Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
pounch patas

ఈ సంచికలో >> శీర్షికలు >>

సాహితీవనం - వనం వెంకట వరప్రసాద రావు

sahiteevanam

ఆముక్తమాల్యద 

ఆముక్తమాల్యద ఆరవ ఆశ్వాసంలో మహాభక్తుడైన  ఒక మాలదాసరి కథను చెబుతున్నాడు  శ్రీకృష్ణదేవరాయలు. దారితప్పి భయంకరమైన అరణ్యంలోకి అడుగుబెట్టిన ఆ భక్తునికి మహా భయంకరుడైన బ్రహ్మరాక్షడుడు కనిపించాడు.వాడు కూడా యితడిని చూడనే చూశాడు.

వాఁడును గంటిఁ బోకు మని వ్రాలె మహీరుపాళి నుగ్గుగా 
వీఁడును మున్ను రే వగటి వేళకు మానిసి యౌట, బోరిలో 
వాఁడిమిఁ గొంతకాల మిల వ్రాలుట లావరి యౌట, నిల్చి యా
వాఁడి శరంబుచే నడువ వాఁ డది ద్రుంపుడు వీఁడు నుధ్ధతిన్

వాడు కూడా వేడిని చూశాడు కనుక, 'పోకు' 'పోకు' అని అంటూ, అక్కడి నేలమీది చిన్ని చిన్ని చెట్లు, మొక్కలు నుగ్గు అయ్యేత్కుగా చెట్టుమీదినుండి నేలమీదకు దూకాడు. వీడు కూడా, అంటే ఈ మాలదాసరి కూడా, గతంలో రాత్రికీ పగటికీ తేడా లేకుండా ధైర్యంగా, శౌర్యంతో, యుద్ధ రంగంలో గడిపిన అనుభవము ఉన్నవాడు కనుక, మొండిగా, ధైర్యంగా నిలిచి, తన వద్దనున్న , చేతితో ప్రయోగించే బాణం లాంటి యినుప ఆయుధంతో 'వాడిని' అడిచాడు, కొట్టాడు.'వాడు' ఆ పదునైన యినుప బాణం వంటి ఆయుధాన్ని విరిచేశాడు. 'వీడు'కూడా మొండిగా, ధైర్యంగా ముందుకు కదిలాడు, పోరాటంలో.

తిగిచిన నడుగులు దెమలక రొమ్మప్ప / ళించి యవ్వలికిఁ గేడించి దాఁటి 
చఱచిన వంచించి చరమభాగమునకై / తిరిగి తత్క్రియకగు దృష్టి నిలిపి 
పైఁబడ్డఁ జనుమఱ పట్ల కొడ్డుక యుండు / పిడికిళ్ల బలిమి లోఁ బడక నిలిచి 
చొరఁజూడఁ గ్రుంకి ముష్టులబిగి కోటగాఁ / జొరవీక తిరిగెడు చోన తిరిగి 

యసుర వధసాధనము రోయు నపుడు గ్రుద్ది 
తాచి తిరిగినఁ గృతముష్టి దండ నిలిచి 
యెడకొలఁది వెనుక నడుమొయ్య నడిచి యడిచి
మత్పదస్మృతి యాత్మ నే మఱక యతఁడు      

'తనను లాగి పడేయడానికి ఆ రాక్షసుడు ప్రయత్నిస్తుంటే తన అడుగులు కదలకుండా రొమ్ము విశాలంగా చేసుకుని తట్టుకున్నాడు. వాడు ఎగిరి తనను చరవడానికి ప్రయత్నిస్తే, వాడిని వంచించి తప్పుకుని వెనుకకు తిరిగాడు. వాడు మరలా తనను చరిచి పడేయడానికి ప్రయత్నిస్తే పిడికిళ్ళను గుండెలకు అడ్డు పెట్టుకుని కాచుకున్నాడు. వాడు వంగి తనమీదికి దూకడానికి ప్రయత్నిస్తే  తానూ వంగి, పిడికిలి పోట్లతో కాచుకుంటూ వాడు ఎటు తిరిగితే అటు తాను తిరిగి కాచుకున్నాడు, వాడికి యే మాత్రమూ సందు యివ్వలేదు. యిలా కాదని  తనను చంపడానికి, ఏ ఆయుధం కోసమో రాయీ రప్పా కోసమో వాడు అటూ యిటూ కలయజూస్తూ వెదుకుతుంటే పిడికిలి పోట్లతో వాడిని హింసించాడు.వాడు వెనుకకు తిరిగినపుడు, తనవైపుకు తిరిగినపుడు, వంగినపుడు, సందు దొరికినపుడల్లా వీపుమీద, నడుము మీద పిడికిలి పోట్లతో వాడిని కుమ్మేశాడు.యింత పోరాటమూ చేస్తూనే నా పద ధ్యానాన్ని యేమాత్రమూ మరిచిపోలేదు  ఆ మహాభక్తుడు' అని ఆ పోరాటాన్ని వర్ణించి చెబుతున్నాడు శ్రీమహావిష్ణువు, విష్ణుచిత్తులవారికి.

