Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

పదవ భాగం

tenth part

నీ మాటలు వుంటుంటే మీ తాతయ్య గుర్తొచ్చారు. నీలాగే లోతుగా ఆలోచించి మాట్లాడేవాడు. ఇక్కడ నువ్వో విషయం మర్చిపోతున్నావురా! మీ పెళ్ళిళ్ళు చేయాలన్నది నా ఒక్కదాని పట్టుదలో, నిర్ణయమో కాదు. నీకు నీ చెల్లెలంటే ఎంత ప్రేమో, నీ మావయ్యలిద్దరికీ తమ చెల్లెలంటే అంత ప్రేమ. ఇక్కడున్న నీ పెద్దమావయ్య గాని, అమెరికాలో వున్న నీ చినమావయ్య గానీ మీ అమ్మని ఎంత గారాబంగా చూసేవారో నాకు తెలుసు. 

ఇప్పటికీ వాళ్ళ మధ్య అనురాగం తగ్గలేదు. అందుకు తగ్గట్టే నాకూ రత్నాల్లాంటి కోడళ్ళు వచ్చారు. నాతోబాటు అందరి ఆశ కూడా మీ రెండు జంటలు ఒకటయి ఉమ్మడి కుటుంబంలా అందరం కలిసే వుండాలని. అందుకే మీకోసం బయట సంబంధాల గురించి మేమెప్పుడూ ఆలోచించలేదు. అందుకే ఈ విషయంలో మరోలా జరుగుతుందని నేననుకోవడంలేదు. అయినా నువ్వన్నట్టు ముందే పెద్దగా అంచనాలు వేసుకోకూడదు గాబట్టి అమెరికా వెళ్లి వాళ్ళను చూసాకే ఓ నిర్ణయానికొస్తాను. సరేనా?" అంది. 

"అలాగే అమ్మమ్మా! ఏది ఏమైనా ఈ విషయంలో నువ్వు ఎక్కువగా ఆలోచించి మనసు పాడుచేసుకోకు. నీది మంచి మనసు. అంతా మంచే జరుగుతుందని ఆశిద్దాం." అంటూ లేచి వెళ్ళిపోయాడు నవీన్. నెలరోజులు గడిచిపోయాయి. 

మారిన పాస్ పోర్ట్ రూల్స్ ప్రకారం నెల తిరిగేసరికి అన్నపూర్ణేశ్వరికి పాస్ పోర్ట్ చేతికి వచ్చేసింది. ఇక వీసా వస్తే అమెరికా ప్రయాణము ఖరారయినట్టే. అయితే మిగిలిన దేశాల కన్నా అమెరికా వీసా దొరకటం చాలా కష్టం. నిబంధనల విషయంలో చాలా ఖచ్చితంగా వుంటారు. 

అమెరికాలో వున్న డాక్టర్ గోపాల్ కి ఈ విషయాలన్నీ తెలుసు. కాబట్టి, పాస్ పోర్ట్ రాగానే వీసాకి దరఖాస్తు చేసేటప్పుడు అవసరమైన సపోర్ట్ ఆఫ్ అఫిడెవిట్ ఐ 134, మిగతా ఇన్ కమ్ టాక్స్ పేపర్స్, లెటర్ పంపించాడు. 

మామూలుగా అమెరికాను చూడ్డానికి టూరిస్టుగా వెళుతున్నాను వీసా కావాలని అప్లయ్ చేస్తే వీసా రావడం చాలా కష్టం. అదే అమెరికాలో వున్న బంధువులో, మిత్రులో స్పాన్సర్ చేస్తూ, అక్కడి ఖర్చులన్నీ తాము భరించి, రిటర్న్ టికెట్ కూడా తామే కొని టైం లోపల వెనక్కు పంపిస్తామని పత్రాలను పంపిస్తే పని సులువవుతుంది. 

ఈ విధంగా తమ్ముడు గోపాల్ పంపించిన లెటరు, ఇతర పేపర్స్, పాస్ పోర్ట్ తో తల్లిని హైదరాబాద్ లోని అమెరికన్ కన్ సలేట్ కి తీసుకెళ్ళి వీసాకి అప్లయ్ చేయించాడు రామలింగేశ్వర్రావు. లక్కీగా వెంటనే వీసా దొరికింది. 

