Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> బాల్యం బహు మధురం

balyam bahu madhuram

రాము వయస్సు పదేళ్ళు.  అయినా పాతికేళ్ళ వయసు ఆలోచనలు. తాను వెంటనే పెద్దవాడై పోయి, పెద్ద ఉద్యోగం చేయాలనే కోరిక. తనుకు యిలా ఒక్కో యేడాది పెరు గుతూ పెద్దవాడు కావటం యిష్టం లేదు. ఒకేసారి పాతికేళ్ళు వయసు  వాడినవ్వాలంటే యెలా అని పరిపరి విధాల ఆలోచించిన మీదట ఒక నిర్ణయానికి వచ్చాడు.

కొండకోనల్లో మునులు వుంటారని,  వారు తమ మహిమతో తనని యువకుడిగా మార్చగలని అనుకొన్నాడు. అయితే తాను వారిని ఎక్కడని వెతకాలి,వారి జాడ ఎవరు చెపుతారు అనె బెంగ పట్టు కుంది. తన  కోరికను చెప్పగానే తల్లిదండ్రులు మిత్రులు మందలించి... యిప్పుడు అలాంటి వారెవరూ లేరు.  పిచ్చి పిచ్చి ఆలోచన్లు మానుకొమ్మని సలహా యిచ్చారు. అయినా రాముకి మాత్రం ఆ కోరిక పోలేదు  ఎలాగైనా సాధించాలనే పట్టుదల రోజు రోజుకి పెరగసాగింది.

ఒకరోజు పొద్దున్నే ఎవరికీ చెప్పకుందా అడవి దారి పట్టాడు. దొరికిన కాయో, పండో తింటూ మునుల కోసం పగలంతా వెతుకుతూ రాత్రి కాగానే  యేదో ఒక చెట్టుపై తలదాచుకొనేవాడు. తెల్లారి మళ్ళీ మామూలే. అలా వెతుకు తున్న రాముకి ఒక కుటీరం కనిపించింది. గబగబ అక్కడికెళ్ళి లోపలకు తొంగిచూశాడు. లోపల ఒక ముని దీక్షలో కూర్చొ నున్నాడు.ఆ మునిని చూడగానే రాము సంబర పడిపోయాడు.ఆయన దీక్ష ముగించుకొనే వరకు నిరీక్షిస్తూ బయట నిల్చొన్నాడు.

కాసేపుటికి ముని దీక్ష ముగించుకొని వెలుపలకు వచ్చాడు. బయట నిల్చొన్న చూసి 

 రాముని నివ్వెర పోయి  “ ఎవరివి నాయనా .. యింత దట్టమైన అడవిలోకి ఎందుకు వచ్చావు... ? ”  అని అడిగాడు.

 రాము వంగి  మునికి పాదాభివందనం  చేసి  “ స్వామీ..!మీలాంటి  మునులను కలవాలనే ధైర్యం చేసి యిలా అడవిలోకి వచ్చాను.  నా అదృష్టం కొద్దీ  మీరు కనిపించారు ” అన్నాడు.

 “ఎంత సాహసం చేశావు నాయనా... ! కౄరమృగాలు సంచరించే అడవిలోకి యిలా ఒంటరిగా రావటం యెంత ప్రమాదకరం. అయినా మునులతో నీకేమి పని ? ” అని అడిగాడు ముని.

 రాము తన మనసులోని కోరిక గురించి చెప్పాడు.

 అంతా విన్న ముని నవ్వి,  “ యిది మంచి కోరిక కాదు నాయనా .. ! కాలంతో పాటు ఎదగాలే తప్ప ఇలా ప్రకృతి విరుద్దంగా ఒక్కసారిగా పెద్దవాడు కావాలని కోర కూడదు..”   అని చెప్పాడు. 

కాని రాము వినిపించుకోక తనని పాతికేళ్ళ కుర్రాడిగా మార్చమని మునిని ప్రాధేయ పడ్డాడు. ముని యెంతగా నచ్చచెప్పినా తన మొండిపట్టు విడవక పోవటంతో కాదనలేక తన తపోబలంతో రాముని పాతికేళ్ళ యువకుడిగా  మార్చి వేశాడు.

 యువకుడిగా మారిన రాము, ముని వద్ద సెలవు తీసుకొని యింటికి బయలు దేరాడు. మారిన తనని తన వూరిలో యెవరూ  గుర్తించ లేదు. అనేక ఆధారాలు చూపి తల్లిదండ్రులను నమ్మించాడు.  యువకుడైన రాము వెంటనే చిన్నపాటి వుద్యోగంలో చేరాడు. ప్రతిరోజూ పొద్దున వెళ్ళి సాయంత్రం వచ్చేవాడు.

