Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నాగలోకయాగం

 

గతసంచికలో ఏం జరిగిందంటే .....http://www.gotelugu.com/issue160/454/telugu-serials/nagaloka-yagam/nagaloka-yagam/

‘‘యువరాజుల వారికి జయము జయము. ప్రభూ! అనుకోకుండా సంకటమున పడితి. మీరు నన్ను కాపాడాలి’’ అంటూ అర్థించాడు.
అతడి మాటలు అర్థం గాక ధనుంజయ భద్రాదేవిలు ముఖ ముఖాలు చూసుకున్నారు.

‘‘ఏమంటివి బాబాయ్‌! నీకు సంకట స్థితియా? ఏమి జరిగినది?’’ అనడిగింది.

‘‘నాతో రండి చూపెదను.’’ అన్నాడు భల్లాతకుడు.

ధనుంజయుడు కూడ అశ్వం దిగాడు.

ఇరువుర్ని వెంట బెట్టుకుని సత్రం వెనుక భాగానికి తీసుకెళ్ళాడు భల్లాతకుడు. అక్కడ చేతులు విరిచి చెట్లకు బంధింప బడున్నారు ఇద్దరు దృఢకాయులు.

‘‘చూడండి ప్రభూ! వీళ్ళు మీకు తెలుసునా?’’ అనడిగాడు వాళ్ళని చూపిస్తూ భల్లాతకుడు.

ధనుంజయుని కేమీ అర్థం కాలేదు.

వాళ్ళని ఎన్నడూ చూసిన గుర్తు లేదు.

కాని భద్రా దేవికి ఏదో సందేహం ఏర్పడింది. చెట్టు వెనక్కి వెళ్ళి వాళ్ళ చేతుల్ని పరికించింది. ఆ యిద్దరికీ కుడి చేతి మణికట్టు మీద రెక్కలు విప్పి నిల బడిన డేగ బొమ్మ పచ్చ బొట్టు వుంది. అది బాహ్లీకుడి సొంత గూఢచార వ్యవస్థకి సంకేతం అది.

‘‘వీళ్ళతో ఇంకో నలుగురు ఉండాలి బాబాయ్‌. వాళ్ళు ఏమయ్యారు?’’ అనడిగింది.

ఈ సారి భల్లాతకుడు విస్తు పోయాడు.

‘‘అంటే... వీళ్ళ గురించి నీకు ముందే తెలిసుండాలె. వీళ్ళు మొత్తం ఆరు మంది. వీళ్ళలో నలుగురు విషపు గుళికలు మింగి చని పోయినారు. రండు...’’ అంటూ అక్కడికి కొంత దూరంలో చాప కింద వరుసగా ఉంచిన నాలుగు శవాలను చూపించాడు. తర్వాత జరిగినదంతా పూస గుచ్చినట్టు వివరించాడు.

అంతటితో భల్లాతకుడి సంకట స్థితి ఏమిటో గ్రహించి నవ్వుకుంది భద్రా దేవి. ధనుంజయుని జూచి`

‘‘ప్రభూ! వీళ్ళు బాహ్లీకుని మనుషులు. సందేహము లేదు. వీళ్ళ మణి కట్టు మీది డేగ గుర్తే అందుకు సాక్ష్యం. మిమ్ము కడ తేర్చుటకు తన గూఢచారి విభాగము నుండి ఎంపిక చేసి పంపిన మూడు బృందాలో ఇది రెండవది. మూడవ బృందం ఎగువన ఎచటనో కాపు వేసే వుంటుంది. మనము అప్రమత్తంగా పోవలె’’ అంది.

అవునన్నట్టు తల పంకించాడు ధనుంజయుడు.

‘‘భల్లాతకా! మాకు శత్రువులని తెలీగానే మా క్షేమం కోరి ఈ ద్రోహుల్ని బంధించినందుకు కృతజ్ఞుడను. ఇక నుండి నీవు మాకు ఆప్తుడివి. మేము వచ్చినాము గావున నిన్నే సంకటము బాధింపదు. ఈ సారి రత్న గిరికి వచ్చినప్పుడు నా వద్దకు వచ్చుట మరువకుము. కొత్వాలుకు కబురు పంపుము. మిగిలిన విషయము మేము చూసుకొందుము’’ అన్నాడు.

