Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

అతులితబంధం

 

గతసంచికలో ఏం జరిగిందంటే....http://www.gotelugu.com/issue157/447/telugu-serials/atulitabandham/atulitabandham/

మమతా, మధుబాలా త్వరగానే దగ్గరయిపోయారు. ఆఫీసులో మరో ఇద్దరు లేడీ కొలీగ్స్ ఉన్నారు. అందరూ ప్రతీ రోజూ కలిసి లంచ్ చేస్తారు. మాటల మధ్యలో తెలిసింది, మమత తెలుగు అబ్బాయినే ప్రేమించి పెళ్ళి చేసుకుందని. 

“అయితే మీ ఇంట్లో భారతీయత వెల్లివిరుస్తుంది అన్న మాట! ఇంచక్కా ఉత్తరదేశపు  పండుగలూ, వంటలూ, దక్షిణ దేశపు పండుగలూ వంటలూ... భలే భలే...” చిన్నపిల్లలా కేరింతలు కొట్టింది మధుబాల. ఆమె సంతోషం చూసి తానూ నవ్వేసింది మమత. మధుబాల ఉద్యోగంలో బాగా స్థిరపడిపోయింది. చక్కని అంకితభావంతో పని చేయటం వలన ఉన్నతాధికారుల మెప్పునూ, మన్ననలనూ పొందింది. మమత కూడా పని బాగా నేర్చుకొని తెలియనివి కొలీగ్స్ ని, మధుబాలనూ అడుగుతూ బాగానే పని చేయసాగింది. మధ్యలో రెండు మూడు సార్లు ఇంటికి వెళ్ళి వచ్చింది మధుబాల. అనంతరామయ్య బాగా కోలుకుని తిరిగి ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. గిరి భార్య నిర్మలకు నెలతప్పింది. మళ్ళీ ఇంట్లో ఆనంద వాతావరణం నెలకొంది. గిరి మధుబాలకు సంబంధాలు చూస్తూనే ఉన్నాడు. చదువుకున్న చెల్లెలికి మంచి ఉద్యోగంలో ఉన్న వరుడిని, అదీ ఆమె పని చేసే ఊళ్లోనే  చూడాలని అతని తాపత్రయం.

ఒకసారి మమత ఎందుకో వరుసగా రెండు రోజులు ఆఫీసుకు రాలేదు. ఎప్పుడో గానీ సెలవు తీసుకొని మమత తనకు ఏమీ చెప్పకుండా మానేయటంతో ఆమె మొబైల్ కి ఫోన్ చేసింది మధుబాల. రెండు మూడు సార్లు రింగ్ అయినా ఎవరూ తీయలేదు. మమత ఇంటికి ఎప్పుడూ వెళ్ళే సందర్భం రాలేదు. అందుకనే, ఆమె ఆరోగ్యం బాగాలేదేమో అని కొంత కంగారు పడినా, అడ్రస్ వెదుక్కుంటూ వెళ్ళటం కష్టమని ఊరుకుంది. వరుసగా ఫోన్ కాల్స్ చేస్తూనే ఉంది. రెండో రోజు ఫోన్ పూర్తిగా స్విచ్ ఆఫ్ అని వచ్చింది.

మూడో రోజు ఆఫీసుకు వచ్చింది మమత. చాలా నీరసంగా కనబడింది. 

“ఏయ్ మమ్మూ? ఏమిటిది చెప్పా పెట్టకుండా మానేసావు? వంట్లో బాగాలేదా? అయ్యో, ఇదేమిటి, ఇలా స్కార్ఫ్ కట్టుకున్నావు?” కంగారుగా అడిగింది మధుబాల.

“బాగా జ్వరం వచ్చి తగ్గింది మధూ...అంత కన్నా ఏం లేదు. కొద్దిగా చలిగా, జలుబుగా ఉందని స్కార్ఫ్ కట్టుకున్నాను...” చెప్పి పనిలో జొరబడింది మమత.

మధ్యాహ్నం లంచ్ టైం లో కూడా తాను తెచ్చుకున్న బ్రెడ్ ముక్కలే తిన్నది మమత. 

