Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
navvunalugu yugaalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

వాస్తు-వాస్తవాలు - సూర్యదేవర వేణుగోపాల్

 

“ప్రాచీనకారిక”

మినపగింజంత పరిమాణంలో ఈశాన్యం పెరిగినా భార్య, సంతాన లాభముతోపాటు విద్య,పాండిత్యం,పశుగణ వృద్ది కలుగుతాయి అని ప్రాచీనకారిక అనే ప్రాచీన వాస్తు గ్రంధం తెలియ జేస్తుంది. దీని ప్రకారం మనం గమనిస్తే ఈశాన్యాన్ని విపరీతంగా పెంచాల్సిన అవసరం లేదు అని స్పష్టమౌతుంది. తూర్పు ఆగ్నేయం కన్నా మరియు ఉత్తర వాయవ్యం కన్నా కొద్దిగా పెరిగితే సరిపోతుంది. కరెక్ట్ చెప్పాలంటే స్థలం యొక్క వైశాల్యంను అనుసరించి ఈశాన్యాన్ని పెంచడం మంచిది.

ఇప్పుడు మనం ప్రయోజనాలను అనుసరించి, కార్యకలాపాలను లేదా లక్ష్యాలను అనుసరించి వాస్తును యే విధంగా మలచాలో, దిక్పతుల బలాన్ని యే విధంగా ఉపయోగించుకోవాలోతెలుసుకుందాం. ఉదాహరణకు కొన్ని సంస్థలను పరిశీలిద్దాం. ముందుగా హాస్పిటల్స్ కు యే విధమైన వాస్తు అవసరం అవుతుందో పరిశీలిద్దాం. వైద్య శాలలు అందరికీ సమానమే. స్త్రీ పురుషులిరువురు సమానమైన వైద్యాన్నిపొందుతారు. మరణాల సంఖ్య తగ్గాలి మెరుగైన వైద్యం ప్రజలందరికీ అందాలి. అదే విధంగా వైద్యుడు అభివృద్దిని పొందాలి. హాస్పిటల్ యొక్క ప్రయోజనం ఇదే. ఈ ప్రయోజనాలకి ఏ దిక్కులు సహకరిస్తాయో ఏ దిక్కులు ఆటంకాలను కలిగిస్తాయో ముందుగా తెలుసుకోవాలి. హాస్పిటల్స్ కు తూర్పు మరియు పడమర దిశల ఖాళీ ప్రదేశాలలో ఎక్కువ బేధం ఉండరాదు. పడమర కన్నా తూర్పు కొద్దిగా మాత్రమే ఎక్కువ ఉండాలి.పడమర వైపు ఖాళిస్థలం లేకుండా హాస్పిటల్ నిర్మించరాదు. అదేవిధంగా ఎత్తుపల్లాలలో కూడా తూర్పు పడమరల మధ్య అధిక బేధం ఉండకూడదు. పడమర తూర్పుకన్న కొద్దిగా మాత్రమే ఎత్తు ఉండాలి.హాస్పిటల్స్ కు దక్షిణం వైపు ఖాళీ ఉండాలి. నైరుతి, ఆగ్నేయ,దక్షిణ ప్రాంతాలు ఈశాన్య, వాయవ్య, పడమర, తూర్పు దిశల కన్నా ఎత్తు ఉండాలి. ఆపరేషన్ గదులు పడమర, వాయవ్య, తూర్పు, ఆగ్నేయ దిశలలో ఉండాలి. దక్షిణం మధ్య భాగంలో మరియు నైరుతి దిక్కులో  ఆపరేషన్ రూమ్ ఉండకూడదు.ఉత్తర దిశ, ఈశాన్య దిశ పల్లంగా ఉండాలి. ఉపయోగించిన నీరు ఈ దిశలగుండ బయటకు వెళ్ళాలి.