అలా నెలా పదిహేను రోజుల్లోనే ఒక ఘట్టం పూర్తయింది. పదిహేను రోజుల్లోపల ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకొని బయల్దేరాలి. ఇక అక్కడినుంచి ఇంట్లో ఒకటే హడావుడి. వెంట అమెరికాకు ఏం తీసుకెళ్ళాలి? ఏం వద్దు అని అన్నపూర్ణేశ్వరి ఒకటే హైరానా. మామూలుగా అయితే డైరెక్ట్ గా న్యూయార్క్ కి ఫ్లయిట్ దొరకనప్పుడు లండన్ లో ఫ్లయిట్ మారేలా టికెట్ తీసుకుంటారు. దేశం వదిలి ఎప్పుడూ వెళ్ళలేదు అన్నపూర్ణేశ్వరి పైగా ఆమెకు తెలుగు తప్ప మరే ఇతర భాషారాదు. 

లండన్ ఏర్ పోర్ట్ లో దిగి, మరో విమానం ఎక్కటం ఆమెకు సాధ్యమయ్యే పనికాదు. అందుకే కాస్త లేటయినా... ఎయిర్ ఇండియా విమానంలో బొంబాయి నుంచి సరాసరి న్యూయార్క్ కి విమానం టిక్కెట్ కన్ ఫర్మ్ కావడానికి పక్షం రోజులు పట్టింది. 

బాంబేలో ఫ్లయిట్ ఎక్కడానికి మూడు రోజుల ముందే పెద్ద కొడుకు రామలింగేశ్వర్రావుతో బయలుదేరింది అన్నపూర్ణేశ్వరి. ఆవిడ అమెరికా వెళుతోందంటే మున్నులూరు గ్రామం గ్రామమే తరలి వచ్చి వీడ్కోలు చెప్పింది. 

తమ కారులోనే తల్లితో హైదరాబాద్ చేరుకున్నాడు రామలింగేశ్వర్రావు. తమ బంధువుల ఇంట్లో ఆ రాత్రి వుండి ఉదయం తమ కారును అక్కడే వుంచి, టాక్సీలో 'ఏర్ పోర్ట్ కు చేరుకుని బాంబే వెళ్ళే విమానం ఎక్కారు. అక్కడ ఒకరోజు గడిచాక మరునాడు రాత్రి తెల్లవారుజామున మూడు గంటలకి ఫ్లయిట్. 

రామలింగేశ్వర్రావుకి ఎప్పుడూ ఫారిన్ వెళ్లకపోయినా లోకల్ విమాన సర్వీసుల్లో ప్రయాణించిన అనుభవం ఉంది. పైగా తమ్ముడు అమెరికా నుండి వచ్చిన ప్రతీసారి వాళ్ళని విమానం ఎక్కించడానికి బాంబేదాకా వచ్చేవాడు. 

కాబట్టి తల్లి విషయంలో అన్ని జాగ్రత్తలూ దగ్గరుండి చూసుకున్నాడు. ఫ్లయిట్ ప్రయాణంలో ఎలా ఉండాలో జాగ్రత్తలు చెప్పాడు. 

లక్కీగా అదే విమానంలో ప్రయాణించాల్సిన భార్యాభర్తలిద్దరు ఏర్ పోర్ట్ లాంజ్ లో కలిసారు. వాళ్ళిద్దరూ తెలుగు వాళ్ళు, అమెరికాలోని న్యూజెర్సీలో స్థిరపడ్డారు. ఆయనకు ఏభై, ఆవిడకు నలభై అయిదు సంవత్సరాలు ఉంటాయి. 

ఏదో టెక్నాలజీ సంబంధించిన ల్యాబ్ లో ఆయన హెడ్ గా పనిచేస్తున్నారు. బంధువుల్ని చూడ్డానికి ఆంధ్రా వచ్చి, అమెరికా తిరిగి వెళ్ళిపోతున్నారు. 

