Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
tenth part

ఈ సంచికలో >> సీరియల్స్

నాల్గవ భాగం

Fourth Part

"సావిత్రి సిన్మాలు చూడాలి..." ఇంతకుముందు ఇదే సలహా మాతంగరావు ఇచ్చాడు. ఇపుడు మన్మధరావు కూడా.

"ఔను... తెలుగు ఇండస్ట్రీలో ముందు ముందు సినిమాలు చేయాలంటే తను తప్పనిసరిగా సావిత్రి సినిమాలు చూడాలి. ఆమె గురించి తెలుసుకోవాలి" ఓ నిర్ణయానికి వచ్చింది గాయత్రీపాటిల్.

వెంటనే అంది... "సావిత్రిని నేను ఇపుడే చూడాలి. ఎలా?"

"ఇదిగో... ఇలా" టేబుల్ పై ఉన్న ఆమె లాప్ ట్యాప్ ని చనువుగా అందుకుని ఇంటర్ నెట్ ఓపెన్ చేసాడు. తర్వాత గూగుల్ సెర్చ్ లో - "తెలుగు ఓల్డ్ సినిమాలు" అని కంపోజ్ చేసాడు. యూట్యూబ్ లో వరుస సినిమాలెన్నో కనిపించాయి.

వాటిలో...'చదువుకున్నఅమ్మాయిలు' క్లిక్ చేసాడు పీఆర్వో.

'ఒకటే హృదయం కోసం... ఇరువురి పోటీ దోషమూ..." అనే పాట ప్లే అవుతోంది. చిన్ని తెరపై ఇద్దరు హీరోయిన్లు... ఒక హీరో కనిపించారు.

"ఈ ఇద్దరిలో సావిత్రి ఎవరు?" అడిగింది గాయత్రీపాటిల్.

"బొద్దుగా ముద్దుగా ఉన్న ఈవిడే సావిత్రి..." చూపించాడతడు.

ఆవిడని పరీక్షగా చూసింది గాయత్రీపాటిల్. అతడన్న బొద్దు... ఆమెకి లావుగా అనిపించింది.

"ఈ ఆంటీయా... హీరోయిన్?" అడిగిందామె.

ఒక్కసారి అడిరిపడ్డాడతడు.

"ఏంటీ... ఆంటీయా?"

"ఔను... సిమ్లాలో మా పక్కింట్లో ఇంత లావుగానే ఓ ఆంటీ ఉండేది. ఈమెని చూస్తే అచ్చం ఆమె గుర్తొస్తుంది"

"ఎంత మాటనేసారు" నొచ్చుకున్నాడు మన్మధరావు.

'తరాలెన్ని మారినా తరగని అందం. ముంబాయి, డిల్లీ మోడల్స్ ఎంతోమంది తెలుగు సినిమాలు చేస్తున్నా ఇప్పటికీ ఇండస్ట్రీకి మరో సావిత్రి ఇంట్రడ్యూస్ కాలేదు..." చెప్పాడతడు.

ఆ తర్వాత - "దృష్టిని బట్టే సృష్టి, చూసే మీ కళ్ళకు సావిత్రి లావు కావొచ్చు. మాకు ఆ విగ్రహం... నటనలో ఆ నిగ్రహం బాగా నచ్చాయి. అందుకే... ఇప్పటికీ తెలుగు నేల అభినేత్రి సావిత్రిని మరిచిపోవడం లేదు"

"నిన్ను బాధపెట్టినట్లున్నాను"

"మామూలుగా కాదు... బాగా" అన్నాడు మన్మధరావు.

"సారీ..."

