Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నాగలోకయాగం

గతసంచికలో ఏం జరిగిందంటే.. http://www.gotelugu.com/issue153/433/telugu-serials/nagaloka-yagam/nagaloka-yagam/

గోండ్వాలు గిరిజన తెగకు చెందిన వారైనా మిగిలిన ఆటవిక జాతులతో ఎన్నడూ కలవరు. ఇంకా చెప్పాంటే, తామవాళ్ళే అయినా మరో గోండ్వా తండాల వారితో కూడ కలవరు. ఏ తండా దారి ఆ తండాదే అన్నట్టుంటారు. తమ తండాలోని యువతులను మరో తండాలోకి యివ్వరు. తమ తండాలోనే ఆమెకు నచ్చిన యువకునితో పెళ్ళి జరిపిస్తారు. అలా తమ తండానే వృద్ధి చేసుకుంటారు. ప్రతి తండాకు ఒక నాయకుడుంటాడు. నాయకుని మాటకు అంతా కట్టుబడి వుంటారు.

వీరి ప్రధాన వృత్తి వేట.
అడవుల వెంటే తిరుగుతారు.
ఎక్కడా స్థిర నివాసం వుండరు.

అడవిలో సేకరించిన దినుసులు, వస్తువుల్ని సమీప గ్రామంలోని సంతకు తీసుకెళ్ళి వస్తు మార్పిడి పద్ధతిలో తమకు అవసరమైనవి తెచ్చుకుంటారు. వీళ్ళ తండా కదిలిందంటే చిన్న పల్లె కదిలి పోతున్నట్టే వుంటుంది.

ఎడ్ల బండ్ల మీద, గాడిదల మీద సామాన్లు వేసుకుని గొర్రెలు, మేకలు, కోళ్లు, పందులతో కదిలి పోతూంటారు. కొందరు కావళ్ళు కట్టుకొని ఒక ప్రక్కగా పసిపిల్లల్ని రెండో పక్క వస్తువుల్ని వుంచి మోసుకు పోతూంటారు. కాలి నడకనే ఋతువులననుసరించి ఎక్కడ వేట పుష్కలంగా దొరుకుతుందో ఆయా ప్రాంతాలకు అడవులబడి తరలి పోతూంటారు. బాణాలు వేయటం, గురి తప్పకుండా బళ్ళాలు విసరటంలో వీళ్ళు నిపుణులు. ఒంటరిగా వేటకు వెళ్ళే అలవాటు వీళ్ళకు లేదు. తండాలోని యువకులు కనీసం పదిమందయినా కలిసి కట్టు వెళ్ళి వేట సాగిస్తారు. ఎక్కడి విడిది చేసినా ఏడాదిలో రెండు మాసాల వరకు అక్కడే వుంటారు. అడవుల్లోని లోయలు, మైదానాల వెంట నివశిస్తారు. కొండపై నివశించే అలవాటు వీళ్ళకు లేదు.

అటువంటి ఆ గోండ్వా తండా లోతట్టు అడవుల వైపు పోతూ వేట కోసం తాత్కాలికంగా బాట పక్కన విడిది చేసింది. వాళ్ళు అక్కడ దిగి ఇది మూడో రోజు. పడుచు వాళ్ళు ముసలి ముతకా పిల్లా పీచు అంతా చేరి మొత్తం యాభై కుటుంబాలకు చెందిన అయిద వందల జనాభా వుంది ఆ తండాలో.

ఆ రోజు ఎండ అధికంగా వుంది.

తండాలోని యువకులు భోజనాలు చేసి వేటకు వెళ్ళడానికి సిద్ధమవుతున్న వేళ. అంతలో ఉన్నట్టుండి ఏమైందోగాని ఒక్క సారిగా అక్కడ రోదనలు చెలరేగాయి. ఒక్క పెట్టున ఏడుస్తూ గుండెలు బాదుకొంటున్నారు. ఆకాశం విరిగి పడుతుందా అన్నంత పెద్దగా ఒక్క పెట్టున ఏడుస్తున్నారు.

