Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
pounch patas

ఈ సంచికలో >> శీర్షికలు >>

వీక్షణం - పి.యస్.యమ్. లక్ష్మి

                                                                                 బేడ్ లేండ్స్ 


15-8-2009 ఉదయం 10 గం. లకి బ్రేక్ ఫాస్ట్ కానిచ్చి, సౌత్ డకోటానుంచి ఇంటీరియర్ కి  బయల్దేరాము బేడ్ లేండ్స్ చూడటానికి.  అక్కడనుంచి 209 మైళ్ళ దూరం.  బేడ్ లేండ్స్ అంటే ప్రస్తుతం సారం లేని భూములు అని కదా వాటిని చూడటానికి అంత దూరం వెళ్ళాలా అని నా సందేహం.  ఈ అమెరికా వాళ్ళకి అన్నీ వింతలే .. సరే అక్కడికెళ్ళినందుకు వాళ్ళ వింతలు మనమూ చూడాలికదా సర్లే అని పరిసరాలమీద దృష్టి పెట్టాను

దోవంతా పచ్చికతో పెద్ద పెద్ద గుట్టలు ... ఆకుపచ్చ .. ఎటుచూసినా ఆకుపచ్చ .. ఆ ఆకుపచ్చలో కూడా ఎన్ని షేడ్సో  కన్నుల విందుగా వున్నది.  పంట కోశాక గడ్డిని పలచటి షీట్స్ లా చేసి గుండ్రంగా చుట్టి పొలాలలోనే పెట్టారు.

మధ్యలో 11-30 నుంచీ ఒక అరగంట ఛాంబర్ లైన్ రెస్ట్ రూమ్ దగ్గర మిస్సోరి రివర్ అందాలు చూడటానికి ఆగాము.  అమెరికాలో ఎన్ని గంటలు ప్రయాణం చేసినా అంత అలసట అనిపించదు.  నున్నటి రోడ్లమీద జారిపోతోందా అన్నట్లు సాగే కారు, ఎక్కడా ట్రాఫిక్ ఇబ్బందులు వుండవు, పక్కనుంచి అడ్డదిడ్డంగా దూసుకుపోయే వాహనాలూ వుండవు.   పైగా డ్రైవింగ్ మనది కాదుకదా ..  హాయిగా ఎంజాయ్ చేశాను.

మధ్యాహ్నం 2 గం. లకి (లోకల్ టైమ్ 12 గం. లు) బేడ్ లేండ్స్ లో ప్రవేశించాము.  ప్రవేశ రుసుము వుంటుంది.  కారుకి 15 $.  బేడ్ లేండ్స్ చూసేదేమిటని అంతకు ముందు అనుకున్నానా ..  ఎంత పెద్ద ప్రదేశమో ..  ఎటు చూసినా కొండలు, మట్టి దిబ్బలు.  కొన్ని కొండలను చూస్తే పూర్వం అక్కడ రాజ మందిరాలు, పెద్ద పెద్ద భవంతులు, అనేక శిల్పాలతో కూడిన ఆలయాలు వుండి, తర్వాత కాలంలో ప్రకృతి విలయంలో మట్టిలో కూరుకు పోయాయా అనిపించింది ఆ ఆకారాలు.

అవ్వన్నీ చూడటానికి ఓపిక కావాలికదండీ  అందుకే ముందుగా అక్కడ వున్న హోటల్ లో లంచ్ కానిచ్చాము.  ఇండియన్ టాకో (పెద్ద, లావు పూరీ మీద నూడుల్స్, కేబేజ్ తో) ఆనియన్ చట్నీలాంటి చట్నీ, క్రీం తో ఇచ్చారు.  బాగానే వున్నాయి.  (ఆవకాయలు, పచ్చళ్ళు లేకుండా పాపం రోజూ వాళ్ళీ చప్పటి తిండి ఎలా తింటారో అని జాలి పడుతూ కానిచ్చేశాను).

ఆ తర్వాత మొదలయింది సైట్ సీయింగ్. 

మొదటగా కెనడాలో వుండే ఫ్రెంచ్ వారు ఈ ప్రదేశాన్ని కనుగొన్నారు.  వాళ్ళు ఈ ప్రదేశాన్ని   “తెస్ మావైసేసే టెర్రెస్ ఎ ట్రేవెర్సర్” అన్నారు. (అంటే ప్రయాణం చెయ్యటానికి పనికి రాని నేల అని) ఆ ప్రాంతంలో వుండే ఇండియన్స్ దీనిని  “మాకో సికా” అన్నారు.  అన్నా బేడ్ లేండ్సే.

కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం అగ్ని పర్వతాలలోని లావా, దుమ్ము, ధూళిలతో సహా వచ్చి  ఈ ప్రాంతమంతా సెటిల్ అయి, ఇక్కడ వున్న రాళ్ళు, నీళ్ళతో కలిసి ఈ ఆకారాలేర్పడ్డాయి.  గట్టిగా వున్న రాళ్ళమీద తర్వాత కాలంలో ఏర్పడిన దుమ్ము, మట్టి వగైరాలు పొరలు పొరలుగా ఏర్పడ్డాయి  పొడి నేలల్లో వుండే అనేక రకాల రాతి పొరలు ఇక్కడ చూడవచ్చు.

2,44,000 ఎకరాల విస్తీర్ణంలో వున్న ఈ బేడ్ లేండ్స్ లో అనేక జీవరాసుల అవశేషాలు కనుగొన్నారు.  వీటిని బెన్ రీఫెల్ విజిటర్ సెంటర్ లో చూడవచ్చు.

ఎత్తయిన శిఖరాలతో,  నిట్ట నిలువుగా వున్న లోతైనా లోయలతో ఈ ప్రదేశమంతా  ఇప్పుడు ఇలా ఎందుకూ పనికి రాని నేల వలే వున్నది కానీ, కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం ఇక్కడ పచ్చని ప్రకృతి, జీవజాలం కూడా వుండేది.  ప్రకృతి తన శక్తులయిన గాలి, నీటితో చేసిన ఘోర విధ్వంస కాండతో ఇలా తయారయినాయి.  అయినా ప్రకృతి తన బిడ్డలమీద దయ చూపిస్తుందా అన్నట్లు ఈ బేడ్ లేండ్స్ కూడా ఎన్నో వింత అందాలతో మెరుస్తూ వుంటుంది.  అందుకే, ఈ ప్రదేశం చూడటానికి అనేక దేశాలనుంచి కూడా సందర్శకులు వస్తూ వుంటారు. ఎడారిలో అందాలు వెతికే వాళ్ళని మిమ్మల్నే చూశాననకండి...  రాతి బండల్లోనూ, మట్టి కొండల్లోనూ దాగి వున్న అందాలను ముందు మేము తీసిన ఫోటోలలో చూడండి.

ఇక్కడ ఎవరైనా ఏ అనుమతీ అవసరం లేకుండా ఎక్కడయినా తిరగవచ్చు.  అయితే అక్కడవున్న రాళ్ళు, మొక్కలు, అవశేషాలు,  జంతువులు ఏం కనిపించినా, మీరు ఫోటోలు తీసుకోవచ్చుకానీ వాటిని ఏ మాత్రం కదపకుండా మిగతా సందర్శకులు చూడటానికి అలాగే వదిలెయ్యాలి.

నడవలేని వారి కోసం ఈ స్ధలంలో 32 మైళ్ళ పొడుగైన రోడ్డు వున్నది.  ఇక్కడ తొమ్మిది వ్యూ పాయింట్స్ వున్నాయి.  వాహనాలని, సైకిల్ అయినా సరే నిర్ణీత ప్రదేశాలలో పార్క్ చెయ్యాలి.   ఈ రోడ్డు తప్ప మిగతా ప్రదేశమంతా రాళ్ళు గా వుండి, వర్షం వస్తే నడవటానికి ఇబ్బందిగా వుంటుంది.

అంతేకాదు ..  ఈ రాళ్ళు, కొండలు, ఒకటేమిటి ... ఈ ప్రదేశమంతా ఎండలోనూ, వెన్నెలలోనూ రకరకాల రంగులతో శోభిల్లుతాయి.  వెన్నెలలో ఈ ప్రదేశం అందాలు చూడాలని కొంతమంది ఇక్కడ రాత్రి కేంపింగ్ చేస్తారు.  వారికోసం సాయంకాలం కొన్ని ప్రోగ్రాంలు ఏర్పాటు చేస్తారు.

తర్వాత తీరిగ్గా  6-30 దాకా బేడ్ లేండ్స్ అంతా  కొంత నడక, ఎక్కడ పడితే అక్కడ కారు ఆపుకుంటూ, గుట్టలు, కొండలు ఎక్కుతూ దిగుతూ వీలయినంత సరదా పడ్డాము.

తర్వాత రాత్రికి కస్టర్ వచ్చి అక్కడ హోటల్ లో వేశాం మాకేంప్.

మరిన్ని శీర్షికలు
navvunaluguyugalu