Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
pounch patas

ఈ సంచికలో >> శీర్షికలు >>

వీక్షణం - పి.యస్.యమ్. లక్ష్మి

 

                                                                                                       హాయ్ హాయ్ మిసిసిపి

14-8-2009 న మేమిద్దరం, మా పిల్లలు దీప్తి, తేజస్వి కలసి లేన్సింగ్ నుంచి వారం రోజుల ట్రిప్ కి   బయల్దేరాము.  మా అమ్మాయి, అబ్బాయే డ్రెవింగ్.  ఉదయం 5-15 కి ఇంట్లో బయల్దేరిన వాళ్ళం మిచెల్ (సౌత్ డకోటా), ఇండియానా, చికాగో (ఇల్లినాయస్ స్టేట్) విస్కాన్సిన్ దాటి మిన్నెసోటాలోకి అడుగు పెట్టేసరికి మధ్యాహ్నం దాటింది.

పాడి పంటలు సమృధ్ధిగాగల రాష్ట్రం మిన్నెసోటా.    అంతేకాదు అనేక నదులు, సరస్సులు కూడా వున్నాయి.  మిన్నెసోటాని .. లేండ్ ఆఫ్ టెన్ ధౌజండ్ లేక్స్ .. అంటారు.    ఇదేమీ అతిశయోక్తి కాదండీ..   అసలు  ఇక్కడ 11,842 సరస్సులు, ఒక్కొక్కటీ 10 ఎకరాలకన్నా ఎక్కువ విస్తీర్ణత కలవి వున్నాయట.  మీరేమంటున్నారో తెలిసిందిలెండి...వాళ్ళకి నీళ్ళ కరువు అస్సలు వుండదుకదా!   ఎంత అదృష్టవంతులో!!  అంటున్నారు కదా.  మిన్నెసోటాలో 6,564 నదులు, సెలయేళ్ళు వున్నాయిట. ఇవ్వన్నీ 1,11,000 కి.మీ.ల దూరం ప్రయాణిస్తాయి.

వీటన్నింటిలో నన్ను అమితంగా ఆకర్షిచింది మిసిసిపీ నది.  దానికీ నాకూ నా చిన్నప్పటినుంచీ, ఒక విధంగా అమెరికా ఎక్కడ వుందో కూడా తెలియని సమయంనుంచీ కూడా వున్న అనుబంధం.  ఆ అనుబంధం ఏర్పడటానికి కారణం నేను చదివిన మార్క్ ట్వైన్ రచిచింన టామ్ సాయర్  అనే నవల తెలుగు అనువాదం. 

ఇంతకాలం తర్వాత ఆ నవల నాకు సరిగా గుర్తులేదుకానీ, దానిలో కొన్ని పాత్రలు సజీవంగా కళ్ళుముందున్నాయి.  టామ్ సాయర్, హకల్ బెరిఫిన్, గ్రాండ్ మదర్, ఆవిడ పిల్లి, మిసిసిపి రివర్, ఇలా కొన్ని పాత్రలు నా మనసులో చెరగని ముద్రవేసుకుని వున్నాయి.  టామ్ చిన్నవాడే.  అల్లరి చేస్తూ, గ్రాండ్ మదర్ వేసే శిక్షలు భరిస్తూ, చదువరులని చాలా సరదాగా వుంచుతాడు.  మిసిసిపి ఒడ్డున వున్న గుహల్లోకి వెళ్ళి తప్పిపోతాడు కూడా.  ఆ చిన్న వయసులోనే, టామ్ కి మల్లే హాయిగా అలా నది ఒడ్డున తిరిగితే అనిపించేది. (బుధ్దెక్కడికి పోతుంది అనకండి...పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది మరి).  సరే, అప్పట్లో ఆ నది ఒడ్డున తిరగటం మాటలా వుంచి అసలు దానిని చూస్తానని కూడా అనుకోలేదు.

