Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> కానుక

kanuka

 " అబ్బా.....    అప్పుడే తెల్లవారిపోయిందా ?  " అలారం చప్పుడికి మెలకువ వచ్చిన ' జాగౄతి ' మెల్లిగా చప్పుడు కాకుండా తన మీద వున్న భర్త చేతిని సుతారంగా తొలగించి  నిద్ర తో మూసుకుపోతున్న కళ్ళను బలవంతాన తెరుస్తూ మంచం దిగింది.

" ఛత్ ..  రోజూ తెల్లవారుఝామునే లేచి, అన్ని పనులూ చేసుకుంటే తప్ప ...   తొమ్మిదింటికల్లా ఆఫీస్ లో  తన సీట్లో కూర్చో లేదు...   ఒకటా ...   రెండా...  సుమారు ఇరవై ఏళ్ళుగా ఇదే దినచర్య...  ఎప్పటినుంచో చెయ్యలేక పోతున్నా ఇప్పుడు మరీ ఇబ్బందిగా వుంటోంది.. అకాల వార్ధక్యం అంటే ఇదేనేమో....   నిజానికి ఇంకా తను నలభై ఏళ్ళు కూడా నిండకుండానే.... ముసలిదయిపోయిందా.... లేకపోతే ...  తన ఆలోచనలు,  మానసికంగా చెయ్యలేకపోతున్నానన్న ఫీలింగ్ వలన అలా అనిపిస్తోందా?  ఆలోచిస్తూనే కాఫీకి ఫిల్టర్ వేసి,  ఇంకోపక్క టిఫ్ఫిన్ ఏర్పాట్లు చూసుకు ....   గబ గబా వాషింగ్ మెషీన్ లో బట్టలు వేసింది  .  అప్పుడే ఆరు ...   గబ గబా పిల్లలని లేపింది ...బిటెక్  మొదటి ఏడాది చదువుతోంది పెద్ద పిల్ల శౄతి, రెండో పిల్ల 'లయ  ' చదివేది పదో క్లాస్ ...   ఇంక చెప్పాలా... ఏం చదువులో, అసలు పొందుతున్నదేమిటో...   పోగొట్టుకుంటున్నదేమిటో... అన్న ఆలోచన...   ఈమధ్య తన మనసుని ... బాగా  చుట్టుముట్టి వేధిస్తోంది .

" అరే ...   అమ్మలూ ...  లేవండమ్మా ...   అప్పుడే ఏడయిపోతోంది...  త్వరగా తెమలండి...  మళ్ళీ ఆలశ్యం అయిందని తినకుండా పరిగెడతారు.... లెండి....   "....

"అబ్బా ...   ఏమిటమ్మా...రాత్రి రికార్డ్స్ రాసుకుంటూ లేట్ అయ్యింది...  ఒక్క అరగంటలో లేస్తాగా.... " మళ్ళీ ముసుగుతన్నింది   పెద్దది.

"అయ్యయ్యో...   ఇంకొంచెం ముందు లేపచ్చు కదమ్మా... ఈవేల్టి నుంచి ఆఫ్యేర్లీ ఎగ్జాంస్ .. ఇంకా చదవాల్సినది వుండి పోయింది....   " గాభరాగా అంది లయ....

" చూడు చిన్నీ...అనవసరంగా టెన్షన్ పడకు... ముందునుంచీ బాగానే చదివావుగా ... పరీక్ష ముందు..  గాభరా పడి  పాడు చేసుకోకు. ప్రశాంతంగా  వుండు ..పరీక్ష చక్కగా వ్రాస్తావు. కూర్చోకు.. వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చేయి...  పాలు తాగి ఓ గంట అన్నీ వల్లె వేసుకో  ... అదే సరిపోతుంది."

