Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నాగలోకయాగం

గతసంచికలో ఏం జరిగిందంటే..http://www.gotelugu.com/issue154/436/telugu-serials/nagaloka-yagam/nagaloka-yagam/

ఎప్పుడైతే సర్పం రాకడను గమనించారో మరు క్షణం అటు ప్రక్క జనం పక్కకు తొలగి దానికి దారి విడువ సాగారు. అది ఎటూ చూడకుండా జనం మధ్య నుంచే నేరుగా అపర్ణుడికి ఎదురుగా వచ్చి ఆగింది. మూడు మూరల పొడవున్న గోధుమ వన్నె కోడె వయసు త్రాచు పాము. ఎండ పొడకు మిలమిలా మెరిసి పోతోంది.

సర్పం ఆగిన వెంటనే`

అంతటితో తన బాధ్యత తీరి పోయిందన్నట్టు చెంగున నేల మీదకు దూకిన తొండ వేగంగా అక్కడి నుండి చెట్లలోకి పారి పోయింది.

తన ముందు పడగ విప్పి ఆడుతున్న సర్పాన్ని చూస్తూ, ఏదో మంత్రాన్ని చదివాడు అపర్ణుడు. ‘‘ఏమయ్యా నాగేంద్రమా! ఏమిటయ్యా ఈ పని? పొరబాటున కాలో చెయ్యో తగిలితే కాటేసి ప్రాణం తీస్తావా? తప్పుగదా. పో... నువ్వు క్రక్కిన విషాన్ని నీవే గ్రహించాలి. అది నీ విషం. త్వరగా తీసేసుకో. పో.’’ అంటూ అదలించాడు.

ఆజ్ఞా బద్ధమైనట్టు ఆ దుష్ట నాగం వెనక్కి వెనక్కి జరిగింది. బాలుడి పాదాల వద్దకెళ్ళి ఆగింది.

కను రెప్పలు వాల్చటం మర్చి పోయి చూస్తున్నారంతా. బాలుడి కుడి పాదం బొటన వ్రేలి పై భాగంలో రెండు నెత్తుటి చుక్కలు అతికించినట్టు రెండు గాట్లు కన్పిస్తున్నాయి.

ఉన్నట్టుండి పెద్ద బుస కొట్టి తలవిదిలించి కాటు వేసింది. సరిగ్గా అదే చోట గతంలో వేసిన కాటు పైనే తిరిగి కాటు వేసింది. అయితే కోరలు దించి పైకి లేవకుండా అలాగే పాదాన్ని అంటి పెట్టుకునుండి పోయింది.

క్షణాలు బరువుగా దొర్లి పోతున్నాయి.

పాములో చలనం లేదు.

ఊపిరి వదిలితే ఎక్కడ విన్పిస్తుందోనన్నంత ఉద్విగ్నభరితులై విషాన్ని వెనక్కు తీసుకుంటున్న భుజంగాన్ని చూస్తున్నారు. యువరాజు ధనుంజయుడు తను చూస్తున్నది కలో నిజమో అర్థం గానంత అయోమయంగా చూస్తున్నాడు. అపర్ణుడిలో ఇంత శక్తి వుందా. పాము మంత్రంలో ఇంత గొప్ప వాడా... ఆశ్చర్య పోతున్నాడు.

సుమారు యాభై లిప్తల కాలం కాటు వేసిన చోటు నుండి కదలకుండా అలాగే వుండి పోయింది సర్పం. అంత వరకు నీలి రంగు తిరిగిన బాలుడి శరీరంలో మార్పు వచ్చింది. క్రమంగా నీలి రంగు అదృశ్యమై శరీరం యధా పూర్వ స్థితికి చేరుకుంది. నోటి నుండి నుచ్చులు గ్రక్కటం పూర్తిగా నిలిచి పోయింది. బాలుడి ముఖం కాంతి వంతమైంది. శరీరంలోని ఆఖరి విషపు శేషాన్ని కూడ వెనక్కు తీసుకోగానే అలసి పోయినట్టు పక్కకు ఒరిగి అచేతనంగా అలాగే వుండి పోయింది సర్పం.