హాస్పటల్ యజమాని యైన డాక్టర్ తన వర్గు నియమాన్ని అనుసరించి తన గదిని నిర్మించుకోవాలి. తన స్వ వర్గులో కానీ, మిత్ర వర్గు కలిగిన దిశలలో కూర్చోవాలి. అంతే కాని యజమాని దిక్కు నైరుతి మాత్రమే అని ఆ దిశలో కూర్చోరాదు. నైరుతి దిశ డాక్టర్ యొక్క శత్రు దిశ అయితే చాలా సమస్యలు వస్తాయి.హాస్పటల్స్ కు తూర్పు బలం చాలా అవసరం కనుక తూర్పులోనే Underground Watersumps నిర్మించాలి. Pharmacy వాయవ్యంలో మంచిది. Cash counter ఉత్తరంలో ఉండాలి. Store room నైరుతి లో ఉండాలి. వైద్యశాలలకు తూర్పు,పడమర మరియు ఉత్తరం సింహద్వారములు మంచివి. ఈ విధంగా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని వాస్తును నిర్ధారించాలి.తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం కన్నా కొద్దిగా ఎక్కువ ఉండాలి.


అదే విధంగా విద్యాలయాల వాస్తును గమనిస్తే, విద్యార్ధులు తూర్పు లేదా ఉత్తరం అభిముఖంగా కూర్చొని విద్యను నేర్చుకోవాలి. దీనికి అనుగుణంగా తరగతి గదులను రూపొందించాలి. ఉత్తరం పల్లంగా ఉండాలి. నిర్మాణం చుట్టూ 4 దిశలందు ఖాళీ ఉండాలి. తూర్పుఉత్తరాల వైపు విపరీతమైన ఖాళీ ఉంచి భవనాన్ని నిర్మించరాదు. ఈ విధంగా చేయడం వల్ల భవనం మొత్తం పూర్తి నైరుతిలోకి ఉంటుంది లేదా స్థలం యొక్క అసుర భాగంలోఉంటుంది. ఈ విధంగా ఉంటే విద్యాఫలితాలు ఆశించినంతగా ఉండవు. కనుక అసుర స్థానంలోకి భవనం వెళ్లకుండా జాగ్రత్తగా నిర్మించాలి. ఉత్తరం లేదా  తూర్పు భాగాలలో కాష్ కౌంటర్ ఉండాలి. వాయవ్యంలో విద్యాసంస్థలకు కాష్ కౌంటర్ మంచిది కాదు. అన్ని దిశలకన్నా ఉత్తరం మరియు ఉత్తర ఈశాన్యం పల్లంగా ఉండాలి. పరిశోధన శాలలు తూర్పు, పడమర వాయవ్యం మరియు ఆగ్నేయం లో ఉండాలి. పి‌హెచ్‌డి తరగతులు తప్పనిసరిగా ఉత్తరం లో ఉంచాలి. సైన్స్ తరగతులను పడమర దక్షిణ దిక్కులందు మిగిలినవి వాయవ్య ఉత్తర దిశలందు ఏర్పాటుచేయాలి. విద్యాలయాలకు దక్షిణ.పడమర తూర్పు సింహా ద్వారములు మంచివి. మగపిల్లల తరగతి గదులు దక్షిణ  తూర్పులందు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా స్త్రీలకు పడమర ఉత్తరాలు మంచివి. విద్యాలయాలకు తప్పనిసరిగా ప్రధాన దిశలందు గేట్ తప్పనిసరి.ఈశాన్యంలో గేట్ ఉన్నది కదా అని ప్రధాన దిశాలైన తూర్పు,ఉత్తరాలలో గేట్ లేకుండా ఉండకూడదు. ఈ విధంగా అన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని వాస్తును నిర్ణయించాలి. తూర్పు ఈశాన్యం  కన్నా ఉత్తర ఈశాన్యం కొద్దిగా ఎక్కువ ఉండాలి.