గబ గబా  వాషింగ్ మెషీన్ లోంచి బట్టలు ఆరేసి... స్నానం చేసి వచ్చేసరికి ... అప్పుడే ఎనిమిది   ...  ఛా..  ఎంత త్వరగా చేసినా తెమలటంలేదు వెధవ పనులు...  నన్ను క్షమించు దేముడా ...   నీ పనీ..నా పనే ...  నే వదిలెయ్యగలిగినవి.... అంటూ ఫ్రిజ్ లోంచి తీసిన నాలుగు పూలు దేముడిమీద వేసి... దీపం వెలిగించి అయిందనిపించే లోగా...  వినిపించింది అయ్యగారి గొంతు.."  జాగీ .. కాస్త కాఫీ తెస్తావా".. ప్చ్.... ఏళ్ళ నుంచి చెబుతున్నా కొంచెం కూడా మారరు... పనిలో సాయం చెయ్యకపోతే మానే కనీసం కలిపిన కాఫీ  గ్లాసు కూడా వంటింట్లోంకి వచ్చి తీసి కెళ్ళరు...   ఏమ్మనిషో...  ఏదయినా అంటే...  అలక ..కట్టుకున్నవాడికి  కాసిని కాఫీ నీళ్ళివ్వడానికి కూడా ఏడుపేనా అంటూ....   అయినా ఇది రోజూ వుండేదేగా ... అయినా అనుకోకుండా వుండదు ఈ పనిలేని మనసు. 

" ఇదిగో...  కాఫీ ..  గమ్ముని తాగి.. త్వరగా స్నానం చేసి వస్తే ...టిఫిన్ పెడతా...లేకపోతే పెట్టుకు తినాలి...   నేను ఈ వేళ కాస్త త్వరగా వెళ్ళాలి... మా ఎం.డి విజిట్ వుంది...”గబ గబా జడ అల్లుకుంటూ అంది...

"మమ్మీ...   నాకు కాస్త జడలు వెయ్యవా ....... " గదిలోంచి అరిచింది లయ....

" అబ్బబ్బ ఏం పిల్లలో ... నేనూ బయటికి వెళ్ళాలి అన్న ఆలోచనే వుండదు ఎవరికీ’ మనసులోనే అనుకుంటూ ఆ  పని కానిచ్చి... “ పరీక్ష బాగా వ్రాయి.   ఏయ్...   శౄతీ...   ఇంక లే......   లేట్ అయి మళ్ళీ కాలేజ్ మానేస్తావ్.   ఏమండీ ..మీకు అన్నీ  టేబిల్ మీదపెట్టా ...    ...  వింటున్నారా...   మరి నే వెడుతున్నా....   " ఒకేసారి అందరికీ చెప్పేసింది ... ఇదే అష్టావధానం .. శతావధానం అంటే కాబోలు .. అదే వేదిక మీద చేసేవారికి బ్రహ్మరధం . యింట్లో యిల్లాలు చేస్తే .. ఎవరికీ లెక్కే ఉండదు .. గుర్తింపూ ఉండదు .. నిట్టూర్చింది అంతలోకే నవ్వుకుంది తన ఆలోచనలకు.