అపర్ణుడి హచ్చరికతో నేల పైనుండి లేపి కొంత దూరంలో ఒక నులక మంచం మీద పరుండ జేసాడు బాలుడ్ని.  కొట్టి పడేసినట్టు అచేతనంగా వున్న ఆ గోధుమ వన్నె త్రాచు నెమ్మదిగా తెప్పరిల్లి లేచే సరికి అపర్ణుడు కోడి గ్రుడ్డు, పాల ముంతను దగ్గరకు జరిపాడు.

నెమ్మదిగా గ్రుడ్డు మ్రింగిన నాగం తర్వాత ముంత లోని పాలు మొత్తం త్రాగేసి పడగ విప్పి చుట్టూ చూసింది. అపర్ణుడు మృదువుగా నవ్వాడు.

‘‘ఓ శేషమా. పిలవగానే వచ్చినందుకు కృతజ్ఞుడను. ఇకనయినా మనుషులకు హాని చేయకుండా దూరంగా సంచరించు. ఇక స్వేచ్ఛగా నీ దారిన వెడలుము. పొమ్ము.’’ అంటూ వీడ్కోలు చెప్పాడు. ఎవరినీ సర్పం వెనక పోనీయలేదు. అపర్ణుడి వీడ్కోలు తీసుకుని నెమ్మదిగా కదిలిన పన్నగం తర్వాత వేగం అందుకుని కొంత దూరం వెళ్ళి డొంకల వెనక కనుమరుగైంది. అది వెళ్ళి పోయిందని గమనించాక తల తిప్పాడు అపర్ణుడు.

నాగ దోషం మహా దోషం.


విషం వెనక్కు తీసుకుని తన దారిన పోతుండగా కోపంలో అక్కడి వారు ఎవరయినా దానికి హాని చేస్తే ఆ దోషం మంత్ర వాదికి చుట్టుకుంటుంది. అందుకే అది స్వేచ్ఛగా వెళ్ళి పోయేవరకు జాగ్రత్తగా వుండటం.

ఇంతలో నులక మంచం మీది బాలుడు నిద్రలో కదిలినట్టు ఇటు నుంచి అటు దొర్లాడు. అది చూసి తండా జనం ఆనందంతో కేరింతలు కొడుతున్నారు. తండా నాయకుడు అతడి భార్య వచ్చి తన కాళ్ళకు నమస్కరిస్తుంటే వారించాడు అపర్ణుడు. వారి కళ్ళల్లో ఆనందం తొణికిసలాడుతోంది.

‘‘మీరు పెద్ద వాళ్ళు. నా కాళ్ళకు మొక్క కూడదు. మీ కొడుక్కి ఆయుష్షు వున్నది అందుకే సమయానికి మేమిటు రావటం జరిగినది. నా చేతనైన సాయము చేసి మీ బిడ్డను బ్రతికించ గలిగాను. వాడు కాసేపట్లో లేచి కూచుంటాడు. కాచిన జావ ఆహారముగా యివ్వండి. రాత్రికి కూడ అదే యివ్వండి. చీకటి పడే లోపు వాడు నిద్ర పోకూడదు. ప్రమాదం. వాడు నిద్రంచకుండా కాపలా ఉండండి. ఇది చేస్తే చాలు. వాడికి తిరుగుండదు. లేచి కూచోగానే ఎర్ర నీళ్ళతో దిష్టి తీసి పోయండి. ఇక మేము బయలుదేరగలము.’’ అంటూ చర చరా వెనక్కి వచ్చి తన మచ్చల గుర్రం ఎక్కి కళ్ళాలు అందుకున్నాడు.

ఇంత సాయం చేసి కనీసం భోజనం కూడ చేయకుండా వెళ్ళి పోతున్నందుకు నాయకుడితో బాటు తండా వాసులంతా ఎంతో బాధ పడుతున్నారు. ఒక్క పూట ఆగి పొమ్మని అభ్యర్థించారు. వారి అభ్యర్థనను సున్నితంగా త్రోసి పుచ్చి, ధనుంజయునితో బాట మీదకు వచ్చేసాడు అపర్ణుడు. అశ్వాలు రెండూ తిరిగి రాజ మార్గం వెంట దుమ్ము తెరలు రేపుతూ దౌడు ఆరంభించాయి. అప్పటికి సంభ్రమాశ్చర్యాల నుంచి తేరుకున్నాడు ధనుంజయుడు. అపర్ణుడంటే ఏమిటో అర్థం గావటంతో ఇంకేమీ అడగ లేదు. మౌనం వహించాడు. కళ్ళ ముందు ఇంకా తండాలో జరిగిన సంఘటనే మెదలుతోంది. అతడేమన్నా అడుగుతాడేమోనని ఎదురు చూసాడు అపర్ణుడు. ధనుంజయుడు మాటాడక పోవటంతో తనూ మౌనంగానే వుండిపోయాడు. అశ్వాలు వాయు వేగంతో పరుగు తీస్తూనే వున్నాయి.

