Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Eleventh part

ఈ సంచికలో >> సీరియల్స్

ఐదవ భాగము

Fifth Part

"మేడమ్...! పత్రికల్లో వచ్చే రివ్యూల్ని... గాసిప్స్ ని ఎదగాలనుకునే ఏ నటీ పట్టించుకోదు. సకలకళల సమాహారమైన సినీ సృజన భావోద్వేగాల హృదయావిష్కరణ. రెండు రెండు కలిస్తే నాలుగు... అది గణితం. కానీ, సినిమాలో మాత్రం ఆలెక్క ఎప్పుడూ తప్పే. ఒక్కోసారి రెండు రెళ్ళు ఆరు కూడా అవొచ్చు - మీ అభిమాని"

అచ్చం తన భావాల్నే అక్షరాలుగా మార్చి మెసేజ్ పంపించాడు. తన ఎదుగుదలని ఇంత దగ్గరగా చూస్తూ ఇంతలా సంతోషిస్తున్న అభిమాని ఎవరు? గుండెల్లో ఎగిసిపడే ఆనందంతో తను తుల్లిపడుతున్నవేళ తనూ ఆనందపడుతూ... మనసుకి చీకట్లు కమ్మి బాధపడుతున్న తరుణంలో తనూ అలాగే ప్రతిస్పందిస్తూ... తన వెన్నుదన్నుగా నిలుస్తున్నాడు. మెసేజ్ ల ద్వారా ఓదారుస్తున్నాడు.

తనకి నా సెల్ నంబర్ ఎలా తెలిసింది? సిల్వర్ స్క్రీన్ సెలబ్రెటీల సెల్ ఫోన్ నంబర్లు అందరికీ అందుబాటులో ఉంటాయనుకున్నా... తనిపుడిపుడే ఎదుగుతున్న హీరోయిన్. అతడు తనకు పంపిస్తున్న మెసేజ్ లను బట్టి చూస్తుంటే తన ప్రెస్ మీట్ లను... సిన్మాలను... రివ్యూలను ఎంతో శ్రద్ధగా గమనిస్తున్నట్లు కనిపిస్తున్నాడు.

అజ్ఞాతంలో ఉండి కూడా అండగా ఉంటున్నాడు. గాయత్రీపాటిల్ కి ఎంతో ఆనందం అనిపించింది. 

"మేడమ్... ఇవాళ రాత్రి ఎనిమిదిన్నరకి టీవీ థర్టీన్ వాచ్ చేయండి. బహుశా... మీ గురించే ప్రోగ్రామ్ వస్తోందని నా గెస్ - మీ అభిమాని'

ఆర్ ఎఫ్ సి లో డ్యూయెట్ పిక్చరైజేషన్ లో యమబిజీగా ఉన్న గాయత్రీపాటిల్ షూటింగ్ కంప్లీట్ చేసుకుని తను బసచేస్తున్న స్టార్ హోటల్ కి కార్లో వస్తుండగా... ఆమె సెల్ లో మెసేజ్.

టైం చూసుకుంది గాయత్రీపాటిల్. ఆరున్నర. అంటే, ఇంకో రెండుగంటల్లో ఆ ప్రొగ్రామ్ టెలికాస్ట్ అవుతుందన్నమాట. అన్ నోన్ ఫాన్ అందించిన కబురది. 'తనలో ఏముందని... ప్రపంచం ఇంతలా మాట్లాడుతోంది?' అనుకుందామె. మొదట్లో తన పేరు పేపర్లలో పడడం... తను చానెల్స్ లో కనిపించడం ఎగ్జయిటింగ్ గానే ఉండేది. అయితే, ప్రతిరోజూ ఎక్కడో అక్కడ వినిపించడం... కనిపించడం జరుగుతుంటే... ఈమధ్య అంత 'కిక్' కలగడం లేదు.