సాగర్ లాల్ దగ్గర సెలవు తీసుకుని బాగ్ తీసుకుని మధుబాల బయటకు వచ్చేసరికే చిరుచీకట్లు ముసురుకుంటున్నాయి. ఆఫీసు బయట ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్టుగా  నిలబడి ఉన్నది  మమత. 

“అయ్యో, మమతా ఏమిటింకా ఇంటికి వెళ్ళలేదా? మీ వారు రాలేదా?” కంగారుగా అడిగింది.

“నేను నీకోసం ఎదురు చూస్తున్నాను... నేను... నేను... నీతో మీ ఇంటికి రానా?” మొహమాటంగా అడిగింది మమత.

“అయ్యో, మహారాణీ లా... రా వెళదాం...” తన స్కూటర్ని పార్కింగ్ లోంచి బయటకు తెచ్చి, హెల్మెట్ సర్దుకుంటూ ‘ఎక్కు...’ అంది వెనకసీటు చూపించి. ఎక్కి సర్దుకు కూర్చుంది మమత.

రెండు కిలో మీటర్ల దూరంలో ఉన్న మధు ఇంటికి చేరటానికి పది నిముషాల కన్నా ఎక్కువ సమయం పట్టలేదు.  స్కూటర్ పెట్టేసి, లిఫ్ట్ లో తన ఫ్లాట్ కి చేరుకుంది మధుబాల, మమతతో సహా.తాళం తీసి లోపలికి  అడుగు పెట్టి, “రా మమ్మూ, ఇదిగో ఇదే మన చిట్టి సామ్రాజ్యం!” అంది కుర్చీ చూపిస్తూ.సింపుల్ గా ఉన్నా అన్నీ అందంగా అమర్చుకుంది మధుబాల. గోడలో అమర్చిన అరల్లో బొమ్మలూ, అలంకరణ వస్తువులూ, పుస్తకాలూ ఉన్నాయి. 

“అమ్మో, ఎన్ని పుస్తకాలు? నువ్వు బాగా చదువుతావు కదూ?” అంది మమత.

“అవును మమ్ము, పుస్తకాలుంటే ఇంక తిండీ, నీళ్ళూ అక్కరలేదు. మా ఐశూ నేనూ చదివి బాగా డిస్కస్ చేసుకునే వాళ్ళం...” నవ్వి, “కూర్చో మమ్మూ, మనిద్దరం తినటానికి ఏమైనా చేస్తాను...” అని వంటగదిలోకి నడిచింది. 

పది  నిమిషాల్లోనే  ‘అటుకుల ఉప్మా’ ప్లేట్స్ తో వచ్చింది. 

“వేడి వేడిగా తినెయ్... ఇంకా చలేస్తోందా? ఆ స్కార్ఫ్ తీసెయ్ మమ్మూ...” తనే లాగబోయి అది పక్కకి జరిగి ఆమె తెల్లని చెంప కనబడటంతో చిన్నగా  అరిచింది అప్రయత్నంగా.

తెల్లని చెంప మీద గోళ్ళతో రక్కిన రక్కుళ్ళు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. ఆమె చెక్కిలి ఎర్రగా కందిపోయింది. అకస్మాత్తుగా ఆ చిరుగాయాలకు చల్లని గాలి తగలటంతో నొప్పిగా అనిపించి, “అబ్బా...” అని మూలిగింది మమత.

“అయ్యో, ఏమిటి? ఏమిటిది మమతా? ఎవరు చేసారు ఈ గాయాలు?” త్వరత్వరగా వెళ్లి అరలోంచి ఆయింట్ మెంట్ తీసుకు వచ్చి మృదువుగా బుగ్గ మీద రాసింది మధుబాల.

శుష్కంగా నవ్వింది మమత. 

“ఎవరేమిటి మధూ? నా పతిదేవుడే... ఈరోజు అందుకే నీ దగ్గరకు వచ్చాను. నా జీవితంలోని కొన్ని చేదు పుటలను పరిచయం చేయాలని...”