‘‘చిత్తము ప్రభూ!’’ అన్నాడు వినయంగా భల్లాతకుడు.

అంతలో అపర్ణుడు కల్పించుకొంటూ` ‘‘బాబాయ్‌! రాత్రంతా చేసిన ప్రయాణ బడలికతో మిక్కిలి అలసి వుంటిమి. ప్రభువులకు నిద్రించుటకు ఏర్పాటు చేయ గలవా?’’ అనడిగాడు.

‘‘అయ్యో! ఎంత మాట అపర్ణా. మీ రాక మా అదృష్టము. రండి...’’ అంటూ సత్రం లోకి దారి తీసాడు భల్లాతకుడు.

ఆ విధంగా సత్రం లోని ఒక గదిలో మెత్తని దిండ్లతో వేసిన పక్క మీద పక్క పక్కనే పడుకుని నిద్ర పోయారు ధనుంజయ, భద్రా దేవిలు. వారి అశ్వాలను పరామర్శించుటకు తన మనుషుల్ని నియమించాడు భల్లాతకుడు. ఒక అశ్వికుడిని కొత్వాలు కోసం గ్రామానికి పంపించాడు. యువ రాజు కోసం చక్కటి విందు భోజనం తయారు చేయటానికి తగిన ఏర్పాట్లు చేయ సాగాడు.

గాఢ నిద్రలో ధనుంజయ అపర్ణులకు ఎంత సమయము గడిచిందో తెలీదు. ఈలోపల కొత్వాలు కోసం వెళ్ళిన అశ్వికుడికి అనుకోకుండా మాళవ యువ రాజు ఇంద్ర జిత్తు చిన్న అశ్విక దళంతో సరి హద్దు ప్రాంతానికి పోతూ దారిలో ఎదురయ్యాడు. రాచరికపు బంధుత్వాలు ఆ అశ్వికునికి తెలుసు. వెంటనే `

అశ్వం దిగి ఇంద్ర జిత్తు అశ్వానికి ఎదురు వెళ్ళి స వినయంగా నమస్కరించాడు. రత్నగిరి యువరాజు ధనుంజయుడు తన మిత్రుడు అపర్ణుడితో సత్రంలో నిద్రిస్తున్న విషయం మనవి చేసాడు. అలాగే జరిగిందంతా పూస గుచ్చినట్టు వివరించాడు.

తన బావ ధనుంజయుడి రాక తెలీగానే ఇంద్ర జిత్తు మహదానందం చెందాడు. కొత్వాలును తీసుకు రమ్మని ఇద్దరు భటుల్ని వెనక్కి పంపించి మిగిలిన అశ్విక దళంతో ఆగ మేఘాల మీద సత్రంకి చేరుకున్నాడు. సాక్షాత్తూ తమ యువ రాజే సత్రంకి వేంచేయటంతో బిడారు నాయకుడు భల్లాతకుడి ఆనందానికి మేర లేదు. గతంలో తమ యువరాజుతో ముఖ పరిచయం ఉన్నప్పటికీ గాఢ పరిచయం లేదు. ఇప్పుడీ సంఘటనతో మాళవ రాజ కుటుంబానికీ రత్నగిరి రాజ కుటుంబానికీ కూడ దగ్గరవుతున్నాడు.

ఇంద్ర జిత్తు స్వయంగా భల్లాతకుడ్ని అభినందించి తన మెడలోని రత్నాల హారంతో సత్కరించాడు. బావ ధనుంజయుడు లేచే వరకు వేచి వున్నాడు. బంధువులిద్దర్ని, మరణించిన నలుగుర్ని చూసాడు. విషయం కొంత అర్థమైంది. ఈలోపల ఆ ప్రాంతపు కొత్వాలు తన మనుషులతో హుటా హుటిన అక్కడికి చేరుకున్నాడు.

బంధితులిరువురితో బాటు`

శవాల మణి కట్టు మీద డేగ పచ్చ బొట్టును గమనించాడు ఇంద్రజిత్తు. బంధితులు నిజం చెప్పరని అర్థమైంది. వాళ్ల అశ్వాలు ఆరింటినీ పరిశీలించినపుడు అవి రత్నగిరి సైన్యానికి చెందినవని అర్థమైంది. కాబట్టి ఇంద్రజిత్తు ఒక నిర్ణయం తీసుకుంటూ సాయంత్రం లోపు బంధితులిద్దరూ నిజం చెప్తే సరి. లేదంటే రేపు సూర్యోదయం తోనే శిరచ్ఛేదన అమలు చేయమని కొత్వాలును ఆజ్ఞాపించాడు. కొత్వాలు తన మనుషులతో బంధితులతో బాటు శవాలు నాలుగింటిని కూడ వెంట తీసుకు పోయాడు.

