Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
vedika

ఈ సంచికలో >> సీరియల్స్

నాగలోకయాగం

గతసంచికలో ఏం జరిగిందంటే..

.http://www.gotelugu.com/issue144/406/telugu-serials/nagaloka-yagam/nagaloka-yagam/

సుమారుగా పది ధనువుల పొడవుండే దుంగ లాంటి పెను సర్పం ఒకటి ఒక పెడగా వాయు వేగంతో పాకుతూ తనను అనుసరిస్తోంది. కాలిన దుంగ లాంటి అతి నల్లని శరీరం. అది శ్వాస వదులుతూంటే పొగలతో కూడిన అగ్ని జ్వాల వెలువడుతోంది. దాని ఒళ్ళంతా కాల కూట విషం లాంటి భయంకరమైన విష తుల్యమని చూడగానే అర్థమవుతోంది. అగ్నిసర్పం!

అరుదైన ఈ అగ్ని సర్పం పాము గురించి తను విన్నాడు గాని నేరుగా ఇప్పుడే చూస్తున్నాడు. గాలిలో వ్యాపిస్తున్న దాని విష జ్వాలలకు ఆకులు, అలములు క్షణాల్లో మాడి మసై పోతున్నాయి. ఇక దాని నోరు తెరిస్తే ఎంత పెను విష జ్వాలలు వ్యాపిస్తాయో వూహించు కోవచ్చు. ఇంత వేగంతో దూసుకొచ్చే పెను నాగాన్ని ఇప్పుడే చూస్తున్నాడు. దీనికి చిక్కితే క్షణాల్లో ప్రాణాలు హరిస్తుందనడంలో సందేహం లేదు.

ఇంతగా ఇది తనను వెంబడిస్తోందంటే సందేహం లేదు. ఇది నాగ లోకాధిపతి ఆ నాగ రాజు పనే. ఓజో ప్రయోగం విఫలం గావటంతో ఎగిరే పాముల్ని తన మీదికి ప్రేరేపించాడు. అదీ తప్పించుకుంటే అంతం చేయమని ఈ అగ్ని సర్పాన్ని అంపకం చేసాడు. రానీ.... ఎంత దూరం వస్తుందో అదీ చూచెదను గాక అనుకొంటూ కళ్ళాలు బిగించి అశ్వాన్ని అదిలిస్తున్నాడు. అగ్నిసర్పం కదలికల్ని ఓర కంట గమనిస్తూనే వున్నాడు.

ఆకాశంలో మేఘాలు అలాగే వున్నాయి.
సూర్యుడు కన్పించ కుండా పోయాడు.
గాలి విసుర్లు ఆగి ఆగి వీస్తున్నాయి.
నట్టడివిలో దిక్కు దరి తెలీకుండా పోయాయి.
తిరిగి వర్షం ఆరంభమైనా ఆశ్చర్యం లేదు.

రాత్రి కురిసిన వర్షానికి మిట్ట పల్లాల్లో వర్షం నీరు నిలిచి వుంది. క్షణాలు భారం గానూ, వేగం గానూ దొర్లి పోతూనే వున్నాయి. క్రమంగా ఒక మైదాన ప్రాంతాన్ని సమీపించింది అశ్వం.

చూడ్డానికి ఒక మడుగులా వుంది గాని, నిజానికి అది సువిశాలమైన లోతట్టు మైదాన ప్రాంతం. పైగా చాలా వరకు రాతి నేల విస్తరించి వుంది. రాత్రి కురిసిన వర్షం నీరు నిలిచి వుంది. అక్కడో చెట్టు ఇక్కడో చెట్టుగా పెరిగి మిగిలిన ప్రాంతమంతా ఒత్తుగా పచ్చిక పెరిగుంది. పచ్చిక తాలూకు చిగుళ్ళు నీటి పైకి స్పష్టంగా కన్పిస్తున్నాయి. మైదానంలో మోకాలి లోతు మించదు నీరు.

