Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
beauty of rajastan   6th part

ఈ సంచికలో >> శీర్షికలు >>

అవీ - ఇవీ - భమిడిపాటి ఫణిబాబు

మాటపధ్ధతిలో తలొకరిదీ తలో పధ్ధతి. కొంతమంది ఉన్నదేదో మొహంమీద చెప్పేస్తే గొడవొదులుతుందీ అనుకుంటారు. కొంతమందైతే, లౌక్యంగా సందర్భాన్ని బట్టి మాట్టాడుతూంటారు. వీళ్ళని నమ్మాలో నమ్మకూడదో తెలియదు. ఎక్కడలేని ఆప్యాయతా చూపించేస్తూంటారు. అలా తీసికుంటే, మొహమ్మీద ఉన్నదేదో చెప్పేవాళ్ళే నయం అనిపిస్తూంటుంది., మహా అయితే వాళ్ళమాట మనకి కటువుగా అనిపించొచ్చు. అంతకంటే నష్టం లేదు. అటుపైన స్నేహం కొనసాగించాలంటే, ఉంచడం, లేకపోతే ఎవరి దారి వారు చూసుకోవడం.. కటువుగా అనిపించడం మాట అటుంచి, కొంతమందైతే అసందర్భంగా మాట్టాడతారు. అలాటప్పుడు కటువుమాట అటుంచి,  పక్కనుండేవాళ్ళకి అసహ్యం కూడా వేస్తుంది.. ఉదాహరణకి , ఎవరింటికైనా వెళ్ళినప్పుడు, అక్కడ ఏదో అనారోగ్యంగా ఉన్న ఆ ఇంటి సభ్యుడిని , ఏదో నాలుగు మంచిమాటలు చెప్పి ఉత్సాహ పరచాలి అంతే కానీ, ఈయనకొచ్చిన అనారోగ్యాన్ని చిలవలూ పలవలూ చేసి, తాను ఇదివరకు చూసిన కేసుల్లో ఎన్ని “ టపా “ కొట్టేశాయో, చెప్పి భయపెట్టేయకూడదు. లేనిపోనివన్నీ ఊహించేసికుని మరీ బేజారెత్తిపోతారు. సాధ్యం అయితే.. “ దీనికేముందండీ ఇదో పెద్ద అనారోగ్యమా.. ఆమధ్యన మాకు తెలిసినవాళ్ళొకరికి ఇలాగే వస్తే.. సర్జరీ చేయించారు.. ఓ వారం రోజులు రెస్టు తీసికుని ఇప్పుడు దసరా బుల్లోడిలా తిరుగుతున్నాడు…ఏం కంగారు పడకండి..”. ఇంట్లోవాళ్ళకీ, ఆ పేషంటుకీ కూడా  ఉత్సాహంగా ఉంటుంది.



సాధారణంగా పెళ్ళిళ్ళు నిశ్చయించే మధ్యవర్తులతో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మామూలుగా మధ్యవర్తంటేనే రెండు పార్టీలకీ తెలిసినవాడై ఉంటాడు.. వీళ్ళు మహ డేంజరస్ ప్రాణులు. రెండు పార్టీల సెహబాసీ సంపాదించాలని, చివరకి ఇద్దరి కొంపా ముంచుతూంటారు.. ఈరోజుల్లో అసలు ఆ గొడవే లేదనుకోండి. ఆ తిప్పలేవో “ వివాహ వేదికలే” చూస్తున్నాయి.. అలాగే, ఏ ఇల్లైనా, స్థలమైనా లావాదేవీలకి  ఏజంట్లని ఉంటారు. మధ్యలో వాళ్ళకొచ్చే కమిషన్ మీదే వాళ్ళ దృష్టంతా.

