Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నాగలోకయాగం

 

అప్పటికి గరుడపక్షి వెనక్కి వెళ్లినట్టే వెళ్ళి పెద్దగా అరుస్తూ రెట్టించిన వేగంతో ఉలూచీశ్వరి కోసం గగన వీధి నుండి దూసుకు రాసాగింది. అశ్వం తనను దాటి ముందుకెళ్ళగానే క్షణం కూడ ఆస్యం చేయకుండా పచ్చిక మీదకు వాలి పోయిందామె.
ధనుంజయుడు అశ్వం కళ్ళాలు వదిలి వింటికి బాణం సింధించి సిద్ధంగా వున్నాడు. గరుడ పక్షి చాలా ఎత్తులో వుండగానే వింటిని చెవి వరకు లాగి గురి చూసి బాణం వదిలాడు.

ఒకే బాణం.

గాలిని చీల్చుకొని దూసుకెళ్ళింది.

సూటిగా గరుడ పక్షి గుండెల్లో నాటుకుంది. అంతే! గాల్లో వుండగానే దాని ప్రాణాలు ఎగిరి పోయాయి. గింగిరాలు తిరుగుతూ వచ్చి నేల మీద పడింది. విల్లు భుజాన వేసుకుని కళ్ళాలు అందుకుని అశ్వాన్ని పక్షి వద్దకు పోనిచ్చాడు. అది చనిపోయిందని గ్రహించి, అశ్వాన్ని వెనక్కి తిప్పాడు. అపరిచిత అయిన ఆ సౌందర్యరాశి కోసం చూసాడు.

పరిసరాల్లో ఎక్కడా ఆమె కనబడ లేదు.

ఇంతలోనే ఎటు పోయినది? ఏమైనది? అశ్వాన్ని పచ్చిక మీద పరుగులెత్తిస్తూ పొద లతలను వెదుకుతూ కొంతసేపు గాలించాడు. ప్రయోజనం లేకపోగా, ఉన్నట్టుండి గాలికి సంపంగి పూల సౌరభం గప్పున సోకింది.

ధనుంజయుడు మరో సారి విభ్రాంతి చెందాడు. మైమరపించే సువాసనలు ఎక్కడి నుండి వీస్తున్నాయి. సమీపంలో సంపంగి మల్లె వంటి మొక్కలు లేవు. ఎటు చూసినా గడ్డిపూలు, ఇక ఆ ముగ్ధ మోహనాంగి ఎటు పోయిందో గాని ఆమె జాడ తెలీటం లేదు. ఇంతలో`
ఒక పొద ముందు శ్వేత వర్ణంలో ధగ ధగాయమానంగా ప్రకాశిస్తూ పడగ విప్పి అడుతున్న శ్వేత నాగు ఒకటి అతడి కంట బడింది.
చుట్ట చుట్టుకొని పైకి లేచి పడగ విప్పి ఆడుతోంది. తననే వీక్షిస్తున్న ఆ శ్వేత నాగును సంభ్రమంగా చూసాడు ధనుంజయుడు. చాలా పెద్ద నాగు. చెప్పనవి గాని అందమైన ఆ నాగును చూస్తున్నాడు. అది కూడ కదం తొక్కుతున్న అశ్వాన్ని దాని మీది ధనుంజయుడ్ని తదేకంగా చూస్తోంది. ఆ నాగు పాము తన మీద దాడి చేసే ఉద్దేశంతో వున్నట్టు లేదు. ఆనంద పరవశంలో పడగ విప్పి నాట్యం చేస్తున్నట్టుంది.
తను ఆఘ్రాణిస్తున్న సంపంగి సువాసనలు ఆ శ్వేత నాగువని అర్థమైంది. తను వెదుకుతున్న యువతి జాడ లేదు ఇటు చూస్తే సూర్యాస్తమయం దగ్గర పడుతోంది. ఇప్పటికే పాముతో పెను ప్రమాదం నుంచి బయట పడ్డాడు. దీని జోలికి పోయి కొత్త ప్రమాదం తెచ్చుకునే ఉద్దేశం ధనుంజయునికి లేదు. అందుకే`

ఇక ఆ అజ్ఞాత సుందరి కోసం వెదుకులాడే ఉద్దేశం విరమించుకొని అశ్వాన్ని వెనక్కు మళ్ళించాడు. అశ్వం గరుడ నాలుగు కాళ్ళ మీద దూకుతూ మైదానానికి అడ్డం బడి పచ్చికలో పరుగు ఆరంభించింది.

