Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Fifth Part

ఈ సంచికలో >> సీరియల్స్

అనాచ్ఛాదిత - వాడ్రేవు చిన వీరభద్రుడు

Anachhadita

చైత్రమాసపు తొలిజాముల ఎండ. పైని వేపాకులూ, రావి ఆకులూ గలగల్లాడుతున్నాయి. చిలకలు వేప పిందెల్ని కొరికి పడేస్తున్నాయి. ఎక్కణ్ణుంచో బంబర్లలోంచి ఆవుల అరపులు విన్పిస్తున్నాయి. పక్కన టైలరు శంకరమూర్తి మిషను చప్పుడు. పంచాయితీ ఆఫీసు దగ్గర పెద్దమనుషులు రాజకీయ చర్చల్లో వున్నారు. చెరువు నుంచి నీళ్ళు తెచ్చుకుంటున్న ఆడవాళ్ళు నెమ్మదిగా పలచబడుతున్నారు - ఆమెత్తని గ్రామీణ నిరవతలో నెమ్మదిగా కరిగిపోతూ కునుకులోకి జారిపోయాను. ఎంతసేపో తెలీదు గాని. "ఏమిటలా మొద్దులా. ఎంతలేపినా, ఎండకి మంచం నీడలోకి లాగుతాను". ఒదులుగా అల్లిన జడ చెంపల మీంచి ముందుకు జారి వూగుతుంటే, ఎప్పటిలాంటి తేట నవ్వుతో తీయని అర్ధం లేని ప్రశ్నలు కురిపిస్తూ పార్వతి. కళ్ళలో అలముకొంటోన్న మధ్యాహ్నపు అలసట ఆ కోల పెదాలమీద ఆ నిర్మలమైన చిరునవ్వుతో చిలిపితనమో, వేదనో తెలియని ఒక నీల ఛాయ. నీళ్ళు తేవడం వల్ల తడిసిన భుజాల రహస్యమయిన పలకరింపు. "లేవండి, లేవండి...' అంటూ కదిలిపోబోయింది కాని ఆమె కొంగు అందుకున్నాను. "ఏమిటిది? పొద్దుటిపూటా, మీ అమ్మగారు ఇప్పటికే రెండుసార్లు కబురు చేశారు."

"ఇక్కడికి రాలేదని చెప్పాను మీ నాన్నగారు బహుశా వీధులన్నీ గాలిస్తున్నారేమో కూడాను. ఈ పడుకునేదేదో హాయిగా ఆ ఇంట్లో పరుపుల మీద..." ఎక్కువ మాట్లాడేందుకు బద్ధకం - అట్లానే ముందుకు వంగి ఆమె మెత్తని పొట్టమీద ముద్దుపెట్టుకున్నప్పుడు మాత్రం పార్వతి ఏమీ మాట్లాడదు. నేను ఎప్పుడూ గమనించలేదు గాని, బహుశా ఆ క్షణాన ఆమె నిండయిన వివశత్వంతో నిశ్చల అయిపోతుంది కాబోలు. ఆ కళ్ళు అరమోడ్పుగా ఏదో దూరశాంత పుష్పం పైని వాలిన సీతాకోకచిలుకలల్లే నిలుస్తాయి కాబోలు. ఒక్కక్షణం. అంతే. ఇంతలో చంచలాలయి కదిలిపోతాయి. రద్దీ, రోడ్డు మీద బస్సు హారన్లు. పక్కన టైలరు మిషను చప్పుడు ఇంట్లో వాళ్ళ కదలికలు, చూపులు, "వుండండి, మీ అమ్మగారు వస్తున్నట్లున్నారు." పార్వతి వోణీ, జడా సవరించుకొని హడావిడిగా వెళ్ళిపోయింది. నాకు ఇంక పడుకోవాలనిపించలేదు. బయటకు వచ్చాను. ఇంటికి వెళ్లాలనిలేదు. ఆకలిగా అన్పించక అలా దూరంగా పొలాల వేపు నడవడం మొదలుపెట్టాను. కాని, ఇంతలోనే వెనుకనించి చప్పట్లు "చినబాబుగారు, మిమ్మల్ని అయ్యగారు అర్జంటుగా రమ్మంటున్నారు" అంటూ. నాన్న పంచాయితీ సర్పంచ్ కావడం కాదు గాని, ఆ రాతకోత లన్నీ నా చేత చేయిస్తుంటాడు.

నేను సెలవుల్లో వచ్చిన నాలుగు రోజులూ ఆ హడావిడి తప్పదు. "ఒరే, యీ దస్తావేజు కాస్త రాసిపెట్టు" నేనింకా వాకిట్లో వుండగానే అరుగు మీంచి పిలిచాడు నాన్న ఇంకా అరుగుమీద, కరణంగారూ, అప్పల నరసింహరాజూ, నరసింహరాజూ, వెంకట్రామయ్య వీళ్ళు కాక పాలేర్లూ, మందీ మార్బలమూను. అప్పల నరసింహరాజు నన్ను చూస్తూనే "చినబాబుగారూ, మీ చేతుల్తో రాస్తే జయప్రదమవుతుందండీ" అన్నాడు. తండ్రి అయినందునో, మరెందువల్లనో గాని, అతని చూస్తే కొద్దిగా ఇబ్బంది అన్పిస్తుంది. పేరుకు ఇంటి యజమాని గానీ, అతనెప్పుడూ ఇంటిని పట్టించుకున్న పాపాన పోలేదు. వ్యవసాయం సరేసరి ఎప్పుడూ పేకాట కోడిపందాలు, ఒకదాన్లోంచి మరొక దాన్లోకి, అక్కడ నష్టాన్ని ఇక్కడ పూడుస్తూ. కాని ఎన్నడూ దాన్నుంచి బాగుపడ్డవాడు మాత్రం కాదు, గడుస్తున్న కొద్దీ ఒక్కో ఎకరమూ అమ్ముకొస్తున్నాడు.