ఇంకొంతమందుంటారు.. అవతలివారు ఎంతో ఉత్సాహంగా చెప్పినవాటిని, పూర్తిగా వినకుందానే, నీళ్ళు చల్లేస్తారు. అసలు అవతలివారిని మాట్టాడనీయరు. మొత్తం తానే dominate  చేసేయడం..  ఇలాటివన్నీ చేస్తూన్నప్పుడు మనకి తెలియదు. కానీ ఇంటికెళ్ళిన తరువాత, భార్య… “ మీరు మరీ అలా అనకుండా ఉండవలసిందండీ..” అంటుంది. పోనీ అప్పుడైనా తన పధ్ధతి మార్చుకుంటాడా.. అబ్బే తనేమిటి నాకు చెప్పడం ఏమిటీ, అనే కానీ, అవతలివారికి ఎంత బాధనిపించిందో మాత్రం తట్టదు.  అందులోనూ ఈమధ్య అంతర్జాలం ధర్మమా అని, ప్రతీవారికీ , తెలివితేటలు ఎక్కువైపోతున్నాయి. ఏదో మొహమ్మాటానికి వింటారు కానీ, ఆమాత్రం అవతలివారికి మాత్రం తెలియకా ఏమిటీ ?
  వీరందరినీ మించినవారు కొంతమందుంటారు—ఒక్కమాట మాట్టాడరు. అన్నీ వింటూంటారు, విన్నవాటిని ఆకళింపు చేసుకుంటారు. అవసరమనిపించినచోట వాళ్ళు చెప్పేదేదో చెప్పేస్తారు…

ఇంకొంతమందుంటారు – అబధ్ధాలని అలవోకగా, మంచినీళ్ళప్రాయంగా చెప్పేస్తూంటారు. వారుమాత్రం ఏం చేస్తారు చిన్నప్పటి అలవాటాయె.. ఉద్యోగం లో  ఏ క్రికెట్ మాచ్చో చూడ్డానికి, ఇంట్లో ఉండే ఎవరికో అనారోగ్యమనో, వీలునిబట్టి పోయారనో కూడా చెప్పగలిగే సమర్ధులు.. అప్పు కావాలంటే లక్ష అబధ్ధాలు చెప్పగలరు. కానీ ఈ అబధ్ధం అన్నది ఎంతోకాలం నిలవదు. వీటితో వచ్చిన గొడవేమిటంటే, ఒకే విషయం గురించి, వేరు వేరు వారితో, తలో రకమైన అబధ్ధమూ చెప్పిన పాపం.. ఎవరితో ఏం చెప్పాడో ఛస్తే గుర్తుండదు.. చివరకి ఏదో రోజున వీధిన పడతాడే. అలాగే భార్యాభర్తలు కూడా తమ విషయాలను ఇంకోరితో పంచుకున్నప్పుడు ఒకే మాటగా ఉండాలి..  అలాకాకుండా ఎవరిదారినవారు, అత్యోత్సాహం ప్రదర్శించి, ఉన్నదాన్ని అతిగా చెప్పడం మొదలెడితే అదో గొడవ.అసలు ఉన్నదున్నట్టే చెప్పేస్తే గొడవే ఉండదుగా, కానీ చాలమంది ఆచరణలో పెట్టడానికి బధ్ధకిస్తూంటారు.

పైగా ఈ అబధ్ధాలు చెప్పేవారు, పురాణాలలోని శ్లోకాలు  గుర్తుచేస్తూ.. “ ఫరవాలేదండీ, ఏదైనా అవసరానికి అబధ్ధం చెప్పడంలో తప్పేమీలేదు”  అని సమర్ధించుకుంటారు కూడానూ.. హాని కలగనంతవరకూ పరవాలేదు. కానీ, పెళ్ళి సంబంధాల విషయం లో, ఈ అబధ్ధాలే కొంప ముంచుతూంటాయి. “ తాంబూలాలిచ్చేశారు కొట్టుకు చావండీ  “ అంటే కుదురుతుందా? అయినా ఈ సందర్భాల్లో,  ఉన్నదున్నట్టుగా చెప్పేవారు బహు తక్కువ.. చెప్పేస్తే ఏం గొడవొస్తుందో అని భయం. అందుకేనేమో ఇదివరకటిరోజుల్లో అటు ఏడు తరాలూ, ఇటు ఏడుతరాలూ చూసుకుని మరీ  తాంబూలాలుచ్చుకునేవారు.. ఈరోజుల్లో అంతా “ కట్టె కొట్టె తెచ్చె..” లాగ, ఏడు తరాలమాట దేవుడెరుగు, ఏడు గంటల్లో, పెళ్ళి పూర్తిచేసి, టింగురంగామంటూ విమానం ఎక్కేయడం…

సర్వేజనా సుఖినోభవంతూ…

మరిన్ని శీర్షికలు
pounch patas