ఎప్పడైతే అశ్వం వెళ్ళి పోవటం ఆరంభించిందో ఆ మరు క్షణమే సహజమైన తన సర్ప రూపం వదిలి నాగలోక యువ రాణి ఉలూచీశ్వరిగా మారి పోయిందా శ్వేత నాగు. వేడి నిట్టూర్పు వదుతూ వెళ్తున్న ధనుంజయుడినే చూస్తుండి పోయింది.

ఆమె శ్వాస బరువైంది, శరీరం వెచ్చ బడింది. వేడి నిట్టూర్పు విడుస్తూ అటే చూస్తోంది. ఆమెకు తెలీకుండానే కనుకొలుకుల్లో నీరు నిలిచింది. అది సంతోషమో బాధో ఆమెకే తెలీదు. ధనుంజయుడు దూరమయ్యేకొద్ది తెలీని విరహవేదన. అతడికి కన్పించి మాటలాడానే కోరిక క్షణ క్షణానికి అధికరిస్తోంది. అతని వెంట బడి వెళ్ళమని మనసు తొందర చేసింది. తొలివలపు బం ఇదేనేమో! ఏ పురుషుని పట్ల చలించని మనసు ఇతన్ని చూడగానే ఇంతగా మోహ పరవశమైనదేమిటి? అతను ఎవరో ఏమిటో వూరేదో పేరేమిటో ఏమీ తెలీదాయె. అయినా ఈ వలపు మైకం ఏమిటి? ఆలోచిస్తోంది.

చూస్తుండగానే ఆ అశ్వం చాలా దూరం వెళ్ళి పోయింది. అది కనుమరుగవుతున్నంతలో చెలికత్తెలు నలుగురూ ఉలూచీశ్వరిని వెదుకులాడుతూ అక్కడికి చేరుకున్నారు. బాణం దెబ్బకు చచ్చి పడున్న గరుడ పక్షిని చూసారు. కాని బాణం వేసి తమ యువ రాణిని ఎవరు కాపాడారో తెలీలేదు. యువ రాణి క్షేమంగా ఉన్నందుకు సంతోషించారు. ఇంకా ఢాకినీ వనంలో సంచరించుట క్షేమంకాదని వారంతా యువ రాణిని తీసుకుని వెను తిరిగారు.

***********************

యువరాణి ఉలూచీశ్వరి చెప్పిందంతా`

శ్రద్ధగా ఆకించింది శంఖుపుత్రి.

జరిగింది అర్థమైంది.

ఇంతగా ఒక మగ ధీరుడి మీద మనసు పడిందంటే అతడెవరోగాని నవ మన్మథుడును పరాక్రమ వంతుడును అయి వుండాలి. కానీ...
శంఖు పుత్రికి రాకూడని అనుమానే వచ్చింది. ఒకవేళ అతడు రాకుమారుడు ధనుంజయుడు కాదుగదా! తన ఆలోచనే తనకే నవ్వు పుట్టించింది.

తన పిచ్చిగాని అతనెందుకవుతాడు? ఈ పాటికి తమ రాజ్య సరిహద్దు దాటి మాళవ రాజ్యంలో ప్రవేశించి, వింధ్య పర్వతాలవైపు ఉత్తరంగా ప్రయాణిస్తుంటాడు. ఢాకినీ వనానికి వెనక్కు పోవాల్సిన పని అతడికి లేదు. ఖచ్చితంగా యువరాణి గాంచిన వీరుడెవరో వేరొక్కడయుంటాడు అనుకుంటూ ఫక్కున నవ్వుకుంది. ఉలూచీశ్వరి చిరు కోపంగా చూసింది.‘‘అత్తా! ఎందుకే నవ్వుతావు? నేను సత్యమే చెప్పినాను గదా! నిజంగా నాది ప్రేమ కాదంటావా?’’ అనడిగింది.