తను మైదానానికి అడ్డం బడి వెళ్ళి పోవచ్చును. కాని అంత వేగంగా వస్తున్న అగ్ని సర్పానికి నీరు అడ్డు కాదు సరి గదా నీటి మీద అది మరింత వేగంగా తన అశ్వాన్ని చేరు కొంటుంది. కాబట్టి నీటి లోకి దిగటం దానికి మరింత అవకాశం ఇచ్చినట్టవుతుంది. తెలిసీ పొరబాటు చేయ కూడదు.

ఇక మిగిలింది ఒకటే దారి.
తాడో-పేడో తేల్చుకోవటం.

అలా మైదానంలో ప్రవేశించటం క్షేమం కాదనుకొంటూ నీటి వంచకు దూరం లోనే తన అశ్వాన్ని నిలువరించాడు ధనుంజయుడు. అది గమనించ లేదు అగ్ని సర్పం. వస్తున్న వేగానికి నేరుగా మైదానంలో నీటి మీద కొంత దూరం దూసుకు పోయింది. తల తిప్పి ధనుంజయుని కౄరంగా చూస్తూ వెను తిరిగి తనూ ఆగింది. దాని శరీర విషానికి నీరు మరిగి ఆవిర్లు వస్తున్నాయి. దాని శ్వాసకు నీటి మీదకు కన బడుతున్న పచ్చిక క్షణాల్లో నల్లగా మాడి పోతోంది. ధనుంజయుని తీక్షణంగా చూస్తూ అది బుసలు కొట్టి నోరు తెరవ గానే భయంకర అగ్నికీలలు గాలి లోకి వ్యాపించాయి. దాన్ని చూసిన అశ్వం గరుడ బెదిరి నాలుగడుగులు వెనక్కి వేసింది. వెన్నుతట్టి ధైర్యం చెప్పాడు ధనుంజయుడు. 

అగ్ని సర్పం తీరు చూస్తే అది తనను వదలదని అర్థమవుతోంది. ఎగిరే పాముల నుంచి ఎలాగో తప్పించుకు రాగలిగాడు గాని భీకరమైన ఈ అగ్ని సర్పం నుంచి మాత్రం తను తప్పించు కోలేడు. ఒకటి దాన్ని సంహరించాలి లేదా తను చావాలి. ఏదో ఒకటి జరక్కుండా మాత్రం ముందుకు పోలేడు. అగ్నిసర్పం నెమ్మదిగా కదులుతోంది.

అది నేరుగా తన వైపే వస్తోంది.
ధనుంజయుడు ఇక ఉపేక్షించ లేదు.
వెంటనే ధనస్సు అందుకున్నాడు.

అంబుల పొది నుండి రెండు బాణాలు తీసాడు. ఒకటి అర్ధ చంద్రాకార శరము, రెండోది వాడి యగు బాణం. రెంటిని ఏక కాంలో వింటికి సంధించాడు. క్షణ కాలం కనులు మూసుకొని తన దైవం కృష్ణ పరమాత్మను, సహ్యాద్రి భీమ శంకరుని తలచుకున్నాడు. తిరిగి కనులు తెరిచే సరికి అగ్నిసర్పం నీటి మీద ప్రచండ వేగంతో వచ్చేస్తోంది.

బుస కొట్టి గొడుగులా పడగ విప్పింది.

దాని నోటి నుండి ఛెళ్ళున విష వాయువులతో కూడిన అగ్ని జ్వాలలు ఎగసాయి. క్రమంగా నీటిని చెల్లా చెదురు చేస్తూ సమీపం లోకి వచ్చేస్తోంది. గురి చూసి బాణాలను వదిలాడు ధనుంజయుడు. బాణాలు రెండూ గాలిని చీల్చుకు వెళ్ళాయి. ఒకటి దాని శరీరంలో దిగ బడింది. అర్ధ చంద్రాకారం బాణం నేరుగా వెళ్ళి దాని పడగ దిగువకు శరీరాన్ని రెండు ముక్కలు చేస్తూ అవతలకు దూసుకు పోయింది. తల తెగి అవతల పడగానే దాని శరీరం నీటిని అల్ల కల్లోలం చేస్తూ ఎగిరెగిరి పడింది. వెంట వెంటనే మరి కొన్ని బాణాలు సంధించి వదిలాడు.