కానీ... ఇవాళ తన గురించి ఓ ప్రొగ్రామ్ వస్తోందని వెరీ స్పెషల్ గా తన అభిమాని మెసేజ్ పంపించడంతో ఆమెకి ఆ ప్రొగ్రామ్ పై క్యూరియాసిటీ పెరిగింది.

"ఎంతసేపట్లో వెళ్తాం?" డ్రయివర్ ని అడిగింది గాయత్రీపాటిల్.

"ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో..."

"అంటే... హోటల్లోని తన రూం కి చేరి కాళ్ళూచేతులూ ముఖం కడుక్కుని పొగలు కక్కుతున్న వేడివేడి కాఫీ తాగుతూ రిలాక్స్ డ్ గా ఆ ప్రొగ్రామ్ వాచ్ చేయొచ్చన్నమాట" అనుకుందామె.

హోటల్ రూం చేరుకున్న వెంటనే ఆమె చేసిన మొదటి పని టీవీ స్విచ్చాన్ చేసి టీవీ ధర్టీన్ చానెల్ పెట్టింది.

'ఒక్క సినిమాతోనే సీనియర్ల గుండెల్లో గుబులుపుట్టిస్తున్న జూనియర్'

'వన్ ఇయర్ వరకూ కాల్ షీట్స్ ఖాళీలేని బిజీ షెడ్యూల్'

'కుర్రపిల్ల సమంతకి ఎసరుపెడ్తున్న కొత్త తార?'

ఆ నవయువతార గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? కమింగ్ అప్ 'టాకీటాక్'లో... స్క్రోలింగ్ రన్ అవుతూ ఉంది.

గాయత్రీపాటిల్ కి ఇప్పుడిప్పుడే తెలుగు కొంచెం కొంచెం అర్ధమవుతోంది. 'వరుసపెట్టి తెలుగు సినిమాలు చేస్తున్నప్పుడు కాస్తయినా తెలుగు నేర్చుకోవడం కంపల్సరీ' అనుకుందామె.అందుకే, షూటింగ్ స్పాట్ లో తెలుగు పండితుడిలాంటి అసిస్టెంట్ డైరక్టర్ దగ్గర తెలుగు నేర్చుకుంటోంది. తీరిక దొరికిన సాయం సమయాల్లో ఓ ట్యూటర్ ని రప్పించుకుని మరీ తెలుగు పాఠాలు నేర్చుకుంటోంది. ఎన్ని తెలుగు సినిమాలు చేసినా ఇప్పటికీ తెలుగులో ఒక్క వాక్యమైనా మాట్లాడలేని చెన్నయ్ సుందరి త్రిషలా, గోవా బ్యూటీ ఇలియానాలా కాకుండా... చార్మిలా, తాప్సీలా, తమన్నాలా ఎప్పటికైనా తన కేరెక్టర్లకు తనే డబ్బింగ్ చెప్పుకోవాలన్నది గాయత్రీపాటిల్ ఆశ. 'రాఖీ' సినిమాలో చార్మి, 'మిస్టర్ పర్ ఫెక్ట్', 'మొగుడు' సినిమాల్లో తాప్సీ, 'హండ్రెడ్ పర్సంట్ లవ్' సినిమాలోని కొన్ని సీన్లకు తమన్నా డబ్బింగ్ చెప్పి తమనింతగా ఆదరిస్తున్న తెలుగు ఇండస్ట్రీ పట్ల ప్రేమని వ్యక్తం చేస్తున్నారు. అన్నట్టు... ఆకోవలోకే నిత్యామీనన్ కూడా. తన డెబ్యూ మూవీ 'అలా మొదలైంది' లో తన కేరెక్టర్ కి తను డబ్బింగ్ చెప్పుకోవడమే కాకుండా... ఆ సినిమాలో ఒకట్రెండు పాటలు కూడా పాడి హిస్టరీ క్రియేట్ చేసింది. లేటెస్ట్ గా నయనతార 'కృష్ణం వందే జగద్గురుం' సినిమాలో తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకుంది.