"సారీ చెప్పొద్దు. సావిత్రిని అర్ధం చేసుకోండి. వీలైతే ఆమె నటనని ఆవాహన చేసుకోండి. ప్రెస్ మీట్ లో మీరన్నట్లు సావిత్రి 'మల్లీశ్వరి' చేయలేదు. ఆ సినిమా చేసింది బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి. ఆమె గురించిన వివరాలు తర్వాత మరెప్పుడైనా చెప్పుకుందాం. మీకు సావిత్రి నటించిన సిన్మాల లిస్ట్ ఇస్తాను. వాటిని చూసిన తర్వాత మీకు మీరే తప్పక మారుతారు" అన్నాడు. తర్వాత ఆ గదివిడిచి, ఆమె వీడ్కోలు చెప్పబోయే ముందు - "సైడ్ యాంగిల్ లో మీరు సావిత్రిలాగే ఉన్నారు. మీ సినీ కెరీర్ 'వన్ ఫిల్మ్ వండర్' కాకుండా ఉన్నతంగా ఇంకా ఎదగాలంటే... తప్పనిసరిగా మీ సీనియర్స్ యాక్టింగ్ తెలుసుకోవాల్సిందే. సారీ టు సే... స్టార్ హీరోయిన్లని ఈ జనరేషన్ గొప్పగా చెప్పుకునే హీరోయిన్లెవరికీ శరీరంతో తప్ప ముఖంతో నటించడం తెలీదు. ఆ కళ తెలుసుకోవాలంటే కంపల్సరీ సావిత్రిని చదవాల్సిందే" అన్నాడతడు.

గాయత్రీపాటిల్ ఆలోచనలో పడింది. లాప్ ట్యాప్ లోంచి పాట వినిపిస్తూనే ఉంది.

ఫ్రైడే -

సిన్మా వాళ్ళ జాతకాలు తేల్చేరోజు. ఇరవైనాలుగు క్రాఫ్ట్ లకు సంబంధించిన ఆర్టిస్ట్ లంతా అయిదారునెలలపాటు అహర్నిశలు శ్రమించి రూపొందించిన పద్నాలుగురీళ్ళ సిన్మా 'హిట్టో... ఫట్టో' తేలిపోయే రోజు. ధియేటర్లలో రిలీజైన వెంటనే కేవలం మొట్టమొదటి ఆట చూసిన ప్రేక్షకుడు పెదవి విరుస్తాడో... ప్రశంసలు గుప్పిస్తాడో తెలీక సినీ సెలబ్రెటీసంతా ఉత్కంటగా ఎదురుచూసే రోజు.

ఆ ఫ్రైడే గాయత్రీపాటిల్ తొలిసినిమా రిలీజైంది. విజేతా ప్రొడక్షన్స్ కి అంతకుముందు పలు విజయవంతమైన చిత్రాలు తీసిన ట్రాక్ రికార్డ్ ఉండడంతో మార్నింగ్ షోకి థియేటర్లన్నీ హౌస్ ఫుల్ అయ్యాయి. ప్రేక్షకుల ప్రతిస్పందన ప్రత్యక్షంగా చూసేందుకు ఆర్టీసి ఎక్స్ రోడ్స్ దగ్గరున్న ప్రధాన థియేటర్ దగ్గరికి విచ్చేసింది చిత్ర యూనిట్.

ఇక, గాయత్రీపాటిల్ ఆనందం వర్ణనాతీతం. అంతమంది ప్రేక్షకులమధ్య లైట్లారిన థియేటర్ లో కూర్చుని సెవన్టీ ఎంఎం స్క్రీన్ పై క్లోజప్ లో కనిపిస్తున్న తన అందాన్ని చూస్తూ పట్టరాని ఉద్వేగంతో ఊగిపోయింది. మొదటిసారి హీరోకి ఎర్రగులాబీ ఇస్తూ మోమాటంగా చెప్పిన - 'ఐ లవ్ యూ' సీన్ దగ్గర్నుంచీ హీరోతో చెట్టాపట్టాలేసుకుని చెట్టు పుట్టా తిరుగుతూ పాడిన యుగళగీతాన్ని ఆడియన్స్ ఎంతో బాగా రిసీవ్ చేసుకున్నారు.

