Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
pustakaviluva

ఈ సంచికలో >> కథలు >> ఆపరేషన్ “లవ్ లెటర్”

operation love letter

డియర్ ఫ్రెండ్!

నమస్తే! ఎలా ప్రారంభించాలో, ఏమని వ్రాయాలో తెలియటం లేదు.  ముందుగా, నీకు లెటర్ వ్రాసే ధైర్యం చేసినందుకు నన్ను అభినందిస్తావో, అభిశంసిస్తావో నీ యిష్టం.  నేను ఎప్పుడూ ఈ ఊరు వచ్చేది నీ కోసమే. ఈసారి వచ్చింది కూడా నిన్ను చూడాలనే.  నిజం. యిక్కడకు వచ్చిన వెంటనే మీ వీధి లోకి వచ్చాను.  నీ దర్శనం అయింది.  చిరు నవ్వుతో పలకరించావు. జన్మ ధన్యమయిందనిపించింది. కాని, నువ్వు “కంప్యూటర్ ఇనిస్టిట్యూట్” కు రావటం లేదని తెలిసి, నేను మ్రాన్పడి పోయాను.  ఎందు కోసమైతే యిక్కడకు వచ్చానో, ఆ ధ్యేయం (నీ నిత్య దర్శనం) నెర వేరని నాడు యిక్కడ ఉండటం వృధా.  కాని పరిస్థితుల వల్ల యిక్కడ ఉండక తప్పటం లేదు.

నాదో చిత్రమైన మనస్తత్వం.  ముఖ్యంగా ఆడ పిల్లల విషయంలో.  అది నేను పెరిగిన వాతావరణం వల్లనో ఏమో ఆడ పిల్లలతో మాటాడాలంటే చాలా మొహ మాటం.  కనీసం వారు పలకరించినా, బదులు పల్క లేని సిగ్గు.  అటు వంటి నేను నీ విషయంలో ఎందుకు మారానో నాకే అర్ధం కావటం లేదు.  నిన్ను ‘హలో’ అని పలకరించే ధైర్యం ఎలా చేయ గలిగానో, నీతో చనువుగా ఎలా మాట్లాడానో తలచుకుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది.  అది ఎదుటి మనిషిని ఆకట్టుకొనే నీ మనస్తత్వం, ఎల్లప్పుడూ విర బూసిన రోజాలా చిరునవ్వులు చిందించే నీ ముఖారవిందం వల్లనేమో అనిపిస్తుంది.

నిన్ను మొదటి సారిగా కలిసిన నాటి నుండి నేటి వరకు, అనుక్షణం నువ్వు నా తలపులలో నిండి పోయావు.  కనులు మూసినా, కనులు తెరచినా నీ ఆలోచనలే.  నీ రూప చిత్రణలే.  నా మనసులోని భావాలను అందంగా అక్షరాల రూపంలో పేర్చటం నాకు చేత కాక పోవటం బాధగా అనిపిస్తోంది.  నేను, రెండు, మూడు రోజులలో మా ఊరు వెళ్ళి పోతాను. మరల కాలేజీకి వెళ్ళాలి.  దీనితో పాటుగా నా అడ్రస్ వ్రాస్తున్నాను.  వెంటనే నీ చిరునామాతో ఉత్తరం వ్రాస్తావు కదూ.

వేయి కళ్ళతో అనుక్షణం నీ జవాబు కోసం ఎదురు చూస్తుంటాను.....

సదా నీ వాడిని కావాలనుకొనే

‘శశి’

లెటర్ టైపు చేయటం పూర్తయినా, నాచేతి వణుకు తగ్గ లేదు.  అది టైపు చేయటం వలన వచ్చినది కాదు, మనసులోని ఆలోచనలు, భావాలు ఒక్కుమ్మడిగా ముసిరి, దాడి చేయటం వలన, జీవితంలో మొట్ట మొదటి ప్రేమ లేఖ వ్రాయటం వలన కలిగినది.  నా చేతి వ్రాత నాకే అర్ధం కానంత అందంగా వుంటుంది.  అందుకే, కంప్యూటర్ లో టైపు చేసాను. ఎగ్జిక్యూటివ్ బాండ్  పేపర్ పై ప్రింట్ తీసి, నా అడ్రస్ ఒక స్లిప్ పై వ్రాసి, రెండింటిని ఒక కవర్ లో పెట్టాను.  కవర్ పైన “ప్రేమతో ప్రియకు” అని వ్రాసాను.