  ఆరోజు సెలవు కావటంతో యింట్లోనే వున్న రాముకి యెదురుగా చెట్టు క్రింద గోళీకాయలు ఆడుతున్న పిల్లలు కనిపించారు.  వాళ్ళంతా నిన్న మొన్నటిదాకా తనతో ఆడిన వాళ్ళే ... !  తనిప్పుడు వారితో కలసి గోళీ కాయలు ఆడలేడు కదా... ! వారి వైపు దిగాలుగా చూస్తుండి పోయాడు. 

రోజులు గడిచే కొద్దీ ... తనేమి కోల్పోయాడో అర్ధం కాసాగింది రాముకి. తనూ చక్కగా పిల్లలతో వాడు కోవాల్సింది  పోయి ... యిలా పెద్దరికం తెచ్చుకొని , కోరి కష్టాలలో పడ్డాననే దిగులు మనసులో చోటుచేసుకుంది. తన తోటి వారు కేరింతలు కొట్టుకుంటూ ఆడుకొంటుంటే .. తను బిక్కముఖం వేసుకొని చూస్తున్న రాములో తిరిగి ఆలోచన మొదలైంది.  తిరిగి తన బాల్యం తనకు వస్తే బావుండుననే తలపు రావటంతో  వెంటనే బయలుదేరి అడవిలోని మునిని కలుసు కున్నాడు. 

తిరిగి వచ్చిన రాముని చూడగానే ముని  “ మళ్ళీ యెందుకొచ్చావ్ ... ? ”  అని అడిగాడు.

 “ స్వామీ నా కోరిక  మన్నించి యువకుడిగా మార్చావు.  కాని అలా యువకుడి నైన నేను యేది పోగొట్టుకున్నానో  అర్ధమైంది.ఎందరు చెప్పినా చివరకు మీరు చెప్పినా  వినిపించుకోలేదు. దయచేసి నన్ను మళ్ళీ మామూలు బాలుడిగా మార్చండి . .”  అని ముని కాళ్ళ మీద పడ్డాడు.

ముని  కోపంగా చూస్తూ .. “ యేంటి అంతా నీ యిష్టమేనా ... !  నువ్వెలా మార్చమంటే అలా మార్చుతూ నా తపోశక్తిని వృధా చేసుకోవటం నాకు యిష్టం లేదు. చెప్పినా వినక మూర్ఖంగా ప్రవ ర్తించిన నీకు ఈ శాస్తి జరగాల్సిందే ..”  అన్నాడు. 

 రాము మునిని వదలక మరీ మరీ బ్రతిమాలి విసిగించడంతో ... ఆయను కోపం వచ్చి,  

“ మూర్ఖుడా ..! చెపితే వినిపించుకోవా ..!యిలా విసిగించావంటే .. నిన్నో కౄరమైన  అడవి జంతువుగా మార్చివేస్తా .యిక్కడె పడి వుంటావ్ .. ” అన్నాడు.

దిక్కు తోచని రాము వంగి ముని కాళ్ళు పట్టుకున్నాడు.  కాళ్ళు పట్టుకున్న రాముని కాలితో బలంగా తోసి  “  యిదిగో నీకు శాపం తప్పదు ..”  అంటూ కమండలం చేతికి తీసుకొన్నాడు.

 ముని కాలితో తన్నిన తన్ను నిజంగా తగిలినట్లనిపించి వెర్రిగా అరుస్తూ ఉలిక్కి పడి నిద్రలేచాడు రాము. అప్పటికే లేచి కళ్ళాపు చల్లుతున్న వాళ్ళమ్మ పరు గెత్తుకుంటూ వచ్చి  “ యేమైందిరా అలా  వెర్రి కేకేశావు. పీడకల వచ్చిందా ..” అని అడిగింది.

 ఇంతవరకు జరిగిందా కలా అనుకొని ... “ యేమీ లేదమ్మా..... ! ”  మంచం అంటూ దిగాడు.

 అంతే ఆరోజు నుండి తను యువకుడిగా మారాలనే ఆలోచనను పూర్తిగా వదిలేశాడు. బాల్యం లోని అన్ని మధురిమలు ఆస్వాదించాలని నిర్ణయించుకొన్నాడు.*  

మరిన్ని కథలు
mid night race