డాక్టర్ గోపాల్ నిమ్మగడ్డతో ఆయనకు పరిచయం వుంది. వారి పరిచయంతో విమాన ప్రయాణంలో అన్నపూర్ణేశ్వరికి మంచి తోడు దొరికినట్టయింది. మొదటిసారి ప్రయాణం అంటున్నారు గాబట్టి, ఆవిడ విషయంలో తాము కేర్ తీసుకుంటామని ఆ దంపతులు మాటివ్వటంతో రామలింగేశ్వర్రావుకి చాలా సంతోషం కలిగింది. 

బోర్డింగ్ కు అనౌన్స్ మెంట్ వచ్చింది. ఎప్పుడూ విడిచి ఉండలేదేమో కొడుకుని కౌగలించుకుని కన్నీళ్లు పెట్టుకుంది అన్నపూర్ణేశ్వరి. ఆమెకు ధైర్యం చెప్పి పంపించాడు రామలింగేశ్వర్రావు. ఆవిడకు విమానాశ్రయంలో గాని, విమానంలో గాని పద్ధతులు అనుభవం లేదుగాబట్టి పరిచయమైన దంపతులిద్దరూ ఆమెను తమ వెంటబెట్టుకొని, లోపలికి తీసుకెళ్ళారు. 

ఇమ్మిగ్రేషన్ చెక్కింగ్, కస్టమ్స్ చెకింగ్స్ దాటి, విమానంలోకి చేరుకునే వరకు అన్నపూర్ణేశ్వరికి తెలుగు దంపతుల తోడుంది కాబట్టి ఇబ్బందిపడాల్సిన అవసరం ఏమీలేదు. వాళ్ళు కనుమరుగవ్వగానే వెనక్కి వచ్చి లాంజ్ లో కాస్సేపు కూర్చున్నాడు రామలింగేశ్వర్రావు. 

సరిగ్గా తెల్లవారుజామున మూడు ఇరవై నిమిషాలకు న్యూయార్క్ కి బయలుదేరిన ఎయిర్ ఇండియా టేకాఫ్ తీసుకుంది. 

విమానం వెళ్ళిపోయినా, రామలింగేశ్వర్రావు అక్కడే కూర్చున్నాడు. ఎందుకంటే తను హైదరాబాద్ వెళ్లిపోవడానికి ఉదయం ఆరుగంటలకి ఫ్లయిట్ వుంది. అందుకే తల్లితో బాటు హోటల్ గది ఖాళీ చేసి తన సూట్ కేస్ తో ఏర్ పోర్ట్ కి వచ్చేశాడు. 

విమానం బయలుదేరి వెళ్ళిన పావువంట తర్వాత తన సెల్ నుంచి అమెరికాలో తమ్ముడికి ఫోన్ చేశాడు. వెంటనే లైన్ లో కొచ్చాడు గోపాల్. 

"ఏమైందన్నయ్యా? అమ్మ బయలుదేరిందా?" అడిగాడతను. 

"విమానం బయలుదేరి పావుగంటయింది. నేనింకా ఇక్కడే ఏర్ పోర్ట్ లో వున్నాను. ఆరుగంటలకి హైదరాబాద్ ఫ్లయిట్ వుంది. అందులో ఇంటికెల్లిపోతున్నాను. యస్.కె. రావు అని భార్యాభర్తలిద్దరు తెలుగు వాళ్ళు అదే విమానంలో వస్తున్నారు. అమ్మను జాగ్రత్తగా చూసుకుంటామన్నారు. ఆయనకు నువ్వు తెలుసని కూడా చెప్పాడు. కాదంటే సుమారు ఇరవై నాలుగ్గంటలు విమాన ప్రయాణంలో అమ్మకి ఎలా ఉంటుందోననే నా భయం" అంటూ వివరించాడు. 

"ఏం భయం లేదన్నయ్యా! క్షేమంగా ఇక్కడికి వచ్చేస్తుంది. విమానం రావడానికి గంట ముందే మేం న్యూయార్క్ ఏర్ పోర్ట్ లో వుండి రిసీవ్ చేసుకుంటాం. అక్కడినించే ఫోన్ చేసి అమ్మతో మాట్లాడిస్తాకదా. డోన్ట్ వర్రీ" అంటూ ధైర్యం చెప్పాడు గోపాల్. 