దస్తావేజు రాయడం పూర్తి అయింది. రాజుగారి పొలాల్ని సోమినాయుడికి తనఖా దస్తావేజు. సోమినాయుడు తూర్పుకాపు. విజయనగరంలో రాజుగారి బంధువులకు తెలిసినవాడు. అతన్ని రాజుగారే కౌలుదారుగా తీసుకొచ్చాడు. మొదట్లో రాతకోతలేవీ వుండేవి కావు. ఇప్పుడు సోమినాయుడు పెద్ద కామందు అవుతున్నాడు. భయం కొద్దినో, భక్తికొద్దినో రాజుగారికి మాత్రమే కౌలు చేస్తున్నాడు. 'ఇందుకు సాక్షులు' అని నాన్నగారు, వెంకట్రామయ్య సంతకాలు చేశారు. పౌరహిత్యంతో పాటు, వెంకట్రామయ్యకి ఇలాంటి వ్యవహారాల్లోంచి కొంత ఆర్జన చేస్తూ వుంటాడు. 'దస్తూరి అని నా సంతకం చేస్తుంటే రాజుగారు ఆ కాగితం మీద ఏభయి రూపాయల నోటు పెట్టాడు. 'తీసుకోండి చినబాబు అంతకు మించి ఇవ్వలేకపోతున్నాను' అన్నాడు. నేను తలెత్తకుండానే 'ఎందుకు రాజుగారు, నాలుగు వాక్యాలు రాయగలను కనుక రాసాను. ఇందులో ఘనకార్యమేముంది? మీరు మాత్రం రాసుకోలేరా; ఏదో నాన్న గారి గౌరవం కొద్ది వొచ్చారు తప్ప మీదగ్గర వుంచండి' అని ఒక్క క్షణం ఆగి 'అసలే అప్పు చేస్తున్నారు కూడాను' అన్నాను.

రాజుగారు గాంభీరంగా నవ్వాడు. ఆ నవ్వులో ఆయన పూర్వీకుల శౌర్యం, దర్పం, మూర్ఖ త్యాగం కదలాడాయి. ఇప్పుడిప్పుడే నెరుస్తున్న మీసంలోకి ఆ నవ్వు ఇంకిపోయేక, "చినబాబంటే నాకెందుకో ఇష్టముండి సర్పంచుగారూ. అంతా మీ పోలికే' అని 'బాబు వుంచండి మంచి పూట కలం కనుక్కోండి?" అన్నాడు. నేను తలెత్తి చూసాను. అతని నల్లని దట్టమైన ముఖంలో శ్రమించి పైకి వచ్చే వాడి కఠోరత్తవంతో పాటు, కుటిలత్వమో, అమాయికతో తెలియని కొంత అసృష్టతా వుంది. మోహంలో చేరుకున్న ముడతల్లో అనుభవాలు నేర్పుతూన్న లౌక్యమూ కన్పిస్తుంది. "ఏదీ, ఇంకా చదువులున్నాయట, అయినా వాడికి వయసే మాత్రమని' అన్నాడు నాన్న. ఆ వాక్యానికి అప్రయత్నంగా నవ్వుకున్నాను. సిగ్గుపడ్డాను. కూడా. నాన్న కళ్ళకి ఇంకా చిన్నగానే వున్నానా? సినిమా వాల్ పోస్టర్లతో మకిలి పట్టిన పట్టణాల గోడలూ, రంగు రంగుల అలంకారాల్తో తిరిగే కాలేజి అమ్మాయిలూ గుర్తొచ్చారు ఆ క్షణాన.

ఎప్పుడో చివరి జాము రాత్రులో - బాధించే అర్ధంకాని వెలితి కూడా. వాళ్ళ సంభాషణ కొత్తగా ఊళ్ళోకి వచ్చిన వీడీవో సత్యనారాయణమూర్తి మీదకు మళ్ళింది. అతను అమలాపురానికి చెందిన బ్రాహ్మల కుర్రాడు. ఇంకా పెళ్లి కాలేదు. మొదట్లో అతనికే నాన్నే ఆశ్రయమిచ్చినా, ఇప్పుడు ఇద్దరికీ పడటం లేదు గావాల్ను. కాస్త పరుషంగానే అతని గురించి మాట్లాడుకుంటున్నారు. నేను పరుషంగానే అతని గురించి మాట్లాడాను. నేను అక్కణ్ణుంచి లేచి బయటకు నడిచాను. నాలుగడుగులు వేసేటంతలో మధ్యాహ్న బడికి వెళ్తూ ప్రకాశరావు కన్పించాడు. కావడానికి టీచరయినా ప్రకాశరావు నాటకాల వాడికిందే లెక్క ఈ వూళ్ళో అతనికో జట్టుంది. వాళ్ళలో సుధాకరరావు పోస్టుమాష్టరు. రఘురామయ్య, మోస్, రంగనాథం రైసుమిల్లులో పనిచేస్తారు. చిట్టిబాబు టూరింగ్ టాకీస్ లో మేనేజరు. దాదాపుగా మా అందరికి ఒకే వయస్సు చిన్నప్పుడు కలిసి చదువుకున్న స్నేహం ఒదులు ఒదులుగా అలాగే వుండి పోయింది.

'అలా బడిదాకా రాకూడదూ, అంటూనే కబుర్లలోకి దిగిపోయాడు. కొత్త వీడీవో గురించి ఎక్కువ సేపు అదీ ఇదీ చెప్పి 'అన్నట్టు నీకో న్యూస్ తెలుసా, మనవాడు బలేదాన్ని పట్టాడులే, రోజూ ఇదే కథ. మోత ఎత్తి పోతోంది ఊరంతా. ఇంతకీ ఎవరో చెప్పు చూద్దాం' అని. నా జవాబు కోసం చూడకుండానే 'ఇంకెవరు నర్సింహరాజు కూతురు పార్వతి' అన్నాడు. నేను ఒక్కక్షణం విభ్రాంతి పడ్డాను. కానీ ఏమీ మాట్లాడలేకపోయాను. 'ఒకటి రెండు సార్లు ఇదే వాడి మకాం వైపు పోతుండగా జనం చూసారు. వాడికయితే నీతి లేదనుకో. దీనికి మాత్రం' నేను అతని మాటలు వినలేక వెనక్కి తిరిగాను. 'సాయంకాలం కలుస్తావా? బడి అయిపోయాక, మన వాళ్ళు కూడా కలుస్తారు' అన్నాడు. కాని నేను ఆ సాయంకాలమే వూరొదిలేసాను.

