Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

పదకొండవ భాగము

Eleventh part

"సంతోషంగా లేదని ఎందుకంటాం మమ్మీ. కాని ఇండియా పద్ధతుల్లో ఇలా వుండాలి. అలా వుండాలి, ఇలా చేయకూడదు అంటేనే మాకు ఇబ్బందిగా వుంది."

"యస్. దటీజ్ మెయిన్ ప్రాబ్లమ్. మన పద్ధతుల్లో మనం వుంటే నాయనమ్మకు వచ్చిన నష్టం ఏమిటి?" అంది శివాని.

"నష్టం చాలా వుంది. అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆవిడ మన దగ్గర ఉన్నన్ని రోజులూ సంతోషపడేలా ప్రవర్తించండి... ప్రవర్తించడం కాదు ఆవిడకు నచ్చిన పద్ధతుల్లోనే ఉండాలి.

అదే మీరు నాకు ఇచ్చే గౌరవం." అన్నాడు శాసిస్తున్నట్టుగా.

కాస్సేపటికి ఏమనుకున్నారో ఏమోగాని అనంతసాయి రాజీకి వస్తూ. "ఒ.కె. డాడీ" అన్నాడు.

"డాడీ కాదు. తెలుగులో నాన్నగారు అనాలి" గుర్తుచేసింది సత్యవతి.

"అలాగే నాన్నగారు" అన్నాడు.

"నీ సంగతేమిటి?" కూతుర్ని అడిగాడు గోపాల్.

"అలాగే... నాన్నగారూ" అంది వత్తిపలుకుతూ.

"బాగుంది. ఇంట్లో మీరు ఇలాగే అమ్మా నాన్న అంటూపిలవాలి. ఇంగ్లీషు బయట మాత్రమే ఉపయోగించాలి. అర్ధమైందా? శివానీ నాయనమ్మ రాగానే ఎలా పలకరిస్తావో చెప్పు?" అని అడిగాడు కూతుర్ని.

"హలో గ్రానీ....... హౌ ఆర్ యు" అంటూ షేక్ హ్యాండ్ ఇస్తానంది ఉత్సాహంగా.

ఆ మాటలతో సత్యవతికి నవ్వాగక పెద్దగానే నవ్వేసింది. శివాని ముఖం చిన్నబుచ్చుకుంది. గోపాల్ కి కూడా నవ్వాగలేదు.

"నాకు అనుమానంగానే వుంది సత్యా. మా అమ్మ ముందు ఖచ్చితంగా మన పరువు తీసేట్టున్నారు" అన్నాడు నవ్వాపుకుంటూ.

"పోనీ ఎలా పలకరించాలో చెప్పొచ్చుగా. అలాగే చేస్తాం" అన్నాడు అనంత్.

"ముందు మీరు తెలుసుకోవలసిన ముఖ్య విషయం ఏమిటో తెల్సా? మా అమ్మకి తెలుగు తప్ప మరో భాష రాదు. అంచేత మీరు ఏం మాట్లాడినా తెలుగులోనే మాట్లాడాలి. చెప్పు సత్యా. వాళ్లకు అలవాటు చేయకపోతే మా అమ్మ నెలతిరక్కుండానే ఇండియా వెళ్ళిపోతానని పేచీ పెడుతుంది." అన్నాడు భార్యతో.

"ఆ సమస్య ఉండడులెండి. మన పిల్లలు మంచివారు.చెప్పిన మాట వింటారు. ఏరా అనంత్, వింటారుగా?"

"అర్ధమయ్యేలా చెప్తే తప్పకుండా వింటాం మమ్మీ!"