"అలాగే తమ్ముడూ! అయితే ఒక్కమాట నీతో చెప్పాలనుకుంటున్నాను"

"చెప్పన్నయ్యా! ఏమిటది?"

"బిడ్డలు ఎంత గొప్పవాళ్ళయినా తల్లికి చిన్నవాళ్ళుగానే కన్పిస్తారు. అమ్మ స్వభావం నీకు బాగా తెలుసు. మనకోసం ఎంతో కష్టపడింది. ఇప్పటికీ కష్టపడుతోంది. కష్టపడడమే జీవితం అంటుంది. తీరికగా కూర్చుని సుఖంగా వుండే స్వభావం కాదు. 

మనమంటే ప్రాణం అమ్మకి. పైగా మీరు అమెరికాలో వుంటున్నారు. అక్కడి పరిస్థితులు అమ్మకు అసలు తెలీవు. అందుకే చెప్తున్నాను అమ్మ మనసు కష్టపెట్టకుండా చూసుకో తమ్ముడూ..." 

"అన్నయ్యా! నువ్వింతగా చెప్పాలా. నీకే కాదూ. నాకూ అమ్మంటే ప్రాణం. అటువంటి తల్లి కడుపున పుట్టడం మన అదృష్టం. అమ్మ ఇక్కడికి వస్తోందంటేనే మా అందరికీ ఎంత సంతోషంగా వుందో తెలుసా? నిశ్చితంగా వుండన్నయ్యా! వూళ్ళో ఎంత సంతోషంగా వుందో అంతకన్నా ఎక్కువ సంతోషంగా మా దగ్గరా వుంటుంది. నువ్వే చూద్దువుగాని. బై..."

"బై..."

లైన్ కట్ చేసి సెల్ జేబులో పెట్టుకున్నాడు రామలింగేశ్వర్రావు. అక్కడే మరికొంతసేపు కూర్చున్నాడు. తల్లిని అంతదూరం పంపిస్తున్నందుకు బాధగానే వుంది, కానీ తప్పదు. 

అక్కడి నుండి లేచి బయటికొచ్చి కాఫీ తాగాడు. పక్కనే ఉన్న డొమెస్టిక్ ఏర్ పోర్ట్ లో అడుగుపెట్టి తను ఎక్కాల్సిన విమానం ఎక్కి అలా కూర్చున్నాడో, లేదో అలా నిద్రపట్టేసింది. తిరిగి హైదరాబాద్ చేరుకున్నాక గాని మెలకువ రాలేదు. 

అమెరికా... డెట్రాయిట్ నగరంలో చీకటిపడకముందే సన్నగా వర్షం మొదలయింది. కార్ల పరిశ్రమ పేరెన్నికగన్న నగరం. 

డాక్టర్ గోపాల్ నిమ్మగడ్డ  నివసించే విలాసవంతమైన ఆ భవంతిలో దేదీప్యమానంగా లైట్లు ప్రకాశిస్తున్నాయి. బాంబే ఏర్ పోర్ట్ లో తెల్లవారుజామున సుమారు నాలుగు గంటలకు అన్న రామలింగేశ్వర్రావు తనకు ఫోన్ చేసిన సమయానికి అక్కడ సాయంత్రం నాలుగు గంటలు దాటింది సమయం. ఆస్పత్రిలో ఎమర్జెన్సీ ఆపరేషన్ ఒకటి ముగించుకుని బయటకొస్తుండగా ఆ ఫోన్ కాల్ వచ్చింది. 

అన్నతో మాట్లాడిన వెనకే తన కారులో బయలుదేరి ఇంటికొచ్చేసాడాయన. అప్పటికింకా పిల్లలిద్దరూ ఇంటికి రాలేదు. ఎప్పటిలాగే భర్త ఇంటికొచ్చి హాల్లో కూర్చోగానే ఆయనకు కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది సత్యవతి. 

"కూర్చో... మనం కాసేపు మాట్లాడుకోవాలి." అన్నాడు కప్పు అందుకుంటూ. 