ప్రియ..... పేరులాగే నాకు ప్రియాతి ప్రియమైన ప్రియదర్శిని.  ఆమెను తొలి సారిగా చూసింది, ఆర్నెల్ల క్రితమనుకుంటా.  మా ఊరు నుండి డిగ్రీ రెండవ సంవత్సరం పరీక్షల తరువాత శలవులలో మావయ్య ఊరికి వచ్చాను.  ఖాళీగా ఉండడం ఎందుకని తను నడుపుతున్న చిన్న కంప్యూటర్ ఇనిస్టిట్యూట్ లో నేర్చుకుంటూనే ఇనస్త్రక్టర్ గా ఉండే వాడిని.  కంప్యూటర్ అంటే పెద్దగా ఇంకా పరిచయం కాని రోజులవి. మావయ్య నన్ను ఇనిస్టిట్యూట్ లో ఉంచి, తను బయటి పనులపై వెళ్ళేవాడు.  నేను ఇనిస్టిట్యూట్ లో కూచుని ఏదో ఒక పుస్తకం తీసుకుని చదువుకుంటూండే వాడ్ని. వేరే విషయాలు ఏమీ పట్టించుకొనే వాణ్ణి కాదు. ఎవరైనా స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు సందేహాలు వ్యక్తం చేస్తే సాయం చేయడం తప్పితే, వేరే విషయాలే మాట్లాడేవాడ్ని కాదు.  ముఖ్యంగా ఆడ పిల్లలయితే, వారి ముఖం కేసే చూసే వాణ్ణి కాదు. ఏమయినా అడిగినా, తలొంచుకొనే సమాధానానం చెప్పే వాణ్ణి.  

నే వెళ్ళిన రెండో రోజో, మూడో రోజో నేను ఇనిస్టిట్యూట్ లో కూర్చుని న్యూస్ పేపర్ చదువుతున్నాను.  “ఎక్స్ క్యూజ్ మి సర్!” అనే పిలుపుకు పేపర్ లోంచి తలెత్తి బయటకు చూసాను.  నా ఎదురుగా ఒక అమ్మాయి నిల్చుని ఉంది.  షాంపూ చేసి, గాలికి స్వేచ్చగా ఆర బెట్టిన జుట్టు, ఆకర్షణీయమైన కళ్ళు, తాజాగా విరిసిన రోజా లాంటి పెదాలతో చిందిస్తున్న చిర్నవ్వు, ముత్యాల్లాంటి పలు వరుస, బంగారు రంగు మేని ఛాయతో, అటు వంటి అమ్మాయిని ఈ ఇనిస్టిట్యూట్ లోనే కాదు, అంత వరకూ మరెక్కడా చూడలేదనిపించేంత అందంగా ఉంది. గులాబి రంగు పంజాబి డ్రెస్సులో హుందాగా నిల్చుని ఉంది. ఉలుకూ, పలుకూ లేకుండా ఆమెకేసే చూస్తున్న నా దృష్టిని మరలా ఆమె పిలుపే మరల్చింది.  ‘ఎస్,, ఏం కావాలండీ”.. అని అడిగాను, తడబడుతున్న గొంతుతో.  “కంప్యూటర్ ఆన్ కావటం లేదు”, అంది.  వెంటనే లేచి, ఆమె చూపించిన కంప్యూటర్ వద్దకు వెళ్ళి. క్రిందా మీదా పడి మొత్తానికి ఆన్ చేయ గలిగాను.  “థాంక్యూ వెరీ మచ్” అంటూ, ఆమె కూర్చుని టైపు చేస్తోంది – ఎం.ఎస్. వర్డ్ ఎక్సర్సైజులు అంటే, ఈ మధ్యనే జాయిన్ అయిందన్న మాట అనుకున్నాను.  

