Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
saradanandam

ఈ సంచికలో >> శీర్షికలు >>

అవీ - ఇవీ - భమిడిపాటి ఫణిబాబు

 

సాధారణంగా కోపం రాని మనుషులుండరు. ఎంతైనా ఉప్పు, కారం తింటున్నాము కాబట్టి  కోపం రావడం సహజమే. ఏదో పెద్ద కారణం ఉండదు ఈ కోపం రావడానికి. అవతలివాడు చేసిన పనికో, వాడు మాట్టాడిన మాటలకో కోపం వచ్చేస్తూంటుంది. కొంతమందికైతే ఓ కారణం కూడా అక్కర్లేదు. అదో హాబీలాగ, ప్రతీదానికీ చిరాకు పడుతూంటారు. అదో జరుగుబాటు రోగం లెండి. ఉద్యోగంలో ఉండి, డబ్బులు తెస్తూన్నవరకూ, అదో వారి జన్మహక్కనుకుంటారు… అయినా రిటైరయిన తరువాత వీళ్ళ అలకలు ఎవరు భరిస్తారూ? మహా అయితే కట్టుకున్నావిడ భరించాలి. అది కూడా కొంతకాలం వరకే. కాలక్రమేణా,  ఇంటి పరిపాలనా పగ్గాలు ఆవిడ చేతిలోకి వెళ్ళిపోతాయే కదా. అప్పుడు చూడాలి, ఎప్పుడు పడితే అప్పుడు కోపతాపాలు వస్తే, పీక్కోడానికి నెత్తిమీద జుట్టుకూడా ఉండదు. పోనీ పళ్ళైనా కొరుక్కుందామనుకుంటే, అవి కూడా, ఏదో “ అలంకారార్ధం గంధం సమర్పయామి “ లాగ, నామ మాత్రమే.

కొన్నిరకాల కోపాలు  ఒక్కొక్కప్పుడు  “ కక్ష” ల్లోకి కూడా దిగి , హత్యలకి దారితీస్తూంటాయి. అయినా ఇప్పుడు ఆ గొడవలెందుకులెండి, హాయిగా, తాటాకు మంట లా అలా వచ్చి, ఇలా గుప్పున ఆరిపోయే వాటిగురించే మాట్టాడుకుందాము. . పసిపిల్లల్లో వచ్చేకోపాలు ఈ కోవకే చెందుతాయి. ఏదో అడుగుతాడు, వాడికి ఇవ్వకపోతే, కోపంవచ్చేసి, కాళ్ళూ చేతులూ కొట్టేసికుంటూ, నానా అల్లరీ పెట్టి, గొంతుకచించుకుని ఏడ్చేస్తాడు. ఏదో మొదట్లో ఆ తల్లో, తండ్రో దగ్గరకి తీసికుని,  ఊరుకోపెట్టి , మొత్తానికి వాడిని నవ్విస్తారు.వాడిక్కావాల్సింది ఇచ్చేయగానే, టక్కున ఏడుపాపేసి, నవ్వుతాడు. కానీ వాడికి ఓ విషయం తెలుస్తుంది. ఏదైనా కావాల్సొచ్చినప్పుడు ఇదో అస్త్రం అని. కానీ ఇంట్లోవాళ్ళకీ వీడి కిటుకు అర్ధం అవుతుంది. దానితో ఇంకోసారి అలా చేసినప్పుడు, ఏమీ పట్టించుకోకుండా,  వదిలేస్తారు. ఏడ్చి, ఏడ్చి వాడే పడుక్కుంటాడు. చిత్రం ఏమిటంటే, జరిగినదేమీ గుర్తురాదు.. హాయిగా నవ్వుతూ ఆడుకుంటాడు..