స్క్రీన్ పై గాయత్రి కనిపించినంతసేపూ - "డార్లింగ్ ఐ లవ్ యూ" అంటూ ప్రేక్షకులు ఈల వేస్తూ గోల చేయడం ప్రారంభించారు. ఒకేసారి ఇంతమంది మూకుమ్మడిగా అరుస్తూ లవ్ ఎక్స్ ప్రెస్ చేస్తుంటే ఊపిరాడనిస్థితిలో ఉకిరిబిక్కిరైంది గాయత్రి. ఒక్క చిత్రం రిలీజైన కొన్ని క్షణాల్లోనే తనకింతమంది ఫాన్సా? సరిగ్గా అపుడే... సిల్వర్ స్క్రీన్ పవరేంటో తెలిసి వచ్చింది. డైరక్టర్ మొదటిసారి చూసి హీరోయిన్ గా ఎంపిక చేసినపుడు కూడా కలుగని ఆనందానుభూతి ఇపుడామెలో సంపూర్ణంగా కలిగింది. జీవితంలో ఎపుడూ ఎవరికీ ఆమె - 'ఐ లవ్ యూ' చెప్పలేదు. అలాటిది... స్క్రిప్ట్ డిమాండ్ మేరకు హీరోతో లవ్ సీన్స్ లో స్క్రీన్ షేర్ చేసుకున్నా... ఎదురుగా కెమెరాతో పాటు ఎంతోమంది యూనిట్ సభ్యులుండడంతో అది కేవలం డ్రామా అని ఆమె మనసుకి తెలుస్తూనే ఉంది. తను ప్రొడ్యూసర్ ఇచ్చిన రెమ్యునరేషన్ తీసుకుని ఈ సినిమాలో నాయికగా నటించింది. హీరోని ప్రేమించింది. కానీ... థియేటర్లలోని ప్రేక్షకులు తెరపై తనని చూసిన క్షణంలోనే ప్రేమలో పడిపోయారు. రంగురంగుల పేపర్లని గాల్లోకి ఎగురవేస్తూ తమ హర్షాతిరేఖాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారు సరే... తెరపై తనని చూసి అభిమానిస్తున్నారు.

మరి, తనకో... సన్నటి చీకట్లో ఒక్కరంటే ఒక్కరూ కనిపించలేదు. అయినా... వాళ్ళ మనసులోని భావాల్ని ఆహ్వానిస్తోంది. మనసారా ఆస్వాదిస్తోంది.

ఇంటర్వెల్ లో డైరక్టర్ సుందరమూర్తిని కలుసుకున్న అభిమానులు - "మంచి చిత్రం తీసారు. అభినందనలు" అన్నారు.

ఆ తర్వాత - "ఈ చిత్రం వల్ల తెలుగు ఇండస్ట్రీలో కొత్త నక్షత్రం పుట్టింది" మెచ్చుకున్నారు. ఆ మాటలు విన్న గాయత్రీపాటిల్ కి ఎంతో సంతోషం వేసింది.

సిన్మా అయిపోయాక బయటకొస్తుంటే జర్నలిస్ట్ లు చుట్టుముట్టారు. ప్రొడ్యూసర్ మాతంగరావు, డైరక్టర్ సుందరమూర్తి తర్వాత హీరోయిన్ మాట్లాడింది. ఇంత చక్కని 'మూవీలో యాక్ట్ చేసే అవకాశం దొరికినందుకు హర్షాతిరేఖం వ్యక్తం చేస్తూ... నటిగా తనకు కొత్త జన్మనిచ్చిన తెలుగు ఇండస్ట్రీ ని ఎప్పటికీ మరిచిపోనని... ఇలాటి మంచి అవకాశాలు మళ్ళీ మళ్ళీ లభించాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.

"మూవీ సూపర్బ్"

"హీరోయిన్ అదుర్స్"

"హండ్రెడ్ డేస్ పక్కా"

థియేటర్లో మీడియా ముందు ఫాన్స్ హడావుడికి అంతేలేదు. ఆ కేకలు, అరుపులు, జయజయధ్వానాలుగా వినిపిస్తుంటే... సిటీలో తను బస చేసిన స్టార్ హోటల్ రూంలోకొచ్చి పడింది గాయత్రీపాటిల్.