అదే సమయంలో వూహించని సంఘటన జరిగింది. అగ్ని సర్పం యొక్క ఖండిత శిర భాగం ఉన్నట్టుండి నిటారుగా లేచి చివ్వున గాల్లోకి ఎగిరింది. నిప్పులు కక్కుతూ సూటిగా ధనుంజయుని మీదికి వచ్చేసింది. చివరి క్షణంలో ప్రమాదం గ్రహించి చట్టున తన బళ్ళాన్ని అడ్డం వేసాడు. వచ్చీ రావడమే బళ్ళానికి దిగ బడింది. కాని దాని నోటి నుంచి విష వాయువులు మీదకు ఎగసాయి. బళ్ళెంతో సహా సర్ప శిరస్సును నీటి లోకి విసిరేసాడు. కాని విష గాలి ప్రభావంతో ఒక్క సారిగా కళ్ళు గిర్రున తిరిగాయి. ఒళ్ళు తూలింది. శరీరంలో శక్తి మొత్తం హరించుకు పోతున్నట్టయింది. అంతే` ఉన్నట్టుండి తెలివి తప్పి` అశ్వం పై నుండి దబ్బున కింద పడి పోయాడు ధనుంజయుడు. తర్వాత ఏం జరిగిందీ అతనికి తెలీదు.

********************************************************************

సమయం ఎంత గడిచిందో గాని`

అశ్వం గరుడ ముఖంలో ముఖం పెట్టి చూస్తూ లేవమని మృదువుగా కదిలిస్తుంటే స్పృహ వచ్చింది ధనుంజయుడికి. కనులు తెరవగానే అశ్వ ముఖమే కన్పించింది. దాని కళ్ళలో కన్నీరు చూసి చలించి పోయాడు. దాని ముఖాన్ని కౌగిలించుకొని ప్రేమగా ముద్దాడాడు. నిజానికి నిన్నటి నుంచి అది ఏమీ తినలేదు. తను కింద పడగానే వెళ్ళి పచ్చిక మేయవచ్చు. కాని తన ఆకలి కూడ మర్చిపోయి తన కోసం అది పడిన వేదన గ్రహించి బాధ పడ్డాడు. అప్యాయంగా జూలు నిమిరాడు.

‘‘నాకేమీ కాలేదురా గరుడా. అలా వెళ్ళి చెట్ల కింద కడుపార పచ్చిక తినిరా. నేను క్షేమంగా వున్నాను. వెళ్ళు.’’ అంటూ చెప్పాడు.
అయినా అశ్వం కదల్లేదు.

‘‘ఈ ఒంటరి ప్రయాణంలో నీకన్నా నాకు తోడు ఎవరురా? నాకేమీ కాలేదంటిని గదా. పద!’’ అంటూ హెచ్చరించగానే అప్పుడు అక్కడి నుండి కదిలింది అశ్వం.

చిన్నగా లేచేందుకు ప్రయత్నించాడు ధనుంజయుడు. తల దిమ్ముగా వుండి, కాళ్ళు చేతులు ఇంకా పూర్తిగా స్వాధీనంలోకి రాలేదు. అదృష్టం బాగుండి అగ్ని సర్పం శిరస్సును మీద పడకుండా నిరోధించ గలిగాడు గాని లేకున్న దాని విష జ్వాలలకు తను అంతమై వుండేవాడు.

శక్తి నంతా కూడ దీసుకుని` నెమ్మదిగా లేచి నిలబడ్డాడు.

వాతావరణంలో మార్పు లేదు సరి కదా` చినుకు చినుకుగా తిరిగి చిరు జల్లులు ఆరంభించింది. ఈదురు గాలి ఆగి ఆగి వీస్తోంది.తను సంహరించిన అగ్ని సర్పం తాలూకు ఖండిత భాగాలు నీటి మీద కన్పించాలి కాని వాటి జాడ ఎక్కడా లేదు. కాని జరిగిందానికి సాక్షిగా నల్లగా మాడి పోయిన పచ్చిక, విష పూరితమై నల్లగా మారిన నీళ్ళు కన్పిస్తున్నాయి. ఏదో జరిగింది...!