"వాళ్ళలాగే తనూ త్వరలో తన కేరెక్టర్లకి డబ్బింగ్ చెప్తానని గాయత్రీపాటిల్ అసిస్టెంట్ డైరక్టర్ దగ్గర చెప్తే అతడు నవ్వి - "ముదితల్ నేర్వగరాని విద్యకలదే..." అన్నాడు ప్రశంసాపూర్వకంగా. ఆ తర్వాత... 'సాధనమున పనులు సమకూరు ధరలోన...' అని చెప్తూ - "మీరు సాధిస్తారు" అని విష్ చేసాడు.

ఎనిమిదిన్నరయింది.

టీవీ స్క్రీన్ పై ప్రత్యక్షమైన యాంకర్ నవ్వుతూ - "హాయ్ వ్యూవర్స్! వెరీవెరీ ఇంట్రస్టింగ్ గా సాగుతున్న 'టాకీటాక్' ప్రొగ్రామ్ కి స్వాగతం. సమంతకు ఎసరుపెడ్తున్న కొత్తతార... ఇదే ఇవాల్టి టాపిక్. ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ లో వండర్స్ క్రియేట్ చేసిన కుర్రపిల్ల సమంతని ఎర్రెర్రని సిమ్లా యాపిల్ డీ కొడ్తోంది. ఆ పిల్ల కూడా తన మొదటి సిన్మాతోనే యూత్ ఆడియన్స్ హార్ట్ త్రోబ్ గా నిలిచింది. ఆ సినిమా రిలీజై సక్సెస్ సాధించడంతో... ఇపుడా పిల్ల చేతుల్లో నాలుగు సినిమాలున్నాయి..."

"నాలుగా... ఇపుడు తను చేస్తుంది రెండు సినిమాలే కదా!" అనుకుంది గాయత్రీపాటిల్.

"ప్రస్తుతం రెండు సినిమా షూటింగుల్లో బిజీగా ఉన్న ఈ యువనటి ఇటీవలే తను విన్న స్టోరీల్లోంచి రెండు కథల్ని ఓకే చేసినట్లు సమాచారం. త్వరలో ఈ రెండు సినిమాల నిర్మాణం మొదలవబోతోందని ఫిల్మ్ నగర్ భోగట్టా"

తనకు తెలీకుండానే తనగురించి అనర్ఘలంగా అబద్దాలు చెప్తుంటే గాయత్రీపాటిల్ కి ఆశ్చర్యం కలిగింది.

"ఎంట్రీతోనే సక్సెస్ ని సొంతం చేసుకున్న ఈ యువతార విజయతారగా తిరుగులేని గుర్తింపు పొందిన సమంతకి గట్టిపోటీనే ఇస్తోంది" యాంకర్ చెప్పడం ఆపగానే 'ఏం మాయచేసావే...' సిన్మాలోంచి సమంత సాంగ్ ప్లే చేసారు.

మళ్ళీ స్క్రీన్ పై యాంకర్ కనిపించి...'క్యూట్ లుక్స్... హస్కీ వాయిస్ తో గాయత్రీపాటిల్ కూడా ఆడియన్స్ మీద తనదైన ప్రగాడముద్రనే వేసిందని చెప్పాలి. మొదటి సినిమాలో ఆమెని చూసి కుర్రకారు పీకల్లోతు ప్రేమలో పడిపోయారు. రాత్రికి రాత్రే ఎంతో మంది అభిమానులుగా తయారై ఆమె నెక్స్ ట్ మూవీ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూపులు చూస్తున్నారు. ఆమె సెల్ నంబరు, ఇ మెయిల్, ఫేస్ బుక్ అడ్రస్ లు సంపాదించిన కొంతమంది ఆమెతో నిత్యం టచ్ లో ఉండేందుకు తెగ తాపత్రయపడ్తున్నారు..." అంటూ చెప్పుకొచ్చింది. ఆ వెంటనే... గాయత్రీపాటిల్ నటించిన ఫస్ట్ మూవీలోంచి ఓ సాంగ్ ప్లే చేసారు.