***********************************

రాజధాని రత్నగిరి నగరం.

రాత్రి సమయం.

ప్రధమ యామం జరుగుతోంది.

పశ్చిమ సముద్రం మీదుగా చల్లటి గాలులు వీచి నగర వాసుల్ని సేద తీరుస్తున్నాయి.

అది ఉప సైన్యాధ్యక్షుడైన బాహ్లీకుని నివాస గృహము. నగర మధ్యంలో ఎత్తయిన ప్రాంతంలో వుంది. సైనిక శిబిరాల నుండి అప్పుడప్పుడూ యిలా తన నిజ గృహానికి వచ్చి రెండు దినాలు వుండి వెళ్ళటం బాహ్లీకుని అలవాటు. మూడు అంతస్థులు కలిగిన ఆ నివాస గృహము ఉప్పరిగెమీద అర్ధ చంద్రుడి వెన్నెట్లో ప్రశాంతంగా కూచుని మధిర సేవిస్తున్నాడు బాహ్లీకుడు. మెత్తని ఆసనం మీద అతడు ఆసీనుడై వుండగా, అతడి కాళ్ళ దగ్గర చిన్న బల్ల పక్కనే నేల మీద చతికిల బడి వున్నాడు కరోతి.

తీవ్రంగా ఆలోచిస్తూ మనోహరమగు నగర రేతిరి దృశ్యాన్ని వీక్షిస్తున్నాడు బాహ్లీకుడు. అతడి ముఖంలో ఎందుకో అసహనం దోబూచులాడుతోంది.

ఎదురుగా తీరం వెంట నగర భవంతులు వాటికి ఆవల వెన్నెల కాంతికి ప్రతిఫలిస్తూ పశ్చిమ సముద్ర జాలాలు లంగరు వేసున్న కొన్ని ఓడలు, చేపలు పడవలు కన్పిస్తున్నాయి. ఇటు వాయువ్యంగా రత్నగిరి కొండ, కోటను చుట్టి అగడ్త, కోటలో సైనికులు వెలిగించిన దివిటీల కాంతి స్పష్టంగా కన్పిస్తోంది. సముద్ర కెరటాల హోరు ఈ రోజు అధికంగా వినవస్తోంది. దిగువన వీధిలో జన సంచారం తాలూకు సందడి కర్ణా కర్ణిగా విన వస్తోంది.

బాహ్లీకుని దృష్టి ఇప్పుడు పూర్తిగా`

దూరంగా కన్పిస్తున్న కోటపైనే వుంది.

ఆ కోటలో పాగా వేసే రోజు తనకు ఇంకెన్ని రోజులకు వస్తుంది? రత్నగిరి గద్దె మీద తను పట్టాభిషిక్తుడు ఆయే ముహూర్తం ఎప్పుడు? అనుకున్న పనులు జర జరా జరుగుట లేదే! యువ రాజు ధనుంజయుడి చావుతో తన తొలి పాదం ఆరంభం కావాలనుకున్నాడు. తన గూఢచారుల్లో సమర్థులను ఎంచి మూడు బృందాలుగా మూడు చోట్లకు పంపించాడు. ఏమి జరిగిందో గాని ఒక్క బృందం నుంచి కూడ ఇంత వరకు శుభ సమాచారం రాలేదు.