మా అమ్మాయి దీప్తి, అబ్బాయి తేజస్వి  మాకోసం  ఈ సౌత్ డకోటా టూర్ ప్లాన్ చేసి దాని గురించి మాట్లాడుతుంటే మిసిసిపి పేరు నాలో దాగివున్న టామ్ సాయర్ ని బయటకి తెచ్చింది.  ఆ నవలలోని సంఘటనలు కొన్ని చాలా క్లియర్ గా, కొన్ని మసక మసకగా కళ్ళముందు కదలాడుతుంటే మా వాళ్ళకి వాటిని వివరించాను.

మా ప్రయాణంలో  మేము దాటి వచ్చిన ప్రదేశంలో మిసిసిపి ట్రిబ్యుటరీస్ కూడా వున్నాయి.  మిసిసిపీ అన్నప్పటినుంచీ నా వాగుడు విన్న మా అబ్బాయి వాటిని చూపించి మిసిసిపీ అదే అని ఆట పట్టించాడు.  ముందు నమ్మక పోయినా అక్కడ రాసివున్న సమాచారం .. అవి మిసిసిపీ ట్రిబ్యుటరీస్ అనీ కొంత దూరంలో కలుస్తాయని చూశాక సంతోషం.

మొత్తానికి నిండుగా పారుతున్న మిసిసిపీ రివర్ చూడగానే సంతోషంతో మనసు ఉరకలు వేసింది.  మా అమ్మాయి కారు ఆపేలోపే, ఎక్కడ పడితే అక్కడ ఆపు, ఆపు అని గోల చేశాను, ఆ నది ఎక్కడ కనుమరుగైపోతుందోననే భయంతో.  అంత సమీపంలో వున్న మిసిసిపికి దూరంగా ఒక్క క్షణం కూడా వుండలేక పోయాను.  కారు ఆగీ ఆగగానే దిగి ఒడ్డుకెళ్ళిపోయాను.  అప్పుడు నేను పొందిన సంతోషం, నా మనసు తొక్కిన పరవళ్ళు నేను మాటలలో వర్ణించలేను. 

మన దేశంలో జీవ నదులను నిండుగా పారుతున్నప్పుడు చూసిన ఆహ్లాదం, సంతోషం, ఏమిటో చెప్పలేని సంబరం మిసిసిపీని చూసినప్పుడూ కలిగింది.  అప్పటిదాకా 9 గం. ల పాటు చేసిన కారు ప్రయాణం అలసట మర్చిపోయి కొంతసేపు అక్కడ గడిపాము.  మరి నేను చూస్తాననుకోని మిసిసిపి, ఇన్నేళ్ళూ నా ఊహలలో కాపురమున్న మిసిసిపి..... .. నా బాల్యం లోని కోరిక నెరవేరిందిగా.

మనసు నిండిన సంతృప్తితో తిరిగి ప్రయాణం మొదలు పెట్టాము.  డెక్స్టర్ (మిన్నిసోటాలోనే) ఒక చోట కనుచూపుమేర అంతా విండ్ మిల్స్ కనిపించాయి.  వేలల్లో వున్నాయనిపించింది.  విద్యుత్ ఉత్పత్తి కోసం ఏర్వాటు చేసినవి అవి.రాత్రి 8-30 కి (మిచిగాన్ టైమ్  .. లోకల్ టైమ్  రాత్రి 7-30)  సౌత్ డకోటాలో ముందే రిజర్వు చేసుకున్న హోటల్ చేరుకున్నాము.  అప్పటిదాకా మేము వచ్చిన దూరం ఎంతో తెలుసా   850 మైళ్ళు.

ఇంత దూరం ప్రయాణం చేసీ హోటల్లో సామాను పెట్టి 20 నిముషాల్లో తయారయి కార్న్ పేలెస్ చూడటానికి బయల్దేరాము.  అద్భుతమైన ఆ కార్న్ పేలెస్ గురించి వీక్షణంలో 23-10-15 సంచికలో వివరించాను.  అందుకే వచ్చేవారం ఇంకా ముందుకు సాగుదాం.

మరిన్ని శీర్షికలు
navvunalugu yugaalu