Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
pounch patas

ఈ సంచికలో >> శీర్షికలు >>

అవీ - ఇవీ - భమిడిపాటి ఫణిబాబు

 

ఇదివరకటి రోజులకీ, ఇప్పటిరోజులకీ చాలా విషయాల్లో చాలా తేడాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయినా అలా అనుకోవడమూ భావ్యం కాదేమో… కారణం—ఆరోజుల్లో మన గురించికూడా మన తల్లితండ్రులు అలాగే  అనుకునుండొచ్చు. “ తన దాకా వస్తేనే కానీ…” అన్న సామెత అక్షరాలా నిజం కదూ.. వారికి తమ అభిప్రాయాలు వ్యక్తపరచడానికి పెద్దగా మాధ్యమాలు ఉండేవి కావు. టెక్నాలజీ ధర్మమా అని, వ్యక్తపరచడానికి ఈరోజుల్లో కావాల్సినన్ని మాధ్యమాలాయె…



అయినా ఒక విషయం మాత్రం ఒప్పుకోవాలి.. ఆరోజుల్లో ఉమ్మడి కుటుంబాలూ, ఇంటిపెద్ద  చెప్పిన మాటని వేదంగా భావించే పిల్లలూ ఉండడంతో, మరీ హద్దులు దాటి, పెద్దవారు చెప్పిన మాట జవదాటే ధైర్యం కూడా ఉండేది కాదు. ఇప్పుడు అలా కాదుగా.. అక్కడికేదో తాము జీవితంలో అసలు ఏమీ అనుభవించలేదే అనే దురభిప్రాయం తో, తమ పిల్లలకి, మోతాదు మించి చనువు ఇచ్చి, వాళ్ళడిగినదల్లా వారికి దక్కించి, ఆ పిల్లలు తమనేదో ఉధ్ధరించేస్తారనే అపోహలో ఉండి, తీరా వాళ్ళనుకున్నట్లు జరగకపోయే సరికి, నెత్తీ నోరూ బాదుకోవడం, ఈరోజుల్లో తరచుగా కనిపిస్తోంది. ఒక్కసారి గుండెలమీద చెయ్యేసికుని, ఆనాటి తల్లితండ్రులు, తమతమ తల్లితండ్రుల విషయాల్లో ఎలా ప్రవర్తించారో గుర్తుచేసికుంటే అసలు గొడవే ఉండదు. కానీ ప్రతీవారూ  “ ఆ ఒక్కటీ..” తప్ప మిగిలినవన్నీ గుర్తు పెట్టుకుంటారు. అక్కడే వస్తుంది గొడవంతా…

ఉపోద్ఘాతం పూర్తిచేసి అసలు విషయంలోకి వద్దాము. ఈ తరం పిల్లల విషయంకదూ… వీళ్ళవన్నీ  Tech Savvy  ఐడియాలూ. ఎక్కడ ఎవరికి ఎలా చెప్పాలో , వీళ్ళకి తెలిసినట్టు ఇంకెవరికీ తెలియదు. అమ్మకేం చెప్తే నమ్ముతుందో, నాన్నకి ఏం చెప్తే నమ్ముతారో, వీళ్ళకి  “ బాయే హాథ్ కా ఖేల్ “.  ఎప్పుడైనా , మగాడికి పెళ్ళైన తరువాత తన భార్యా, పిల్లలే ముఖ్యం అనడంలో సందేహం లేదు. అది ఇప్పుడైనా, అప్పుడైనా ఎప్పుడైనా ఒప్పుకోవాల్సిందే. ఏదో మరీ పిల్లలే లేకపోతే వేరే విషయం.  అలాటప్పుడు, తమ తల్లితండ్రుల విషయంలో చాలా శ్రధ్ధ చూపిస్తారు. అలాగని పిల్లలున్న జంటలందరూ తమతమ తల్లితండ్రులని అశ్రధ్ధ చేస్తారనీ కాదు. వీళ్ళు ఆశించినంత శ్రధ్ధ కనిపించదు. అదీ విషయం… కానీ ఒక్కొక్కప్పుడు అనిపిస్తూంటుంది కొంచం  పారదర్శకత  లాటిది ఉంటే బావుంటుందేమో అని. మళ్ళీ ఇందులోకూడా ఓ గొడవుంది—మరీ ఉన్నదున్నట్టుగా చెప్పేస్తే, ఈ పెద్దాళ్ళకి నచ్చదేమో. అందుకనే అంటారు--  Packaging is more important  అని. ఏదైనా చూడ్డానికి అందంగా ఉంటేనే కదా ఆకర్షించేదీ?