అటు చూస్తే శతానీకుడు ఏర్పాట్లు పూర్తి కావస్తున్నాయి. రత్నగిరిలో పరిస్థితి ఏమిటి? అంటూ పావురాల ద్వారా గాంధారం నుండి సందేశాలు పంపిస్తున్నాడు. యువ రాజును అంతం చేస్తే గాని తన అడుగు ముందుకు వేయ లేడు. అందుకే అసహనంగా ఉన్నాడతను. ఎప్పుడు రత్నగిరి తన వశమవుతుందా ఎప్పుడు సింహాసనం ఎక్కుతాడాని ఉవ్విళ్ళూరుతున్నాడు.

పక్కనే నేల మీద కూచున్న కరోతి కాళీ అయిన బంగారు లోటాను తిరిగి మధిరతో నింపుతూ బాహ్లీకుని నిశితంగా గమనిస్తున్నాడు.

పావు రాయిలకు తర్ఫీదునిచ్చే తన సేవకుడు కరోతిని గాంధార రాజు శతానీకుడు ఇక్కడ వదిలి పోయాక వాడు తన లౌక్యంతో బాహ్లీకునికి చాలా దగ్గరయ్యాడు. ఇప్పుడు వాడే బాహ్లీకుని అంతరంగ సేవకుడు. తన మనసులో ఆలోచనల్ని కరోతితో పంచుకొంటూ వుంటాడు. వాడి ఇచ్ఛకాలను శ్రద్ధగా వింటాడు. వాడ్ని పూర్తిగా నమ్ముతున్నాడు. ఇలా ఏకాంతంలో ఉన్నప్పుడు ఒక కరోతి మాత్రమే పక్కన వుంటాడు. ఇతర సేవకులుగాని సైనికులు లేదా సైన్యాధిపతులకు గాని ఎవరికీ అనుమతి వుండదు. ఎవరూ ఉప్పరిగె మీదకు రాకుండా దిగువనే ఇద్దరు సేవకులు వారిని ఆపేస్తుంటారు.

ఎంతటి గొప్ప వారైనా కొందరిలో ఇంతులు చెప్పెడి మాటలు వినటం, అందులో నిజానిజాలు గ్రహింపకనే నిర్ణయాలు తీసుకోవటం ఒక బలహీనతగా వుంటుంది. అలాగే స్వయం నిర్ణాయాధికారం వున్నా ఇతరుల సలహాలను పాటించే అలవాటు మరి కొందరిలో వుంటుంది. ప్రస్తుతం బాహ్లీకుడు కరోతి మాటకు అంత విలువ యివ్వటం అతడి అదృష్టమో దురదృష్టమో అతడికే తెలియాలి.

వెన్నెట్లో కూచుని మధిర సేవిస్తూ రత్నగిరి కోటనే తదేకంగా చూస్తున్న బాహ్లీకుని చూసి దరహాసం చేసాడు కరోతి.

‘‘ప్రభు! దీనికి ఇంతగా మీరు ఆలోచించాల్సిన పని లేదు. అతి త్వరిత గతిని ఆ కోట మీ వశము గాక తప్పదు. ఇలాగే ఆ కోట పైన మనం వెన్నెట్లో కూచుని మీరు మధిర సేవిస్తుంటే నేను గ్లాసు నింపకా తప్పదు.’’ అన్నాడు ఛలోక్తిగా.

కరోతి మాటలకు తనూ నవ్వాడు బాహ్లీకుడు.

‘‘మా ఆశ ఆశయము కూడ అదేనురా కరోతి. కాని ఇంకనూ మేము ఎన్ని దినములు వేచి వుండ వలెనో తెలీకున్నది. యువరాజు మరణ వార్త ఇంకనూ మనకు చేరనే లేదు. వెళ్ళిన మూడు బృందాలూ ఏం చేస్తున్నావో, ఎచట నున్నవో అర్థము గాకున్నది. శతానీకుల వారితో జరిగిన ఒప్పందము ప్రకారము నాలుగు మాసముల వ్యవధిలో ఒక నెల జరిగి పోనున్నది. ఈ పరిస్థితులో చింతింపకుండా వుండ గలనా?’’ అన్నాడు.

కరోతి విక వికా నవ్వాడు.

‘‘దీనికంత చింతయేలను ప్రభు. తమ చెంతనే ఉన్నాడుగా ఈ కరోతి.’’ అన్నాడు.