పార్వతి నాకన్నా అయిదారేళ్ళు పెద్దది. కాని ఆమె ఎందుకో నా కళ్ళముందే పెరిగి పెద్దదయినట్లుంది. ఆమె జీవితంలోని ముఖ్యమయిన దశలన్నీ నేను దగ్గరలోంచి చూసినట్లయింది.

ఒదులు పరికిణీ ఒక్కటే వేసుకొని చిన్నప్పుడు బళ్ళోకి వచ్చేస్తే 'ఏవమ్మా మహారాణి ఇది మీ అంతఃపురమనుకున్నావా' అని హాస్యమాడింది పంతులమ్మగారు. చిన్ని జడలూ, మెరుపుల తాబొందూ, అమాయకమయిన ఆ పసి నేత్రాలు - నాకు స్పష్టంగా గుర్తున్నాయి. అప్పుడు ఆ అమ్మాయి రాణీ గారి పిల్లలాగే వుండేది.

నేను ఇంటర్మీడియేటులోకి వచ్చేటప్పటికి పరిస్థితులు తారుమారయి పోయాయి. చితికిపోతున్న కుటుంబం మధ్య, కొత్త దశలోకి అడుగుపెడుతున్న ఆ అమ్మాయి. కుటుంబాన్ని అంటిన దారిద్ర్యం యవ్వనం కమ్మిన ఆమె శరీర సౌష్టవాన్ని బాధించలేకపోయింది. గుండ్రనవుతున్న బుజాలూ, పసిమిరంగు పాదాలు, ఎర్రని అరచేతులూ, లేత కరవీర పుష్పంలాంటి ఆ నోరు... నేనూ అప్పుడే యవ్వనంలోకి ప్రవేశిస్తున్నాను. నా శరీరం లోనూఏవో చిత్రమయిన మార్పులు. నరాల్లో సాగే బిగువు, కండరాల్లో వెచ్చదనం, రక్తంలో ఉరుకు ఆడవాళ్ళు ఎదుటపడితే కంపన, దగ్గర కూచుంటే గొంతు తడారి పోయేది. అట్లాంటి రోజుల్లో ఒకసారి...

ఆ అమ్మాయి మా అమ్మకి సాయపడటానికి ఇంటికి వచ్చి ఆ పని ఈ పని చేసి ఏదన్నా ఇస్తే తీసుకునేది. ఆ రోజు అట్లానే ఏదో పనిలో వుంది. ఇంట్లో ఎవ్వరూ లేరు. నేను సాహసించి గుమ్మం దాకా వెళ్ళాను ఏదో దుస్సాహం చేయాలన్న తెగింపు. ఉద్రేకం, ఏం చెయ్యాలనో తెలీదు ఏ చెయ్యగలనో తెలీదు. విశాల పృథ్వీ మైదానం మీద నక్షత్రాలు సాక్షిగా తొలి స్త్రీ పురుషులు కలిసినపుడు వాళ్ళు ఒకళ్ళ నొకళ్ళు ఎట్లా సమీపించి వుంటారు? కాని ఆ వేళ ఆ ఇరుకు గదుల్లో ఆ చీకటిలో దొంగతనంగా భయంభయంగా, శరీరంలోంచి ఏమో ముందుకు తోస్తుంటే, మరేవో అభ్యంతరాలు వెనక్కి లాగుతోంటే నంగిరిగా, తెగింపుగా... నేను మొట్టమొదటగా ఒక స్త్రీని సమీపించిన దృశ్యం అది. తొలిమానవుడి నుంచి ఎంత దూరం ఒచ్చేశాం! ఆ అమ్మాయి ఓ కంట ఇదంతా కనిపెడుతూనే వుందా? ఓ చెంప దీన్ని నిశ్శబ్దంగా ఆహ్వానిస్తూనే వుందా? కాని ఏమీ జరగనట్టే వుంది. తన పనిలో తాను. కాని ఆ క్షణాన, అట్లా ఆమెని కావలించుకున్నప్పుడు. లేత యవ్వనహస్తాల్లో లేత స్త్రీ దేహం, బీదరికం వోడుతున్న ఆమె దుస్తుల్లోంచి మెరిసే రోజారంగు అవయవాలు, దేహాల నుంచి స్రవిస్తోన్న వింత యవ్వన సుగంధం, పల్చగా ఆమె కనుబొమ్మల మీద పెట్టిన చెమట, పురుష స్పర్శకి కందిపోతున్న చర్మం - నన్నామె నెమ్మదిగా పక్కకి తోస్తూ 'పెద్దవాడివయ్యావన్నమాట' అంది. కాని ఇప్పటికీ ఆమాట, ఆ దృశ్యం, నిలువనీయని ఆ అనుభవం - ఇవేవో అర్ధంకాని స్పందనల్తో చుట్టుముడుతుంటాయి.

