Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
nagaloka yagam

ఈ సంచికలో >> సీరియల్స్

కడలి

 గతసంచికలో ఏం జరిగిందంటే..http://www.gotelugu.com/issue144/408/telugu-serials/kadali/kadali/

 

రెండు రోజుల తరవాత ఆ రోజు సహస్రకి షూటింగ్ లేదు. అంచేత ఇంట్లోనే ఉంది. నేను కూడా కోర్ట్ నుంచి త్వరగా వచ్చేసాను.

సహస్ర టి వి చూస్తోంది. బహుశా తను యాంకరింగ్ చేసిన గేం షో అనుకుంటా. లోపలికి అడుగు పెడుతున్న నన్ను చూసి  " హాయ్ మమ్మీ" అంటూ పలకరింపుగా నవ్వింది.

" హాయ్ బేబి త్వరగా వచ్చేసినట్టున్నావే  లంచ్ చేసావా? " అడిగాను.

" యా అయిపోయింది." అంది రిమోట్ తో చానెల్ మారుస్తూ .

నేను లోపలికి వెళ్లి చీర మార్చుకుని వచ్చి సత్యవతి తెచ్చిన మంచి నీళ్ళ గ్లాసు అందుకుని నీళ్ళు త్రాగిగి సహస్ర పక్కన కూర్చున్నాను.
" కాఫీ గాని, టి గాని ఇవ్వమంటారా" అడిగింది సత్యవతి.

నాకన్నా ముందు సహస్రే " కాఫీ చేయండి" అంది. ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది.

" ఏం  ప్రోగ్రాం ఇది?  నీదేదన్న వస్తుందా పెట్టు చూస్తాను" అన్నాను టివి వైపు చూస్తూ. సడన్ గా టి వి ఆఫ్ చేసి " ఇప్పుడేది వద్దు" అంటూ నా వైపు తిరిగింది."నీ  ప్రోగ్రాం పెట్టచ్చుగా చూస్తాను"  తను అలా హఠాత్తుగా టి వి ఆఫ్ చేయడంతో ఎందుకో తెలియని నేను అన్నాను.

"ఏం వొద్దన్నగా"  అసహనంగా అంది. దాని తిక్క స్వభావం తెలిసిన నేను దాని నెత్తిన మొట్టి "నీ  తిక్క పెళ్లి అయితే గాని కుదరదు"  అన్నాను.

పెళ్లి మాట ఎత్తగానే సహస్ర మొహం గంభీరంగా మారింది. కళ్ళు దించుకుని అర చేయి చూసుకుంటూ అంది.

" మమ్మీ ఒక విషయం అడగనా? "

" ఒక్కటేంటి వంద అడుగు"  సరదాగా అన్నాను. కానీ తను నా మాటల్లో హాస్యాన్ని ఆస్వాదించే మూడ్ లో లేదనిపించింది. ఏదో చాలా సీరియస్ గానే మాట్లాడబోతోందని అర్ధమైంది. ఏవిటై ఉంటుందా  అని ఆసక్తిగా చూసాను.

కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉన్న పరిసరాల్లో పెద్ద బాంబు పడినట్టుగా వినిపించింది దాని స్వరం.

"మీరు నాకు సంబంధాలు చూస్తున్నామని చూసే ముందు నాతో  ఒక్క మాట చెప్పాలి గదా ! "

విస్తుబోయి చూసాను " ఎందుకు? "

" ఎందుకేంటి ? నా పెళ్లి కదా నా పెళ్లి మీ ఇష్టం తో ఎలా జరుగుతుంది ? "

ఒక్క సారిగా కుదుపు  ఆశ్చర్యంగా చూసాను  "ఏమన్నావు? "

" యస్... కరెక్టుగా అన్నాను నా పెళ్లి మీ ఇష్టం తో ఎలా జరుగుతుంది? "

" మరి ఎవరిష్టంతో జరగాలి?  నీ పేరెంట్స్ మేము కాదా ? "  ఆ  ఆ క్షణం నేనేం మాట్లాడుతున్నానో నాకు ఆలోచించే సహనం కానీ, నేను మాట్లాడేది కరేక్టేనా అని ఆత్మ విమర్శ చేసుకునే శక్తి గానీ   కలగ లేదు. నా ఆదర్శాలు, నా వివేకం, విచక్షణ అన్నీ నా కోపాగ్ని జ్వాలల్లో దహించుకు పోతున్నట్టు అనిపించింది.