" ఆ ..ఆ ... వెళ్ళిరా ... జాగ్రత్త "  పేపర్లోంచి  తల ఎత్తకుండానే చెప్పాడు భర్త  రమేష్ చంద్ర .  చేసేది లెక్చరర్ ఉ ద్యోగం ...     పది గంటలకి వెడతాడు...     సాయంత్రం...  నాలిగింటికల్లా అయిపోతుంది.   అయినా సరే... ఇక్కడ పుల్ల తీసి అక్కడ పెట్టడు...  పాపం  జాగౄతి చేసేది... ఓ కార్పొరేట్ ఆఫీస్  లో సూపర్వైజర్....   పనీ ఎక్కువే...    బాధ్యతా  ఎక్కువే...  ఆఫీస్ లో ఎంత మంచి  పేరు వున్నా ... అదంతా ఆమె బాధ్యతగా  సరిగా చేసినంత సేపే ఆగుర్తింపూ... గౌరవం...   అందుకే..  ఎటువంటి పరిస్తితుల్లోనూ మాట పడకుండా జాగ్రత్తగా వుంటుంది ...   ఎన్నో సార్లు అనుకుంది... ఇంక చెయ్యలేక, పోనీ మానేద్దామా అని...   కానీ.. ఈ గడ్డు రోజుల్లో  కష్టమే   ...   ... ఒక  స్టేండర్డ్ ఆఫ్ లివింగ్ కి అలవాటు పడి పోయాకా ........   ఆలోచిస్తూనే.. కైనటీక్ పరిగెట్టించింది...  స్పీడ్ పెంచి. సరిగ్గా టెన్ టు నైన్ ఆఫీస్ లో వుంది...  హమ్మయ్యా ..ఇంకా ఎం.డి  రాలేదు...  ...

***

గుడ్ మానింగ్  మేడం...   "నవ్వుతూ విష్ చేసి ... వాటర్ బాటిల్ టేబిల్ మీద పెట్టాడు... ప్యూన్  చందర్రావ్....

"గు డ్ మానింగ్ ...    థేంక్యూ... " చల్లటి నీళ్ళు తాగేసి సీట్లో కూర్చుంది .

అంతా అప్పుడే వచ్చి ,పని మొదలు పెట్ట బోతున్నారు...   తను ఎవరు ఆ ఆఫీస్ లో చేరినా మొదటిరోజే చెబుతుంది...

పంక్చువాలిటీ ... క్రమశిక్షణ  ఇక్కడ ఖచ్చితంగా పాటించాలనీ...   ..   ఏ రోజు పని ..   ఆ రోజు ఖచ్చితంగా పూర్తి చెయ్యాలనీ...   మనకి అన్నం పెట్టి ఆదరిస్తూ... సమాజంలో ఒక స్థాయినీ ... గౌరవాన్నీ ఇచ్చే సంస్థ మనకు తల్లితో సమానమనీ ,ఎవరైనా పని మీద దౄష్టి పెట్టక పోతే...   అవసరమైతే పనిష్ చెయ్యడానికి కూడా ఏ రోజూ వెరవలేదు...  అందుకే తనంటె యాజమాన్యానికి నమ్మకం, గౌరవం...   సిబ్బందికి భయం... భక్తీ... ఇన్నాళ్ళ ప్రయాణంలో పని ఎగ్గొట్టింది ... విస్మరించింది,  అలక్షం చేసింది కానీ లేదు. 

కానీ ఈ మధ్య చేరిన  ' ప్రణవి "  తన సహనానికి సవాలుగా మారింది....  తనని ఏ మాత్రం లెఖ చేయడం లేదు...   అలా అని ఎదిరించదు...  పని పెండింగ్ పెట్టదు... కానీ ..   అస్సలు ..పంక్చువాలిటీ  ...   క్రమశిక్షణ పాటించదు....   ఏమైనా  అంటే నవ్వేస్తుంది.......   ఎలా ... పోనీ ...   పైకి రిపోర్ట్   చేద్దామా అంటే... ఉద్యోగాలు దొరకడమే  గగనంగా వున్న ఈ రోజుల్లో ..  ...   మంచి చదువు , చక్కటి పనితనం వున్న ఆ అమ్మాయికి ఎలా అన్యాయం చెయ్యడం.? పోనీ చూసీ చూడనట్లు వదిలేద్దామా అంటే అప్పుడే ... గుసగుసలు మొదలయ్యాయి....   తను ‘ఆడ పిల్ల’ అనే పక్షపాతంతో వ్యవహరిస్తోందని ,  ఎప్పుడైనా తమకి పొరపాటున లేట్ అయితే ' లేట్' మార్క్ పెట్టి... మూడు 'లేట్ మార్క్స్ కి ఒక లీవ్ నోట్ చేసే మేడం...   ప్రణవి రోజూ ఆలస్యంగా వచ్చినా ....  ఆఫీస్ లో గంటలు గంటలు ఫోన్ మాట్లాడినా ఎటువంటి చర్యా తీసుకోవడం లేదనీ...