"మమ్మీ కాదు. అమ్మా అనే పిలవాలి. ఆవిడ రాగానే నాయనమ్మ బాగున్నారా? మన వాళ్ళంతా ఎలా వున్నారు? పెదనాన్న, పెద్దమ్మ క్షేమసమాచారాలు ఏమిటి? పిల్లలు బాగున్నారు కదా? మావయ్య, అత్తయ్య వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు? అంటూ ఇలా పేరుపేరునా అందర్నీ అడిగి యోగక్షేమ సమాచారాలు తెల్సుకోవాలి. ఇవన్నీ ఒక్కరే అడగాల్సిన అవసరం లేదు. శివాని, నువ్వు మార్చి మార్చి అడగొచ్చు. ఇంకా వ్యవసాయం బాగుందా? వూళ్ళో అంతా బాగున్నారా? నీ ఆరోగ్యం ఎలా ఉంటోంది? ఇలా ఎన్నో కుశల ప్రశ్నలు అడగొచ్చు.

కూర్చోండి నాయనమ్మా! ఏం తీసుకుంటారు? అంటూ ప్రేమగా మాట్లాడితే ఆవిడ సంతోషిస్తుంది" అంటూ వివరించింది సత్యవతి.

"మరో ముఖ్య విషయం ఏమిటో తెలుసా? అత్తయ్యా, మావయ్యల గురించి అడిగిన తర్వాత మహేశ్వరి, నవీన్ ల గురించి అడగడం మర్చిపోవద్దు. నవీన్ శివానికి బావ అయితే మహేశ్వరి నీకు మరదలు. మీకు పెళ్ళిళ్ళు చేయాలని నాయనమ్మ ఆశ. మేమంతా చిన్నప్పట్నుంచి అనుకున్నదే" అంటూ హెచ్చరించాడు గోపాల్.

తండ్రి మాటలకు అన్నాచెల్లెళ్ళు ఇద్దరూ ఇబ్బందిగా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఉన్నట్టుండి లేచాడు అనంతసాయి.

"నాన్నగారు. వాళ్ళు మన బంధువులు, కావలసినవాళ్ళు. అంతవరకే. పెళ్లి విషయంలో మాత్రం నాకు స్వతంత్రం కావాలి. మరదలని ఎక్కడో ఇండియాలో వున్న పిల్లని చేసుకోమంటే ఐకాన్ట్" అంటూ లేచి తన గదిలోకి వెళ్ళిపోయాడు. అతడు కనీసం తన అభిప్రాయం చెప్పి వెళ్ళాడు. కానీ శివాని పెదవి విప్పకుండా లేచి కోపాన్ని అదుపుచేసుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది.

వాళ్ళ తీరు నచ్చని డాక్టర్ గోపాల్, సత్యవతి దంపతులు తలలు పట్టుకొని అలాగే కూర్చుండిపోయారు.

 

***
 

ముంబై లో అన్నపూర్ణేశ్వరి ఎక్కిన ఎయిర్ ఇండియా విమానం సుమారు ఇరవై నాలుగు గంటలు ప్రయాణం చేసి అమెరికా తీరపట్టణమైన న్యూయార్క్ జాన్ ఎప్ కెనడీ అంతర్జాతీయ విమానాశ్రయంలో లాండ్ అయ్యేసరికి అమెరికా టైం ప్రకారం మధ్యాహ్నం పన్నెండు గంటలు. అక్కడ సూర్యాస్తమయం అవుతున్న సందర్భంలో ఇక్కడ ఇంచుమించు సర్యోదయం అవుతుంది. మనకి ఇండియాలో స్టాండర్డ్ టైం ఒకటే. తూర్పు తీరానికి, పశ్చిమ తీరానికి కొద్ది నిమిషాలకు మించి వ్యత్యాసం ఉండదు.

కాని అమెరికా భూభాగం ఇండియాకన్నా ఆరురెట్లు పెద్దది. అందుచేత ఒక్క అమెరికాలోనే ఐదు టైం జోన్స్ వున్నాయి. తూర్పు తీరం నుంచి పశ్చిమ తీరానికి గంటల్లో వ్యత్యాసం ఉంటుంది. ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు స్థానిక కాలమాన ప్రకారం గడియారంలో ముల్లుల్ని సరి చేసుకోవాల్సిందే.