“నిజమా? నేను నమ్మలేకపోతున్నాను...” అప్రయత్నంగా మధు కళ్ళలో నీళ్ళు నిండాయి.

“ఛ! నాకోసం నీవు బాధ పడకు మధూ...”

“సరే మమ్మూ, తర్వాత మాట్లాడుకుందాం. బాగా నీరసంగా ఉన్నావు, ముందు ఇది తీసుకో, తర్వాత వేడిగా కాఫీ తాగుదాం...” తనను తాను  సంబాళించుకుంటూ చెప్పింది మధుబాల. మౌనంగా ఫలహారము, కాఫీలు ముగిసాయి.

“మమతా, ఇప్పుడు చెప్పవే... అసలు ఏం జరిగింది?” దీర్ఘంగా నిట్టూర్చి చెప్పటం మొదలుపెట్టింది మమత.

“మీ ఊరిలో టెంత్ రాసేయగానే మా నాన్నగారికి బదిలీ అవటంతో హైదరాబాద్ వచ్చేసాం. ఇంటర్ మీడియట్ మంచి మార్కులతో పాసై, ఇంజినీరింగ్ లో జాయిన్ అయ్యాను. అక్కడే నాకు నరేంద్ర పరిచయం అయ్యాడు. చక్కగా పాడే నరేందర్ గానమాధుర్యానికి నేను వశురాలను అయిపోయాను. పరిచయం స్నేహంగా, స్నేహం ప్రణయంగా రూపు దిద్దుకోవటానికి ఆట్టే సమయం పట్టలేదు. ఇద్దరం డిగ్రీ రాగానే వివాహం  చేసుకోవాలని నిర్ణయం చేసుకున్నాము.

అయితే మా కాలేజీ విద్యార్థులు ఎవరో మా నాన్నగారికి మా విషయం తెలియజేసారు. మా నాన్నగారు నన్ను పిలిచి సౌమ్యంగానే నరేంద్ర గురించి అడిగారు. నేనతన్ని గాఢంగా ప్రేమిస్తున్నానని, ఒప్పుకుంటే పెద్దల ఆశీర్వాదంతో లేకుంటే గుడిలో దేవుడి ఆశీర్వాదంతో మా పెళ్ళి జరుగుతుందనీ చెప్పాను. అయితే అందరు తండ్రుల్లా ఆయన కోపం తెచ్చుకోలేదు. నరేంద్ర గురించి తాను వాకబు చేసాననీ, అతనంత యోగ్యుడు కాదనీ, నేను డ్రాప్ అవటం మంచిదనీ చెప్పారు.

నీకు తెలుసు కదా, మనం చిన్నప్పుడు పంచతంత్రంలో చదువుకున్నట్టు ‘పోగాలము దాపురించిన వాడు మిత్రుని మాటను, అరుంధతినీ, దీప నిర్వాణ గంధమునూ వినడు, కనడు, మూర్కొనడు’ అని... నాన్నగారి హితోక్తులు నా చెవికెక్క లేదు. ఆయన మౌనంగా తన అసమ్మతిని తెలియజేసి, నాకు కొంత డబ్బు ఇచ్చి ఇంట్లోంచి వెళ్ళిపొమ్మని చెప్పారు. నేను ఆ డబ్బు వద్దని అనలేదు. ఇంకా ఉద్యోగాలు సంపాదించుకోలేని మాకు ఆ డబ్బు ఎంత ఉపయోగమో నాకు తెలుసు. ఆర్యసమాజ్ పద్ధతిలో, కొంతమంది మిత్రుల సహకారంతో  మా వివాహం జరిగిపోయింది. ఇద్దరం చిన్న ఇల్లు తీసుకుని కాపురం పెట్టాం. నవ్వులు పువ్వులతో కాపురం మొదలైంది.