ఆ సన్నివేశంలో అంతకు మించి జరిగిందేమీ లేదు. అట్లాంటి అవకాశాలే అప్పుడప్పుడూ వీలు దొరికినప్పుడల్లా కలుగుతుండేవి. గదిలో ఏ చీకటి మూలనో ఆమెని కావలించుకోవడం, మెత్తని ఆ దేహాన్ని నా అరచేతుల్తో బలంగానూ, మృదువుగానూ స్పర్శించడం, ఆమె పెదాల్ని అందివ్వకుండా తప్పుకుంటుంటే, ముద్దు కోసం బతిమాలాడటం - ఇంతలోనే ఎవరి అడుగుల చప్పుడో, ఏ అలికిడో మమ్మల్ని విడదీసెయ్యడం... కాని ఆ సన్నివేశాలన్నిట్లోనూ ఆ ఒక్కటి మాత్రం నన్ను చిరకాలం వెన్నాడుతుంది. నాలో, నా పరిమితుల్ని దాటి నన్ను మాత్రం కుదిపేసే ఏదో గొప్పశక్తి ఆ అనుభవంలో వుంది కావును అన్పిస్తుంది. ఆవేళ నాలో మరీ వుధృతమైన కాంక్ష ఎవ్వరూ చూడకుండా ఆమెని స్నానాల గదిలోకి తీసుకుపోయాను. తలుపు మూసేసాను. నాలుగుగోడల మధ్య ఎన్నడూ దొరకని అపూర్వ ఏకాంతం. కాని ఏంచెయ్యాలి ముందు రవికె విప్పెయ్యమన్నాను. ఆమె మారాం చేస్తూనే భయపడుతూనే రవికె బొత్తాలు విప్పి పక్కకు తొలగించింది. అప్పుడు నా కళ్ళముందు సాక్షాత్కరించిన ఆనగ్న స్త్రీ వక్షాన్ని ఎట్లా వర్ణించేది? పుష్టిగా ఆరోగ్యంగా ప్రేమగా ధైర్యంగా జీవంతో శక్తితో ఏదో దైవత్వంతో నా ముందు రెండు కుందేలు పిల్లల్లాంటి రొమ్ములు. ఆ రోజా రంగు చర్మం లోంచి నీలిసిరలు పారదర్శకమవుతున్నాయి. కన్నార్పకుండా, నేనట్లా నిశ్చేష్టున్నయి వాటినట్లా చూస్తూ వుండిపోయాను. అవి రెండు పర్వత శిఖరాలయ్యంటే వాటికి నా తలని మోదుకొని చచ్చిపోయుండేవాణ్ణి. 'ఊ త్వరగా ఎవరన్నా వస్తారు' అంటోంది పార్వతి. నాకు కళ్ళమ్మట నీళ్ళు తిరిగాయి. ఒంట్లో నిస్సత్తువ ఆవహించింది. ఆమె పైటని వాటి మీదుగా కప్పేసి 'పోదాం, పద' అన్నాను.

పార్వతి అంటే నాదృష్టిలో ఒక ఆకృతి కన్పించేది. ఆ ఆకృతిని చూడగానే పార్వతి అని స్పురించేది. శరీరం లేని పార్వతి మాత్రం నా ఊహకి అందేదికాదు. అలా ఎన్నోసార్లు ఆమెను నా చేతుల్లోకి లాక్కోవడం బలంగా ఎముకలు చిట్లి పోయేలా కావలించుకోవడం - కాని ఇంతలో అది శరీరం అని స్ఫురించి, ఏదో అతిక్రమించలేని భారమయిన విషయం తోచి నిస్పృహగా జారిపోయేవాణ్ణి. తిరిగి కాలేజీకి వెళ్ళాక, ఎన్నో ఒంటరి రాత్రులు తిరిగి తిరిగి ఆ దృశ్యాలే నా కళ్ళముందు కదిలేవి. ఆవేళ అలా చేసి వుంటే బాగుణ్ణి' అంతదాకా అయింది కదా, అ తర్వాత... ఇలా అసంపూర్తి జ్ఞాపకాల్ని కలల్తోనూ, కల్పనలతోనూ రకరకాలుగా వూరించేవాణ్ణి. కాని ఆ పురాణాల వెనుక అన్ని ప్రయత్నాల వెనుకా ఒక శూన్యం దాటరాని నిశ్శబ్దం.

నేను మళ్ళీసారి వచ్చేటప్పటికి వర్షాలు. కాలు కదపనివ్వని ముసురు చిత్తడి. నాన్న కబురు చెయ్యడం వల్ల రావాల్సి వచ్చింది. పార్టీ గొడవల్లో పెద్ద తగాదాలు అయ్యాయట. ఊరు పరిస్థితి బావులేదు. లాయరును కలిసి కొన్ని విషయాలు మాట్లాడాలని నాకు కబురంపాడు.

వచ్చిన రెండురోజులదాకా బయటకు కదల్లేదు. రెండోనాడు సాయంకాలం కాస్త తెరిపిచ్చాక - బయటపడి ఎటు వెళ్ళడానికి తోచక శంకరమూర్తి షాపుకు వెళ్ళాను. అక్కడ ప్రకాశరావు జట్టంతా వుంది. నన్ను చూస్తూనే సాదరంగా పిలిచారు. శంకరమూర్తి భార్య కుర్చీ వేసింది. 'బావున్నారా తమ్ముడు గారూ' అంటూ టీ ఇచ్చింది. ఆమెను చూస్తే జాలిగా అన్పిస్తుంది. శంకరమూర్తి ఆవిణ్ణి నానా హింసలూ పెడతారని విన్నందువల్ల కాబోలు. 'ఏంటి గురూ, ఇంట్లో కూచుండిపోయావ. నేను వద్దామనుకున్నాను గానీ, మీ నాన్నకు జడిసి రాలేదు' అన్నాడు మోజసు. అతను ఎక్స్ పార్టీ. 'ఊళ్ళో గొడవలుగా వున్నాయట ఎందుకు?' అనడిగాను. 'గొడవలంటే - గొడవలసలేం, పంచాద్రినాయుడు పొలాన్ని చెవిటి పుల్లయ్య కౌలు చేస్తున్నాడు. ఇప్పటి మాటా, పదేళ్ళ నుంచి, ఇప్పుడేమో వాడికి కాకుండా నాయుడు కొత్తగా వచ్చాడే వీడివో. ఆడు రెకమెండు చేసాడని వెంకట్రామయ్యకి ఇచ్చేసాడు.