"నువ్వే ప్రాణం... నువ్వే ప్రణవం... నువ్వే నా స్వప్నం... నువ్వే నా స్వర్గం" అంటూ మనసుకి నచ్చిన హీరోని ఉద్దేశించి సినిమాలో హీరోయిన్ పాడిన పాట అది. ఆ పాటంటే గాయత్రీకి కూడా ఎంతో ఇష్టం. అందుకే, తన ముబైల్ రింగ్ టోన్ గా ఆ సాంగ్ నే పెట్టుకుందామె. ఇపుడాపాట ప్లే అవుతున్నంతసేపూ ఆమె కూడా హమ్ చేస్తూనే ఉంది.

తర్వాత... సినిమా పట్ల గాయత్రీపాటిల్ చూపిస్తున్న ఫాషన్, డెడికేషన్, కమిట్ మెంట్ తొందర్లో ఆమెని సూపర్ హీరోయిన్ ని చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. ఇబ్బడిముబ్బడిగా సినిమాలు ఒప్పుకుని కాల్షీట్లు కేటాయించి హెల్త్ అప్ సెట్ అయి సకాలంలో వాటిని కంప్లీట్ చేయలేక లాంగ్ లీవ్ తీసుకున్న సమంతకి గాయత్రీపాటిల్ ఎంట్రీ ఎదురులేని దెబ్బే. సమంతతో సినిమాలు తీద్దామనుకుంటున్న ఒకరిద్దరు ప్రొడ్యూసర్లు ఆమెకి బదులు గాయత్రీపాటిల్ తో తీయాలనే ఉద్దేశంతో ఉన్నారని మా రిపోర్టర్ సంపత్ చెప్తున్నాడు... యాంకర్ చెప్పగానే సంపత్ స్క్రీన్ మీద ప్రత్యక్షమయ్యాడు.

"దేవీ... ఏ ముహూర్తంలో గాయత్రీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిందో కానీ... అప్పట్నుంచీ ఆమెకన్నీ శుభశకునాలే. రిలీజైన మొదటి సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టడంతో... 'గోల్డెన్ లెగ్' అని ఆమెకి పేరొచ్చింది. అంతేకాదు... సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తన లేటెస్ట్ మూవీలో గాయత్రీపాటిల్ ని తీసుకోవాలని ప్రొడ్యూసర్లని వత్తిడి చేస్తున్నాడని మనదగ్గర సమాచారముంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే... గాయత్రీపాటిల్ తెలుగు ఇండస్ట్రీలో తిరుగులేని కథానాయిక అవుతుందనడంలో ఆశ్చర్యమేం లేదు... ఓవర్ టు స్టూడియో" అన్నాడు సంపత్.

"ముందొచ్చిన చెవులకన్నా వెనుక వచ్చిన కొమ్ములు వాడి అని ఎవరన్నారో కానీ... గాయత్రీపాటిల్ విషయంలో అదే నిజమనిపిస్తోంది. ఇదీ ఇవాళ్టి టాకీటాక్. మళ్ళీ మరిన్ని ఇంట్రస్టింగ్ విషయాల్తో మరో ఎపిసోడ్ లో కలుద్దాం. బాయ్" చెప్పింది యాంకర్.

ఇపుడు చేతులో ఉన్న రెండు సినిమాలే కాకుండా... మరో రెండు సినిమాలు కూడా రాబోతున్నాయని... త్వరలో మహేష్ బాబు సరసన కూడా యాక్ట్ చేసే అవకాశం ఉందని చానెల్ చెప్పిన జోస్యం నిజం కావాలనుకుంటూ గాయత్రీపాటిల్ అలా బెడ్ మీద వాలిందో లేదో... ఇలా ఫోన్ రింగైంది.

"మేడమ్... నా పేరు రాణి. అపూర్వ క్రియేషన్స్ నుంచి మాట్లాడుతున్నా. బిజీగా ఉన్నారా?" పొలైట్ గా అడిగిందామె.