‘‘లేదు లేదు. నా నవ్వునకర్థం అది కాదు లేవే.’’ అంది వెంటనే శంఖుపుత్రి.

‘‘ఇంకేమి?’’

‘‘చూడు దేవీ. ఇంతగా నీవతనిని మరువ లేకున్నావంటే నీది ప్రేమ కాదని, వలపు లేదని ఎలా అనగలను? ముందుగా నాకో విషయము చెప్పుము. నీవు గాంచిన వీరుడి అశ్వము ఏ వర్ణములో వున్నది?’’ సందేహ నివృత్తి కోసం అడిగింది.

‘‘పాలకన్నా తెల్లని శ్వేత వర్ణము’’

‘‘ఆ అశ్వం జూలు, తోక భాగము కూడ తెలుపేనా? బాగుగా గుర్తు చేసుకొని చెప్పుము.’’

కొద్దిక్షణాలు కనులు మూసుకుంది ఉలూచీశ్వరి. ఆమె కనుల ముందు అశ్వం గరుడ, దానినధిరోహంచిన ధనుంజయుడు కదలాడారు.
‘‘లేదత్తా. అవి తెలుపు వర్ణము కాదు.’’ అంది కనులు తెరవకుండానే.

‘‘తెలుపు వర్ణము కాదా!’’ నమ్మ లేనట్టు అడిగింది శంఖు పుత్రి.

‘‘కాదంటినిగ. అశ్వం జూలు, తోక భాగము చిక్కని కాటుక పూసినటుల నల్లగా వున్నవి’’ అని చెప్పి కనులు తెరిచింది.

ఆ సమాధానం విని నిర్ఘాంత పోయింది శంఖుపుత్రి. సందేహ నివృత్తి అయినది. అయిననూ నమ్మ లేకున్నది. అది ధనుంజయుని అశ్వం. అతడు రత్నగిరి యువరాజు ధనుంజయుడే. తన అంచనా తప్పి అతను ఢాకినీ వనానికెందు కెళ్ళినాడో వూహ కందని విషయం.
‘‘అతడు ఆజాను బాహుడా?’’

‘‘అవును.’’

‘‘ఎత్తు భుజములవాడా?’’

‘‘అవును.’’

‘‘అయితే ఇకనేం? నీ వపు చెలికాడు ఎవడో తెలిసి పోయినది.’’

‘‘తెలిసినదా. ఎవరతడు?’’

‘‘ఆహాఁ... అంత తొందరే గాని మీ ప్రేమ ఫలించదు. నీవు అతన్ని మరిచి పోవుట మంచిది’’ కావాలనే హెచ్చరించింది శంఖు పుత్రి. ఉలూచీశ్వరికి అర్థం గాక తెల్లబోయి చూసింది.

‘‘అత్తా! ఏమంటివి? నా ప్రేమ ఫలించదా! ఎందుకు?’’ అనడిగింది.

‘‘ఎందుకనగా, నీవు వలచిన వాడు అమరులగు దేవజాతులకు చెందిన వాడేమీ కాదు. నరుడు. మానవుడైన అతను నీ తండ్రికి శత్రువు. ఆ యువకుడు నాగ లోకమునకు వచ్చు ప్రయత్నములో వున్నాడు. ఇప్పటికే నీ తండ్రి నాగరాజు ఆ యువకుని భయ పెట్టి వెనక్కు మరలించుటయో లేదా అతన్ని అంతమొందించుటయో జరగాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఈ పరిస్థితిలో నీవా మానవ యువకుని వరించుట వ్యర్థం. అందుకే మీ ప్రేమ ఫలించదని చెప్పితిని’’ వివరించింది శంఖుపుత్రి.

‘‘నా తండ్రితో అతనికి శత్రుత్వం ఎందుకు?’’ కుతూహలంగా అడిగింది ఉలూచీశ్వరి.