సహస్ర నా వైపు తదేకంగా చూసి మొహం తిప్పుకుంది. నెమ్మదిగా అయినా స్థిరంగా అంది.  "పేరెంట్స్ కి  వాళ్ళ పిల్లల మీద కొంత వయసు వరకే హక్కుంటుంది మమ్మీ ! నా వయసు పాతికకు దగ్గరవుతోంది. నన్ను చిన్నపిల్లలా ట్రీట్ చేసి మీరు సంబంధం చూడడం ఇట్స్ జస్ట్ రెడిక్యులస్ . "

నాకు నోట మాట రాలేదు. సహస్రేనా ! నా కూతురేనా ఇలా మాట్లాడేది ? దీని మీద నాకూ, చంద్రకి  ఏమీ హక్కు లేదా? దీన్ని కనీ, పెంచి, పెద్ద చేసి చదివించి ఈ స్థాయికి తీసుకు వచ్చింది మేము  కాదా?  మంచివాడు, బుద్ధిమంతుడు అయిన కుర్రాడిని , మంచి కుటుంబ నేపధ్యాన్ని చూసి పెళ్లి చేసి తను సుఖంగా ఉంటే చూసి ఆనందించేది మేము కాదా? ఏం మాట్లాడుతోంది ?
నా చూపుల్లో భావం గమనించిన దానిలా అంది.

"మమ్మీ నేను చదువుకున్నాను.. నలుగురిలో  తిరుగుతున్నాను. మీడియాలో ఉన్నాను. నాకూ కొన్ని వ్యక్తిగత అభిప్రాయాలు, ఇష్టాలు ఉంటాయని మీరు తెలుసుకోడం మంచిది. సమయం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. నేను నాతో పాటు యాంకర్ గా చేసే సిద్ధూ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము.  కొన్ని రోజులాగి చెప్పాలనుకున్నాను కానీ ఇపుడే చెప్పే పరిస్థితి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇది మీ పర్మిషన్ కోసం చెప్పడం లేదు. జస్ట్ నా పేరెంట్స్ కాబట్టి ఇన్ ఫార్మ్ చేస్తున్నాను. "

ఆ క్షణం నా పక్కన కూర్చున్నది నా కూతురు సహస్రలా అనిపించలేదు పెద్ద హ్యూమన్ బాంబ్ లా అనిపించింది. నా నెత్తి మీద, నా గుండె మీద గురిచేసి బాణాలు వేస్తున్న నిపుణురాలైన విలుకాడిలా కనిపించింది.

నా కాళ్ళ కింద నిప్పులు పోసి నడవమని శాసించే పెద్ద మంత్రగత్తెలా అనిపించింది. నా నమ్మకం మీద గొడ్డలితో బలంగా కొట్టినట్టుగా అనిపిస్తోంది. నిలువెల్లా అవమానంతో  దహించుకుపోతూ చూసాను.

"అదేంటి చంద్రా ఆడపిల్లలకి ప్రేమించే హక్కు లేదా? పెద్దవాళ్ళ మాట శిరసావహించి వాళ్ళు నిర్ణయించిన వాడినే పెళ్లి చేసుకోమనడం ఎంతవరకు సమంజసం ! "  అంటూ చంద్రని నిలదీసిన సంయుక్త,   ఏ పిల్లలైనా మైనారిటీ తీరే వరకే తల్లి, తండ్రుల అజమాయిషీ,   మైనారిటీ తీరిన వాళ్ళని  ఏ విషయం లోను నిర్బంధించే హక్కు ఎవరికీ లేదు అంటూ కోర్టులో బల్ల గుద్ది వాదించే సంయుక్త  నాలో నుంచి వెళ్ళిపోయి దూరంగా నిల్చుని తమాషా చూస్తున్నట్టుగా నేను కేవలం ఒక తల్లిగా మిగిలి పోయి సహస్ర వైపు అగ్ని కణాలు కురిపిస్తూ చూసాను.

"నువ్వేం మాట్లాడుతున్నావో తెలుస్తోందా " అడిగాను.

" స్పష్టంగా తెలుస్తోంది. మమ్మీ మీరిద్దరూ నిరక్షరాస్యులు కారు, సంప్రదాయవాదులు కాదు, ఆధునిక భావలున్నవాళ్ళు , మీ ఆశలు, మీ కోరికలు నా నెత్తి మీద రుద్దకుండా నాకు ఏదిష్టమో అదే చదివించారు. నేను మాస్ కమ్యునికేషన్స్ చేస్తానంటే వెరీగుడ్ ఇప్పుడు చాలా డిమాండ్ ఉన్న కోర్స్ అది అంటూ నన్ను ఎంకరేజ్ చేసావు. నేను మీడియాలోకి వెళ్తానంటే బెస్ట్ విషెస్ చెప్పి పంపించావు . మరి నా పెళ్లి విషయంలో నాకొక ఇండివిడ్యువల్ టేస్ట్  ఉంటుందని  నీ కెందుకు అనిపించలేదో నాకర్ధం కావడం లేదు."