తను తెలివి తప్పాక ఇక్కడ ఏదో జరిగింది. ఏమిటది? ఆలోచిస్తూ వెను తిరిగిన ధనుంజయుడికి అప్పుడు కన్పించాడు భీకరాకారుడు. తనకు సమీపంలోనే అంత ఎత్తున శిలా విగ్రహంలా నిలబడున్నాడతను. విచిత్రమైన ఆ ఆకారాన్ని చూసి మ్రాన్పడి పోయాడు. సుమారు పదడుగుల ఎత్తున చామన ఛాయ దేహంతో బలిష్టుడైన మహా కాయుడతడు. నున్నగా బోడి గుండు వెనుక పొడవాటి పిలక గాలికి రెప రెప లాడుతోంది.

ఉక్కు పలక వంటి ఛాతీకి అడ్డంగా జంధ్యం పోగు వుంది. నీలి వర్ణపు పట్టు వస్త్రం దట్టీ బిగించి కట్టాడు. చెవులకు మణిమయ కుండలాలు వున్నాయి. మెడలో బెత్తెడు వెడల్పున్న కంఠ హారం ధరించాడు. రెండు చేతులకు బంగారు కడియాలు, ఎడమ కాలికి స్వర్ణ తోడాలు వున్నాయి. నుదుటిన అర్ధ చంద్రుడు, మధ్య చుక్కతో ఎర్రటి బొట్టు వుంది. గడ్డం మీసాలు లేవు. కను బొమలు పెద్దగా తీర్చి దిద్దినట్టుండి విశామైన నేత్రాలు కలిగి వున్నాడు. ముక్కు పొడవుగా కొటేరులా వుంది.

అతి బలాఢ్యుడైన అతడు ఎవరో, ఎందుకు ఇక్కడ వున్నాడో అర్థం కాలేదు. శత్రువో, మిత్రుడో అంత కన్నా తెలీదు. ఎందుకైనా మంచిదని చట్టున విల్లంబులు అందుకున్నాడు ధనుంజయుడు.

అది చూసి మందహాసం చేసాడతను.

రెండు చేతులూ జోడిస్తూ` ‘‘మహా వీరా నమో నమః నేను నీ శత్రువుని కాను. ఆయుధాలతో పని యేమి?’’ అన్నాడు. ‘‘అలాగని మిత్రుడవూ కాదు.’’ అన్నాడు కరుగ్గా ధనుంజయుడు.‘‘ఇక నుండి నేను నీ మిత్రుడను’’ మేఘ గంభీర స్వరంతో పలికాడతడు.

‘‘ఎవరు నీవు? ఇక్కడ ఏమి పని? నాకు ఎలా మిత్రుడవు కాగలవు?

‘‘నాకు శాప వియోచన కలిగించిన సాహస వీరుడవు నీవు. కృతజ్ఞతగా నా స్నేహ హస్తం అందిచు చున్నాను.’’

‘‘శాప వియోచనమా?’’

‘‘అవును. శాప వియోచనమే. వీర కుమారా! నేనొక యక్షుడను. నన్ను రుచికుడందురు. నీవు సంహరించిన అగ్ని సర్పం ఎవరో కాదు, నేనే.’’

ధనుంజయునికి అతడేమి చెప్తున్నాడో, తనేమి వింటున్నాడో అర్థం కాలేదు. ఆశ్చర్య చకితుడై చూస్తున్నాడు.

‘‘శాప వశమున నీవు అగ్నిసర్పముగా మారి వుండొచ్చును గాక. కాని నా మీద నీకు పగ యేమి? ద్వేషమేమి? అటు ఎగిరే పాములు, యిటు నీవు. నను మృత్యువు సమీపము వరకు తరిమినారు గదా. ఏమిటిదంతా?’’ అనడిగాడు.

‘‘ఇది నా వలన జరిగిన తప్పిదము గాదు.’’ వెంటనే బదులిచ్చాడు యక్షుడు.