సరిగ్గా అదే సమయంలో `

ఎగువ నుంచి ధనుంజయ, అపర్ణులు తమ అశ్వాల మీద శరవేగంతో దూసుకొస్తున్నారు. తండాలో చెల రేగిన రోదనల ధ్వనులు వారి చెవులకు సోకాయి.

‘‘మిత్రమా! ఏమా రోదనలు. ఏమి జరిగి వుంటుంది?’’ ఎగువకు దృష్టి సారిస్తూ అడిగాడు ధనుంజయుడు.

‘‘అదియే అర్థము గాకున్నది ప్రభు. వాళ్లు ఎవరో ఏమి కష్టము సంఘటిల్లినదో. రండి చూతము’’ అంటూ తన మచ్చల గుర్రాన్ని మరింతగా అదలించాడు అపర్ణుడు.

వాయు వేగంతో అశ్వాలు తండాను చేరుకున్నాయి. అశ్వాలను నెమ్మదించి జనం లోకి పోనిచ్చారు. తండా వాసులంతా ఒక్క పెట్టున రోదిస్తున్నారు. అశ్వాలు రెంటినీ చూసి పక్కకు తొలగి దారి వదిలారు.

‘‘ఏమి జరిగినది? మీకొచ్చిన కష్టమేమి?’’ అశ్వం పైనుండే ఒక తండా వాసిని ప్రశ్నించాడు ధనుంజయుడు.

‘‘ఏం చెప్పనయ్యా. అయ్యో దేవుడా... ఒక్కగా నొక్క బిడ్డడు. మా నాయకుని కొడుకును పాము కాటుతో చంపి తీసుకు పోతున్నావే. దేవుడా! ఇది నీకు న్యాయమా....’’ ఆకాశం వంక చూస్తూ అరిచాడా వ్యక్తి. అతడి మాటల్ని బట్టి తండా నాయకుడి కొడుకు పాము కాటుకు బయ్యాడని అర్థమైంది.

అశ్వాలను ఇంకా ముందుకు పోనిచ్చారు.

ఎదురుగా కన్పించిన దృశ్యం చూసి నిశ్చేష్టితుయ్యారు. సుమారు పదిహేనేళ్ళు ప్రాయం కలిగిన బాలుడు ఒకడు నేల మీద పడి వున్నాడు. అతడి నోటి నుండి నుచ్చలు వస్తున్నాయి. కనులు తిరగబడుతున్నాయి. ఎర్రటి శరీరం ఇప్పుడిప్పుడే నలుపు రంగు తిరుగుతోంది. పాము కాటేసి ఎక్కువ సేపు కాలేదనిపించింది.

చేతికి అంది వచ్చిన ఒక్కగా నొక్క కొడుకు పరిస్థితికి తల్లడిల్లి పోతూ తండా నాయకుడు తల పట్టుకొని ఏడుస్తున్నాడు. అతడి భార్య కొడుకు పక్కనే చతికిల బడి శోకాలు తీస్తూ రోదిస్తోంది. తమ నాయక దంపతులకొచ్చిన కష్టాన్ని చూసి తట్టుకోలేక స్త్రీలు, బాలలు, వృద్ధులతో సహా అంతా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆ బాలుడు మరి కొందరితో దూరంగా పొదల్లో కంద మూలాలు తవ్వుతుండగా పాము కాటేసి పోయిందట. మిగిలిన బాలురు ఆ బాలుడ్ని తండా లోకి తీసుకొచ్చారట. చూస్తుంటే హృదయ విదారకంగా వుంది అక్కడి పరిస్థితి.
‘‘పాపము... ఇంతటి కష్టము ఎవరికీ రాకూడదు. బ్రతకడనుకుంటాను’’ అన్నాడు బాలుడి తీరు చూసి జాలి పడుతూ ధనుంజయుడు.
‘‘లేదు ప్రభు. వాడు బ్రతుకుతాడు. వాడికి ఆయుష్షు వుంది.’’ అన్నాడు నిశితంగా బాలకుని పరిశీలిస్తున్న అపర్ణుడు. చెంగున అశ్వం దిగి బాలుడి వద్దకెళ్ళాడు.

నిర్ఘాంత పోయాడు ధనుంజయుడు.