"నో...నో... చెప్పండి. విశేషాలేంటీ?" గాయత్రీపాటిల్.

"మా ప్రొడ్యూసర్ మీతో మాట్లాడతారట..."

"ఓకే..."

ఆమె ప్రొడ్యూసర్ కి కాల్ కనెక్ట్ చేసిన తర్వాత - "హలో..." అన్నాడు ప్రొడ్యూసర్ పీతాంబరరావు బొంగురు గొంతుతో.

"హలో..." చెప్పింది గాయత్రీపాటిల్.

"నీ మూవీ చూసాను. హ్యాట్సాఫ్. చాలా బాగా చేసావ్. మా ప్రొడక్షన్ లో నిన్ను హీరోయిన్ గా పెట్టి హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా ఒకటి తీద్దామనుకుంటున్నా. నువ్వు టైం ఇస్తే మా డైరక్టర్ తో వచ్చి నీకు స్టోరీ వినిపిస్తా" చెప్పాడతడు.

"ష్యూర్... నాకు తప్పకుండా మీలాటి ప్రొడ్యూసర్ల సిన్మాలు చేయాలనుంది. రేపు సండే నేను ఫ్రీనే. మనం కలుద్దాం..." చెప్పిందామె.

అతడు 'థాంక్స్' చెప్పి ఫోన్ పెట్టేశాడు.

"అరే... అచ్చం యాంకర్ చెప్పినట్లే అవుతోందే. చేస్తున్న రెండు సినిమాలకు తోడు మరో రెండు సినిమాల కథలు త్వరలో తనువినబోతోంది. అవికానీ వర్కవుటై షూటింగ్ మొదలైతే నాలుగు సినిమాలు చేస్తున్నట్లే. అనవసరంగా తొందరపడి యాంకర్ పై తను నోరుపారేసుకుంది... సారీ" తనలోతనే నవ్వుకుంటూ అనుకుంది గాయత్రీపాటిల్.

ఇంతలో... గువ్వపిట్టలా సెల్ ఫోన్ కువకువలాడింది. ఇన్ బాక్స్ లోకి తొంగిచూస్తే... అభిమాని పంపించిన మేరో మెసేజ్ - "మేడమ్... టాకీటాక్ చూసారనుకుంటాను. మీగురించి సూపర్బ్ గా వచ్చింది కదూ - అభిమాని" అని ఉంది.

అంతేకాదు... నెక్స్ ట్ వీక్ వచ్చిన 'నవతార' పత్రికలోనూ ఇంచుమించు ఇదే మాట కవరవడం గాయత్రీ గమనించింది.

ఆ ఆర్టికల్ రాసిన రిపోర్టర్ సుదర్శన్.

"ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో... అనుకుంటూ ఉంటాను ప్రతి నిముషమూ నేను" గాయని సునీత గులాబీ సినిమా కోసం పాడిన ఆ పాటని ఈవేళ గాయత్రీపాటిల్ హమ్ చేస్తోంది. సరిగ్గా ఆమె పెదాలంచున ఆ పాట తెలుగంత కమ్మగా జాలువారుతున్నప్పుడు... సడన్ గా ఆ అభిమాని గుర్తొచ్చాడు. 'ఈ వేళలో అతడేం చేస్తున్నాడో?' అనుకుంది ఆమె కూడా. ఇలా ప్రతిరోజు, ప్రతినిముషం, ప్రతి క్షణం ఆమె ఏ పనిచేస్తున్నా ఆ అభిమాని గుర్తొస్తూనే ఉన్నాడు. "ఏం మాయచేసాడతడు? మాటిమాటికీ గుర్తొస్తున్నాడు..." ముద్దుగా విసుక్కొంటోంది. "ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో..." అసలదేం పాట? పనిపాట లేకుండా అతడ్నే జ్ఞప్తి చేసుకోవడం ఏంటీ? ఆ అభిమాని మెసేజ్ పంపిస్తే ఓ ఆనందం... పంపకపోతే మూగవోయిన సెల్ ఫోన్ వంక మురిపెంగా చూస్తూ అదీ ఆనందమే. మెసేజ్ లు తప్ప కాల్ చేయడు. తను చేస్తే ఉలకడు... పలకడు. ఎందుకలా? అసలు తనేం చేస్తున్నాడు? అతడి గురించే ఆలోచిస్తోంది గాయత్రీపాటిల్.