మరి ఎరువులూ, గింజలూ, బ్యాంకుల్లోనూ - అన్ని రకాలుగానూ సాయం దొరుకుతుందని, ఈ చెవిటి పుల్లయ్యగాడు వీధిన పడ్డాడు. ఇదేం న్యాయమని తీర్పు తీర్చమంటే మీ నాన్న ఆ సత్యంగాడి వైపు నిలబడ్డాడు. వూళ్ళోవాణ్ణి కాదని పైవూరు వాణ్ణి సర్పంచ్ బలపర్చడమేమిటని' నాయుళ్ళందరికీ మంటగా వుంది. అందుకు వెంకట్రామయ్య మనుషుల్ని పొలంలో అడుగుపెట్టనివ్వలేదు. ఇక చెప్పేదేముంది? కొట్లాటలూ, పోలీసులూ, ఆ పైనా పంచానామాలూ జరిమానాలూను...' చాలా పెద్ద గొడవే, అక్తిగా చెప్పాడు యోజస్. నాకు విషయం అర్ధమయింది. కాని నాన్న వాడి పక్షాన ఎందుకు నిలబడ్డాడో అర్ధం కాలేదు. ఏమయినా ఆ సత్యంగాడు మితిమీరి పోతున్నాడు. ఓ పట్టుపడదాం రండిరా అంటే ఎవళ్ళూ కదలరు'. చిట్టిబాబు మాటల్లో జులాయితనపుకసి. అతనికి ఏ బరువులూ లేవు. కాని సుదాకరరావుకి పెళ్ళి కావాల్సిన చెల్లెలు వుంది. తక్కిన వాళ్లకి తగాదాల్లోకి దిగితే పొట్టగడవదు. 'చూడు చిట్టిబాబూ గొడవల్తో అయ్యేదేమిటి, అయినా వాన్నెవన్నో ఏదో చెయ్యడానికి ఇంతమంది కావాలా? ఒదిలెయ్యండి ఆ గొడవ' అన్నాను.

శంకరమూర్తి కలుగజేసుకుని 'నీకు తెలీదు చిన్నబాబూ, మొన్నగాక మొన్నవాడు నర్సింహరాజు కూతుర్ని చంపబోయినంత పని చేసాడు. ఈ మదపిచ్చి దానికి బుద్ధిలేకపోయింది గాని, లేకపోతే ఆ దెబ్బ తోటే వాణ్ణి జైలుకు తోసేద్దుం' అన్నాడు. ఆ మాటలు నన్ను కలత పెట్టాయి. నేను అడక్కుండానే రఘురామయ్య వివరాలు చెప్పాడు. 'అది కాదులే, జరిగిందేమంటే అది కొంతకాలం పాటు వాడితో తిరిగింది. వాడికి దీనిమీద అనుమానం. అది పట్టలేక నువ్వెవడివి. నాకేమన్నా మొగుడివా అని తిట్టి పొమ్మందిట. వాడు కోపం పట్టలేక నాలుగు దెబ్బలేసాట్ట. అదీ గొడవ. ఇప్పుడు ముసలి వెంకటరామయ్య డప్పాలు కొట్టు కుంటున్నాడో, నిజమో తెలీదుగాని..." నాకు నిస్త్రాణ వచ్చేసింది. 'ఒద్దులే, రామయ్య, ఇంకేమన్నా మాట్లాడుకుందాం' అంటుంటే 'మనవాడికి వినడానికి బాధగా వున్నట్టుంది. ఒదిలేరా మనవాడికి మంచి ఫ్రెండు కూడాను' ప్రకాశరావు మాటల్లో వ్యంగ్యం గుచ్చుకుంది. నాకు ఒక్కసారిగా అక్కదండరిమీద రోత పుట్టింది కోపమొచ్చింది కూడా. 'ప్రకాశరావు, నిజానికి పుకారుకీ మధ్య తేడా తెలియని వాణ్ణి కానులే' అన్నాను. 'లేదు బాబూ, నిజమే బాబూ' శంకరమూర్తి సణుగుతున్నాడు. 'పందెం కాస్తావా' మోజెసు పట్టుబట్టాడు.

'నీ కళ్ళ ముందే మేం దాన్ని పిలిచి...' ఆ రోజు వాళ్ళు అంత పని చేసి చూపించారు. నేను అక్కడ నిల్చోలేకపోయాను. ఆ సన్నని జల్లులో, ఆ బురదలోనే వూరికి దూరంగా వెళ్లి పోవాలనిపించింది. అట్లా పిచ్చిగానూ, అయోమయంగానూ నడుస్తున్న నన్ను పలకరింపుగా ఆపి - సత్యనారాయణమూర్తి! ఆ క్షణంలో అతను చాలా వూరటగా అన్పించాడు. 'ఏమిటిది, ఇలా వున్నారు' అన్నాడు.  ఏ లేదంటూ వెళ్ళిపోయాడు. కాని ఆగి జరిగింది చెప్పాను. నేనతన్ని అదే మొదటిసారిగా కలవడం అన్న విషయం కూడా మర్చిపోయాను, అతను నీరసంగా నవ్వాడు. కొద్దిగా ముదురుతున్న మొహం, తీక్షణమయిన చూపు ఒంకీలు తిరిగిన జుత్తు వక్రంగా నవ్వుతూ 'దాని సంగతా ఒదిలెయ్యండి, దాన్ని పెళ్లి చేసుకుంటానన్నాను, పూజితం వుండొద్దూ, మీరెందుకు వర్రీపడటం, ఇంటికెళ్ళిపోండి, వాన పెద్దదయ్యేట్టుంది' అని నాలుగు అడుగులు వేసి 'మీకో రహస్యం తెలుసా? దాన్ని మొట్టమొదట చెరిచిన వాడు మీ ఫ్రెండు ప్రకాశరావే, ఇంటికి పాటాలు చెప్పించుకోవడానికి వస్తే మనవాడు పక్కలోకి లాక్కున్నాడు. అదే చెప్పింది నాకు. దాన్నసలు షూట్ చేసి పారెయ్యాలనిపించింది... అవునూ, ఇట్లాంటి మదపిచ్చి వాళ్ళను ఇంగ్లీషులో ఏదో అంటారని విన్నాను. ఏమిటది? అన్నాడు. 'నింఫోమానియక్ అని అనబోయి 'ఏమో, నాకు తెలీదు' అన్నాను. ఆ పదాన్ని అతనికి ఎవరూ చెప్పకుండా వుంటే బాగుండనుకున్నాను.