మరో పావు గంటకి ఆమె తన ఎక్సరసైజు పూర్తి చేసుకొని వచ్చింది. అంత వరకూ ఆమె కేసే చూస్తున్న చూపు మరల్చుకుని, ఆమె తీసి ఇచ్చిన పేపర్ దిద్దటానికి తీసుకున్నాను.  ఎక్కడైనా చిన్న తప్పు దొరుకుతుందేమో, ఆ వంకతో “ఈసారి బాగా చెయ్యండి” అంటూ సలహా ఇద్దామనుకున్న నాకు నిరాశే ఎదురయ్యింది.  ఆమె లాగే, ఆమె వర్క్ కూడా అందంగా, పొందికగా ఉంది.  ఎక్కడా తప్పు ఎంచ లేక, చివర్న నా సంతకం చేసి (అవసరం లేక పోయినా), ఆమె చేతికిచ్చాను.  అతి కష్టం మీద నోరు పెగల్చుకుని, “చాలా బాగా చేసారు, కీపిటప్” అన్నాను.  ఆమె చిర్నవ్వుతో “థాంక్యూ” అంటూ రాజ హంసలా నడచుకుంటూ వెళ్ళిపోయింది.  ఆమె వెళ్ళిన తరువాత ఆమె పేరు కోసం వెతికాను. దొరికింది.  “ప్రియ దర్శిని- వాటే స్వీట్ నేమ్” నాలో నేనే అనుకున్నాను.  

మర్నాటి నుండి నా తీరే మారిపోయింది.  ఇనిస్టిట్యూట్ లో, ముఖ్యంగా ఆమె వచ్చే టైముకు కూర్చోవటం దిన చర్యగా మారి పోయింది. ఆమె టైముకు అర గంట ముందు గానే, నీట్ గా తయారై కూర్చునే వాడిని. ఒక వేళ బావ ఉన్నా, “నేను చూసుకుంటాను కదా, బావా నువ్వు వేరే పనులు చూసుకో” అనే వాడిని.  ఆమె లోనికి రాగానే, ‘హల్లో గుడ్ మార్నింగ్!” అని నేను పలకరించటం, ఆమె చిర్నవ్వుతో రెస్పాన్స్ ఇవ్వటం సాధారణమై పోయింది. ఒక వారం రోజుల తరువాత ఆమెను యధాలాపంగా అడిగాను, “ఏమి చదువుతున్నారు?” అని. వెంటనే, ఆమె “ఎందుకు”? అంది. ఊహించని ఆ సమాధానానికి తడబడుతూ, తల దించుకుని, “ఏమి లేదు, ఊరికే” అన్నాను.  ఆమె నవ్వుతూ “డిగ్రీ ఫస్ట్ ఇయర్” అని చెప్పింది.  దాంతో మరలా ధైర్యం వచ్చి, ఈ ఊరేనా? అన్నాను. “కాదు, విజయవాడ నుంచి వచ్చాం, మా నాన్న గారికి ఇక్కడికి ట్రాన్సఫర్ అవ్వడంతో...” అంటూ తుర్రున వెళ్ళి పోయింది.  తరువాత వివరాలు సేకరించగా, వాళ్ళ నాన్న గారు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టరని, బ్రదర్ కూడా మెడిసిన్ చదువుతున్నాడని తెల్సింది.  

అక్కడ ఉన్న రోజుల్లో, ఆమె నాకు మానసికంగా చాలా దగ్గరయింది.  ఆమె లేక పోతే నేను బ్రతక లేనన్న భావం నన్నావరించింది.  ఆమె నాతో తప్ప మరెవ్వరి తోనూ మాట్లాడక పోవడం, మరెవ్వరి వైపూ కన్నెత్తైనా చూడక పోవటం, ఆమెకు కూడా నేనంటే ఇష్టమే నన్న అభిప్రాయం ఏర్పరచింది. తరువాత కొన్ని రోజులకు, నేను మా ఊరు వెళ్ళాను.  మరలా, ఒక వారం రోజులు శలవులు రావటంతో యిక్కడకు వచ్చాను. రాగానే, ప్రియకు ఇద్దామని ఈ లెటర్ తయారు చేశాను.  తరువాత తెలిసింది- తను పరీక్షల వలన కంప్యూటర్ ఇనిస్టిట్యూట్  కు రావటం లేదని.  ఇదీ జరిగిన కథ.  