‘‘ఉండి. నీవు చెంత వుండి ఫలమేమిరా? అచట గాంధారమున మన కోసం శతానీకుల వారు సైనిక సమీకరణ గావించుచున్నారు. ఇక్కడ చూస్తే ఎక్కడ వేసిన గొంగళి అచటనే వున్నది. యువ రాజు ధనుంజయుని అంతం చేసినారో లేదో తెలియకున్నది...’’

‘‘చేయకున్న ఏమాయె ప్రభూ. మన వాళ్ళు గాకున్న ఏ ప్రమాదమో ఆయన్ని బలి తీసుకొంటుంది. వెళ్ళినది ఎక్కడికి? నాగ లోకమునకు. మరలి వచ్చుట సంభవమా? కోటలో మహారాణీ వారు రాజు గారి ఆరోగ్యం కోసమూ, కుమారుని క్షేమము కోసమూ నోములూ, వ్రతాలూ ఆచరిస్తున్నారట. కనిపించని దేవుళ్ళు వచ్చి కాపాడు వారా యేమి పిచ్చి గాని’’ అన్నాడు.

‘‘ఇంతకూ నీ మనసులో ఏముందిరా?’ కుతూహలంగా అడిగాడు బాహ్లీకుడు.

‘‘ప్రభూ! మనకు కావలసినది యుద్ధము, విజయము. ఒక నెల సమయమిచ్చి యువ రాజా వారు మరణించినారని ఇక్కడ పుకారు పుట్టించి ఆ వెంటనే శతానీకుల వారిని ససైన్యంగా తరలి రమ్మని యువరాజు అంతమైనాడని పావు రాయి ద్వారా సందేశం పంపించేద్దాము. చాలు. యుద్ధం తథ్యం.’’ అన్నాడు కరోతి.

వాడి మాటలు బాహ్లీకునకు కొంత వూరట నిచ్చాయి. యుద్ధానికి ముందే యువ రాజు తిరిగి వస్తే కొంత ఇబ్బంది తప్పదు గాని ఆరంభమయ్యాక వస్తే ఏమీ చేయ లేడు. లేదా ఈలోపే తన మనుషులు అతడ్ని అంతం చేయ వచ్చు. కరోతి మాటలకు సమ్మతిస్తున్నట్టు తల వూపాడు బాహ్లీకుడు.

**************************************

నాగలోకం.

నాగ రాజు మహా పద్ముడి రాజ మందిరం.

మందిర అంతర్భాగం అంతటా మణి మయ రత్న కాంతులతో ధగ ధగాయ మానంగా మెరిసి పోతోంది. అది నాగ రేడు సభా మందిరానికి బయలుదేరు సమయం. ఆయన దేవేరి కీర్తి మతి కూడ పక్కన వుంది. ఆ సమయంలో`

యువ రాణి ఉలూచీశ్వరి బిర బిరా ఆ మందిరం లోనికి ప్రవేశించింది. హఠాత్తుగా తమ గారాల పట్టి రాక ఆ నాగ దంపతులకు విస్మయం కలిగిలించింది. ఆయిననూ`

‘‘రమ్ము పుత్రీ! తక్క సమయమున కేతెంచినావు’’ అంటూ దరహాసంతో పలికాడు నాగ ప్రభువు.

‘‘తక్క సమయమా! అది యేమి జనకా?’’ చెంతకు వస్తూ తన విస్మయాన్ని ప్రకటించింది ఉలూచీశ్వరి.

‘‘అవును తల్లీ. తక్క సమయమే. ఇప్పుడే... నీ వివాహము గూర్చి చర్చించుకొంటిమి. నీ కొరకు తగిన వరాన్వేషణ ఆరంభించనున్నాము’’

‘‘వరాన్వేషణా... నా కోసమా... క్షమించండి తండ్రీ. నా పరిణయమున కిది తరుణము గాదు. ఇప్పుడే నాకు వివాహేచ్ఛ లేదు. నేను వచ్చిన పని వేరే యున్నది.’’

ఆ మాటకు ముఖ ముఖాలు చూసుకుని మరిపెంగా నవ్వుకున్నారు రాజ దంపతులు. ‘‘నీ వయసు నీకు తెలియకున్నది పుత్రీ. నీ విపుడు బాలికవు గాదు. యుక్త వయస్కురాలివి. నీ వివాహము వైభవోపేతముగా జరిపించుట మా బాధ్యత గదా! ఒక వేళ నీ మనసుకు నచ్చిన నాగ కుమారుడుంటే సంశయింపక జెప్పుము. నీవు వరించిన ఆ అదృష్టవంతునికే యిచ్చి మీ పరిణయము గావించెద’’ అన్నాడు.