ఆ రాత్రి పెద్దవాన లోకాన్ని వేళ్ళతో పెకలిస్తున్నట్టు కురిసింది. దబదబమని బయట ఎవరో తలుపులు బాదుతున్నట్టు వానకురుస్తోంటే గదిలో ఒక్కన్నీ నిద్రపట్టక ఆస్తిమితంగా గోడల్ని వున్న దేవుళ్ళ పటాలని, మా బంధువుల, పూర్వీకుల ఫోటోల్ని చూస్తూ అటూ యిటూ దొర్లాను. బయట వురుములు, మెరుపులు మెరిసినప్పుడల్లా ప్రపంచం కాంతి మంతం అవుతోంది కాబోలు. కాని ఎవరి కోసం, ఏం ప్రయోజనం? ఎవరో దేవుడు టార్చిలైటు వేసుకుంటూ మురికి పట్టిన గదిని మరీమరీ కడుగుతున్నట్టు వాన.

నా గదిలో నా శయ్యమీద ఒక అస్పష్ట ఆకృతిగా పార్వతి కూర్చున్నట్టు కన్పించింది. కాని నేను ఆ ఆకృతిని చూసి భయపడటం లేదు, ఆ ఆకృతే నన్ను చూసి భయపడుతోంది. ఇంకా మానవ ముఖకృతుల్ని చూసి తట్టుకోగలగటం అలవాటు కానట్టుగా, ఆ ఆకృతే నన్ను చూసి భయపడుతోంది. ఆ ఆకృతి నన్ను ఏదో ప్రశించడానికి ప్రయత్నిస్తూ ఆగిపోతూ అంది. ఆమె అలా ప్రయత్నించినపుడల్లా నాలో కొత్త ప్రకంపాలు. కాని మధ్యలో వాత్సల్యంతో 'పెద్దవాడివయ్యావన్నమాట' అని నెమ్మదిగా జుత్తు దువ్వుతూ అన్నట్లు అనిపించి అరచేతుల్తో ముఖాన్ని కప్పుకున్నాను. ఎన్నిసార్లు ఆ దేహాన్ని ఈ అరచేతుల్తో తడిమాను. ఒళ్లంతా వేడి చిమ్ముతోంటే, అవయవాలు కెరటాల్లా ఎగిసి పడుతోంటే - ఏదో ఆశక్తతో ఎన్నోసార్లు స్థానువుగా ఉండిపోయాను.

దాటలేనిదీ, తెరవకూడనిదీ, చేయకూడనిదీ నిజంగా ఏదన్నా వుందా? అది శరీరంతో మాత్రమే సాధ్యమవుతోందా? నాకు తెలియంది ఈ అమ్మాయికి తెలిసిందా? తెలుసుకోవడానికి మనిషి చెల్లించాల్సిన మూల్యం విషాదకరమా? లేక తెలుసుకోవడమే విషాదకరమా? ఆమె మెత్తని పొట్ట మీద ముద్దు పెట్టుకోవడం, ఆవాళ స్నానాల గదిలో దృశ్యం... ఏవేవో నాలో కదులుతున్నాయి. కళ్ళు తెరిచాను. ఆ ఆకృతి తన పొట్టను చూపిస్తూ ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తోంది. ముద్దుపెట్టుకోమని మాత్రం కాదు. నాకు ఆ క్షణంలో ఆ ఆకృతిని పూర్తి నగ్నంగా చూడాలనిపించింది. కాని తట్టుకోగలనా? ఆ ఆకృతి సగం భ్రమ, సగం వాస్తవం. సత్యనారాయణమూర్తి ఎంత దుర్మార్గుడు. నాన్న అతన్నెందుకు సపోర్టు చేస్తాడో? అతనికి సమితి ప్రెసిడెంటు దగ్గర వున్న పలుకుబడికేనా? నాన్న మాత్రం ఎప్పుడూ ఆమె గురించి ఒక్కమాట కూడా అనలేదు. నర్సింరాజు వాళ్ళ నాన్నకి ఉంపుడుగత్తె వల్ల కలిగాడట. ఈ రహస్యాన్ని నాన్న ఎందుకు అంతలా గుర్తు పెట్టుకున్నాడు?

బయట పెళపెళ వాన. ఏదో మగతగా కల. కలత నిదుర. నర్సింరాజు సోమినాయుడు పెళ్ళాన్ని అమెరికా తీసుకుపోయినట్టు, సత్యనారాయణమూర్తిని మోజస్ షూట్ చేసినట్టు, ప్రకాశరావు సర్పంచ్ అయినట్టు, నాన్న?!

రెండు మూడేళ్ళ తరువాత, అప్పటికి నా ఇంజనీరింగ్ స్టడీస్ పూర్తి అయిపోయాయి. కాంట్రాక్టులు మొదలుపెట్టాను. నాన్న ఎమ్మెల్యే అయ్యాడు. పని మీద వూరికి వచ్చాను. పండుగ ముందు, ఊరు ఈ కాస్త లోనే బాగా పెరిగిపోయింది. మరొక సినిమా హాలు, చిన్నపెద్ద తామర తంపరగా షాపులు, జూనియర్ కాలేజీ, పంచదార ఫ్యాక్టరీ. మనుషుల్లో ఇదివరకటి తీరికదనం లేదు. కొత్త వ్యాపారాలు, మునుపటి కన్నా పెరిగిన నాణేల గలగల.

శీతాకాలపు చివరి దినాలు. మధ్యాహ్నం తీరిగ్గా పడక కుర్చీలో వాలి పేపరు చదువుతుండగా ఓ ఓణీపిల్ల ఇంట్లోకి దూసుకోస్తూ 'బాగున్నారా' అంటే మొదట గుర్తుపట్టలేకపోయాను. పార్వతి చెల్లెలు దుర్గ 'మా అక్క అత్తారింటి నుండి వచ్చింది. పండుగయ్యేదాకా ఇక్కడే వుంటుంది, మీరొచ్చారని చెబుతాను మరి' అంది. పార్వతికి పెళ్లయిందా? ఆశ్చర్యపోయాను. అమ్మనడిగితే చెప్పింది. 'చాలా వైభవంగా జరిగింది పెళ్ళి. నర్సింరాజు గారు అసలు పిల్ల పెళ్ళి చేస్తాడని అనుకున్నామా? ఎంత గొప్పగా చేశాడని. ఊరువూరంతా కదిలి వచ్చింది. పెళ్ళికి వెన్నట్లో' ఆ మాటలంటున్నప్పుడు ఆమె కన్నుల్లో వింత వెలుగు. 'పాపం ఆ పిల్లని ఊరంతా ఆడిపోసుకున్నారు. అన్నెం పున్నెం ఎరుగని పసిదాన్ని పట్టుకొని నానామాటలు అన్నారు. నిజానిజాలు దేవునికి తెలియవా?' అమ్మని పరిశీలనగా చూసాను.