‘‘వీర కుమారా! ఇది యంతయు నాగ రాజగు మహా పద్ముని ఆనతి మేరకు జరిగినది. నేను నిమిత్త మాతృడను’’ అన్నాడు. నాగ లోకాధిపతి ద్వేషం గురించి ధనుంజయుడు ఇది రెండో సారి వినటం. అడుగడుగునా అవరోధాలు కల్పించి, తనను వెనక్కు పంపించాలని లేదా నాగ లోకం చేరు లోపలే తనను నిర్జించాని చూస్తున్నాడు. తను అప్రమత్తుడై వుండక తప్పదు.

‘‘సాటి లేని విక్రముడవు. నా శాపం గురించి చెప్తాను విను మిత్రమా.’’ అంటూ తన గురించి చెప్పుకొచ్చాడు యక్షుడు రుచికుడు.

‘‘మాది యక్ష లోకం. యక్షులలో విలక్షణమైన స్వభావము నాది. తరచూ భూలోక విహారం చేసే వాడిని. అలా విహరించేప్పుడు నాగు పాము కనబడితే చాలును, పట్టి శిరము తుంచి తినేసే వాడిని. సర్ప భక్షణ నా అలవాటు. అందుకే సర్ప భక్షకుడను నామాంతరము కూడ కలదు నాకు.

అప్పట్లో... అనగా కలి యుగారంభానికి ముందు అయిదు వందల సంవత్సరాల నాటి మాట. ఇప్పటి నాగరాజు మాహా పద్ముడి తండ్రి యగు పద్ముడు నాగ రాజుగా వున్న కాలం. ఒక పరి నేను దక్షిణా పధ మందలి దండకార్యణమున సంచరిస్తుండగా అయిదు శిరస్సుల మహా నాగాన్ని చూసినాను. దాన్ని భక్షింప నిచ్చగించితిని. దాన్ని పట్ట బోయినపుడు గాని అది సాధారణ సర్పము కాదని, నాగ లోకాధిపతి యగు నాగరాజు పద్ముడని నాకు తెలియనైతిని.

దివ్య దృష్టితో నా గురించి గ్రహించిన నాగ రాజు ఆగ్రహోదగ్ధుడయ్యాడు. ‘‘ఓరీ యక్షా. సర్ప భక్షణతో మా నాగ జాతి ఉసురు పోసుకొను నిన్ను క్షమింప జాలను. పొమ్ము. భయంకర అగ్ని సర్పంగా మారి మా నాగ లోక మందు నాగాలకు సేవకునిగా పడి వుండుము.’’ అంటూ శాపమిచ్చినాడు. నేను తప్పిదము గ్రహించి శాప వియోచన అనుగ్రహింపుమని వేడుకొంటిని. ఒక మహా వీరుడు మహర్జాతకుడైన ఒక రాజ కుమారుని చేతిలో మరణ మొందినపుడు నీకు శాప విముక్తి కాగలదని అనుగ్రహించాడు.

అప్పటి నుండి అగ్నిసర్పంగా మారిన నాకు నాగ లోకమే నివాసమైనది. కలి యుగారంభమైన పిమ్మట జరిగిన సర్ప యాగంలో అనేక నాగ జాతులు నశించుట తెలిసి వ్యధ చెంది తన వారసుడైన మహా పద్ముడిని నాగ రాజుగా అభిషేకించాడు పద్ముడు. పిమ్మట తను తపస్సుకై నాగ లోకం విడిచి పాతాళానికి వెళ్ళి పోయినాడు. నేను మాత్రం ఇంత కాలమూ నాగ లోకాన అగ్ని సర్పముగా నాగుల భృత్యునిగా అక్కడే పడి వుంటిని.

ఇప్పుడు నిను అంతం చేయమని నాగరాజు నాకు ఆనతి పంపించినాడు. అలాగే ఎగిరే పాముల్ని కూడ నీ మీదకు ప్రేరేపించినాడు. తదుపరి ఏమి జరిగినది నీకు తెలిసినదే. మహర్జాతకుడవైన నీవలన నేటికి నాకు శాప వియోచన లభించి నిజరూపు ధరించినందుకు చాలా ఆనందముగ వున్నది. ఇక నుండి నను నీ మిత్రునిగా భావింపుము’’ అంటూ వివరిస్తుంటే విస్మయం చెంది అలా వింటూండి పోయాడు ధనుంజయుడు.