ధార్మిక సంస్థలకు, ఆశ్రమాలకు నైరుతి దోషం ఉండకూడదు. నైరుతి దోషం ఉంటే ఆశ్రమాలు అక్రమాలకు నిలయం కాగలవు. అదేవిధంగా ఆగ్నేయ దోషాలు ఉండరాదు. కలహాలు ఉంటాయి. ఆశ్రమాలకు నైరుతి మరియు ఆగ్నేయ దోషం ఉంటే అనేకరకమైన ప్రవర్తనా దోషాలు ఉంటాయి. ఈ దోషానికి వాయవ్య దోషం తోడైతే పోలీస్ కేసులు ఇంకా న్యాయపరమైన వివాదాలు ఉంటాయి.  అదేవిధంగా వీటిని తప్పనిసరిగా 4 వైపులా సమానమైన ఖాళీ వదలి నిర్మించాలి. ఆశ్రమాలకు లాభాపేక్ష ఉండదు కాబట్టి  వీటికి ఈశాన్యం పెంచరాదు. 4 దిశలు సమంగా ఉండాలి.ఇది గమనించండి

          “ముక్తికామస్యకరణే శుద్ద ప్రాచీమ్ ప్రయోజయేత్”

ముక్తిని కొరువారు 4 కొలతలు సమానమైన భూమిలో నివశించాలి. దీనినే శుద్ధ ప్రాచీ స్థలం అని అంటారు. ఈ స్థలంలో ఈశాన్యం పెరిగి ఉండక 4 దిశలు సమానం గా ఉంటాయి. ఇటువంటి స్థలాలలో ఆశ్రమాలు ధార్మిక సంస్థలు బాగా రాణిస్తాయి.సింహద్వారాలు ఈశాన్య భాగంలో కాకుండా ప్రధాన దిక్కులలో ఉండాలి. తూర్పు,పడమర ,ఉత్తరం మరియు దక్షిణ మధ్య భాగాలందు ద్వారాలు ఉండాలి. అంతే కాని విదిక్కు లైన ఈశాన్యం,దక్షిణ ఆగ్నేయం ,పశ్చిమ వాయవ్యం లలో సింహద్వారాలు ఉండకూడదు. విదిక్కులందు కిటికీలను ఉంచాలి.

వ్యవసాయానికి పడమర మరియు వాయవ్య దిశలు బలంగా ఉండాలి. వ్యాపారానికి ఉత్తరంతో పాటు దక్షిణ ఆగ్నేయం కూడా బాగుండాలి.కొన్ని రకాలైన వ్యాపారాలకు ఉత్తరం కన్నా దక్షిణం కొద్దిగా పల్లంగా  ఉండాలి.బార్ మరియు మద్యపాన దుకాణాలకు నైరుతి బలంగా ఉండాలి. మద్యపాన దుకాణాలకు ఈశాన్యం కన్నా నైరుతి ఎంతోకొంత పెరిగిఉంటే చక్కటి వ్యాపారం ఉంటుంది. అయితే ఇటు వంటి షాపుల యజమాని ఇంట్లో నైరుతి కరెక్ట్ గా ఉండి ఈశాన్యం పెరిగి ఉండాలి.ఇటు వంటి విచారణ తో మరియు పూర్తి అవగాహనతో వాస్తును అమలు చేస్తే తప్పనిసరిగా మంచి ఫలితాలు వస్తాయి. గృహాలలో తప్పనిసరిగా దక్షిణం పడమరలు తూర్పు ఉత్తరాలకన్నా మెరకగా ఉండాలి నైరుతి అన్నిటికన్నా మెరక తో మరియు ఈశాన్యం అన్నిటికన్నా పల్లంగా ఉండాలి.

ఈ విధంగా పూర్తి అవగాహనతో వాస్తును అనుసరించవలసి ఉంటుంది. మిడిమిడి జ్ఞానం పనికి రాదు. దిక్పతులను దిక్కుల లక్షణాలను మరియు నవగ్రహాలను పూర్తిగా అవగాహన చేసుకొని వాస్తును అమలుచేయాలి. ఈశాన్యం పెంపుతో తూర్పు ఉత్తర నడకలతో వాస్తు ఆగిపోదు.ఇది నిరంతర ప్రక్రియ పరిశోధన చేస్తే ఎన్నో విషయాలు వెలుగులోనికి వస్తాయి.