త్రోచి పోఁజూడఁ దన రాక్షసీచయంబు 
నెల్లఁ జీరిన డిగ్గి వా రేగుదేరఁ 
బోయె నదె వాఁడు రారె రారే యటంచుఁ 
బాఱి వారును దానును బట్టికొనుఁడు 

అలా పోరాటం చేస్తూ ఆ బ్రహ్మరాక్షసుడిని త్రోసి పారిపోవడానికి అతడు ప్రయత్నం  చేస్తుంటే, ఆ బ్రహ్మరాక్షసుడు తన చెలికత్తెలను, ఆడ రాక్షసులను పెద్దగా పిలిచాడు. వాళ్ళూ ఊడిపడ్డారు. అదిగో వాడు పోతున్నాడు, పోతున్నాడు, రాండే అని అరుస్తూ  మాలదాసరి వెంటబడి ఉరికి, అందరూ కలిసి మీదపడి, ఆ భక్తుడిని పట్టుకున్నారు. 

పెంబో తద్దాసరి య
ప్డుం బదహతులను గపోణి పోటుల నిరుమై 
లం బొడుచుచుఁ బెనఁగుచుఁ బో
వం బట్టి వటంబుఁ జేర్చి వాఁ డిట్లనియెన్  

బాగా మదించి, బలంగా ఉన్న ఆ దాసరి అప్పుడుకూడా, అంతమందీ కలిసి మీదపడి  తనను పట్టుకున్నప్పటికీ, రెండుప్రక్కలా కాళ్ళతో తంతూ, మోచేతులతో పొడుస్తూ పెనగులాడుతూ తప్పించుకుని పోవడానికి ప్రయత్నిస్తుంటే అతడిని పట్టుకుని, మఱ్ఱిచెట్టుకు చేర్చి యిలా అన్నాడు ఆ బ్రహ్మరాక్షసుడు. 

సా రాస్వాదనఁ బ్రాణపంచకము తృష్ణంబాసి సంతర్పణ 
న్మూరింబో నసిఁ ద్రుంచి పొంగెడు భవన్ముండాస్రధారోష్మ మిం 
పారం గ్రోలి పిశాచి నీదు కఱకు ట్లందీ నదస్తాలకాం 
తారాంతర్నృకపాలకుండవిగళన్మైరేయముం గ్రోలెదన్    

నీ కొవ్వును రుచి చూసి నా పంచప్రాణాలకూ త్రుప్తిని కలిగిస్తాను. నేను త్రుప్తిని  పొందుతాను అనడంలేదు, వాడు వేరు, వాడి ప్రాణాలు వేరు, మామూలు రాక్షసుడు కాదు కదా, బ్రహ్మరాక్షసుడు. 'తను' వేరు, 'తన శరీరం' వేరు అన్న జ్ఞానం ఏడిసింది  వాడికి! కత్తితో నీ పుచ్చెను చీల్చి వేడినెత్తురు కడుపారా త్రాగి, నా ఆడ పిశాచులు నీ మాంసపు ముక్కలను కడ్డీలకు గుచ్చి కాల్చి అందిస్తుంటే తింటూ, ఈ తాటితోపులో ఉన్న పుర్రెల కుండల్లో మద్యాన్ని నింపి అందిస్తుంటే త్రాగుతాను.

న న్నిం తలయించినఖలు
నిన్నున్ ఋజువిధి వధింతునే యని యార్పుల్ 
మి న్నందఁగ బుస కొట్టుచు 
నన్నీచుఁడు పొగరు వెడలు నవ్యక్తోక్తిన్ 

నన్ను యింత యిబ్బంది పెట్టి అలిసిపోయేట్లు చేసిన నిన్ను మామూలుగా,  సున్నితంగా చంపుతాను అనుకుంటున్నావా? అని ఆకాశానికి తాకేట్లు పెడబొబ్బలు  పెడుతూ, నిట్టూర్పులు విడుస్తూ, గసపెడుతూ ఆ నీచుడు పిచ్చి పిచ్చిగా రంకెలు  పెట్టాడు.

అసియుఁ బాత్రియుఁ దేఁ బంచి యాంత్రవల్లిఁ 
గోలగగ్గెర ద్రోయ నక్కుజముతోడ 
నొరగి రక్కసుతో దైన్యవిరహితముగ
ధర్మ మెఱిఁగించుసూక్తి నాతండు పలికె 

తనను నరకడానికి కత్తిని, తన రక్తాన్ని పట్టడానికి పాత్రను తెమ్మని ఆ ఆడ పిశాచాలను పంపించి, రెండుకాళ్ళకూ పశువులకు తగిలించినట్లు తాళ్ళు  కట్టి(గోలగగ్గెర) నేలమీదికి తోసేయడంతో ఆ మఱ్ఱిచెట్టుకు జారగిలబడి, దైన్యముతో  కాకుండా, ఒక ధర్మ సూక్ష్మాన్ని చెపుతున్నట్లు, ధైర్యంగా, తాపీగా యిలా అన్నాడు  ఆ మహాభక్తుడు, సాహసి, ధైర్యవంతుడు అయిన మాలదాసరి. 

(కొనసాగింపు వచ్చేవారం)

***వనం వేంకట వరప్రసాదరావు.

మరిన్ని శీర్షికలు
vangi bath