‘‘సరి. నీ మాటలు నిక్కముని నమ్ముచున్నాను. నిను మిత్రునిగా భావించెదను. నేను నాగ లోకము వెళ్ళుటకు మార్గము చెప్పుము.’’ అనడిగాడు.

‘‘లేదు మిత్రమా! అది దేవ రహస్యము. నేను చెప్ప కూడదు. అయిననూ తొందరేల? మార్గము తానుగా నిను వెదకుచూ రాగలదు. నేనుగా నీకో వరమిచ్చెదను. ఇక ముందు నీకు ఎలాంటి సంకటము నేరినను నను తలుచుకుని ‘యక్ష వీరా రుచికా’ అని పిలువు చాలును. తక్షణమే నీ చెంత కొచ్చి వలసిన సాయము చేసెదను. చాలునా? ఇక శలవు మిత్రమా. ఈ మైదానమును దాటి నేరుగా ప్రయాణిస్తే నీకు శుభం జరుగును. పోయి వచ్చెదను’’ అంటూ ధనుంజయునికి మరొక్క సారి నమస్కరించి అదృశ్యుడయ్యాడు యక్షుడైన రుచికుడు.

నాగ లోకము చేర్చు మార్గము అంత సులువుగా తెలియదని తెలుసు. కాని యక్షుడైన రుచికుడు కూడ చెప్పక పోవటం విస్మయం కలిగించింది.

నిజానికి కొన్ని వందల ఏండ్లుగా అగ్ని సర్పంగా మారి నాగ లోకాన భృత్యుడిగా పడి వున్నందున రుచికుడిలో నాగుల మీద కోపం, ద్వేషం సహజం కాబట్టి తప్పక చెబుతాడనే ఆశించాడు. కాని ధనుంజయునికి నిరాశే ఎదురైంది. దేవ రహస్యమంటూ చెప్పటానికి నిరాకరించాడు రుచికుడు. భారంగా నిట్టూర్చుతూ వెను తిరిగాడు.

అంత వరకు రాలుతున్న వర్షపు చినుకులు ఆగాయి. గగన తలంలో నల్లటి మబ్బులు ఇప్పుడిప్పుడే చెదరి పోవటం ఆరంభించాయి. గాలి విసురు కూడ తగ్గింది.

పచ్చిక మేస్తున్న గరుడను పిలిచి తన ఆయుధాలు సర్దుకొని అధిరోహించాడు. కళ్ళాలు అందుకొని కొంత దూరం ఎగువకు వెళ్ళాక అశ్వాన్ని మైదానం నీటి లోకి మళ్ళించాడు. మోకాలి లోతు నీటిలో మైదానం ఆవల కన్పిస్తున్న అటవీ భాగం వైపు అదలించాడు. నీటిని చెల్లా చెదురు చేస్తూ వేగంగా పరుగు ఆరంభించింది గరుడు.

***********************************************************************

మర్మ భూమి అటవీ ప్రాంతం.

నాగ జాతి ప్రజలు నివశించు నాగుల దిబ్బ కొండ గుట్టల నుండి దక్షిణంగా సుదూర ప్రాంతంలో సంపంగి వనమగు ఒక కాననము వుంది.

అక్కడ చట్టూ మూడు కొండ గుట్టల నడుమ మనోహరమగు సువిశాల సరోవరం ఒకటి వుంది. ఆ సరోవరం ఎప్పుడూ నిండుగా తామర పూలతో కళ కళ లాడుతూ వుంటుంది. ఆ తామర మడుగును చుట్టి సంపంగి మొక్కు విస్తారంగా పెరిగి సంపంగుల సువాసనలతో ఆ ప్రాంతం ఎప్పుడూ గుబాళిస్తూంటుంది. అందుకే ఆ ప్రాంతాన్ని సంపంగి వనముగా పిలుస్తుంటారు. మల్లలు, సంపంగి పూల వాసనలు నాగులకు ప్రితి కరమని వేరే చెప్పనక్కర్లేదు. అందుకే ఆ ప్రాంతం పాముల క్కూడ ప్రసిద్ధి.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
kadali