నిన్న  మరీ మరీ చెప్పింది ..ఈ రోజు ఎం.డి  వస్తారనీ త్వరగా రమ్మనీ...   ... ఏ క్షణం లో అయినా ఆయన  రావచ్చు... అందరూ వచ్చేసారు...  ఈ పిల్ల మాత్రం ఇంకా రాలేదు...  అందరూ తనకేసి దొంగ చూపులు చూస్తున్నారు ...  ఇప్పుడు తనేం చేస్తుందా అని ..   ఇన్నేళ్ళ సర్వీస్ లో తనకి ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి  ఎదురవ లేదు...  అసహనంగా వాచ్ చూసుకుంది......

ఎప్పుడూ లేనిది తను ఈ పిల్ల మూలంగా మాట పడాల్సి వచ్చేలా వుంది.......   ఎం.డి గారు రాగానే తను వున్నది వున్నట్లు చెప్పేస్తుంది...   ఈ అమ్మాయి మూలంగా ఇన్నాళ్ళుగా ఈ ఆఫీస్ లో వున్న క్రమశిక్షణ మాయం కాక ముందే ...   పరిస్థితి పూర్తిగా చేజారిపోకముందే  ... బాధ్యత గల వ్యక్తి గా చక్కదిద్దాలి . తప్పదు. 

" గుడ్ మానింగ్ మేడం.... " ఎం.డి గారు.. ఆలోచనలో పడి ఆయన రావడమే చూడలేదు...  కంగారుగా లేచి "  వెరీ గుడ్ మానింగ్ సార్... " తిరిగి విష్ చేసింది.

" ఏమిటీ వర్రీడ్ గా కనబడుతున్నారు., ఎనీ ప్రాబ్లం?. ఈ నెల బిజినెస్ టార్గెట్స్ డిస్కస్ చెయ్యాలి.... రండి....   " చెప్పేసి ఆయన మేనేజర్ రూం లోకి వెళ్ళి పోయారు... టార్గెట్స్ ఫైల్  తీసుకు వెళ్ళింది.... 

"ప్లీజ్ బీ సీటెడ్...   ఎనీ  థింగ్ రాంగ్ ... " అడిగారు ఏం.డి...

" సర్ ... ఒక చిన్న విషయం... మిస్ ప్రణవి ...  న్యూ రిక్రూటీ ...   కొంచెం డిస్ప్లీన్  ...  పంక్చువాలిటీ  ఏస్పెక్ట్స్ ...ఎంత వార్న్ చేసినా సరి చేసు కోవడం లేదు....   పని చాలా ఫాస్ట్ గానూ... పెర్ఫెక్ట్ గానూ చేస్తుంది...   కానీ  టైంకి  రాదు...   అలాగే ఆఫీస్ టైంలోఫోన్స్ చాలా ఎక్కువ...   మంచి వర్కర్ కదాని ఇన్నాళ్ళూ  పద్దతి మార్చుకోమని చెబుతూ వచ్చాను ప్చ్... బట్....  ఆఫ్ నో చేంజ్ .. మీ నోటీస్ కి తీసుకు వచ్చా,    ఇట్ ఈజ్ అప్టూ  యూ సర్ టు టేక్ ఏక్షన్....   " బాధ కలిగినా చెప్పక తప్ప లేదు.

" ఐ ..సీ ...   " బెల్ కొట్టి చందర్రావ్ ని అడిగారు...  "ఆ అమ్మాయి వచ్చిందా ?   "

" సార్ ...   వచ్చారు ... "

" ఒక సారి లోపలికి రమ్మను.... "

"గుడ్ మానింగ్ సర్స్ ...అండ్ మేం .  " మర్యాదగా విష్ చేసింది అందరికీ.