ఆవిడ పాపిట తెల్లబడుతోంది. ఆమె మాటలను బట్టి ఆమెకి ఏమీ తెలియదని అనుకోవాలో, లేక నిజంగా తెలిస్తే ఆమెకి మాత్రమే తెలుసనుకోవాలో, 'అతనేం చేస్తుంటాడు?' అతను బాగా దిగువదేశంలో ఎక్కడో గానీ వాళ్లవూరు, మిల్లులో పనిట రాజులే. నేను పెళ్ళిలో చూశాను కదా! కను ముక్కుతీరు బాగానే వుంది. బుద్ధిమంతుడే' అంది. నాలో నేను అనుకుంటున్నట్టుగా అన్నాను. 'పోన్లే, ఇన్నాళ్ళకు సుఖపడిందన్నమాట' అని లేవబోతుండగా, 'ఏం సుఖమో ఏమోలే వెర్రిపిల్ల. వెళ్లి ఆరు నెలలు కాలేదు. ఏ రాత్రి వేళ ఏమయిందో గాని దెయ్యం పట్టిందట. అంతా ఒంట్లో నుంచి ఊడ్చేసిందనుకో. చిక్కిపోయింది. నాల్రోజులు గాలి మారుతుందని ఇటు వచ్చింది' అని కాసేపాగి, అనాలా వద్దా అన్నట్టుగా నెమ్మదిగా 'అదేమిటోరా వచ్చి అప్పుడే రెన్నెల్లు అవుతోందా, అల్లుడొక్కసారీ రాలేదురా, నాకు తెలియకడుగుతాను. వాళ్ళకి సెలవులుండవా?' అంది.

నాకు పార్వతిని చూడాలని ప్రబలంగా అనిపించింది. వాళ్ళింటికి వెళ్ళగానే ఆశ్చర్యపోయాను. పుష్యమాసపు సంధ్యవేళ. వాకిట్లో నులక మంచం వాల్చి ఓ మాసిన దుప్పటి పరచింది. ఆ ఇంట్లో పండుగ రాబోతున్న కళ ఏమీలేదు. వెల్లవెయ్యక మాసిన గోడలు, అటూ ఇటూ గలీజుగా తిరుగుతున్న కోళ్ళూ. అరుగుమీద వగరుస్తున్న కుక్క. చూపుల్ని పార్వతి మీదకు మరల్చాను. ఆమె నేను చూసిన ముసలివాళ్ళందరిలోకి ముసలిదానిలా వుంది. ఏ శరీరాన్నయితే ఆమె నుంచి వేరుగా ఊహించలేక పోయేవాడినో, ఆ శరీరం ఇలా పరిణమిస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. 'బాగున్నారా చినబాబూ' వాడిన పెదాలపైని మరింత నీల వర్ణపుజీవం లేని చిరునవ్వు. చిన్నప్పుడు వాళ్లనాన్నగారి చొక్కాలు లూజుగా తొడుక్కుని ఇంకా ఎదిగీ ఎదగని రొమ్ముల అస్పష్ట రేఖాకృతితో కన్పించిన పార్వతికీ, ఈ పార్వతికీ మధ్య ఎంత తేడా. కానీ ఆ పలకరింపులో మాత్రం ఏ తేడా లేదు. అప్పుడూ ఇప్పుడూ ఒకే మార్దవం. అప్పుడు ఊహలు చప్పుడయితే, ఇప్పుడు గడిచిన దినాలు మూల్గుతున్నాయి.

ఏదో ప్రేతం ఆవహించినట్టే ఉందామె. మాటల మధ్యలోనే లోపల నుంచి పళ్ళెంలో పెట్టి పోకుండలు తెచ్చి పెట్టింది. 'ఏమిటి గోడలకు వెల్ల వేయించినట్టులేదు' అన్నాను. ఆ మాటలకు ఆమె తల్లి శోకపడింది. బహుశా ఒక బయటివాడు ఆ ఇంటికొచ్చి అంత ఆత్మీయతతో పలకరించడం అదే మొదటిసారేమో! 'ఏం చెప్పను బాబూ! ఆయనకు ఇల్లు పట్టదు. ఉన్న పొలమంతా సోమినాయుడి చేతిలో పెట్టేశారు. వాడు నిరుటిదాకా ఎంతో కొంత ఇచ్చేవాడు. పండగ్గదా, ఈయనకు కోడి పందేలు. ఇదిగో, దీని సంగతి చూస్తే ఇలా వుంది, నాకేమో పోద్దల్లా షుగర్ ఫ్యాక్టరీలోనే గడిచిపోతుంది. ముసలిదాన్నయిపోతున్నాను, నేను మాత్రం ఎంతకాలం తాపత్రయపడగలను?' నేను ఆవిడను తలెత్తి చూడలేకపోయాను. ఆమె బాల్యం గొప్ప వైభవంగా గడిచిందని పార్వతి చెప్పేది. 'మీ చదువులు పూర్తయిపోయాయా?' పార్వతి అడుగుతూనే పళ్ళెంలో అరిసెలు వెయ్యబోతోంది. 'అమ్మో అన్ని తినలేను' అంటూ ఆమె చేతిని పట్టుకొని ఆపేస్తుంటే - మళ్ళీ ఆ స్పర్శ. ఎన్నాళ్ళ తరువాతనో.

