Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Improve Your Eye Sight | తగ్గే చూపును పెంచుకోవడం ఎలా? | Dr. Murali Manohar M.D. (Ayurveda)

ఈ సంచికలో >> శీర్షికలు >>

అవీ - ఇవీ - భమిడిపాటిఫణిబాబు

సాధారణంగా ఒక్కొక్కప్పుడు, అనుకోకుండా కొన్ని జరుగుతూంటాయి.  ఎవరినో ఓసారి కలుద్దామనుకుంటాము, ఏదో కారణంచేత, కలవలేకపోతాము. పోనీ అలాగని ఇంకొకసారి ప్రయత్నం చేస్తామా అఁటే, అదీ లేదూ… ఏదో ఆ క్షణంలో కలుద్దామనిపిస్తుంది, పెద్ద కారణం కూడా ఉండదు. ఏదో గుర్తుకొచ్చాడూ, ఓసారి ఫోను చేద్దామా లేక స్వయంగా కలిస్తేనే  బావుంటుందీ అనుకోడం. మొత్తానికి వీలు పడదు. ఆ విషయంకూడా మర్చిపోతాము. వచ్చిన గొడవల్లా ఏమిటంటే, ఎప్పుడో ఆ పెద్దమనిషి పోయాడని తెలుస్తుంది. అయ్యో.. అప్పుడు కలిసున్నాబాగుండేది, పాపం వెళ్ళిపోయారూ అని బాధపడతాం.అందుకే, ఎవరినైనా కలుద్దామనుకున్నా, ఫోనులో మాట్టాడదామనుకున్నా, వెంటనే ఆ పనేదో చేసేస్తేనే మంచిది. తరువాతెప్పుడో అనుకుని బాధపడక్కర్లేదు. ఇలాటివి వారితో మనకున్న సంబంధబాంధవ్యాలమీద ఉంటుంది.

అలా కాకుండా, కొంతమందిని ఏ కారణం లేకుండా కలవడం. ఒకరి మొహం ఇంకోరికితెలియదు. అయినాసరే, మాట్టాడినంతసేపూ, మనసువిప్పి మాట్టాడుకోడం.. ఎందుకని తరువాత ఆలోచిస్తే, “ ఏదో గతజన్మ సంబంధంఅయుంటుంది, లేకపోతే , ఆయన్ని కలవడం ఏమిటి, అధవా కలిసినా, అంతసేపు మాట్టాడడమేమిటి “ అనుకుంటాము. మనవాళ్ళు కొంతమంది దీన్ని “ ఘటన” అంటూంటారు.

ఇంకొంతమందుంటారు, బయటివాళ్ళందరికీ వీళ్ళు అపూర్వసహోదరుల్లాగ కనిపిస్తారు. పక్కపక్కనే ఇళ్ళూ, రాకపోకలూ, ఒకటేమిటి, వారేవీరైనంతగా  కనిపిస్తారు. ఎక్కడో అభిప్రాయబేధం వస్తుంది, అంతే ఆ ఇంటిమీద కాకి ఈ ఇంటిమీద వాలనంతగా అయిపోతుంది. ఒకరిమీద ఇంకొకరు యాగీ మొదలెడతారు. పైగా, స్నేహంగా ఉన్నప్పుడు ఒకరి లొసుగులు ఇంకోరితో పంచుకున్నారుగా.. దాని పర్యవసానం అన్నమాట. అందుకే అంటారు, దేనికైనా ఓ పరిమితి అనేది ఉండాలని. కానీ మానవసహజంకదా, తమ విషయాలను ఆత్మీయంగా ఉండేవారితో పంచుకోవడమనేది.

 స్నేహాలు మొదలెట్టడమే కాదు, ఆ స్నేహాన్ని నిలుపుకోవడం కూడా ఉండాలి.  అవసరం వచ్చినచోట, compromise అయితేనే కదా, స్నేహాలు నిలిచేది? అలా చేయడం  కొంతమంది నామోషీగా భావిస్తారు.. అలాటప్పుడే  స్నేహబంధం బీటలు తీస్తుంది. ఎన్ని ప్లాస్టర్లు పెట్టినా అతుక్కోదు.