‘‘శత్రుత్వము నీ తండ్రిది. ఆ యువ కిశోరానిది గాదు. ఏమి? ఒకప్పుడు నా ప్రియుడు మానవుడని అన్యాయముగ అతనిని జంపించి నను నాగలోకము నుండి బహిష్కరించిన వాడు నీ విషయమున మిన్న కుండునా? నీ తండ్రి దృష్టిలో మానవు అల్పులు, అప్రయోజకులు.’’

‘‘లేదు లేదు. ఆ అభిప్రాయము సరి కాదు. నా తండ్రి అతన్ని శత్రువుగా భావింపవచ్చు గాక. నాకు శత్రువు కాదు గదా. అతని వలపు దక్కిన నా జన్మ ధన్యమైనట్టే. నేనా వీరు కుమారుని మరువజాల. ఈ విషయమున నేను నా తండ్రిని ఎదిరించుటకునూ సిద్ధమే. అత్తా. నీకు చాలా విషయము తెలుసునని అర్థమైనది. ఇక తామసించక నా వలపు రేడు వివరములు తెలుపుము’’ అంటూ అర్థించింది.

‘‘సరి. నీవింతగా అడుగుతున్నావు గాబట్టి అతని వివరము వివరించి మీ యిద్దర్ని కలిపెదను. కాని ఎన్ని కష్టములైననూ నీవు అతడి చేయి విడువనని, మాట తప్పనని నాకు వాగ్ధాన మొనర్చుము.’’

‘‘అత్తా! ఆడిన మాట తప్పను. మాటిస్తున్నాను. ప్రాణము పోయినా పోవు గాక, ఎవరికీ భయ పడను. ఆ సుందరాంగుని వలపు దక్కిన చాలును’’ అంటూ ప్రమాణం చేసింది యువరాణి ఉలూచీశ్వరి.

శంఖు పుత్రికి చాలా ఆనందంగా వుంది. తన పథకం ఫలించు సమయం అసన్నమైంది. నాగ రాజుపై ఇంతకాలం తనలో గూడు కట్టుకొనున్న కోపం చల్లారే రోజు త్వరలో రానుంది. ఇక ఆలస్యం చేయ లేదామె.

‘‘అతను రత్నగిరి రాకుమారుడు. ధనుంజయుడను నామధేయుడు...’’ అంటూ తనకు తెలిసిందంతా వివరించింది.

శంఖు పుత్రి మాటలను శ్రద్ధగా ఆలకించింది ఉలూచీశ్వరి. ఎప్పుడైతే ధనుంజయుని వివరాలు తెలిసాయో ఆ మరుక్షణమే అతనిని చూడాలి, మాట్లాడాలన్న కోరిక అధికరించింది ఆమెలో.

‘‘అత్తా. నేను వెంటనే ఆ మోహనాకారుని గాంచవలె. ఇప్పుడే ఢాకినీ వనమునకు పోయెదను గాక. నీవును రావలె’’ అంది.

ఉలూచీశ్వరి తొందర పాటు చూసి`

ఫక్కున నవ్వింది శంఖు పుత్రి.

‘‘ఏమమ్మా యువరాణీ. లేడికి లేచినదే ప్రయాణమా ఏమిటి? ధనుంజయుడు నీకోసం గాలిస్తున్నాడని తెలుసు గదా. సర్ప రూపాన తప్పించుకొన పని యేమి. అప్పుడే అతని ఎదురుగా బోయి పలకరింప వచ్చును గదా?’’ అనడిగింది.

‘‘ఏమో! ఆ సమయాన నాకా ఆలోచనే రాలేదు. అతని ఎదురుగా బోతే సిగ్గు దొంతర కనులార అతన్ని జూడ సాధ్యం కాదని యెంచి సర్పమునైతి...’’

‘‘సరి సరి. ఇప్పుడు బోవుట సాధ్యము గాదులే.’’

‘‘అది యేమి? ఎందుకు సాధ్యము గాదు. నీకు వేరే పనున్నవా ఏమి?’’

‘‘నాకే పనులూ లేవుగాని. ఒక విషయము నీవు మరచితివి. ఆలోచింపుము. ఇప్పటికే నాగ లోకము వదిలి వారము దినములు ఢాకినీ వన విహారమున వుంటివి. ఇంకను ఆలస్యమైన నీ తండ్రి సందేహింపగలడు. నా మాట వినుము.