అంతేకాదు విమానం తూర్పునుంచి పశ్చిమంగా ప్రయాణం చేయడంలో సూర్యుడితో బాటే ప్రయాణించడం చేత ఎంతదూరం ప్రయాణించినా సూర్యుడు కన్పిస్తూనే ఉంటాడు.

ఈ విషయం తెలీని వాళ్లకి, మొదటిసారిగా పశ్చిమ దేశాలకి ప్రయాణిస్తున్న వాళ్లకి అక్కడి టైం విషయంలో కొంత అయోమయంగానే వుంటుంది.

మొదటిసారిగా అమెరికా వస్తున్న తన తల్లి అన్నపూర్ణేశ్వరిని రిసీవ్ చేసుకోవడానికి భార్య సత్యవతితో కలిసి డెట్రాయిట్ నుంచి విమానంలో న్యూయార్క్ కి రెండుగంటల ముందే చేరుకున్నాడు డాక్టర్ గోపాల్ నిమ్మగడ్డ.

మొదట కార్లో వద్దామనుకున్నారు గాని ఇంతదూరం విమాన ప్రయాణంలో వచ్చిన అన్నపూర్ణేశ్వరికి కారు ప్రయాణం సౌకర్యంగా ఉండదనే ఉద్దేశంతో విమానంలో వచ్చారు. వచ్చీరాగానే తిరిగి డెట్రాయిట్ కి తల్లితో బాటు ముగ్గురికీ లోకల్ ఎయిర్ వేస్ లో టిక్కెట్లు బుక్ చేసాడాయన.

ఎయిర్ ఇండియా విమానం ల్యాండ్ అయినట్లుఅనౌన్స్ మెంట్ వినగానే అరైవల్ గేట్ వద్ద భార్యతో రెడీగా ఉన్నాడు గోపాల్. వయసయిన తల్లి అంత దూరం నుంచి ఒంటరిగా ఎలా వస్తుందో ఎలా వుందోనని అంతటి డాక్టర్ లో కూడా కంగారు, ఆతృత కన్పిస్తున్నాయి.

భర్త ఆందోళన గమనించి అతని చేయి అదిమి చిరునవ్వుతో ధైర్యం చెప్పింది సత్యవతి.

అంతలో కష్టమ్స్ చెకింగ్ ముగించుకొని ప్రయాణీకులు ఒక్కొక్కరే బయటకు రావడం ఆరంభమైంది. సుమారు అరగంట తర్వాత ట్రాలీ మీద తన సూట్ కేస్ తో హేండ్ బాగ్ నెమ్మదిగా తోసుకుంటూ బయటకు వస్తున్న అన్నపూర్ణేశ్వరి కన్పించింది.

తల్లిని చూడగానే ఒక్కసారిగా ప్రకాశవంతమైంది గోపాల్ ముఖం. ఆయనతో పాటు సత్యవతి కూడా ఆవిడకు చేయి వూపి తమ ప్రజన్స్ ను సూచిస్తూ చిరునవ్వులు నవ్వారు.

ఆవిడ పక్కనే ప్రయాణంలో ఆమెకు అన్నివిధాలా సహకరించిన ఆంధ్రా దంపతులు ఇద్దరూ తమ సామాన్లతో ట్రాలీలు తోసుకుంటూ వస్తున్నారు. వాళ్ళను చూడగానే గోపాల్ గుర్తుపట్టాడు. తెలిసిన వాళ్లే. నిజానికి విమానం ఎక్కినప్పట్నుంచి దిగి బయటకు వచ్చేవరకు వారి సహాయం మరువలేనిది.

వాళ్ళంతా బయటకు రాగానే గోపాల్, సత్యవతిలు వేగంగా ఎదురువెళ్లారు. కొడుకు, కోడల్ని చూడగానే అన్నపూర్ణేశ్వరికి ఆనందంతో మాటలు కరువయ్యాయి. వాళ్ళిద్దర్నీ కౌగలించుకొని చిన్నగా ఏడ్చేసింది. మాటలకి అందని ఉద్వేగభరితమైన క్షణాలవి. ఒకటి కాదు రెండు కాదు. గోపాల్ కుటుంబం ఇండియా వెళ్ళి అయిదేళ్ళవుతోంది. ఎప్పుడూ తన వృత్తిలో బిజీగా వుండే గోపాల్ కి ఈ మధ్యకాలంలో ఇండియా వెళ్ళడానికి తీరికే దొరకలేదు. వీడియో ఫోన్లో ఒకర్నొకరు చూసుకొని మాట్లాడుకోవడమే జరుగుతూ వచ్చింది ఇంతకాలం.

