Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
interview

ఈ సంచికలో >> సినిమా >>

చిత్రసమీక్ష

movie review
చిత్రం: త్రిపుర 
తారాగణం: స్వాతి, నవీన్‌ చంద్ర, రావు రమేష్‌, షకలక శంకర్‌, సప్తగిరి, 
చాయాగ్రహణం: రవికుమార్‌ సానా 
సంగీతం: కామ్రాన్‌ 
దర్శకత్వం: రాజ్‌కిరణ్‌ 
నిర్మాతలు: ఎ.చినబాబు, ఎమ్‌.రాజశేఖర్‌ 
విడుదల తేదీ: 6 నవంబర్‌ 2015 

క్లుప్తంగా చెప్పాలంటే 
ఓ పల్లెటూరమ్మాయి త్రిపుర (స్వాతి)కి ఏదైనా కల వస్తే అది నిజమవుతుంటుంది. ఇద్దరు వ్యక్తులు ఆమెకు కలలో జరిగినట్లే హత్యకు గురవుతారు. దాంతో త్రిపురలో ఆందోళన నెలకొంటుంది. ఇంకోపక్క సైకియాట్రిక్‌ డాక్టర్‌ అయిన నవీన్‌ (నవీన్‌ చంద్ర)తో త్రిపురకు పెళ్ళవుతుంది. అయితే అతనితోనే తనకు ముప్పు ఉందని కల ద్వారా తెలుసుకుంటుంది త్రిష. మరోపక్క త్రిపుర - నవీన్‌ ఓ ఇంట్లోకి కొత్తగా వెళతారు. అక్కడ ఓ సమస్య ఎదురవుతుంది ఈ జంటకి. అదేమిటి? త్రిపుర తన భర్త గురించి కలగన్నట్లే జరుగుతుందా? వంటి ప్రశ్నలకు సమాధానం తెరపై చూడాలి. 

మొత్తంగా చెప్పాలంటే 
స్వాతి నటిగా ఎప్పుడో తానేంటో నిరూపించుకుంది. సినిమా సినిమాకీ ఇంకా పరిణతి సాధిస్తోంది. నటిస్తోందని కాకుండా, జీవించేస్తోందనిపించేలా స్వాతి నటన ఉంది. సినిమాకి అవసరమైన మేర తన నటనా ప్రతిభతో ఆకట్టుకుంది. ఆశ్చర్యం, అమాయకత్వం, భయం లాంటి ఎమోషన్స్‌ విషయంలో స్వాతి చాలాబాగా చేసింది. నవీన్‌ చంద్ర తన పాత్రకు తగినట్లుగా చేశాడు. రావు రమేష్‌ కాస్త నిరాశపర్చుతాడు. ఆయన పాత్రకు ఇంకాస్త వెయిట్‌ దర్శకుడు ఇచ్చి ఉంటే బాగుండేది. సప్తగిరి, షకలక శంకర్‌, జయప్రకాష్‌రెడ్డి కామెడీతో ఓకే అనిపించారు. 
హర్రర్‌ ఎలిమెంట్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌ జోడించి హిట్స్‌ కొట్టడం టాలీవుడ్‌లో ట్రెండ్‌గా మారింది. ఆ ట్రెండ్‌లో చాలా సినిమాలు విజయవంతమయ్యాయి. ఆ కోవలోకే వస్తుంది ఈ సినిమా కూడా. 'గీతాంజలి'తో ఇలాగే హిట్‌ కొట్టిన దర్శకుడి సినిమానే ఇది. కొత్తగా కలల కాన్సెప్ట్‌తో థ్రిల్లర్‌ ఎలిమెంట్‌ని ఎంటర్‌టైనింగ్‌గా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. మాటలు బాగానే ఉన్నాయి. స్క్రీన్‌ప్లే బాగుంది. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్‌ బాగానే ఉన్నా కొన్ని చోట్ల ఇంకాస్త అవసరమనిపిస్తుంది. సంగీతం ఓకే. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సి ఉంది. నిర్మాణపు విలువలు బాగున్నాయి. 

'గీతాంజలి' చిత్రంతో ఆకట్టుకున్న దర్శకుడు, తదుపరి సినిమా 'త్రిపుర' విషయంలో ఆ మార్క్‌ చూపించలేకపోయాడు. హర్రర్‌ని, ఎంటర్‌టైన్‌మెంట్‌తో మిక్స్‌ చేయడం, సినిమా కథనీ, కథనాన్నీ ఆడియన్స్‌ని అలరించేలా తీర్చిదిద్దడం వంటివాటిల్లో కాస్త నమ్మదించాడు. కలల కాన్సెప్ట్‌ తప్పిస్తే, 'గీతాంజలి' సీన్స్‌ రిపీట్‌ అవుతున్నట్లు అనిపిస్తుందంటే, అది దర్శకుడి పొరపాటే. ఫస్టాఫ్‌ బాగానే సాగిపోతుంది. సెకెండాఫ్‌లో అక్కడక్కడా జర్క్‌లు కనిపిస్తాయి. థ్రిల్లర్‌ ఎలిమెంట్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌ సరిగ్గా కుదరకపోతే అసలుకే తేడా కొట్టేస్తుంది. ఆ విషయంలో దర్శకుడు కొంచెం జాగ్రత్త పడి ఉంటే బాగుండేది. సెకెండాఫ్‌, ఫస్టాఫ్‌లో స్వాతి నటనే హైలైట్‌. సినిమా భారాన్నంతా స్వాతి తన భుజాల మీద మోసేసింది. కామెడీ విషయంలోనూ దర్శకుడు కొత్తదనంతో ఆలోచించి ఉంటే మెరుగైన రిజల్ట్‌ వచ్చేది. ఓవరాల్‌గా సినిమా నిరాశపర్చేస్తుందని అనలేంగానీ, అంచనాల్ని అందుకోలేకపోయిందని చెప్పవచ్చు. ప్రమోషన్‌ బాగా చేస్తున్నారు, లిమిటెడ్‌ బడ్జెట్‌తో రూపొందించిన సినిమా కాబట్టి కమర్షియల్‌ రిజల్ట్‌ ఓకే అనిపించవచ్చు. 

ఒక్క మాటలో చెప్పాలంటే 
త్రిపుర జస్ట్‌ ఓకే 

అంకెల్లో చెప్పాలంటే: 2.5/5
మరిన్ని సినిమా కబుర్లు
crying tollywood comedy