"ఏదన్నా విశేషమా ఏమిటి?" ఎదురుగా కూర్చుంటూ అడిగింది. 

"అలాంటిదే... చెప్పుకో చూద్దాం" అన్నాడు కాఫీ కప్పుసిప్ చేస్తూ. 

"అర్ధమైంది అత్తయ్య బయలుదేరారు. అంతేగా" అంది ఉత్సాహంగా. 

అవునన్నట్లు తల ఊపాడు. 

కాఫీ కప్పు టీపాయ్ మీద వుంచి టై లూజ్ చేసుకుని రిలాక్స్ గా సోఫాకు జేరబడ్డాడు. సత్యవతి ఆయన షూస్ విప్పి, పక్కన పెట్టి తిరిగి ఎదురుగా సోఫాలో కూర్చుంది. 

"ఎప్పుడు బయలుదేరారు?" అడిగింది. 

"గంటక్రితం అన్నయ్య బాంబే ఏర్ పోర్ట్ నుంచి ఫోన్ చేశాడు. ఎయిర్ ఇండియా విమానంలో వస్తోంది. మనం న్యూయార్క్ ఏర్ పోర్ట్ కి వెళ్లి రిసీవ్ చేసుకుందాం. కారులో వెళదామా?" ఉత్సాహంగా చెప్పాడు... 

"అలాగే" అంది. 

"వీళ్ళిద్దరూ కాలేజ్ నుంచి ఇంకా రాలేదా?"

"శివాని వచ్చేసింది. గదిలో వుంది. అనంత్ ఇంకా రాలేదు. వచ్చేటైమైంది. ఆరు లోపలే ఇంటికి చేరుకోవాలని చాలా స్ట్రిక్ట్ గా చెప్పాను. వచ్చేస్తారు." అంది. 

"నాకు డౌటే, ఏదో పార్టీ వుందని లేట్ చేయొచ్చు. ఎందుకయినా మంచిది. వాడి సెల్ కి ఫోన్ చేసి మరోసారి హెచ్చరించు. వాళ్ళిద్దరితో మనం ప్రత్యేకించి మాట్లాడాలి. బట్ ఇప్పుడు కాదు భోజనాలయ్యాక" అంటూ లేచి స్నానానికి వెళ్ళిపోయాడాయన. 

రాత్రి ఏడు గంటలకి అనంత్ సాయి కారు పోర్టికోలో ఆగింది. అప్పటికి బయట వర్షం జోరు కూడా పెరిగింది. 

వాతావరణం చాలా చలిగా ఉంది. 

"మమ్మీ... దిసీజ్ నాట్ గుడ్. పార్టీ మిస్సయ్యాను. నీ మూలంగా. అర్జంటు పనేముంది, ఇంటికి రమ్మని ఫోన్ చేశావ్?" వస్తూనే తల్లిమీద అలిగాడు అనంత్. 

"డాడీ ఇంట్లో వున్నారు. మీతో మాట్లాడాలంటున్నారు. కాసేపునోరు మూసుకుని డ్రస్ చేసుకునిరా" అంది ఆర్డర్ వేస్తున్నట్లు సత్యవతి. 

డాడీ ఇంట్లోనే ఉన్నారనగానే ఇక మాట్లాడలేదు అనంత్. 

రాత్రి ఎనిమిది గంటలకు భోంచేసారంతా. 

భోజనాల తర్వాత తీరిగ్గా హాల్లో కూర్చున్నాక అప్పుడు పిల్లలిద్దర్నీ పిలిచాడు గోపాల్. బుద్దిమంతుల్లాగా వచ్చి తల్లిదండ్రుల ఎదుట సోఫాలో కూర్చున్నారు అనంతసాయి, సాయిశివాని ఇద్దరూ. 

"మీ ఇద్దరికీ ఒక ముఖ్య విషయం చెప్పాలి. అందుకే పిలిచాను." అన్నాడు గోపాల్. 

"యస్ డాడ్, చెప్పండి" అన్నాడు అనంత్. 