"గుడ్ మానింగ్ ... ప్రణవి ప్లీజ్ బీ సీటెడ్ ... ఇప్పుడు టైం ఎంతయింది...  మీరు రోజూ లేట్ గా వస్తున్నారని మేడం చెబుతున్నారు...  మీ సమాధానం ఏమిటి... పనితో బాటు మంచి క్రమశిక్షణ కూడా చాలా అవసరం...  " సీరియస్ గా అడిగాడు ... మేనేజర్.

" సారీ సర్... ఈ ఏరియా లో మన ప్రోడక్ట్స్  ఎవరెవరు వాడుతున్నారో ... ఇంకా ఎంత మంది వాడటం లేదో అవన్నీ మార్కెట్ సర్వే చేసి తయారు చేసిన రిపోర్ట్,  కొత్తగా తీసుకున్న ఆర్డర్స్ ....   అవే నేను చేస్తున్న ఫోన్ కాల్స్ ... ఈ రోజు ఎలాగైనా కొంచెం ముందు వచ్చి మేడం కి ఈ విషయం చెబుదామనుకున్నా ,కానీ ఒక కొత్త కస్ట్మర్ దగ్గర ఆలశ్యం అయింది...   సారీ మేం....   " హుందాగా అంది.

"ఎక్స్లెంట్ ...   " అప్పటికే ఆ రిపోర్ట్ చూసి ఒక్క నెలలో సుమారు ఒన్ క్రోర్ బిజినెస్ పెంచిన 'ప్రణవీ ని గర్వంగా చూసింది జాగౄతి తన అంచనా తప్పు కాదనీ ...   ఆ అమ్మాయి చాలా టేలెంటెడ్ అనీ...

"ఏం...   మేడం...   ఈ అమ్మాయిని మన కంపెనీ లో వుంచుదామా ...  వూస్టింగ్  లెటర్  ఇచ్చి పంపేద్దామా ....   " సీరియస్ గా అడిగాడు .... ఏం.డి..

" లేదు సార్ ..ఇలాంటి టేలెంటెడ్ ఎంప్లోయీ ని ఏ కంపెనీ వదులుకోదు...   మనం వదులుకోవద్దు...   కాక పోతే .. ఈ అమ్మాయిని మన ఆఫీస్ లో కంటే ... మన మార్కెట్టింగ్ సెక్షన్ ఇంచార్జ్ గా హెడ్ ఆఫీస్ లో వేసుకుంటే  మన కంపెనీ కి ఎంతో మంచిదని నా పెర్సనల్ ఒపీనియన్ ... ప్రణవీ ... ఐ యాం ప్రౌడ్  ఆఫ్ యూ మై డియర్.... నీకు చాలా మంచి ఫ్యూచర్ వుంది...   ' ఎక్సిటింగ్ గా అంది...

" ఓ ...   వెరీ గ్లేడ్...   మరి మీరేమంటారు మేనేజర్ గారు... "

"ఏమంటాను... మేడం ...సర్టిఫై  చేస్తే  ఇంక తిరుగే లేదు.... "   సంతోషం గా అన్నాడాయన.

" వెల్ డన్... మై డియర్ . కంగ్రాజులేషన్స్...    మన  మార్కెట్టింగ్ సెక్షన్  కాదు కాని మన ఎం.డి గా చేసేద్దామనుకుంటున్నా...   ఏమంటారు " నవ్వుతూ అడిగాడాయన.

" సార్ " ఇద్దరూ ఒకసారే అన్నారు ఆశ్చర్యం గా .