‘‘లేదు లేదు జనకా. నా మనసున ఎవరును లేరు’’ అంది వెంటనే. కాని ఆమె మనసున రత్నగిరి రాకుమారుడు మెదలుతున్నాడు. ఆ విషయం చెబితే తండ్రి తనను నాగ లోకము నుండి బయటకు పోనీయడని తెలుసు. తిరిగి తండ్రి మాటలతో ఆలోచనల నుంచి బయట పడి అటు చూసింది.

‘‘సంతోషము. నీ మనసున ఎవరును లేకున్న ఏమాయె. మేము ఎంపిక జేసిన వరుని వరింప వచ్చును. ఇంకను సమయమున్నదిలే. ఇంతకూ నీవు వచ్చిన పని యేమి?’’ నుదురు ముడుతలు పడుతూండగా సూటిగా చూస్తూ అడిగాడు నాగ రాజు.

‘‘జనకా! తమ అనుమతి కోరి వచ్చితి’’ మృదువుగా పలికింది ఉలూచీశ్వరి.

‘‘మా అనుమతియా? ఎందులకు?’’

‘‘వింధ్యాటవిలో వన విహారము జేయ మనసైనది జనకా. మీరు అనుమతిచ్చిన, చెలులతో పోయి వచ్చెదను’’

ఒకింత అసహనంగా కుమార్తెను చూసాడు నాగ ప్రభువు.

‘‘వలదు వలదు పుత్రీ. ఇందులకు సమ్మతించు వాడను గాను.’’ అన్నాడు వెంటనే.

తండ్రి అభ్యంతరము చెప్పటంతో`

ఒకింత నిరాశకు గురైంది యువ రాణి. అయినా వెంటనే తేరుకుని`

‘‘తండ్రీ! ఇందుకు అభ్యంతరమేమున్నది? మీరు అనుమతింప వలె’’ అంది ధైర్యం తెచ్చుకుంటూ.

‘‘ఎటుల అనుమతింప గలను? నీవా తరుణ వయస్కవు, చిన్న పిల్లవు గావు. ప్రమాదములతో కూడిన వన విహారములకు ఆడపిల్లలు మీరు పోనేల? అదియును గాక ఢాకినీ వనముల విహరించి వచ్చి పది దినములు కాలేదు తిరిగి వింధ్యాటవికేల పోవలె. వలదు వలదు.’’ అన్నాడు అయిష్టంగా.

‘‘వింధ్యాటవి ఈ ఋతువున కడు రమ్యముగ ఉండునట. ఈసారికి అనుమతించరూ?’’ బుంగ మూతిపెట్టి తల్లి కీర్తి మతిని చూస్తూ తండ్రిని అభ్యర్థించింది.

కుమార్తె అభిప్రాయము గ్రహించిన రాణి కీర్తి మతి భర్త భుజం మీద చేయి వేస్తూ` ‘‘ పోనిండు ప్రభు! వెళ్ళిన ప్రతి సారీ క్షేమము గనే వచ్చుచున్నారు గదా. వెంట చెలులుండనే వుంటారు. ఈ సారికి వెళ్ళి రానిండు. ఈలోపల మనము వరాన్వేషణ గావించి వరుని ఎంపిక జేసి ఉంచెదము గాక. ఏమందురు?’’

ఎంతయినా మహా రాణి మాట తోసి పుచ్చ లేడు గదా. ఆమె సలహా సబబు గానే తోచింది నాగ రేడుకి. తల పంకించి కుమార్తె వంక చూసాడు.

‘‘సరి. ఇంతగా వేడుకొంటున్నావు గాబట్టి ఈ సారికి కడు భద్రముగా పోయి రమ్ము. తుదపరి నీ వివాహమే.’’ అన్నాడు నవ్వుతూ.

తండ్రి అనుమతి లభించటంతో`

ఆనందంతో పొంగి పోయింది ఉలూచీశ్వరి.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
kadali