ఒక్కోప్పుడు, స్నేహితుడెవరికో అనారోగ్యం చేసిందని  తెలుస్తుంది. ఇదివరకటిరోజుల్లో అయితే, వెంటనే వెళ్ళి చూసొచ్చేవారు. కానీ, ఈరోజుల్లో అలా కాదుకదా.. దూరాలెక్కువ, ఇంట్లో ఉన్నారో, హాస్పిటల్ లో ఉన్నారో తెలిసికోవాలంటే, ఫోను చేసే వెళ్ళాల్సొస్తూంటుంది. మనం ఫోను చేసినప్పుడు, వారి అబ్బాయో, భార్యో, చెప్తారు… మా నాన్నగారు రెస్టు తీసికుంటున్నారండీ, అనేసి వదిలేస్తారు. వెళ్ళాలో తెలియదు, వెళ్ళక్కర్లేదో తెలియదు. మొత్తానికి వాయిదా వేసి, వదిలేస్తాము. ఆ విషయంకూడా, మర్చిపోయే అవకాశం ఉంది. అక్కడితో అవదుగా… ఆ ఇంటివారు, అనుకోవచ్చు,, “మొన్న ఆరోగ్యం బాగుండక హాస్పిటల్లో చేరినప్పుడు, ఈయన మాటవరసకైనా పలకరించలేదూ… ఇలాగే ఉంటాయి.. సంబంధాలు…” అని. కానీ వారికి తెలియదుగా, పాపం ఈయన రావడానికి ప్రయత్నించాడూ, వాళ్ళబ్బాయే రెస్టు సికుంటున్నారూ అని చెప్పాడని. చివరకి మిగిలేదేమిటీ, అపార్ధాలు, స్నేహాలు కొండెక్కడమూనూ. ఇందులో ఎవరిది తప్పు లేదు. పరిస్థితుల ప్రభావం. ఉత్తి పుణ్యాన 30 ఏళ్ళ స్నేహమూ ఆగిపోయింది. ఇది ఎవరూ కావాలని చేసిందీకాదు. కానీ, ఒక్కొక్కప్పుడు, వీరి స్నేహం చూసి ఓర్వలేక, మధ్యలో పుల్లలు పెడుతూంటారు. అదో పైశాచిక ఆనందం కొందరికి. పనేమీ ఉండదు, ఏదో ఒకటి చేస్తేనే కానీ తోచదు. ఎవరిమధ్యో పొగరాజేస్తే సరి, మంట దానంతటదే వస్తుందనే మనస్థత్వం వీళ్ళది. మన జాగ్రత్తలో మనం ఉంటే సమస్యే ఉండదు.

 పైన చెప్పినవన్నీ ఒకెత్తైతే, మన  మొబైళ్ళలో ఒక్కొక్కప్పుడు, ఎవరో తెలియనివారినుండి ఫోన్లొస్తూంటాయి.  ఏదో పొరపాటున చేస్తే గొడవే లేదు. కానీ, దురదృష్టవశాత్తూ,  ఆ ఫోను చేసినవారికి ఏదైనా అయితే, వారి ఫోన్లలోని  కాల్ హిస్టరీ అంతా వెదుకుతూంటారు. అలాటప్పుడు, ఆ పెద్దమనిషి ఫోను చేసిన, మనంకూడా ఇరుక్కుపోతూంటాము. పోలీసులతో గొడవా,  ఆయనెవరో మాకు తెలియదు మహాప్రభో అని ఎంత చెప్పినా నమ్మరు. అంత తెలియకుండా, మీ నెంబరుకే ఎందుకు ఫోను చేసినట్టూ, ఏదో ఒకటి ఉండేఉంటుంది, అని  నానాగొడవా చేసే సందర్భాలు కూడా ఉంటాయి.   ఇలాటివాటిలో, మనం చేయకలిగినది కూడా ఏమీ ఉండదు.

అసలు మనకి ఎలా రాసిపెట్టుంటే అలాగే జరుగుతుందనుకుంటే గొడవే లేదు.

సర్వేజనాసుఖినోభవంతూ…

మరిన్ని శీర్షికలు
veekshanam