ఆ క్షణాన స్పష్టంగా చెప్పలేను కాని, నాకు ఆ బంధాల నుంచి, పరిమితుల నుంచి విముక్తి చెందినట్టనిపించింది. నా శరీరం నుంచి బయటపడి, ఏదో పదిలంగా నిలబడే ఒకే ఒక మహత్తర క్షణాన జీవించినట్టు. కాని ఆ వెంటనే భయమూ, దిగులూ కమ్మేశాయి. ఆ చేతిని చూశాను. నల్లగా ఒడిలిపోయిన చర్మం, ఆ రిస్టుని ఒక నాసిరకం వాచి. 'టైమెంతయింది' అన్నాను. 'అది తిరగడం మానేసింది లెండి, ఊరికే ఇలా ఉంచాను' అంది. ఇక ఏమీ మాటలు కనిపించలేదు. 'ఏమిటలా చిక్కిపోయావు పార్వతీ?' అనో, 'మీ ఆయన నిన్ను బాగా చూస్తాడా?' అనో ఏవేవో అడగాలని ఉందికాని, నిజంగా ఏమని అడగగలను? మొట్టమొదటగా పార్వతి రెండు పార్వతులుగా కన్పించింది నాకు. ఒడిలిపోయిన శరీరంతో రోగంతో, బీదరికంతో మగ్గుతున్న పార్వతి. ఆ పార్వతి మీద నేను జాలి చూపించగలను, సాయం చెయ్యగలను... 'అన్నట్టు మీరే చూసి చెప్పండి, డాక్టర్ చీటీ ఇచ్చాడు. ఆ మందులు ఎక్కడ దొరుకుతాయో చెప్పండి' అంటూ బాగా నలిగిపోయిన ఒక ప్రిస్కిప్షన్ తీసుకువచ్చింది. దాన్ని బహుశా రోజూ విప్పి చూసుకొని మళ్ళీ లోపల ప్రాక్టీషనర్ ఇచ్చింది. నాకున్న పరిజ్ఞానంతో నేను అర్ధం చేసుకోగలిగినదాన్ని బట్టి ఆ అమ్మాయికి వున్న రోగమేమిటో తెలుసుకోగలను తలెత్తి చూస్తే, అంతదాకా ఆసక్తిగా నన్నే చూస్తున్న కళ్ళని ఎటో తిప్పింది. ఆమెకు కూడా తెలుసా? 'ఇవి అజీర్తి కోసం రాసిన మందులు, ఇంత ఇండైజేషన్ ఎందుకొచ్చింది?' అని అడిగాను. 'అజీర్తి అంటే చినబాబూ? వేళకి తిండి, నిద్ర వుండవండీ అక్కడ. ఆయనకేమో షిప్టు డ్యూటీలు. అన్నం వేడిగా వుంటే సయించదాయనకి. నేను ఆయనకోసం ఆగడంలో, అరుగుదల పూర్తిగా చెడిపోయింది.' అని పార్వతి చెప్తూంటే 'పైగా బండెడు చాకిరీ బాబూ, కట్నం తేలేదని వాళ్ళ అత్తగారు ఒకటే సాధిస్తుంది దీన్ని' వాళ్ళమ్మ అందుకుంది. నేను ఏం మాట్లాడగలను? గొంతు పెగుల్చుకుని 'ఎలాగో ఒకలా సర్దుకుపోవాలి' అంటుంటే చలిగాలిలాగా పార్వతి కళ్ళల్లో హిస్టీరిక్ చిరునవ్వు. మంచురాత్రుల ఒణుకు, ఎక్కడో తలత్తలల మెరుపులు. ఉరుముతూ ఫెళఫెళా వాన. ఏదో ఆకృతి వగరుస్తూ నన్ను వాటేసుకుంది...

ఈ ప్రిస్కిప్షన్ ఏ మందుల షాపు వాడికన్నా అర్ధమవుతుంది. నాకెందుకు చూపించిందని? నేను పర్సు తీసి యాభై రూపాయలు లెక్కపెట్టి 'అన్నట్టు పార్వతీ, మర్చిపోయాను. ఒక్కసారి మీ నాన్నగారి దగ్గర యాభై రూపాయలు అప్పు తీసుకున్నాను. వుంచగలవా? అన్నాను. ఆమె చీర కొంగు బుజాల చుట్టూ లాక్కుంటూ, చేతుల్ని చెంపలకాన్చుకుని 'మానాన్నగారి డబ్బులు మా నాన్నగారికే ఇవ్వండి' అంది నాకేమనాలో తోచలేదు. నా దుస్తులూ, ఒళ్ళు నాకే బరువుగా ఇబ్బందిగా అనిపించాయి. అన్నీ వదిలేసుకుని, ఫ్రీగా ధైర్యంగా నడవాలనిపించింది. పార్వతి కొన్ని క్షణాలు నన్నట్లానే చూస్తూ నిలబడింది. 'పోన్లెండి మీ బాకీ ఎప్పుడన్నా తీరుద్దురు గాని, ఇది నాకు పండుగకు చీర ఇచ్చారని అనుకుంటాను' అంది. నేను తలెత్తి చూడలేకపోయాను. ఆమె గాజుల సవ్వడి సన్నగా వినిపిస్తోంది. దుస్తులు ధరించికూడా అవి అంటీ అంటని నగ్నమూర్తిని నలుగురిలా చూడగల సాహసం నాకుందా? అ క్షణాన ఆ రోగిష్టి పార్వతి పక్కగా నిరాకార అయిన ఒక స్త్రీ నిల్చుని నన్ను తన వక్షానికి ఆన్చుకొని 'పెద్దవాడివయ్యావనుకుంటున్నావా, నాన్నా, నువ్వు ఎప్పుడూ పసివాడివేరా' అంటున్నట్టుగాతోచింది. అలా తోచడం నాపట్ల సానుభూతి అనుకోవాలో, ఏ గొప్ప వ్యక్తితో ఎత్తిన నీరాజనమే అనుకోవాలో తేల్చుకోవడం నావల్ల గాని పని అనుకున్నాను. ఒక్క నమస్కారం పెట్టాను ఎవరికి? ఏమో? - మరుక్షణంలో లేచి బయటకు వచ్చేసాను.

మరిన్ని సీరియల్స్