విషం శరీరాన్ని ఆక్రమిస్తోంది.

నుచ్చలు గ్రక్కుతూ కొట్టుకుంటున్నాడు బాలుడు. అలాంటి వాడికి ఆయుష్షు వుందా! బ్రతుకుతాడా... ఏం చూసి ఈ అపర్ణుడు ఇంత ధీమాగా చెప్తున్నాడు. ఏం చేసి బ్రతికిస్తాడు. అనేక సందేహాలు చుట్టు ముడుతుండగా అశ్వంపై కూచునే కుతూహలంగా గమనించసాగాడు.
అపర్ణుడు బాలుని వద్దకెళ్ళి చేయి పట్టుకుని నాడి చూసాడు. కనురెప్పలు ఎత్తు చూసి పరిశీలించాడు. తండా వాసుల్ని చూస్తూ`
‘‘మీరు భయ పడకండి. బాలుడు బతుకుతాడు. మీరంతా నిశ్శబ్ధంగా వుండండి’’ అంటూ వేగంగా అక్కడి నుండి పొదల్లోకి పరుగెత్తాడు.
తండా వాసుల్లో ఏదో ఆశ చిగురించింది. ఉన్నట్టుండి రోదనలు ఆగి పోయాయి. కాని కొందరు వెక్కి వెక్కి మౌనంగా రోదిస్తూనే వున్నారు. బాలుడు బతుకుతాడంటే చాలా మందికి నమ్మకం లేదు. అశ్వం మీది ధనుంజయుని పొదలవెంట గాలిస్తున్న అపర్ణుడిని ఉత్కంఠతో చూడ సాగాడు.

వెళ్ళిన ఒకింత సేపట్లోనే గుప్పెడు ఆకులతో తిరిగి వచ్చాడు అపర్ణుడు. అది ఏ మొక్కల ఆకులో, పాదుల ఆకులో గాని కొసలు ఎరుపు రంగు తిరిగి వున్నాయి. వాటిని అర చేతిలో బాగా నలిపాడు. బాలుడి నోరు తెరిపించి గొంతులో పది చుక్కలు పిండాడు. ఆ ఆకులు విషం శరీరమంతా వ్యాపించకుండా వున్న చోట ఆపటంలో అద్భుతంగా పని చేస్తాయి.

అపర్ణుడు కోరిన వెంటనే`

ఒక తొండను పట్టి తెచ్చారు తండా యువకులు.

అపర్ణుడు ఒక వెడల్పాటి పచ్చి ఆకును త్రుంచాడు. దాని పైన గోటితో ఏదో మంత్రం లిఖించాడు. దాన్ని తొండ మెడకు చుట్టి జారిపోకుండా తీగతో కట్టాడు. పిదప ఏవో మంత్రాలు చదివి తొండ ముఖాన మూడు సార్లు గాలి ఊదాడు. ‘‘నాగ మిత్రుడా. ఇక వేగిరం పొమ్ము. ఈ బాలుని కాటందుకున్న దుష్ట నాగము ఎందున్నను వేగమే ఇటకు తోలుకొని రమ్ము. పొమ్ము.’’ అంటూ దాని వీపు మీద ముమ్మారు తట్టి నేలమీద వదిలేసాడు. అంతే`

తనకు అంతా తెలుసునన్నట్టు అపర్ణుని జూచి నిక్కి నిక్కి తల వూపి గిరుక్కున తిరిగి పొదలవైపు పరుగెత్తి కనుమరుగైంది. తండా వాసులంతా ఎక్కడి వాళ్ళక్కడ నిలబడి ఉత్కంఠ భరితులై అపర్ణుడి వంక చూస్తున్నారు. వాళ్ళకేమీ అర్థం గావటం లేదు. వాళ్ళకే కాదు, అశ్వం మీద కూచునున్న యువరాజు ధనుంజయుకీ అర్థం గావటం లేదు. తొండ వెళ్ళి కాటేసిన సర్పాన్ని తీసుకొస్తుందా? వచ్చి ఏమి చేస్తుంది? అసలా కుర్రాడు బతుకుతాడా లేదా? అందరిలోనూ ఇదే సంశయం. అపర్ణుడు అందరి వంకా చూస్తూ పెద్ద స్వరంతో చెప్పాడు.