ప్రతిరోజూ జిరాక్స్ కాపీలా అదే సూర్యోదయం... అరుణిమలు దిద్దుకుంటూ అదే సాయంసంధ్య. క్షణాల రెక్కలు విప్పుకుంటూ ఉరుకులు పరుగులతో అదే గడియారం... అదే సమయం.

అయినా... ఇవాళ గాయత్రీపాటిల్ కి లోకమంతా కొత్తగా కనిపిస్తోంది. ఇవాల్టి సూర్యోదయం ఆమె జీవితంలో సరికొత్త మార్పుల్ని తీసుకొచ్చింది. ఇపుడు... గాయత్రీపాటిల్ దేశంలో ఉన్న కోట్లాది జనాల్లో ఒకరు కానేకాదు. కొన్ని కోట్లమంది కళ్ళింతలు చేసుకుని తిలకించేంత ఎత్తులో తనుంది... ఆ భావనే క్షణం సేపు ఒక్కచోట నిలువనీయడం లేదు. తను ఇక్కడే... ఈ హోటల్ లోనే ఉన్నా... నేల నాలుగు చెరుగులా వందల థియేటర్లలో వెండితెరపై తన రూపం ఆవిష్కృతమవుతోంది. ఆడుతోంది... పాడుతోంది. కమ్మని కబుర్లు చెప్తోంది. అంతేనా... ప్రతి థియేటర్ ప్రాంగణంలోనూ తన నిలువెత్తు కటౌట్ టీవి గా చూపరులను ఆకట్టుకుంటోంది. ఎస్... ఇవాళ జనాల ముందు తను ఓ హీరోయిన్ గా తలెత్తుకుని దర్జాగా నిల్చుంది. అందుకే... ఈరోజు... జీవితంలోనే మరిచిపోలేని మధురమైన రోజుగా గుండెభరిణెలో కలకాలం గుర్తుండిపోతుంది...

ఆనందాతిశయంతో తలమునకలవుతున్న గాయత్రికి ఆకలి వేయడం లేదు. దాహం వేయడం లేదు. అసలేమీ తినాలనిపించలేదు. 

అంతలో సెల్ ఫోన్ మోగింది. ఇన్ బాక్స్ లో మళ్ళీ ఓ ఎస్ఎంఎస్.

"కంగ్రాట్స్... మీ ఫస్ట్ మూవీ హిట్ అయినందుకు. ముందే నాకు తెలుసు... ఇండస్ట్రీలో మీరు సూపర్ డూపర్ హిట్ హీరోయిన్ గా మీరు ఎదుగుతారని... కీపిటప్ మీ అభిమాని"

"ఎవరా అభిమాని? నా ప్రతి కదలికల్నీ గమనిస్తూ ప్రోత్సహిస్తున్నాడు... 'ఓసారి అతడితోనే డైరక్ట్ గా మాట్లాడుదామని ఆ అన్ నోన్ నంబర్ కి కాల్ చేసింది గాయత్రీపాటిల్.

'ఔటాఫ్ కవరేజ్ ఏరియా' అనే రికార్డెడ్ మెసేజ్ వినిపిస్తోంది అట్నుంచి. సెల్ టవర్ సిగ్నల్స్ కూడా అందడం లేదు అంటే... అంత దూరంగా ఉన్నాడా...లేక, అన్నీ గమనించేంత దగ్గర్లోనే ఉంటూ తనతో దాగుడుమూతలు ఆడుతున్నాడా?

ఇంతకీ అతడెక్కడున్నాడు?