మంచి మార్కులతో డిగ్రీ పాస్ అయిన మేమిద్దరం ఉద్యోగాన్వేషణలో పడ్డాం. ప్రతీ పోటీ పరీక్షకూ కలిసి చదువుకొని,  ప్రిపేర్ అయి వెళ్ళి బాగా రాయాలని, పాసై, ఇంటర్వ్యూలలో కూడా జయం సాధించి మంచి జాబ్ లు సంపాదించాలని ఎన్నెన్నో కలలు కనేదాన్ని. నేను జాగ్రత్తగా చదువుకుంటూ, తననీ రమ్మంటే వచ్చే వాడు కాదు. ఫ్రెండ్స్ తో ఏదో ప్రోగ్రాం ఉందంటూ వెళ్ళిపోయేవాడు. 

పోనీ నేను కూర్చుని చదువుకుంటూ ఉంటే వచ్చి సరాగాలు మొదలు పెట్టేవాడు, లేదా, సినిమా ప్రోగ్రాం వేసేవాడు. జీవితానికి కావలసినది ఏమిటో తెలిసిన నాకు అతని జీవన విధానం నచ్చలేదు. రాత్రి టీవీ లో అడ్డమైన సినిమాలూ చూడటం, తెల్లవారి ఆలస్యంగా నిద్ర లేచి, ఆదరా బాదరా తయారై బయటకి పోవటం. అసలు జాబ్ కి వెళ్ళినట్టుగా రోజూ ఎక్కడికి వెళుతున్నాడో కూడా తెలిసేది కాదు. అడిగితే ఉద్యోగ ప్రయత్నాలు అని చెప్పేవాడు. కాని తర్వాత తెలిసింది అతను క్లబ్ కి వెళ్లి పేకాట ఆడతాడని, ఆ అలవాటుకు బానిసనీ... నా కలలన్నీ కల్లలై పోయాయి మధూ...

నాన్న గారు నాకిచ్చిన ఐదు లక్షల రూపాయలకు కాళ్ళు వచ్చాయి. జాయింట్ అకౌంట్ లోంచి ఎప్పుడో డ్రా చేసేసాడా మూర్ఖుడు. అప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాయి, కాని ఏం లాభం? అప్పటినుండీ అతన్ని కంట్రోల్ చేయాలని ఎంతో ప్రయత్నించాను. నయానా భయానా చెప్పి చూసాను. ఒక దగ్గర నిలబెట్టి ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టించాలని ట్రై చేసాను. ఉహు వినలేదు. తనది చేయి తిరిగిన హాండ్ అనీ పోగొట్టుకున్న డబ్బుకు పదింతలు పేకాట లోనే సాధించగలననీ అన్నాడు. నేను ఒక చిన్న జాబ్ లో జాయిన్ అయ్యాను.

నాకు వచ్చే జీతంలోనే ఇంటద్దె, పాలు, బియ్యం,సరుకులు అన్నీ నడవాలి. పైగా అతనికి పాకెట్ మనీ ఇవ్వాలి. లేకపోతే అరిచి గోల చేసేసేవాడు. ఇంటి పనిలో నాకు వీసమెత్తు సహాయం కూడా చేసేవాడు కాదు. వండిపెడితే హాపీగా తిని లేచేవాడు. గట్టిగా గొడవ పెట్టుకున్నాను. ఏమనుకున్నాడో ఒక రోజు ఎవరో సినిమా సంగీత దర్శకుడు తనకి గాయకుడిగా అవకాశం ఇస్తానని అన్నాడని, కానీ ఒక లక్ష రూపాయలు ఇవ్వాల్సి వస్తుందనీ, ఆ డబ్బు మా నాన్నగారిని అడిగి తీసుకురమ్మని  చెప్పాడు. మన ప్రతిభను వెదుక్కుంటూ అవకాశాలు రావాలి కానీ ఇలా డబ్బిచ్చి అవకాశాలు కొనుక్కోవటం అంటే నాకు అసహ్యం అని చెప్పాను. పైగా నాన్నగారి ముఖం చూడటానికే నాకు అర్హత లేదని నా భావన. అలాంటప్పుడు ఆయన దగ్గరకి వెళ్లి అడిగి తెమ్మంటాడేమిటి అని చాలా దుఃఖం వచ్చింది. నేను వెళ్ళి డబ్బు తీసుకురాలేదని అతనికి కోపం వచ్చి చెన్నై వెళ్ళిపోయాడు. 