ప్రింట్ తీసిన ఉత్తరం ఉన్న కవర్ జాగ్రత్తగా బీరువాలో పుస్తకాల మధ్య దాచాను, మావయ్యకు, అత్తయ్యకు తెలిసే వీలు లేకుండా. ఈ సాయంత్రం ఎలాగైనా తనకు ఈ లెటర్ అందజేయాలి. కాని ఎలా? నేను లైబ్రరీకి వెళ్ళేటప్పుడు దూరమైనా వాళ్ళింటి ముందు దారి నుండే వెళతాను. ఆమె దర్శనం కోసం. ఆ టైములో ఆమె చూస్తుండగా ఆమె గుమ్మం ముందు కవర్ పడేయాలి. ఎందువల్ల నంటే, ఆమె చేతి కిచ్చే ధైర్యం నాకు లేదు... సాయంత్రం తయారై వెళ్ళిన నాకు వాళ్ళింటి దగ్గర ఆమె కనిపించింది. పలకరించింది చిర్నవ్వుతో, పక్కన వాళ్ళ అమ్మతో. తల వంచుకొని బుద్ధి మంతుడిలా వెళ్ళొచ్చేసాను. అదే విధంగా మరో నాలుగు రోజులు గడిచాయి. కాని ఆమెకు లేఖనందజేయటం మాత్రం జరగ లేదు. దానికి ఒక కారణం పరిస్థితులు అనుకూలించక పోవటం అయినప్పటికీ, ముఖ్య కారణం నా భయమే అనటంలో సందేహం లేదు. యిక, రెండు రోజుల్లో కాలేజి తెరుస్తారు. మా ఊరు వెళ్ళి పోవాలి. ఈ లోగా ఆమెకి లెటర్ యివ్వటం కుదురుతుందా? లేదా? కుదరక పోతే మళ్ళీ ఆమెకి లెటర్ యిచ్చే అవకాశం ఉండదు. యిదే ఆలోచనలతో మనస్సంతా ఆందోళనతో ఆ రోజు రాత్రంతా నిద్ర లేకుండానే గడిపాను. తెల్ల వారుతుండగా కాస్త కునుకు పట్టింది. 

పొద్దున లేచేటప్పటికి, ఆ రోజు సోమవారం, అక్కడ వారపు సంత కావటంతో, ఇనిస్టిట్యూట్ బజారు కు దగ్గర గానే ఉండడంతో, వీధంతా కోలాహలంగా వుంది. అప్పుడు వచ్చిందో ఆలోచన. ఈ రోజు సంతకు కూరల కోసం ప్రియ వస్తుంది కదా, ఏదో విధంగా ఆమెననుసరించి, లెటరివ్వాలి అనుకున్నాను. తొందరగా స్నానం చేసి,  తయారై, వీధి గుమ్మంలో నుంచున్నాను. టైము గడుస్తోంది గాని, ఆమె కనిపించటం లేదు. ఎండ మొహం మీదకు పడుతున్నా, ఓపిగ్గా నిరీక్షిస్తున్నాను. 11.30 అయ్యేటప్పటికి ఆమె కనిపించింది, కూరల కోసం వస్తూ. చంద్రుని చూసిన కలువలా నా మనసు వికసించింది ఆనందంతో. ఎలాగైనా ధైర్యం చేసుకొని, ఆమెకి లెటరిద్దామని నిర్ణయించుకుని లోనికి వచ్చాను. యింతలో మావయ్య పిలిచాడు, ఏదో అర్జెంటు వర్క్ చేసి పెట్టమని, తనకు బయటకు వెళ్ళే పని ఉందని. ఒక్క సారిగా నా ఉత్సాహం నీరు కారినట్లైంది. భారమైన హృదయంతో కంప్యూటర్ ముందు కూచున్నాను.

నా శక్తి నంతా ఉపయోగించి సాధ్యమైనంత వేగంగా వర్క్ పూర్తి చేసి, బయటకు వచ్చాను. ఆమె కనిపించ లేదు. ఆ వీధంతా కలియ జూసినా లేదు. నా మనసంతా చేదు భావనతో నిండి పోయింది. అరుదుగా లభించిన ఈ అవకాశం జార విడుచుకో వలసి వచ్చిందన్న బాధ, ఉక్రోషం మనసులో ముప్పిరి గొన్నాయి. కళ్ళలో నీళ్ళు చిప్పిల్లాయి. ఆ రోజు సాయంత్రమే మా ఊరికి బయల్దేరాను. భారమైన గుండెతో. 


