. జడ్జి గారితోసహా అంతా అటు చూడగా అక్కడ అనూహ్య దృశ్యం కన్పించింది. రివాల్వర్లతో సహస్రను షూట్‌ చేయాలని ప్రయత్నిస్తున్న దుక్కలాంటి ఇద్దరు వ్యక్తుల్ని ఇద్దరు యువకులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళిద్దరూ విరాట్‌ ధర్మలు. హర్యానా షూటర్స్‌ యిద్దరూ రివాల్వరున్న చేతుల్ని ముందుకు సాచి ఎలాగైనా సహస్రను షూట్‌ చేయాలని గింజుకొంటున్నారు.

గ్యాలరీలోని విజిటర్సు తొక్కిసలాడుతూ పక్కలకు పరుగు తీస్తున్నారు. ఇక లాభంలేదని తన చేతుల్లో గింజుకొంటున్న వాడ్ని ఎత్తి గ్యాలరీలోంచి కిందకు విసిరేసాడు విరాట్‌. ఆ వెనకే ధర్మ కూడా రెండో వాణ్ని తోసేసాడు. పైనుంచి కిందపడ్డంలో వాళ్ళ చేతుల్లోని రివాల్వర్లు ఎగిరి దూరంగా పడ్డాయి. పైనుంచి కింద పడ్టంతో ఎముకలు విరిగనంత బాధతో కెవ్వుమన్నారు ఒకేసారి యిద్దరూ. పడిలేచేలోన కోర్టులోపలే వున్న నలుగురు పోలీసులు పరుగున వచ్చి వాళ్లిద్దర్నీ అదుపులోకి తీసుకున్నారు. కోర్టు అమీనా రివాల్వర్లు రెంటినీ తీసుకెళ్ళి జడ్జిగారి ముందుంచాడు.

ఆ తర్వాత పరిణామాల్లో సహస్ర అభ్యర్థన మీద లోపలి వాళ్ళు బయటకి పోకుండా, బయటి వాళ్ళు లోనకురాకుండా జడ్జిగారు తలుపుల్ని మూసి లాక్‌చేయించేసారు. పిమ్మట సహస్రనుంచి స్టేట్‌మెంట్‌ తీసుకోనారంభించారు. ఆమె సుప్రీంకోర్టుకి సబ్మిట్‌ చేసిన ప్రతుల్లో ఒకటి జడ్జిగారి ముందుంది. సహస్ర రిపోర్టు చదివి జడ్జిగారు అడుగుతుంటే సహస్ర మౌఖికంగా వివరణ యివ్వసాగింది. ఓ పక్క కోర్టుహాల్లో సహస్ర వివరణ యిస్తుండగానే బయట జరుగుతున్న నాటకీయ పరిణామాలు లోపలున్న ఎవరికీ తెలీవు.

 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
death mistery