గుడ్లప్పగించి చూస్తున్నానే గాని  నా కళ్ళ ముందు విస్ఫోటనాల ఉరుములు, మెరుపులు తప్ప సహస్ర కనిపించడం లేదు.
సహస్ర మాత్రం అనాల్సినవి అన్నీ అనేసి తిరిగి రిమోట్ తీసుకుని ఆన్ చేసింది.

ఆకాశమంత ఎత్తు ఎగసి సమస్త మానవ జాతి సంస్కృతీ, సంప్రదాయాలను తుడిచి వేస్తున్న పెద్ద సునామీ లా అనిపిస్తోంది సహస్ర.
నాలో ఆవేశం, ఆగ్రహం అంతకన్నా ఎత్తుకి ఎగిసాయి. తన చేతిలో రిమోట్ విసిరి పడేలాగా తన చేయి పట్టుకుని లాగి నా వైపు తిప్పుకుని సూటిగా కళ్ళల్లోకి చూస్తూ అడిగాను.

" నిన్ను  గారాబంగా చూసుకున్న౦దుకు నువ్వేం చేసినా  ఊరుకుంటామనుకున్నావా ? చెంప పగిలి పోతుంది. నాన్నకన్నా నీకే ఎక్కువ తెలుసా! ఎవడ్నో ఊరు, పేరూ లేని వాడిని ప్రేమించి వాడినే పెళ్లి చేసుకుంటా అంటే ఆకాశమంత పందిరి వేసి పెళ్లి చేస్తామనేనా నీ ఆశ. నెవ్వర్ . నీకిష్టమైన చదువు చదువుకుంటానంటే ఊరుకున్నాం కదా అని నీకిష్టమైన వాడిని చేసుకుంటానంటే ఊరుకుంటామని ఎలా అనుకుంటున్నావు? పెళ్ళంటే తమాషా కాదు. పిచ్చి వేషాలేయకు. అతను బాగా చదువుకున్న వాడు, నాన్నగారి స్నేహితుడి కొడుకు, లక్షణమైన సంబంధం. యూ హావ్ టు సే ఓ కే .. "

నా మాటలకి రెప్ప వేయకుండా చూస్తున్న సహస్ర చూపులు లక్ష్య పెట్టకుండా నేను అంతకన్నా సీరియస్ గా చూసాను. సహస్ర  పెదాలు కదిలాయి.

"మీరు సెలక్ట్ చేసిన వాళ్ళని ఓ కే అని పెళ్లి చేసుకుని నాకు నచ్చిన వాడితో లేచిపోతే మీకు బాగుంటుందా ? " ఫెడిల్మని  తగిలింది గుండె మీద.

"ఏమన్నావు? "

" అవునమ్మా ఇష్టం లేని పెళ్లి చేసుకున్న మీ మావయ్య కూతురు గురించి చెప్పావు నాకు గుర్తుందా? నేనూ అలా చేస్తే నీకు ఓకేనా? "
నిశ్చేష్టురాలినై చూడసాగాను. నా గుండె ముక్కలు, ముక్కలుగా విరిగి పోతున్నట్టు అయి ఆ పగుళ్ళ లోంచి ఇరవై ఐదేళ్ళ నాటి స్మృతులు పొరలు, పొరలుగా విచ్చుకోసాగాయి.

"అందుకే దయచేసి నాకు సంబంధాలు చూడ్డం మానేయండి. పది రోజుల్లో సిద్ధుని ఇంటికి తీసుకొచ్చి పరిచయం చేస్తాను. ఆ తరవాత మీరు పెళ్లి చేసినా సరే, నన్ను చేసుకోమన్నా  సరే.. "

నేను నిలబడిన చోటే కుప్ప కులిపోతుంటే నిర్దయగా సహస్ర అక్కడినుంచి లేచి వెళ్ళిపోయింది.

నా గుండె లోయల్లో ఎప్పుడో పాతేసిన గతాన్ని తవ్వుతూ నేను సోఫాలో కూలబడి పోయాను.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్