అలా ప్రశాంతంగా ఒక మూడు నెలలు గడిచాయి. నా ప్రాణానికి మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఖరీదైన బట్టలతో పాటుగా రెండు లక్షల రూపాయలు తెచ్చి నాకిచ్చాడు. తమిళ్ సినిమా పాటలకు ట్రాక్స్ పాడుతున్నానని చెప్పాడు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని స్థితి. అభావంగా తలూపాను. తన తప్పులకు క్షమించమనీ, ఇకనుంచి కష్టపడి పాడుతూ సంపాదిస్తాననీ, చెన్నై వెళ్ళిపోదామనీ గొడవ చేసాడు. కానీ నేను ఒప్పుకోలేదు. అప్పటికే మన కంపెనీలో జాబ్ కి అప్లై చేసాను. 

వారం రోజుల తర్వాత జరిగిన ఇంటర్ వ్యూ లో సెలెక్ట్ కూడా అయ్యాను. నేను జాయిన్ అయిన వెంటనే మనం కలిసాం కదా... అతను ఒక వారం ఇక్కడా, ఒక వారం చెన్నై లోనూ  ఉండేవాడు.  ఏం చేస్తాడని అడిగిన వారికి నీకు చెప్పినట్టే చెప్పేదాన్ని. ఏం చేయను మరి? పరువు కోసం తప్పేది కాదు...

మొన్న మళ్ళీ వచ్చాడు. ఈసారి నా బంగారు నగలన్నీ ఇవ్వమని అడిగాడు. నేను ఇవ్వనని గట్టిగా చెప్పాను. నేను ఎంత ప్రతిఘటించినా వినకుండా నాతో బలవంతపు శృంగారం జరిపాడు. ఇదిగో పైశాచికత్వంతో నా చెంప మీద ఇలా గోళ్ళతో గట్టిగా గీరేసాడు. ఇక కొన్ని చోట్ల అయిన గాయాలు, నొప్పులూ చెప్పలేనివి మధూ... పెళ్ళి చేసుకుని రెండేళ్ళు కాకుండానే రెండు జన్మల బాధలు అనుభవించాను. చాలా సార్లు అనిపిస్తుంది, పెళ్ళికి ముందు నరేన్ కురిపించిన ప్రేమ నటనా? ఒకవేళ అది నటన కాకుంటే, నిజమే అయుంటే, మరిప్పుడు ఆ ప్రేమ ఏమై పోయింది? ఆవిరై గాలిలో కలిసిపోయిందా? 

ఈ రోజు మళ్ళీ చెన్నై వెళ్ళిపోయాడు. ఇప్పుడు నాకేం చేయాలో తోచటం లేదు. క్షణం క్షణం నరకం అనుభవిస్తూ అతనితో కలిసి బ్రతకాలని లేదు. ఎందుకో నా మనసెరిగిన స్నేహితురాలివని నీతో ఇవన్నీ చెప్పుకోవాలని అనిపించింది...” చెప్పటం ముగించి రెండు చేతులలో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది మమత. 

“అయ్యో, మమ్మూ... ఏమిటిది? ప్లీజ్ మా తల్లివి కదూ, అలా ఏడవకు...” ఆమెను అక్కున చేర్చుకుని కళ్ళు తుడిచింది మధుబాల. 

“ముందు విశ్రాంతి తీసుకో... తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం... సరేనా?” ఆమెను అనునయించి, తన మంచం మీదనే పడుకోబెట్టింది మధుబాల.

మమత ఆదమరచి నిద్రపోయింది. పసిపాపలా కనిపిస్తున్న ఆమెను చూస్తుంటే మధుబాలకి ఎంతో బాధ, ఆవేదన కలిగాయి... పెళ్ళి అంటే ఒక్క క్షణం భయం కలిగింది. అంతకన్నా ముందు, ఈ మమత సమస్యను ఎలా తీర్చాలి? జీవితాన్ని ఎలా చక్కదిద్దాలి? ఈ ఆలోచనలు ఆమెను చుట్టుముట్టాయి.