అమ్మాయి స్క్రీన్ ఫ్రెజన్స్ క్యూట్ గా బాగుంది. నటించే స్కోప్ లేని కేరెక్టర్ కనుక... గాయత్రి కేవలం గ్లామర్ కే పరిమితమైంది. ఎంతసేపూ హీరోని అల్లేసుకుంటూ 'హల్లో...' చెప్తూ చెట్టూపుట్టా తిరుగుతూ డ్యూయెట్లు పాడుతూ కనిపించేపాత్ర. అందువల్ల... హీరోయిన్ కి ఏమాత్రం ఇంపార్టెన్స్ లేదు. కాగా... కలువల్లాంటి కళ్లతో యువహృదయాలకు గాయత్రి గాలం వేసిందనే చెప్పాలి. తెలిసో... తెలీకో మహానటి సావిత్రి తన రోల్ మోడల్ అని ప్రెస్ ముందు ప్రకటించిన ఈ నటి ముందు ముందు తనని తాను ఫ్రూవ్ చేసుకోవాలంటే కేవలం తన వంటి వంపుసొంపుల్ని, గ్లామర్ నే నమ్ముకోకుండా అంతో ఇంతో నటన ఖచ్చితంగా నేర్చుకుని తీరాల్సిందే. అపుడే... మహానటి సావిత్రి పేరు తను మెన్షన్ చేసే అర్హతను సాధించుకోగలుగుతుంది. లేదా... ముంబాయి, డిల్లీలనుంచి తెలుగుతెరకు దిగుమతి అయి అందాల ప్రదర్శన చేస్తున్న ఎంతోమంది ముద్దుగుమ్మల లిస్ట్ లో గాయత్రీపాటిల్ పేరు కూడా చేరుతుంది. ఇది ఆమె నటించిన మొదటి సినిమా కనుక... భవిష్యత్ కెరీర్ చక్కదిద్దుకునే అవకాశం ఇంకా ఆమె చేతుల్లోనే ఉంది.

గాయత్రీపాటిల్ తొలిసినిమాపై మీడియాలో వచ్చిన చాలా రివ్యూలు ఇలాగే సాగాయి. పైకి పాజిటివ్ గా చెప్తున్నట్లనిపిస్తున్నా... ఇండస్ట్రీకి మంచి నటి కాదు... మరో గ్లామర్ డాల్ దొరికిందనే అన్ని పత్రికలూ వెల్లడించాయి. నవతార జర్నలిస్ట్ గా సుదర్శన్ కూడా ఇలాటి అభిప్రాయాన్నే వ్యక్తం చేసాడు.

గ్లామర్... ఇవాళ్టి సినిమాని నడిపించే నిజమైన గ్రామర్.

హీరోయిన్ సెలక్షన్ లలో కళ్ళముందు కనిపించే అందమే ప్రధాన కొలమానం అవుతోంది. అమ్మడి శిరసుపై అందాల కిరీటం ఉందో లేదో ఆరాతీస్తారు. ఉంటే ఆరాధిస్తారు. సాధ్యమైనంతవరకూ 34-24-34 కొలతల నెలతలకోసం అన్వేషణ కొనసాగిస్తారు. వంపుసోంపుల్తో ఆకట్టుకుని కనికట్టు చేసే అమ్మాయిల్నీ నెత్తికెత్తుకుని అభినందిస్తారు. సినిమా తెరమీదకి ఆహ్వానిస్తారు. పెళ్ళిచూపుల సెలక్షన్ కంటే ఘనంగా హీరోయిన్ సెలక్షన్ లు జరుగుతాయి. ఆమెలోని ఆకర్షణని అణువణువూ పరీక్షిస్తారు. కళ్ళు, కనుబొమ్మలు, అందమైన భ్రుకుటి, నుదుటిపై విలాసంగా పడే ముంగురులు, ముఖం అందాన్ని ఇనుమడింపచేసే నాసిక, ఎర్రెర్రని పెదాలు... ఆ పెదాల చివర్నుంచీ సుతిమెత్తగా జాలువారే సుందరమైన నవ్వు... ఇలా ప్రతి విషయాన్నీ 'కెమెరాకన్ను'తో తిలకిస్తారు. అంతేనా... అమ్మడిది నడకొ... హంసధ్వని రాగమో... ఆ చివర్నించి ఈ చివరివరకూ 'కాట్ వాక్' చేయించి మరీ క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఆమె వయసు వసంతాలు ఏ డ్రస్ లో ఎంతెంతమోతాదులో విరబూస్తున్నాయో... పకడ్బందీ ఫోటో సూట్ ద్వారా గమనిస్తారు.