రెండు వారాలు గడిచాయి. పరీక్షలు దగ్గర పడుతుండటంతో చదవ వలసిన, వ్రాయ వలసిన పని ఎక్కువగా ఉన్నప్పటికీ, ఆమె తలపులు నా మనస్సు లోంచి చెరగటం లేదు. ఈ బాధకు ఏదైనా పరిష్కారం చూడాలి. ఆది వారమంతా తీవ్రంగా ఆలోచించాను. ఆలోచనలన్నీ ఒక కొలిక్కి రాగానే, అమ్మతో చెప్పాను – మర్నాడు మావయ్య ఊరు వెళ్ళాలని. ‘అంత అర్జంటు పని ఏముందిరా?’ అని అమ్మ అడిగింది. ‘ముఖ్యమైన పని ఉంది వెళ్ళాలి అంతే’ అన్నాను. మర్నాడు పొద్దున్నే ఏడు గంటలకు డైరెక్టు బస్ ఉంది, దానికి వెళ్దామని నిర్ణయించుకున్నాను. రాత్రంతా నిద్ర లేక పోవటంతో, తెల్లవారు ఝామున ఐదు గంటలకే లేచి స్నానం చేసి కూర్చున్నాను. ఆరున్నరకు బయల్దేరుతుండగా ‘టిఫిన్ చేస్తున్నాను, తినేసి వెళ్దువు గాని, కూచో” అంది అమ్మ. వద్దన్నాను. “నీరసంతో ఏం వెళతావు? తీరా వెళ్ళేటప్పటికి ఏ టైమవుతుందో...” అంటూ కసురుకుంది. యింకా మొండి కేస్తే, ప్రయాణమే వద్దంటుందనే భయంతో సరేనన్నాను. 8.30 కి గాని టిఫిన్ తయారు కాలేదు. అతి కష్టం మీద నిప్పుల మీద కూచున్నట్లుగా ఉంది నాకు. గబ గబా అయిందనిపించి, బ్యాగ్ భుజాన తగిలించుకున్నాను. లెటర్ ఉంచిన కవర్ ఒక పుస్తకంలో పెట్టి బ్యాగ్ లో పెట్టడం మాత్రం మర్చి పోలేదు. వేగంగా బస్టాండుకి చేరాను. కిళ్ళీ కొట్టు వాణ్ణి అడిగాను. బస్ ఏమైనా ఉందా? అని. ‘యిప్పుడే డైరెక్టు బస్ వెళ్ళి పోయింది బాబూ, మరో గంట దాకా డైరెక్టు బస్సు లేదు’ అన్నాడు. నాకు నెత్తిన పిడుగు పడ్డంత పనయ్యింది. చీ! ఎంత దురదృష్టం అనుకుంటూ నన్ను నేనే తిట్టుకున్నాను. అసహనం పెరిగి పోతోంది.  టైమ్ తరిగి పోతోంది. మరో 20 నిమిషాలకు ఒక షటిల్ బస్సు వచ్చింది. అది కొంత దూరం వరకే వెళ్తుంది. మళ్ళీ యింకో బస్సు మారాలి. అయినా ఏం చేస్తాం, ముందు ఎక్కేస్తేనే మంచిది అనుకొని బస్సెక్కి  కూచున్నాను. షటిల్ బస్ కావటంతో మరో అర గంటకి గాని బస్ కదల లేదు. 9.30కి స్టార్ట్ అయ్యింది. డైరెక్టు బస్సు దొరికితేనే ఒకటిన్నర గంట పైగా ప్రయాణం. అటువంటిది, షటిల్ బస్సులో ఎప్పటికెళ్ళేను? అనుకుంటూ నా మనసు మూలుగుతోంది. ప్రియ, సంతకు 11-12 గంటల మధ్య నే వస్తుంది. 11 గంటలకి ఎలా వెళ్ళటం? నాకేం తోచటం లేదు. టిక్కెట్ తీసుకున్నాను. ముక్కుతూ, మూల్గుతూ కుంటుతూ నడుస్తోంది బస్సు. “ఇంకొంచెం స్పీడుగా పోనియ్య రాదూ?” ఉక్రోషం ఆపుకో లేక అడిగాను డ్రైవర్ని. “యిది యిప్పుడే షెడ్ నుంచి వచ్చిన బండి. స్పీడు కొడితే, మొత్తానికే ఆగి పోతుంది”. కటువుగా సమాధానమిచ్చాడు డ్రైవరు. 