ధనుంజయుడు ఏ కార్యర్థియై ఢాకినీ వనమున వున్నను మరలి వచ్చి వింధ్యా పర్వతాను చేరుటకు పది దినములగును. ఈలోపల నీవు నిజ లోకమున కేగి నీ తండ్రి గారిని సందర్శించి ఏమీ తెలియ నటులే వుండుము. వారము దినములకు ఇదే రోజున ఇటకు రమ్ము. నీ సఖియను ఈ సంపంగి వనమందే వుంచి మన మిరువురము వింధ్య పర్వతముకు పోయి వచ్చెదము’’ అంటూ వివరించింది శంఖుపుత్రి.
అంతలో జలక్రీడలు ముగించుకొని నాగకన్యలు నలుగురూ అచటికి రావటంతో వారి సంభాషణ ఆగి పోయింది.

***************

ఎడ తెరిపి లేని ప్రయాణం.

అశ్వం గరుడ అలుపు లేకుండా`

ఏక బిగిన పరుగు తీస్తూనే వుంది.

దారి తెన్ను లేని అడవి.

ఈ రోజు కూడ ఎండ వేడిమి అధికంగా వుంది. కాలం గాని కాలంలో ఈ ఎండలు, వడగాడ్పులేమిటో అర్థం గాలేదు. ధనుంజయుడు దారి తప్పి ఇది ఆరవ రోజు. రామ గిరిలో తిన్న భోజనం తప్ప తిరిగి భోంచేయ లేదు. దొరికిన కాయలు, పండ్లు తిని ప్రయాణం చేస్తున్నాడు. ఈ రోజు ఉదయం సొర కాయలో మంచి నీరు కూడ నిండుకుంది. దారిలో వాగుల వంకల జాడ లేదు. ఎండ వేడిమికి నాలుక పిడచ కట్టుకు పోతోంది. మంచి నీటి జాడ కోసం గాలిస్తూనే ముందుకు సాగుతున్నాడు.

ఇదే పరిస్థితిలో నిన్నటి సాయంకాలపు సంఘటన కూడ ఇంకా మర్చి పోలేదతడు. అద్భుతమగు ఆ సౌందర్య రాశి ముగ్ధ మోహన రూపాన్ని మరువ లేక పోతున్నాడు. ఎవరా అతివ? ఎక్కడి నుండి వచ్చింది? ఎటకు నిష్క్రమించింది? తన మనసును గిలిగింతలు పెట్టి మంత్రం వేసినట్టు మాయమైనదే. తిరిగి కన్పిస్తుందా? ఆలోచిస్తుంటే ఆమె ఖచ్చితంగా మానవ కన్య కాదనిపిస్తోంది.

మర్చి పోదామన్నా ఆమెను మర్చి పోలేక పోతున్నాడు. పదే పదే గుర్తు కొచ్చి వ్యాకుల పరుస్తోంది.

ఆమె వూరేమి, పేరేమి, ఏ లోకానికి చెందినది ఏమీ తెలియదాయె. కాని ఇంతగా తన మనసును హరించి అదృశ్యమవుతుందని వూహించ లేదు. ఆ సొగసును వర్ణింప తరమా?

ఆలోచనల నుండి ఉలికి పడి`

అశ్వాన్ని నిలువరించాడు ధనుంజయుడు.

ఉన్నట్టుండి మంచు కొండల నుండి వీస్తున్నట్టుగా చల్లని శీతల గాలులు తన శరీరాన్ని తాకి సేద తీర్చటమే అందుక్కారణం. అక్కడి కొచ్చే సరికి చల్లని గాలికి శరీర శ్వేదం హరించి హాయి గొలుపుతూ కొత్త శక్తి ఏర్పడినట్టుంది. ఇంతలోనే మార్పా... ఏమైనది? చుట్టూ పరికించాడు.
వాతావరణంలో మార్పు లేదు.

ఎంత తీవ్రత అలాగే కొనసాగుతోంది.

ఆకాశన మబ్బుల జాడ కూడ లేదు.