ఈ రోజుల్లో, అందరూ కాకపోయినా, కొంతమంది , అమ్మానాన్నల ప్రమేయం లేకుండా, ఎవరినో ప్రేమించానని, చెప్తాడు. అదేం చిత్రమో కానీ, నూటికి 90 పాళ్ళు, ఆ విషయం, తల్లితండ్రులకి మింగుడు పడదు.  ముందే ఆవిషయం తమకు చెప్పలేదనో, లేదా లక్షల్లో వచ్చే కట్నం చెయ్యిజారిపోయిందనో, కారణం ఏదైతేనే, తల్లి మాటెలా ఉన్నా, తండ్రి, గయ్యిమంటాడు..  మరీ సినిమాల్లోనూ, కథల్లోనూ అయినట్టు.. “ నాకు అసలు కొడుకేలేడనుకుంటానూ…నా ఆస్థిలో చిల్లిగవ్వకూడా దక్కదూ…నువ్వులు వదిలేస్తానూ.. జంధ్యాలు తెంపేసుకుంటానూ..” అనేటంత భారీ డయలాగ్గులకి రోజులు కావుఇవి. ఈరోజుల్లో, ఏ కొడుకూ , తండ్రి ఆస్థిమీద ఆశపడటం లేదు. వస్తే సరే సరి, లేకపోయినా ఫరవాలేదనే స్థాయికి వెళ్ళారు పిల్లలు. తమాషా ఏమిటంటే, పెళ్ళి చేసుకుని, ఏ విదేశాలకో వెళ్ళి, ఆ తరువాత, తల్లితండ్రులకి ఫ్లైట్ టిక్కెట్లు పంపగానే, ఆ కోపం కాస్తా హూష్ కాకీ అయిపోతుంది. ఈమాత్రందానికి అంత హడావిడెందుకో అర్ధం అవదు. ఇదో రకం కోపం.

ప్రతీ ఇంట్లోనూ, తప్పనిసరిగా భార్యాభర్తలకి తగాదాలు వచ్చి, కోపాలు తెచ్చుకునే సందర్భాలు కోకొల్లలు. ఉదాహరణకి, ఏ ఫంక్షనుకో బయలుదేరడానికి, భర్తగారు, తనకున్న కొద్దిపాటి బట్టల్లో ఒకటి వేసికుని, ముస్తాబవుతాడు. తీరా బయలుదేరేముందు.. ఇంటావిడ “ అదేమిటండీ, మళ్ళీ అదే వేసికున్నారూ? కిందటిసారి  అదేదో పెళ్ళిక్కూడా అదే వేసుకున్నారూ… మార్చి ఇంకోటేసుకోండి..”  అంతే, భర్తగారికి కోపం వచ్చేస్తుంది. “నా ఇష్టం వచ్చింది వేసుకుంటాను… నాకేమైనా బీరువానిండా బట్టలా ఏమిటీ..నీలాగ  (మళ్ళీ ఈమాటెందుకో ). అయినా తెలియకడుగుతానూ, ఎవరెవరే బట్టలు వేసికున్నారో చూడ్డమే పనా వాళ్ళకీ… “. అంటాడు. కానీ చివరకి మార్చుకుంటాడు.. అలాగే, ఖాళీగా ఉన్నప్పుడు, ఓ పాతగుడ్డ తీసికుని, ఇంట్లో ఉండే ఫ్రిజ్జీ, టీవీ, అద్దాలూ తుడుస్తాడు. ఆ పనికి గుర్తింపు కూడా ఉండకపోవడమే కాకుండా, భార్య మళ్ళీ తుడవడం ప్రారంభించేసరికి, ఈ భర్తగారికి కోపం వచ్చేస్తుంది. ఇప్పుడే కదా చచ్చేట్లు తుడిచానూ, మళ్ళీ మొదలెట్టావూ.. అంటూ.  ఇందులో తెలిసికోవలసిన “ నీతి “ ఏమిటయ్యా అంటే, ఎప్పుడో పౌర్ణానికీ, అమావాశ్యకీ  ఇంటిపనులు చేద్దామని అనుకోవడమే కాదు, భార్య చూస్తూండగా చేస్తేనే ఉభయతారకం. లేకపోతే ఇలాటివి జరుగుతూంటాయి.. పోనీ ఆరేసిన బట్టలు మడతపెడతామా, తప్పనిసరిగా, మనం పెట్టిన మడత ఛస్తే సరిపోదు., మళ్ళీ తనూ ఓ చెయ్యివేయాలే. ఇలాటప్పుడు కోపాలు రావడం  ప్రకృతి సిధ్ధమే కదా…కానీ ఇవన్నీ తాటాకు మంటల్లాటివి, అలా వచ్చి ఇలా ఆరిపోతాయి. దానికేమీ పెద్దకారణం ఉండదు—ఉత్తిపుణ్యాన్న ఈ వయసులో, అలకలూ, కోపాలూ తెచ్చుకుంటే  రోజులు గడుస్తాయా, ఆప్యాయంగా, ప్రేమతో రెండు ముద్దలు పెట్టాలంటే , ఆ భార్యే గతి.. ఈ రహస్యం తెలిసినవాడెవడూ  తీరికూర్చుని కోపాలు తెచ్చుకోడు…

సర్వే జనా సుఖినోభవంతూ…

మరిన్ని శీర్షికలు
pounch patas