బస్ బయల్దేరిన పది నిమిషాలకే బస్సులో ఏదో గొడవ మొదలైంది. ఏంటీ అంటే, ఎవరో పెట్రోలు తెస్తున్నారట. కండక్టరు కుదరదంటాడు. దాంతో బస్సు మొత్తానికి ఆపేసారు. నాకు ఏడుపొక్కటే తరువాయి. గొడవ పడుతున్న వాళ్లకి సర్ది చెప్పే ప్రయత్నం చేసాను. నాకే చీవాట్లు దక్కాయి. మొత్తానికి పెట్రోలు తెస్తున్న మనిషి డబ్బాతో సహా దిగితే గాని, బస్సు తిరిగి బయల్దేర లేదు. అతి కష్టం మీద మరో అర గంటకి బస్ స్టాండు చేరింది. యిప్పుడు మరో బస్ వస్తుందో రాదో, అనుకుంటూ దిగాను. టైమ్ చూసాను. 10.50. అప్పటికది పదిహేనో సారో, పదహారో సారో టైము చూడటం. ఎంక్వయిరీలో బస్ ఎన్నింటికుందని అడిగాను. మరో గంటకి- అని సమాధానం. అయి పోయింది. ఈ చాన్సు కూడా దాదాపు మిస్సయినట్లే అనిపించటంతో నా మనసంతా బాధతో నిండి పోయింది. నిప్పుల మీదున్నట్లుగా గడిచింది- ఆ గంట. అయినా బస్ రాలేదు. మరో పావు గంటకి వచ్చింది. ఎక్కి టికెట్ తీసుకుని, కళ్ళు మూసుకుని కూచున్నాను. కళ్ళలో నీళ్ళూరుతున్నాయి. ఎన్నడూ లేనిది, ఈ ప్రేమ వ్యవహారంలో పడ్డాక, నేను బేలగా మారుతున్నానేమోననిపించింది. మనసంతా ఆలోచనలు రొద చేస్తున్నాయి. ఎక్కడో గోరంత ఆశ. నా ప్రయత్నం సఫలమవుతుందని. నా ఆశకు నాకే నవ్వొచ్చింది. అలాగే కళ్ళు మూసుకున్నాను. 

కళ్ళు తెరిచేటప్పటికి బస్ నే చేరాల్సిన ఊరుకి దగ్గరగా వచ్చేసింది. టైము చూసాను. 12.20. మరో 15 నిమిషాలకల్లా గమ్యం చేరింది. టైము 12.35. బస్ దిగుతూనే, పరుగు లాంటి నడక మొదలెట్టేను. యింకా ఆశ చావ లేదు. తొందరగా వెళ్తే, బజార్లో కనబడే అవకాశం వుంది. మరో రెండు నిమిషాల్లో, ఇనిస్టిట్యూట్ కు చేరుకున్నాను. బజార్ అంతా కోలాహలంగా ఉంది. గుమ్మం లోంచే చూసాను. ఎక్కడైనా ఉందేమోనని. ఒక్క సారిగా ఆశ్చర్యం నన్నావరించింది. హృదయం ఆనందంతో నిండి పోయింది. అవును. ఆమె కనిపించింది.  నా కళ్ళను నేనే నమ్మ లేక పోతున్నాను. ఆమె కూరల కొట్టు దగ్గర ఉంది. వెంటనే పరుగుతో ఇనిస్టిట్యూట్ లోకి అడుగు పెట్టి, బేగ్ లోపల పడేసి, కవర్ జేబులో పెట్టుకొని, బయట పడే సమయంలో అడ్డొచ్చారు- యమ కింకరుల్లాంటి సీనియర్ స్టూడెంట్స్ “హల్లో గురూ, ఎప్పుడొచ్చావు?” అంటూ. అతి కష్టం మీద నవ్వటానికి ప్రయత్నిస్తూ, “యిప్పుడే” అన్నాను. “ఏంటి విశేషాలు?” అంటూ జిడ్డులా పట్టుకొని వదలటం లేదు. వాళ్ళని కాదని వెళ్ళటానికి లేదు. వీళ్ళ కళ్ళకి ఏమాత్రంగా అనుమానంగా కనపడినా, విషయం కని పెట్టి, ఊరంతా టముకు వేసేస్తారు. వీళ్ళకు దొరక్కుండా ప్రియని కలవాలి...ఎలా?  నాకు ఎక్కువ శ్రమ లేకుండానే, మరో ఐదు నిమిషాలకి వాళ్ళే వెళ్ళి పోయారు, అర్జెంటు పనుందంటూ.  నా యిష్ట దైవానికి మనస్సు లోనే నమస్కారాలు అర్పించుకున్నాను. 