గృహాలకు వాస్తును నిర్ణయించేటప్పుడు చెడును కలిగించే దిక్పతుల బలాన్ని తగ్గించి మంచిని కలిగించే దిశల బలాన్ని పెంచేటట్లుగా అమరిక ఉండాలి. కాని కొన్ని రకాలైన నిర్మాణాలకు చెడును కలిగించే దిశలను కూడా అవసరమైనంత మేరకు ఉపయోగించుకోవలసి ఉంటుంది. అప్పుడే నిర్మాణం యొక్క ప్రయోజనం చక్కగా నెరవేరగలదు. ఉదాహరణకు మద్యపాన దుకాణాలకు నైరుతిని కొంచం పెంచవలసి ఉంటుంది. నైరుతి దురలవాట్లను పెంచుతుంది. మద్యం ఒక దురలవాటు. కనుక మద్యం దుకాణాలు నిర్మించేటప్పుడు నైరుతిని ఆగ్నేయ వాయవ్యాల కన్నా కొంచెం ఎక్కువ ఉంచితే మద్యం అమ్మకం పెరుగుతుంది. కాని ఈ మద్యం దుకాణం యజమాని ఇంట్లో నైరుతి కరెక్ట్ గా ఉండాలి ఎంతోకొంత ఈశాన్యం పెరిగిఉండాలి. ఈ సందర్భంలో మనం చెడును ప్రసాదించే నైరుతిని అవసరమైనంతగా ఉపయోగించగలిగితే ఇటువంటి వ్యాపారాలు బాగా వృద్దిలోకి వస్తాయి. ఈ విధంగా జరిగే కార్యకలాపం,ప్రయోజనం బట్టి వాస్తు అమరిక ఉండడం సరియైన పద్దతి. అదేవిధంగా హోటల్స్ కు ఉత్తరం దక్షిణం సమానమైన ఎత్తులో ఉండాలి. కొన్ని రకాలైన హోటల్స్ కు దక్షిణ దిశను ఉత్తర దిశ కన్నా కొద్దిగా పల్లంగా ఉంచితే వ్యాపారం బాగా సాగుతుంది. దక్షిణం పల్లమైతే వ్యయం. కాబట్టి తినుబండారాలు అమ్మకం జోరుగా సాగుతుంది. కాని యజమాని ఇంట్లో మాత్రం ఉత్తరమే పల్లంగా ఉంచాలి. దక్షిణ దిశను మెరకలో ఉంచాలి. ఇటు వంటి వాస్తు నిర్ణయాలు తీసుకొనే సందర్బంలో సరియైన వాస్తు పండితుని సలహా మరియు పర్యవేక్షణ అవసరం. కిరాణా దుకాణాలు,ఆర్ధికపరమైన సంస్థలను  దక్షిణ ముఖద్వారం తో నిర్మిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.దక్షిణ ఆగ్నేయంలో దర్వాజా ఉంచితే స్త్రీలకు సకాలంలో వివాహాలు అవుతాయి.పాడిపరిశ్రమలకు, పశువుల కొష్టాలకు తూర్పు కన్నా పడమరను పల్లంలో ఉంచాలి. అప్పుడే పశువృద్ది, పాలవృద్దిచక్కగా ఉంటుంది. పశువుల ఆరోగ్యం బాగుంటుంది.

దీనిని బట్టి అర్థం అయ్యే దేమంటే అన్నీ దిశలను  వాటి లక్షణాలను అనుసరించి మనం సరిగ్గా ఉపయోగించుకొంటే మంచి ఫలితాలు వస్తాయి. దిక్పతుల బలాబలాలను సరిగ్గా అంచనా వేయడంలోనే నిజమైన ప్రతిభ దాగుంది. ఇటు వంటి ప్రతిభ ఉన్నవారే నిజమైన వాస్తు పండితులు. వీరివల్ల ప్రజలకు సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది.

మరిన్ని శీర్షికలు
Improve Your Eye Sight | తగ్గే చూపును పెంచుకోవడం ఎలా? | Dr. Murali Manohar M.D. (Ayurveda)