కాని ఈ ప్రాంతం ఇంత శీతలంగా ఆహ్లాద భరింతంగా ఉందేమి? ఒకవేళ` తపోధనులు, మహాసిద్దులు వశించు చోట ఇలాగే వ్యతిరేక వాతావరణం వుంటుందంటారు. ఇది ఎవరో ముని పుంగవుడు వశించు తపో భూమి కాదు గదా! ఎండ వేడిమి తట్టు కోలేని అనేక పక్షిజాతులు వన్యమృగాలు ఆ ప్రాంతాల్లో గుంపుగా చేరి సేద తీరుతున్నాయి. కౄర మృగాలేవీ ఆ పరిసరాల్లోకి రావటం లేదు. ఖచ్చితంగా ఇది తపో భూమి అయి వుండాలి.

ఆ మహనీయుని దర్శన భాగ్యం పుణ్య ప్రదం పాప హరం. ఆ పైన తనకు అతిధ్యం లభిస్తుంది. సందేహ నివృత్తి కూడ జరుగుతుంది. ఈ విధంగా ఆలోచించిన ధనుంజయుడు సమీపంలో ఏదయినా ముని వాటిక గాని ఆశ్రమం గాని కన్పిస్తుందేమోనని గాలిస్తూ బయలుదేరాడు.
మరికాస్త ముందుకెళ్ళగానే పర్ణశాల ఒకటి కన్పించింది. విశాలమైన మట్టి దిబ్బమీద అందమైన పర్ణశాల. దాని వెనక తట్టున కొండవాగు ఒకటి ప్రశాంతంగా ప్రవహిస్తోంది. దిగువ నుండి పర్ణశాలను చేరుకోడానికి పద్దెనిమిది మెట్లతో కూడిన విశాలమైన రాతి మెట్ల వరుస కన్పిస్తోంది. ఇక ఆ పరిసరాలలో అనేక ఫలవృక్షాలు, పండిన ఫలాలతో కనువిందు చేస్తున్నాయి. దిబ్బను చుట్టి పైన కూడ అనేక పూలమొక్కల తీగలు విర బూసిన పూలతో ఆకర్షిస్తున్నాయి. పర్ణశాల నుంచి ‘‘ఓం నమః శ్శివాయ’’ అనే పంచాక్షరీ మంత్రం మంద్ర స్వరంలో నినదిస్తూ ఆ ప్రాంతాన్ని పునీతం చేస్తోంది. వింటుంటే అలౌకిక భక్తి భావం ఏర్పడుతోంది.

తన అంచనా వాస్తవమైనందుకు`

సంతసించాడు ధనుంజయుడు.

ఎవరో మహా తపశ్శాలియగు మునీంద్రుని నివాసం అది. ఆయన దర్శనం చేసుకోవాలి. ఇక ఆలోచించ కుండా అశ్వం దిగాడు ధనుంజయుడు. కొండ వాగు చెంతకు అశ్వాన్ని తీసు కెళ్ళి నీళ్ళు తాపించాడు. తను ముఖం కర చరణాలు ప్రక్షాళనం చేసుకున్నాడు. అశ్వాన్ని ఒక చెట్టు మొదలుకు కట్టి మెట్ల దారి వైపు అడుగులు సారించాడు.

పాద రక్షల్ని మెట్ల వద్దనే విడిచి`

మెట్లెక్కి  పైకి వెళ్ళాడు.

అక్కడంతా చాలా ప్రశాంతంగా వుంది.

దిగువ నుండి చూసిన దాని కన్నా పర్ణశా ఆవరణ మరింతగా శోభయమానంగా వుంది. చుట్టూ ఫెళ్ళున ఎండ కాచి వడగాలి వీస్తున్న ఇక్కడ మాత్రం చలి వాతావరణం నెలకొని ఆహ్లాద భరితంగా వుంది. ఆవరణ అంతటా విర బూసిన పూలతో ఎన్నో మొక్కలు లతలు కనువిందు చేస్తున్నాయి. సువిశాలమైన ఆ పర్ణశాల వెదురుతో నిర్మించ బడి పైన తాటియాకు కప్పబడ్డాయి. ముఖ ద్వారం తలుపు దగ్గరగా మూసి వుంది.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
kadali