బయట కొచ్చి చూసేటప్పటికి, ఆమె కనిపించ లేదు. నాకళ్ళు వర్షించటానికి సిద్ధంగా ఉన్నాయి. వీధంతా కలియ తిరిగాను. కాని, ఆమె లేదు. వెళ్ళి పోయిందన్న మాట, అనుకుంటూ, జారి పడుతున్న కన్నీళ్ళని తుడుచుకుంటూ, బరువెక్కిన గుండెతో వెనక్కి తిరిగాను. అప్పుడు కనిపించింది- ఆమె, సాయిబు కొట్టు దగ్గర నిమ్మకాయలు కొంటూ. నా ఆనందం అవధులు దాటింది. మనసు పరవళ్ళు తొక్కుతోంది. వేగంగా సాయిబు కొట్టు దగ్గరకి వెళ్ళాను.ఆమె ప్రక్కన నుంచున్నాను. సడెన్ గా నన్ను చూడటంతో చాలా ఆశ్చర్యపడినట్లు కనిపించినా, నవ్వుతూ, “హలో బాగున్నారా?” అని అడిగింది. “హా..” అన్నాను. “నువ్వు బాగున్నావా?” అని అడగుదామనుకున్న మాట లోపలే ఉండి పోయింది. గొంతు పూడుకున్నట్టనిపించింది. రెట్టించిన నా హృదయ స్పందన నాకే స్పష్టంగా వినిపిస్తోంది. తన దగ్గరకి వెళ్ళటమైతే వెళ్ళాను గాని, అసలు విషయం ఎలా ప్రారంభించాలో, ఆ లవ్ లెటర్ ఆమెకు ఎలా ఇవ్వాలో నాకు తెలియటం లేదు. 

“ఏం కావాలి బాబూ?” అని సాయిబు అడగటంతో, తడ బడుతూ, “నిమ్మ కాయలు- ఒక అర డజను” అన్నాను. ధైర్యం కూడ గట్టుకుని, ఆమె కేసి చూస్తూ, “నేను ఈ రోజే ఊరి నుంచి వచ్చాను, క్రితం వారం వెళ్ళి” అన్నాను. “అలాగా!” అంది, ముక్త సరిగా. నాకు ఏం చెయ్యాలో తోచటం లేదు. చెమటలు పట్టేస్తున్నాయి. ఈ సంభాషణ నెలా పొడిగించాలో అనుకుంటుంటే, సాయిబు నిమ్మకాయలిచ్చేడు. “అయ్యో, అవి బాగోలేవండి”, అంది ప్రియ. ‘హమ్మయ్య, వంక దొరికింది” అనుకుంటూ, “అయితే, కాస్త నువ్వే ఏరిపెట్టు” అన్నాను. నవ్వుతూ ఏరి పెట్టింది. తన బ్యాగు తీసుకుని వెళ్ళి పోబోతోంది. ఆఖరి ట్రంపు కార్డుగా, “ఐదు రూపాయలు చిల్లరుందా, నీ దగ్గర – నా దగ్గర వంద నోటుంది?” అన్నాను ప్రియతో. నీ ఎత్తుగడ నాకు తెలుసులే అన్నట్లుగా చూసి, ఐదు రూపాయలు సాయిబు కిచ్చింది. ఆ సమయం లోనే నేను ధైర్యం తెచ్చుకొని, జేబులోని కవర్ తీసి, తన కూరల సంచిలో వేసి, వెనక్కి తిరిగాను.  “ఏంటండీ యిది?” అని ఆమె అంటున్నా వినిపించుకోకుండా వడి వడిగా ఇనిస్టిట్యూట్ కు వచ్చేసాను. మరో అర గంటకు గాని నా గుండె దడ తగ్గ లేదు. ఏమైనప్పటికీ, ఒక ఘన కార్యం “ఆపరేషన్ లవ్ లెటర్” పూర్తయింది. “మరి వాటెబౌట్ హర్ రిప్లై? “వెయిట్, అండ్ సీ”- అని సమాధానపరిచింది నా మనసు.  

మరిన్ని కథలు
rendo pustakam