ఇలాటి ఎన్నో 'ఇన్ కెమెరా' ఎగ్జామ్స్ గట్టెక్కిన తర్వాతే గాయత్రీపాటిల్ తెరంగ్రేటం చేసింది.

అవన్నీ గుర్తుతెచ్చుకున్న సమయంలోనే గాయత్రీపాటిల్ కి అలనాటి సావిత్రి గుర్తొచ్చింది.

"ఆ రోజులు వేరు. హీరోయిన్ ఎలా ఉన్నా సరిపోయేది. ఇవాళ హీరోయిన్ అంటే... సన్నగా సన్నజాజితీగెలా ఇలాగే ఉండాలన్న 'స్టయిల్ షీట్' ఒకటి కటినంగా అమలవుతోంది. కన్నుముక్కు తీరు కాస్త అటు ఇటు ఉన్నా... అప్పట్లో కథానాయికగా చలామణీ అయ్యేవాళ్ళు. కానీ... సరససౌందర్య అప్సరసలే ఇప్పట్లో వెండితెర సామ్రాజ్య పట్టమాహిషులవుతున్నారు. బొద్దుగా ఉన్న సావిత్రి అప్పట్లో యాక్ట్ చేయబట్టి ఇవాళ్టికీ మహానటిగా చిరయశస్సుతో చిరస్మరణీయమైంది.

అపుడు కాకుండా ఇప్పట్లో అదే సావిత్రి... కొత్తగా సినిమాల్లో పనిచేయాలనుకుంటే... ఆ ఊహే గాయత్రీపాటిల్ కి నవ్వు తెప్పించింది. కరడు కట్టిన సావిత్రి అభిమానులకు ఆమె బొద్దుగా ఉందని అనిపించొచ్చు... కానీ, అంత లావున్న నాయికని ఇప్పటి తెలుగు తెర ఆమోదిస్తుందా?

అనుమానమే.

మొదట్లో సన్నగా ఉన్న నమితను అభిమానించారు ఇక్కడి జనం. లావెక్కిన తర్వాత తమిళనాడుకి తరిమేశారామెని. ఒకప్పుడు ఖుష్బూ కూడా అంతే. కాస్త సన్నగా ఉన్నప్పుడు ఇక్కడి ఈ తెలుగువాళ్ళకి తెగ ముద్దొచ్చింది. బొద్దుగా మారాక... అక్కడ తమిళతంబీలు ఏకంగా గుడికట్టేంతగా ఆరాధించారు. అంతెందుకు... 'దేశముదురు' హన్సికని తెలుగువాళ్ళు ముందుగా అభిమానించారు. క్రమక్రమంగా ఆమె లావెక్కిన తర్వాత... తమిళులు 'చిన్న ఖుష్బూ'గా పిలుచుకుంటూ ఆమె సిన్మాల్ని వరుసపెట్టి హిట్ చేస్తున్నారు. తెరపై యవ్వనాల తుఫాన్ రేపిన సిమ్రాన్ లాంటి స్లిమ్ గా ఉన్న హీరోయిన్లనే ఇక్కడి తెలుగువాళ్ళు ఎంతో ఇష్టపడతారు. ప్రేమిస్తారు.

కాస్త లావుగా ఉంటే చూడ్డానికి కష్టపడతారు. పక్కన పెడతారు.

ఈ నేపధ్యంలో మహానటి సావిత్రే ఇప్పట్లో తెరముందుకొచ్చి సినిమాలు చేస్తానంటే... ఆమెనీ ముందుగా డైటింగ్ చేయమంటారు. సడన్ గా 'జీరో' సైజ్ లోకి మారకున్నా సగానికి సగం తగ్గాల్సిందే. 'జీరో' ప్రపంచాన్నిప్పుడు చుట్టేస్తున్న సరికొత్త భావజాలం. జీరో క్యాలరీలు, జీరో కొలెస్ట్రాల్, జీరో సుగర్... ఇంకాస్త ముందుకెళ్తే జీరో ప్లాస్టిక్, జీరో పర్సంట్ ఇంట్రస్ట్... ఇలా 'జీరో'యే మనకు హీరో!! ఇన్ని రకాలుగా 'సున్నా' రాజ్యమేలుతుంటే శూన్యానికి విలువ లేదని ఎవరనగలరు?