"ఎలా వున్నార్రా... నాన్నా... ఇక్కడంతా చూస్తుంటే ఏదో కొత్త లోకంలోకి అడుగుపెట్టినట్టుంది," అంది అన్నపూర్ణేశ్వరి.

"మేం బాగున్నాం అమ్మా! ఇంత కాలానికైనా మమ్మల్ని చూడాలన్పించి వచ్చావ్. చాలా సంతోషంగా వుంది." అన్నాడు చెమర్చిన కళ్ళు తుడుచుకుంటూ ఆనందంగా గోపాల్.

పలకరింపులు కాగానే అంతవరకూ తమ పక్కనే ఆగిన తెలుగు వాళ్లయిన దంపతులకు కృతజ్ఞతలు చెప్పాడు గోపాల్. రొటీన్ గా వాళ్ళూ పలకరించి అన్నపూర్ణేశ్వరికి శుభాకాంక్షలు చెప్పి బయలుదేరారు. ఆ దంపతులను ఓసారి తమ ఇంటికి రమ్మని ఆహ్వానించాడు గోపాల్. వాళ్ళు సరేనని చెప్పి తమ బిజినెస్ కార్డ్ ఇచ్చి బయటకు దారితీశారు.

తల్లి చేతిలో నుంచి ట్రాలీ తను తీసుకున్నాడు గోపాల్. అత్తగారి చేయి పుచ్చుకుని నడిపించింది సత్యవతి.

"అదేమిట్రా అబ్బాయ్! బయలుదేరినప్పట్నుంచి రాత్రే కాలేదు. సూర్యుడు కన్పిస్తూనే ఉన్నాడు. ఈ దేశంలో చీకటి పడదా?" అనడిగింది కొడుకు పక్కనే నడుస్తూ అన్నపూర్ణేశ్వరి.

"అలాంటిదేం లేదమ్మా" అంటూ నవ్వేశాడు గోపాల్.

"మనలాగే ఇక్కడా పగలూ, రాత్రి వున్నాయి. కాదంటే నువ్వు ప్రయాణించిన విమానం సూర్యుడితోబాటే పశ్చిమంగా ప్రయాణం చేయడం చేత నీకు పొద్దు కనబడుతూనే ఉంది.

ఇప్పుడు మనకిక్కడ మధ్యాహ్నం టైం గదా, ఇదే టైం లో మనకక్కడ ఇండియాలో అర్ధరాత్రి సమయం" అంటూ వివరించాడు.

"ఇంతకీ మనం వుండేది ఈ ఊరేనా?" అడిగింది అనుమానంగా.

"లేదమ్మా! ఇక్కడికి చాలా దూరం. నిన్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చాం. ఇది న్యూయార్క్ నగరం. మేం ఉండేది డెట్రాయిట్. మనం ఇప్పుడు పక్క ఏర్ పోర్ట్ లో ఆ వూరికి వెళ్ళే మరో విమానం ఎక్కాలి."

"మళ్ళీ విమానమా... అమ్మో! నా వల్ల కాదురా తండ్రీ! నిద్ర ముంచుకొస్తుంది. మన ఊళ్ళో నిద్రపోయే టైం కదా. కళ్ళు మూతలుపడుతున్నాయి." అంది ఇబ్బందిగా చూస్తూ.

అప్పటికి ఏర్ పోర్ట్ లోంచి బయటకొచ్చారంతా.

ఏం చేద్దాం అన్నట్లు భార్య ముఖంలోకి చూశాడు గోపాల్.