వచ్చిన గొడవల్లా ఏమిటంటే  ఆ  Packaging  కొంచం మోతాదు మించడం. ఉదాహరణకి , తన కుటుంబం (తనూ, భార్యా, పిల్లలూ మాత్రమే. ఇందులో తన తల్లితండ్రుల ప్రస్తావన ఉండదు ), ఏ శలవలకో విహార యాత్రకి వెళ్ళడానికి ముందుగా  అన్ని విషయాలూ చూసుకోవాలిగా, ఆమాటెదో ముందరే చెప్పేస్తే, వీళ్ళూ వస్తానంటారేమో అని భయం. కానీ నూటికి తొంభై మంది తల్లితండ్రులు , తమ పిల్లల్ని శ్రమ పెట్టాలని అనుకోరు.. అంతంత దూరప్రయాణాలు చేస్తే, ఇంక ఆ కొడుకు వీళ్ళ సంగతి చూసుకుంటాడా, లేక తన పిల్లల సంగతి చూసుకుంటాడా? ముందుగా తెలిస్తే, తమ దారిన తాము, తమ తోటి వయసువారితో ఏ తీర్థయాత్రకో వెళ్ళొచ్చుగా.  ఆఖరి క్షణంలో ఆదరాబాదరాగా ప్రయాణాలు చేసే వయసూ కాదూ,  ఎన్నెన్ని చూసుకోవాలి, వెళ్ళి వచ్చేవరకూ కావాల్సిన మందులు, ప్రయాణానికి కావాల్సిన రిజర్వేషన్లు, మరీ బస్సుల్లో ప్రయాణం చేసే ఓపిక లేదాయె, పిల్లలు ఆ చెప్పేదేదో ముందరే చెప్పేసుంటే, హాయిగా వీళ్ళ దారిన వీళ్ళూ వెళ్ళేవారుగా, ఆమాత్రం తెలియొద్దూ… అనుకుంటారు ఈ పెద్దవారు. ఇందులో ఎవరిని తప్పు పడతాము? మా ప్రోగ్రామ్ ఇంకా సెటిలవలేదూ అందుకే చెప్పలేదూ అంటారు పిల్లలు. నమ్మేటట్టుగా ఉందా ఇదీ? అయినా నమ్మినట్టు కనిపించాలి..

అలాగే, అప్పటిదాకా తల్లితండ్రులతో కలిసున్నవాళ్ళు కాస్తా, ఆఫీసుకి దగ్గరగా ఉంటుందని, ఇంకో చోట ఇల్లు అద్దెకు తీసికునైనా మారిపోవడం. అసలు కారణం ఏమిటంటే, కొత్తగా వచ్చిన కోడలుకి, అత్తగారి “ క్రమశిక్షణా అభియాన్ “ నచ్చకపోవడం తప్ప ఇంకోటి కాదు. అన్ని సంవత్సరాలూ, తల్లితండ్రులతోనే కలిసుండి, అదే ఆఫీసుకి వెళ్ళేవాడు కాదూ, ఇప్పుడు పెళ్ళాం వచ్చిన తరువాత  దూరం అయిందా, వేషాలు కాపోతే అనుకుంటారు పెద్దవారు.

ఇలా చెప్పుకుంటూ పోతే ఏదో విషయంలో అబధ్ధాలు చెప్తూనే ఉండాలి.  తల్లితండ్రులకి తెలియదా ఏమిటీ, తెలుసును… అయినా పోనిద్దూ  అని వదిలేస్తూ ఉంటారు  ..

సర్వేజనా సుఖినోభవంతూ…

మరిన్ని శీర్షికలు
navvunalugu yugaalu