అందుకే, 'జీరో'ని కనిపెట్టి ప్రపంచానికందించిన ఈ దేశం పరుగు ఇపుడు 'జీరో'వేపు... శూన్యం వేపు.

వెండితెరపై వెలిగే హీరోయిన్లకైతే జీరో సైజ్! బాలీవుడ్ హీరోయిన్ కరీనాకపూర్ జీరో సైజ్ ట్రెండ్ కి ఆద్యురాలు. సైజ్ జీరో... స్త్రీల దుస్తుల సైజుల్లో భాగంగా వచ్చింది. స్పష్టంగా చెప్పాలంటే...'31-23-32' కొలతలన్నమాట. ఒకనాడు కళ్ళతోనే అభినయకౌశలాన్ని వ్యక్తం చేసిన అలనాటి మేటి నటి సావిత్రి ఈనాటి కుర్రహీరోయిన్లతో పోటీపడి నెగ్గాలంటే కరీనాలా 'జీరో'సైజ్ లోకి రాకున్నా కాస్తో కూస్తో తగ్గాల్సిందే.

అంతేనా... అడపాదడపా గ్లామరస్ కేరెక్టర్లూ వేయాల్సిందే"

తనకొస్తున్న వింతవింత ఆలోచనలకి పడిపడి నవ్వుకుంది గాయత్రీపాటిల్.

గ్లామర్... ఓ హీరోయిన్ ని తెరకు పరిచయం చేసే మహిమానిత్వ ఆయుధం.

ఆ ఆయుధం లేనిదే... ఇండస్ట్రీలో ఇపుడే తార తళుక్కుమనలేదు.

అదే వాస్తవం.

ఈ వాస్తవాన్ని... కమర్షియల్ సినిమాల లెక్కల్నీగమనించకుండా ఓ హీరోయిన్ కేవలం గ్లామర్ కే పరిమితం అవుతోందంటూ విమర్శిస్తూ రివ్యూలు రాయడం కేవలం మేధావులనబడే క్రిటిక్స్ కే దక్కింది. ఇలా రాసేవాళ్ళని ఓ సినిమా తీసి విజయం సాధించమంటే... అసలు వాళ్లకి ఆ అవకాశం వస్తే కదా!... అనుకుంది గాయత్రి.

'గాయత్రీపాటిల్ గ్లామరస్ హీరోయిన్... ఆమెకి నటన రాదు' -

రివ్యూల్లో రాసినంత మాత్రాన తనకొచ్చే నష్టమేం లేదు. జనం కోరుకున్నదే మనం ఇవ్వాలన్నదే సినీసూక్తం. దాన్ని అలవర్చుకుని ముందుకెళ్తే చాలు... అంతా అభ్యున్నతే. నిజానికి... ఈ చిత్రంలో తను వేసిన ఈ పాత్ర ఖచ్చితంగా తన వయసుకి తగ్గ పాత్రే. అయినా, రివ్యూలు చూసే ప్రేక్షకులు ఓ చిత్రాన్ని ఆమోదించరు. తిరస్కరించరు.

ఆ సత్యాన్ని నిరూపిస్తూ రిలీజైన అన్ని థియేటర్లలో తన సిన్మా హౌస్ ఫుల్ కలక్షన్స్ తో రన్ అవుతూనే ఉంది... అనుకుంది గాయత్రీపాటిల్.

ఇంతలో - గాయత్రీపాటిల్ ఫోన్ లోకి మళ్ళీ ఓ ఎస్ఎంఎస్ పక్షి వచ్చి వాలింది.

(...ఇంకా వుంది)

మరిన్ని సీరియల్స్
Athadu Manishi