"ఓ పని చేద్దాం. టికెట్స్ కాన్సిల్ చేయండి. అద్దె కారులో వెళ్ళిపోదాం అత్తయ్య నిద్రపోతారు" అంది సత్యవతి.

"మళ్ళీ కారు ఎందుకురా డబ్బు దండగ? ఇక్కడి నుంచి మీ వూరికి బస్సులుండవా?" అనడిగింది అన్నపూర్ణేశ్వరి.

"లేదు అత్తయ్యా! మనదేశంలోలాగ ఇక్కడ పబ్లిక్ సర్వీస్ లుండవు. అవసరాన్ని బట్టి బస్సయినా, కారయినా బుక్ చేసుకోవాల్సిందే. టాక్సీలు దొరుకుతాయి గానీ రేటెక్కువ. అందుకే ఈ దేశంలో కారు లేకుండా ఎవరూ వుండరు. మన ఇంట్లోనే నాలుగు కార్లున్నాయి." అంది సత్యవతి.

ఈ లోపల గోపాల్ తనకు తెలిసిన ట్రావెలింగ్ ఏజన్సీకి ఫోన్ చేసి డ్రయివర్ తో సహా కారు పంపించమని చెప్పి తల్లిని, భార్యని అక్కడే ఉండమని చెప్పి తను ఏర్ టికెట్స్ కాన్సిల్ చేసుకుని వచ్చాడు.

ఫోన్ చేసిన పావుగంటకి కారు ఏర్ పోర్ట్ కి వచ్చి రెడీగా వుంది. గోపాల్ తిరిగి వచ్చేసరికి సత్యవతి, అన్నపూర్ణేశ్వరి కారువద్ద నిలబడి ఉన్నారు.

అంతా కారులో కూర్చున్నారు. కారు బయలుదేరింది. అది ఖరీదైన కారు. ప్రయాణం సుఖంగా వుంది.

"పిల్లలిద్దర్నీ కూడా తీసుకురావలసింది" అంది రిలాక్స్ గా సీటుకి జేరబడుతూ ఆవిడ.

"వాళ్ళిద్దరూ ఇంటి దగ్గర మనకోసం ఎదురుచూస్తుంటారు. నువ్వే చూస్తావ్ గా" అన్నాడు గోపాల్.

న్యూయార్క్ వీధుల్లో ప్రయాణిస్తుంటే ఆకాశాన్ని తాకుతున్నట్టున ఆ భవనాలు, అక్కడి రోడ్లు, ప్రజల్ని అబ్బురంగా చూస్తోంది ఆవిడ. నగరం దాటేసరికి ఎనిమిది లైన్ల రోడ్లు. చిన్నకుదుపు కూడా లేని కారు ప్రయాణంలో క్రమంగా నిద్రలోకి జారుకుంది అన్నపూర్ణేశ్వరి. కారు వేగంగా డెట్రాయిట్ నగరం దిశగా దూసుకుపోతోంది.

న్యూయార్క్ సిటీ దాటక మునుపే మగత నిద్రలోకి జారుకున్న అన్నపూర్ణేశ్వరి తిరిగి మెలకువ వచ్చేసరికి కారు డెట్రాయిట్ నగర వీధుల్లో ప్రయాణిస్తోంది.

బాగా నిద్రపోవడం వలన అలసట తగ్గి ముఖం కాంతివంతమైంది. కొత్త ఉత్సాహం ఏర్పడింది. లేచి సరిగా కూర్చుంటూ వాటర్ బాటిల్లోంచి కొంచెం మంచినీరు తీసి ముఖం తుడుచుకొని నీరు తాగింది.

"ఏరా అబ్బాయ్! ఏ వూరురా ఇది?" అనడిగింది వీధిలో వెనక్కి పోతున్న ఎత్తయిన భవనాల్ని, అక్కడి జనాన్ని చూస్తూ ఆమెకు సత్యవతి బదులిచ్చింది.

"డెట్రాయిట్ నగరం వచ్చేశాం అత్తయ్యా! కాసేపట్లో చేరుకుంటాం" అంది.