ఇదంతా జరిగిన చాలా సేపటికి`

అనగా పొద్దు పడమట వాలుతూండగా ధనుంజయ అపర్ణులు నిద్ర లేచారు. ప్రయాణ అలసటతో బాటు నిద్ర మత్తు కూడ తీరింది. ఇక వూహించని విధంగా బావ ఇంద్రజిత్తు కూడ వచ్చి ఉండటం ధనుంజయునికి అమితానందం కలిగించింది.

ధనుంజయ అపర్ణులు స్నానాదికాలు ముగించి దుస్తులు మార్చు కొని రాగానే ఇంద్ర జిత్తుతో కలిసి విందు భోజనం చేసారు. పిమ్మట ఇరు రాజ్యాల పరిస్థితులు, కుటుంబ యోగ క్షేమం గురించి ముచ్చటించుకున్నారు. బాహ్లీకుడు తెగించి అంతర్యుద్ధాన్ని మొదలు పెడితే సర్వ సన్నద్ధంగా వున్న మాళవ సేనలు రత్నగిరి సేనలకు అండగా వస్తాయని స్వయంగా తానే సేనల్ని నడిపిస్తానంటూ మాటిచ్చాడు ఇంద్రజిత్తు. కోటకు వచ్చి రెండ్రోజుండి వెళ్ళమని అర్థించాడు గాని ధనుంజయుడు సున్నితంగా తిరస్కరించాడు.‘‘బావా! చాలా సేపటిగా  అడగానుకుంటున్నాను.  ఈ బాల మిత్రుడు ఎక్కడ లభించాడు నీకు?’’ అనడిగాడు అపర్ణుడిని సందేహంగా చూస్తూ ఇంద్ర జిత్తు. అతడు పురుషుడు కాడు స్త్రీయేమోనని అనుమానం పీకుతోంది. కాని ధనుంజయుడు పరిహాసంగా నవ్వేసాడు.

‘‘బావా! వీడు చూడ్డానికి బాలుడే గాని బాహు మేధావి. నాకు మిత్రుడే కాదు. ప్రస్తుతం అంగరక్షకుడు కూడ. దివ్య నాగ మణితో తిరిగి వచ్చు వరకు నా తోనే ఉంటాడు. మహా వీరుడు కూడాను. పరీక్షింప దలిచిన ఇతనితో ద్వంద్వ యుద్ధమునకు తల పడవచ్చు.’’ అన్నాడు.
‘‘ఇప్పుడు కాదులే. మీరు మరలి వచ్చిన పిదప తప్పక పరీక్షింతును’’ అన్నాడు ఇంద్రజిత్తు.

అంతా వదని వారిస్తున్నా ఆగకుండా పొద్దు పడమట వాలుతూండగా అందరి వద్ద వీడ్కోలు తీసుకుని తమ అశ్వాల మీద మహా పథంలో సాగి పోయారు ధనుంజయ, అపర్ణులు. వారి అశ్వాలు కను మరుగు కాగానే ఇంద్రజిత్తు తన సిబ్బందితో సరి హద్దు వైపు కదిలి పోయాడు. ఆ విధంగా అంతా ఎవరి దారిన వారు వెళ్ళి పోగానే తేలిక పడ్డ మనసుతో తన బిడారును బయలుదేర దీసాడు భల్లాతకుడు.

**********************************

సత్రం నుండి బయలు దేరిన`

ధనుంజయ, అపర్ణులకు దూరంగా వింధ్యా పర్వత పంక్తుల శిఖరాలు కన్పిస్తున్నాయి. ఆకాశం నిర్మలంగా వుండి చల్లటి గాలులు వీస్తున్నాయి. ఈ రోజు ఎండ తీవ్రత తక్కువ గానే వుంది. వింధ్య పర్వతాలను చేరాంటే నాలుగు జాము అంటే ఒక పగటి ప్రయాణ దూరం ఉంటుందనిపించింది. రెండు జాముల్లోనే ఆ దూరాన్ని అధిగమించి చీకటి పడిన తొలి జాము వేళకి చేరుకోవాలని లక్ష్యంగా అశ్వాలను శర వేగంతో పరుగులు తీయిస్తున్నారు.