‘‘మీరంతా శ్రద్ధగా ఆలకించండి. ఈ బాలుడ్ని కాటందుకున్న పన్నగాన్ని ఇటకు రప్పిస్తున్నాను. మీలో ఏ ఒక్కడూ పాముకి హాని తల పెట్టకూడదు. నా మీద ఆన. మీరు కొలిచే దేవుళ్ళ మీద ఆన. ఆ దుష్ట భుజంగం ఎటు నుండయినా రావచ్చును. మీ కాళ్ళ సందు నుండి కూడా రావచ్చును. భయ పడి మీరు కదల కూడదు. అరవ కూడదు. మౌనంగా, ధైర్యముగా ఎక్కడి వాళ్ళక్కడ నిశ్శబ్ధంగా ఉండాలె. అంత ధైర్యం లేని వాళ్ళుంటే ఇప్పుడే అలా దూరంగా బాట మీదకు వెళ్ళి పోవచ్చును. ఇప్పుడు ఒక ముంతలో కాచి చల్లార్చిన పాలు, ఒక కోడి గ్రుడ్డు ఇక్కడ సిద్ధంగా వుంచండి. త్వరగా’’ అన్నాడు.

వెంటనే పాలు, గ్రుడ్లు అక్కడ సిద్ధమయ్యాయి.

సర్ప ద్రష్టుడైన బాలుని సమీపంలో ఎవరూ లేకుండా కాస్త దూరంగా పంపించేసి తను మాత్రమే అక్కడి నిలుచున్నాడు అపర్ణుడు. పాము ఎటు నుంచి వస్తుందోనని ఆందోళనతో చుట్టూ చూస్తున్నారంతా.

అశ్వం మీది ధనుంజయుడు విభ్రాంతి నుండి తేరుకోలేకున్నాడు. కాటు వేసిన పాము నిజంగా వెనక్కి వస్తుందా? వచ్చి విషాన్ని తీసుకుంటుందా? అపర్ణుడిలో అంత మంత్ర శక్తి వుందా? మతి పోయినట్టు చూస్తున్నాడు. క్షణాలు భారంగా కరిగి పోతున్నాయి.
అంత క్రితం వరకు`

రోదనతో హోరెత్తిపోయిన ఆ ప్రాంతమంతా ఇప్పుడు చీమ చిటుక్కుమన్నా విన్పించేంత నిశ్వబ్ధం అలుముకుంది. ఎవరికి వారు ఇప్పుడు ఊపిరి తీయటం మర్చి పోయి ఉత్కంఠ భరితులై చుట్టూ చూస్తున్నారు. ఇంతలో జనం వెనక తట్టు నుంచి ఎవరో అరిచారు. ‘‘అదిగో... అదిగదిగో పాము... వచ్చేస్తుంది వచ్చేస్తుంది.’’ అంటూ.

‘‘ష్‌.... నిశ్శబ్ధం’’ అంటూ హెచ్చరించాడు అపర్ణుడు.

అందరి దృష్టి ఒక్కసారిగా అటు తిరిగింది.

తండా ఉన్న చోటుకు పశ్చిమ దిక్కుగా వున్న పొదల్లో బాలుడిని కాటందుకున్న సర్పం ఎప్పుడు వెళ్ళిందో ఎలా వెళ్ళిందో గాని ఇప్పుడు తండాకు తూర్పు భాగంగా వున్న పొదల వైపు నుండి వచ్చేస్తోంది. పడగ విప్పి అంత ఎత్తున లేచి ఆడుతూ ఆగమేఘాల మీద జరజరా బిరబిరా దూసుకొచ్చేస్తోంది.

అందర్నీ మరింత విస్మయానికి గురి చేసిన విషయం ఏమంటే` అపర్ణుడు మంత్రించి వదిలిన తొండ నిజంగానే ఆ పన్నగం పడగ మీద పడుకుని తోలుకొస్తున్నట్టే వుంది. 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
atulitabandham