"మీ నాయనమ్మ మనింటికి వస్తోంది. రేపు మీ అమ్మ, నేను న్యూయార్క్ వెళ్లి మా అమ్మను రిసీవ్ చేసుకొని తీసుకొస్తాం. ఆవిడ ఉన్నంతకాలం మీ ఇద్దరూ బుద్ధిగా ఉండాలి. మన పద్ధతులు పాటించాలి. అర్ధమైందా?"

"యస్ డాడ్..."

"డాడీ మమ్మీలను కొద్ది రోజులు పక్కన పెట్టండి. నేను ఇంతకు ముందే మీకు చెప్పాను. మా అమ్మకు మన సంస్కృతి, సంప్రదాయాలంటే చాలా ఇష్టం. మనం తెలుగువాళ్ళం. ఆంధ్రులం. మనకంటూ ఆచారాలు, కట్టుబాట్లు, పద్ధతులు ఉన్నాయి. వాటిలో నేను పెరిగి పెద్దవాన్నయ్యాను గాబట్టే ఈరోజు మనం ఈస్థితిలో వున్నాం. మమ్మీని అమ్మా అని పిలవాలి. డాడీని నాన్నా అని పిలవాలి. బయటికి వెళ్ళినప్పుడు మనం ఇక్కడి పద్ధతుల్లో నడుచుకున్నా ఇంట్లో మాత్రం మన సంప్రదాయం ప్రకారం నడుచుకోవాలి. 

పిచ్చి పిచ్చి డ్రస్సులు వేయడం, పార్టీలు, పిక్నిక్ లకని తిరిగి అర్ధరాత్రి కొంపకు చేరడం, ముఖ్యంగా డ్రింక్ చేయడం మా అమ్మకు అస్సలు నచ్చవు. ఇంతకు ముందు మీకు మన పద్ధతుల్లో డ్రస్సులు వేసి ఫోటోలు తీసి మీ నాయనమ్మకు పంపించాం. ఇప్పుడు ఆవిడే ఇక్కడకు వస్తున్నారు. కాబట్టి ఫోటోలు దిగినట్టుగానే ఇక్కడ మీరూ ఆవిడకు కనబడాలి. అర్ధమైందా?" అంటూ హెచ్చరించాడు. "సారీ డాడ్! లంగా, ఓణీలు, చీర, జాకెట్లు, చెవులకీ, కాళ్ళకీ నగలు. వాట్ నాన్సెన్స్. జిప్సీస్ లా వేషం వేస్తే ఇక్కడివాళ్ళు నన్ను చూసి నవ్వుతారు. ఐ కాన్ట్ డూయిట్" అంది అసహనంగా. 

"యూ మస్ట్ డూయిట్. మీరు పద్దతిగా ఉంటేనే మా అమ్మకు నచ్చుతుంది అనంత్. నువ్వు ఇకనించి నీట్ గా డ్రస్ చేసుకోవడం తప్పదు. శివానీ! నీ విషయంలో ఇంట్లో అలా వుండక తప్పదు. కాలేజీకి వెళ్ళేటప్పుడు మామూలుగా వెళ్ళొచ్చు" అన్నాడు గోపాల్. 

"అయినా నాయనమ్మ ఇప్పుడే రావాలా? నాకు నచ్చలేదు"

"పోనీ నీకు నచ్చేలా ఎప్పుడు రమ్మంటారో చెప్పండి. ఏర్ పోర్ట్ లోంచే మరో విమానంలో ఇండియాకు పంపించేస్తాను." అన్నాడు చిరాగ్గా. 

పిల్లల పధ్ధతి సత్యవతికి కూడా కోపం రప్పించింది. 

"మీరాగండి. ఏరా అనంత్! ఆవిడ వచ్చాక కూడా ఇలాగే పెడసరంగా ప్రవర్తిస్తారా? రాకరాక నాయనమ్మ అంతదూరం నుంచి మనల్ని చూడడానికి వస్తోందంటే మీకు సంతోషంగా లేదా?" అంటూ అన్నాచెల్లెళ్ళిద్దర్నీ చూస్తూ అడిగింది.

మరిన్ని సీరియల్స్
Fourth Part