"అబ్బ! ఏం వూరు, ఏం లోకమో తల్లీ! ఊరు కాని ఊరు, దేశం కాని దేశంలో ఇక్కడ ఎలా ఉంటున్నారోగానీ, చూద్దామంటే ఎక్కడా చీరకట్టిన ఆడాళ్ళే లేరు. ఎక్కడ చూసినా, గౌన్లు, ఫ్రాకులు, ప్యాంట్లు. ఇంతకీ నా మనవడు, మనవరాలు లక్షణంగా మన పద్ధతుల్లోనే వున్నారా, లేక ఇక్కడి పిల్లల్లా ఆ పిచ్చిపిచ్చి డ్రస్సులేనా?" కూపీలాగుతున్నట్టు అడిగింది.

"అమ్మా! మా పిల్లలు మాలాగే ఉంటారు. మన పద్ధతుల్లోనే పెరిగారు. నువ్వే చూస్తావ్ గా?" అంటూ గోపాల్ జవాబు చెప్పాడు.

"ఈ ఊళ్ళో మన తెలుగు కుటుంబాలు ఇంకా ఏమన్నా వున్నాయా. మీరు ఒక్కళ్ళే ఉంటున్నారా?" మరో ప్రశ్న.

"ఇక్కడ ఏభై కుటుంబాల వరకూ వున్నారు. వీళ్ళుగాక చదువుకోవడానికి వచ్చిన స్టూడెంట్స్ కూడా వుంటారు. మనకు తెలిసిన కుటుంబాలు పదివరకూ వున్నాయిక్కడ. నీకు కాలక్షేపానికి ఇబ్బంది వుండదులే. కొందరు నీ వయసు వాళ్ళు కూడా ఉన్నారు" అంటూ నవ్వాడు గోపాల్. మాట్లాడుతూ ఉండగానే కారు తమ ఇంటి గేటును సమీపించింది.

ఆటోమాటిక్ గా తెరుచుకున్న గేటు తలుపులు, గేటు లోనకు వెళ్ళగానే వాటికవే మూసుకున్న తలుపులు, విశాలమైన తోట మధ్యలో రాజభవనం లాంటి ఆ ఇల్లు అంతా తన కళ్ళను నమ్మలేనంత ఆశ్చర్యంగా చూస్తోందావిడ.

"ఏమిటే అమ్మాయ్ సత్యవతీ! మన ఇంటికి వెళుతున్నామన్నారు. చూస్తే ఇదేదో ఖరీదైన హోటల్లా కనబడుతోంది" అంటూ ఉండబట్టలేక అడిగేసింది కూడా.

"హోటల్ కాదు అత్తయ్యా! ఇదే మన ఇల్లు. చుట్టూ పదెకరాల ఈ తోట, భవనం అన్నీ మనవే. అదో... పోర్టికోలో అనంతసాయి, సాయిశివానీలు మనకోసం ఎదురుచూస్తున్నారు చూడు" అంటూ అటు చూపించింది.

చూస్తున్నంతలోనే రివ్వున వచ్చి పోర్టికోలో ఆగింది కారు.

అన్నాచెల్లెల్లిద్దరూ పోర్టికోలో నిలబడి ఎదురుచూస్తున్న మాట నిజమే. అనంత్ సింపుల్ గా జీన్స్ పాంటు, షర్టులో నీట్ గా తయారయి వున్నాడు. శివాని చక్కగా పూల డిజైన్ తో కూడిన లంగా, ఓణీలో పుత్తడిబొమ్మలా మెరిసిపోతోంది. ఎంతో ముచ్చటగా వున్న మనవడు, మనవరాలిని చూసి మురిసిపోయింది అన్నపూర్ణేశ్వరి.

అంతా కారు దిగారు.

అనంత సాయి, సాయిశివాని ఇద్దరూ వచ్చి "నాయనమ్మా! బాగున్నావా" అంటూ వంగి పాదాలకు నమస్కరించారు.

(...ఇంకా వుంది)

మరిన్ని సీరియల్స్
Fifth Part