***

టేబుల్ మీద తలవాల్చి పడుకుంది ఐశ్వర్య. ఏదో తెలియని బాధ ఆమెను కుదిపేస్తోంది. ఏమిటిది? ఎందుకీ వివక్ష? తాను  మాత్రం ఆడపిల్ల కాదా? 

పై ఫ్లాట్ లో సందడి క్రింది వరకూ వినిపిస్తోంది... నవ్వుల కిలకిలలూ, కబుర్ల గలగలలూ అలల్లా గాలిలో తేలివస్తున్నాయి. పైనున్న వాటాలోని ప్రసన్నకు సీమంతం చేస్తున్నారు, అపార్ట్ మెంట్ లోని ఆడవారంతా కలిసి. విషయం తెలిసినప్పటినుండీ తానూ ఆ వేడుక చూడాలని ఆరాటపడింది కానీ ఐశ్వర్యకు పిలుపు రాలేదు... ఎప్పుడైనా పిన్ని గారింట్లో కలిసినప్పుడు బాగానే మాట్లాడతారు అందరూ... ఇలాంటి పేరంటాలకు మాత్రం పిలవరా? మనసు బాధతో మూలిగింది.

“ఐశూ, ఎందుకంతగా బాధ పడతావ్? లే, లేచి బట్టలు మార్చుకో, బయటకు వెళదాం...” సముదాయించాడు కార్తీక్. 

“లేదు కార్తీ... నాకు రావాలని లేదు...” 

“ఇలా ఇంట్లోనే కూర్చుంటే బాధ పడుతూనే ఉంటావు... పోనీ మధుబాల గారిని రమ్మని చెప్పనా?”

“ఉహు, వద్దు...”

“అమ్మాయ్ ఐశూ, ఉన్నావా?” అంటూ లోపలికి  దూసుకు వచ్చింది అన్నపూర్ణ. 

“రండి ఆంటీ...కూర్చోండి.  ఐశూ, రా పిన్ని వచ్చారు...” 

గబుక్కున లేచి, జుట్టు సరిచేసుకుని, ముఖం నీళ్ళతో కడుక్కుని బయటికి వచ్చింది ఐశ్వర్య.

“ఏమిటి ఇంకా అలాగే ఉన్నావు? పైన సందడి వినబడటం లేదా? రెడీ అవమ్మా...”

మౌనంగా తలదించుకుని నిలబడింది ఐశ్వర్య.

“అదీ... అదీ... ఆంటీ... ఐశ్వర్యను వాళ్ళు పిలవలేదు... అందుకని...” 

“పిలవలేదా? ఎందుకుటా? ఇదేం తప్పు చేసిందని?” ఆవిడకి కోపం వచ్చేసింది.

“ఆ ప్రసన్న వాళ్ళమ్మకి లేకపోతే దానికైనా ఉండక్కరలేదా? ఉండు నేను గట్టిగా అడిగేస్తాను...” అంటూ లేచింది. 

పసుపు రంగుకు కుంకుమ రంగు అంచు పట్టుచీరతో అచ్చు అమ్మవారిలా ఉన్నది అన్నపూర్ణ. ఆమె కొంగును పట్టి ఆపుతూ, “వద్దు పిన్నీ... నాకు రావాలని లేదు...” అంది ఐశ్వర్య.

“ఐశ్వర్యా... నేను కూడా వెళ్ళటం లేదమ్మా... ఈ బిల్డింగ్ లో ప్రతీ అమ్మాయీ నా కన్న కూతురితో సమానమే. ఎవరికి న్యాయం జరగకపోయినా నేను సహించలేను...” అన్నది అన్నపూర్ణ.

“కాని, మీరు వెళ్ళకపోతే వాళ్ళు చాలా బాధపడతారు...”

“పడనీ... బాధ అంటే వాళ్ళకీ అర్థం కావాలి కదమ్మా?”

మిగతా భాగం వచ్చేసంచికలో... 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
nagalokayagam