" చూడండి... ప్రణవి నా ఒక్కగానొక్క కూతురు...  ఐ.ఏ.ఎం , అహమ్మదాబాద్ లో ఎం.బి.ఏ చేసింది...   తను ఏ మాత్రం చెయ్యగలనో పరిక్షించుకుందుకే కాదు... మన ఆఫీస్ లో ఏమేమి నేర్చుకోవాలో తెలుసుకుందుకి కూడా ఇక్కడ చేరింది...   చేరిన మొదటి రోజే చెప్పింది...   మీలా క్రమశిక్షణ తో డెడికేటెడ్ గా పని చెయ్యడం నేర్చుకోవాలని.... " ఆనందంగా అన్నాడాయన.

" ప్రణవీ....   సారీ మేడం ...   చాలా సంతోషంగా వుంది....  మీ లాంటి కూతురువున్న సార్ చాలా లక్కీ "   ఆనందంగా అంది జాగౄతి.

" బట్....  ఐ  యాం నాట్ హేపీ ...మేం...   మీరు రోజూ ఎంత టైర్డ్ గా ... ఎంత టెన్ష్సన్ గా వుంటున్నారో ఈ నెల రోజుల్లో నేను చూసాను...   సో...   సర్...  నా కొత్త పోస్ట్ లో  తొలి నిర్ణయం తీసుకోవచ్చా "   సీరియస్ గా తండ్రిని అడిగింది...

"ఎస్ ...  వై నాట్ ...  యూ కేన్....  "   ఏం నిర్ణయం తీసుకుంటుందా అని ఆశ్చ్ర్యం గా చూస్తూ అన్నారాయన.

"మేడం...   నెక్ష్ట్ మంథ్ నుంచీ మీరు రానక్కరలేదు....  యూ కేన్ టేక్ రెస్ట్ ....   "సీరియస్ గా అంది.

" ప్ర....ణ ....  సారీ మేడం...  నేనేం చేసాను...   అందరి  లాగే మీరు టైం కి రావాలని మీరు మా కాబోయే ఏం డి అని తెలియక చెప్పాను...   అంతమాత్రానికే మీరు నన్ను ఉద్యోగం లోంచి తీసెయ్యడం.....    "

"నో నో  ..మేడం మిమ్మల్ని తీసేస్తున్నామని ఎవరు చెప్పారూ... మీరు యిరవై ఏళ్ళుగా మా కంపెనీ అభివౄధికి ఎంతో చేసారు...  అలాంటి మీకు నేనిచ్చే  చిరు కానుక,  ‘థ్రీ మంథ్స్ లీవ్ విథ్ ఫుల్ సేలరీ’....   అంతే కాదు థ్రీ మంథ్స్ తరువాత మీరు ఈ బ్రాంచ్ కి ఇంచార్జ్  ...   మేనేజర్ సార్ వాళ్ళ పిల్లల దగ్గరికి అమెరికా వెళ్ళిపోతున్నారు కదా.... సో ఈ మూడు నెలలూ మీరు బాగా రెస్ట్ తీసుకు రెట్టించిన వుత్స్చాహం తో రెట్టింపు ఎనర్జీ తో రావాలి.... ఏమంటారు.? అప్పటి వరకూ మీ ప్లేస్ నే భర్తీ చేస్తా...    ఓ.కే ...."

" థేంక్స్ ...   థేంక్యూ వెరీమచ్ మేడం... నిజం గానే ఈ మధ్య చెయ్య లేక ఇంక మానేస్తేనో అన్న ఆలోచన అస్తమానం కలుగుతోంది...   నాకు మీరిచ్చే ఈ కానుక నిజంగా చాలా..  చాలా విలువైనది....... సర్...ఇంక బిజినెస్ డిస్కషన్స్ మొదలు పెడదామా.... "

"దట్ ఈజ్ మేడం......   " నవ్వుకున్నారందరూ.

అలసిన మనసుకీ, మనిషికీ నిజంగా ఎంత అపురూపం ఇలాంటి కానుక.

మరిన్ని కథలు
verribaagulavaadu