"ఏమిటీ వింత మొహం?" తనని తాను కసురుకుంటూనే మనసు నెమ్మదిపరుచుకునేందుకు నానా ప్రయాస పడ్తోంది గాయత్రీపాటిల్. తను పుట్టి పెరిగిన సిమ్లాలో మగాళ్ళే లేరా? స్కూల్లో, కాలేజీలో అపుడపుడే మూతిమీదకి మీసమొస్తున్న కుర్రాళ్ళంతా వెనుకెనుకపడ్తూ తన అందానికి అభినందనలు చెప్తున్నా వాళ్ళని కన్నెత్తి చూళ్ళేదు. పన్నెత్తి పలకరించలేదు. అలాటి తను... ఊరుపేరు, ముక్కూ మొహం తెలీని ఓ వ్యక్తి కోసం ఇంత తపన పడ్తున్నదెందుకు? పంపించే సంక్షిప్త సమాచారాలద్వారా తన శుభాన్ని ఆకాంక్షిస్తున్నాడనా? తను నాలాగే ప్రతి క్షణం నాగురించే ఆలోచిస్తున్నాడనా... ఎందుకోసం అతడంటే ఇంత వెర్రితపన పడ్తోంది.

ఇలా అయితే... త్వరలో తను పిచ్చిదానిలా కూడా మారిపోవచ్చు. ప్రేమని అంతా అనుకునేది ఈ పిచ్చినేనా? సినిమాల్లో తరచూ చూపించేది కూడా ఇలాటి ప్రేమేనా?

ఆమె ఆలోచిస్తుంటే... "షాట్ రెడీ మేడమ్" దగ్గరికొచ్చి చెప్పాడు అసిస్టెంట్ డైరక్టర్. తర్వాత అడిగాడు - 'సీన్ పేపర్ చూసుకున్నారా?"

తెలుగు డైలాగ్స్ ని ఇంగ్లీష్ లో రాసుకుని ప్రొనౌన్సేషన్ ప్రాక్టీస్ చేసిన తర్వాతే కెమెరాని ఆమె ఫేస్ చేస్తుంది.

అతడలా అడగ్గానే తన చేతిలో గాలికి రెపరెపలాడ్తున్న పేపర్ వేపోసారి చూసింది.

"లేదు... ఏదో ఆలోచనలో పడి" చెప్పింది గాయత్రీపాటిల్.

'ఈ మధ్య మీరు చాలా పరాగ్గా ఉంటున్నారు. సిమ్లాకి దూరంగా ఉన్నాననే హోంసిక్ నెసా?" అడిగాడు అసిస్టెంట్ డైరక్టర్.

"ఊహూ... కాదు. అక్కడ కూడా చదువు కోసం హాస్టల్లోనే ఉండేదాన్ని కదా"

"మరి... ఇంతకుముందు మీరిలా ఉండేవాళ్ళు కాదు. సీన్ పేపర్ చేతికి రాగానే అందులో తలమునకలయ్యేవారు. ఇపుడు కెమెరా అక్విప్ మెంట్ తో సహా డైరక్టర్ రెడీగా ఉన్నా మీరు రెడీగా లేరు. సారీ టు సే... ఎందుకో మీ ఏకాగ్రత తగ్గుతోంది" అన్నాడతను.

"ఔను... నా కాన్ సంట్రేషన్ దెబ్బ తింటోంది. ఇక, అతడి గురించి ఏమాత్రం ఆలోచించకూడదు. ఔనూ... ఇదేమి చోద్యం? తెరపై కనిపించే నచ్చిన హీరోయిన్ కోసం అభిమానులు వెర్రెత్తిపోతారు. కానీ, ఆ హీరోయిన్లు మాత్రం అందని తారల్లా ఆ ఆకాశాన్నే ఉంటారు. మరి, తనేంటి? ఎవరో తెలీని ఓ అభిమాని కోసం ఇంతలా తపించిపోతుంది. వర్క్ పట్ల సిన్సియర్ గా ఉండాలి. తనని నమ్ముకుని లక్షల్లో రెమ్యునరేషన్ తో పాటు స్టార్ హోటల్ ఫెసిలిటీ ఇచ్చి సినిమా తీస్తున్న ప్రొడ్యూసర్ కి న్యాయం చేయాలి. తనే నాయికగా స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే సిద్ధం చేసుకున్న డైరక్టర్ కి కంప్లీట్ గా సహకరించాలి" గట్టి నిర్ణయం తీసుకుంది గాయత్రీపాటిల్.

తర్వాత అసిస్టెంట్ డైరక్టర్ వేపు తిరిగి - "ఈ రోజుకి నన్ను క్షమించు. రేపట్నుంచీ ఇది రిపీట్ కానివ్వను. ఓ టెన్ మినిట్స్ టైమిస్తే సీన్ పేపర్ చూసుకుని వస్తా" అంది దీనంగా అతడివేపు చూస్తూ.

"ఓకే మేడమ్... త్వరగా రెడీ కండి" అన్నాడతడు.

యాక్షన్ పార్ట్:

గార్డెన్ లో ఓ చెట్టు కింద నిల్చున్నాడు హీరో రాజా. అతడ్ని చూసిన హీరోయిన్ దూరంనుంచే పరిగెడ్తూ వచ్చి... అతడ్ని గట్టిగా హత్తుకుని -

డైలాగ్ పార్ట్ (హీరోయిన్):

'ఐ లవ్ యూ'

యాక్షన్:

హీరో ఆమెని విడిపించుకో ప్రయత్నిస్తాడు.

హీరోయిన్ అతడిని మరింత గట్టిగా కౌగిట్లో బంధిస్తుంది.

డైలాగ్:

హీరోయిన్: "కనిపించకుండా ఇన్నాళ్ళూ ఎక్కడికి వెళ్లిపోయావ్ రాజా. నీకోసం రాత్రీ పగలూ కన్నులు కాయేలా ఎంతలా ఎదురుచూశానో తెలుసా?"

హీరో: సారీ... ఇపుడు నీ కంట నేపడతాననుకోలేదు.

హీరోయిన్: ఇంకా నాపై కోపం పోలేదా?

హీరో: ఈ జీవితంలో పోదు

హీరోయిన్: అంత తప్పు నేనేం చేశాను? నిన్ను ప్రేమించడమే నేను చేసిన తప్పా?

హీరో: అది నేను చేసిన తప్పు

హీరోయిన్: రాజా... అంత మాటనకు. ఈ నింగీనేల సాక్షిగా మనం కలిసే జీవిద్దాం... కలిసే చద్దాం

హీరో: మొదటిది కుదరదేమో?

హీరోయిన్: నువ్వు నా మెళ్ళో మూడుముళ్ళు వేస్తానంటే రెండోదానికి నేను సిద్ధమే.

హీరో: నువ్వు జగమొండివి

హీరోయిన్: నీకన్నానా?

యాక్షన్:

హీరో హీరోయిన్ ని దగ్గరకి తీసుకుని ఆమె చెక్కిలిపై ముద్దు పెట్టుకుంటాడు.

'అమ్మో... కిస్ సీన్' హడలిపోయింది గాయత్రీపాటిల్.

'కిషోర్...' అసిస్టెంట్ డైరక్టర్ ని పిలిచింది.

"మేడమ్..." వచ్చాడతను.

"ఈ సీన్ డైరక్టర్ గారు ఓకే చేసిందేనా?"

"ఆ డౌటెందుకొచ్చింది?"

(...ఇంకా వుంది)

మరిన్ని సీరియల్స్
Anachhadita