మార్గంలో కొద్ది సేపటికే కుడి పక్కగా చీలి పోతున్న అవంతీ మార్గాన్ని చూసారు. మహా పథం నేరుగా ఎగువకు పోతూ క్రమంగా ఉత్తరాభి ముఖంగా తిరిగి వింధ్యా సానువుల వైపు పోతోంది. బాట సాయి అశ్వికుల శకటాలు మార్గంలో ఎదురవుతున్నాయి. చిన్న చిన్న పల్లెల్లో జన పదాలు వెనక్కు పోతున్నాయి. క్రమంగా పంట భూములు తరిగి పోయి చిట్టడివి ఆరంభమైంది. అది ఎగువకు పోయే కొద్ది దట్టమైన అటవీ ప్రాంతంగా మారి పోతోంది. వింధ్య పర్వతాలను చేరుకుంటే అక్కడి నుండి ఆరంభమయ్యేది వింధ్యాటవి. ఆ పర్వత శ్రేణిని దాటితే అవతల హైహియ రాజ్య భూభాగం లోకి ప్రవేశిస్తారు.

చిట్టడవిలో బాటల మీద పరిసరాల వెంట కుందేళ్ళు, అడవి కుక్కలు, నక్కలు, పందుల సంచారం కన్పిస్తోంది. వాయు వేగంతో దూసుకొస్తున్న అశ్వాల గిట్టల శబ్ధానికి చెదిరి బాట వదిలి అవి దూరంగా పరుగులు తీస్తుంటే భద్రా దేవి హుషారుగా అరుస్తోంది. ఆకాశంలో కొంగల బారులు పశ్చిమంగా ఎగిరి పోతున్నాయి. పక్షుల గూళ్ళకు చేరుకొంటున్నాయి.

క్రమంగా సూర్యుడు అస్తమించాడు.

అడవంతా పుచ్చ పువ్వులా వెన్నెల పరుచుకుంది. చీకటి పడిన కొద్ది సేపటికే చిట్టడివి కూడ దాటి దట్టమైన అడవిలో ప్రవేశించారు. ఇప్పుడు వింధ్య పర్వతాలు స్పష్టం గాను దగ్గర గాను కన్పిస్తున్నాయి.

రాత్రి మొదటి జాము ముగిసే వేళకి మహా పథం రెండు ఎత్తయిన పర్వతాల నడుమ ముందుకు పోతూ వారిని వింధ్య పర్వతాల్లోకి తీసుకు పోయింది.

రాత్రివేళగాబట్టి ఎగువ నుంచి ప్రయాణీకులు ఎవరూ ఎదురు కావటం లేదు. తాము కూడ ఎక్కడో చోట రాత్రికి మజిలీ చేయాలి. ఆనువైన చోటు కోసం గాలిస్తూ అలా ముందుకు సాగి పోతూనే వున్నారు.

వింధ్య సానువులు దాటాలంటే`

కనీసం అయిదారు యోజనాల దూరం ప్రయాణించాలి. నిన్న రాత్రి నిద్ర లేకుండా ప్రయాణించటం చేత ఈ రాత్రికి అలా ప్రయాణం చేయుట కష్టం. రాత్రికి అనువైన చోట తాము మజిలీ చేయక తప్పదు. అలా కొంత దూరం వెళ్లగానే ఉన్నట్టుండి తన అశ్వాన్ని నిలువరించాడు ధనుంజయుడు.

‘‘ప్రభూ! ఏమైనది?’’ అంటూ తన అశ్వాన్ని మళ్లించింది భద్రా దేవి.

చేయెత్తి కుడి పక్క చిన్న గుట్టల మీదకు చూపించాడు ధనుంజయుడు.

‘‘అటు చూడుము భద్రా! ఆ గుట్ట పైన ఏదో శిధిల మండపమున్నది’’ అన్నాడు.
అటు చూసిన భద్రా దేవికి ఎత్తుగా ఉన్న మండపము అరుగు వెన్నెట్లో గోచరించింది. స్థంభాలు కూలి పోయి ఒకే ఒక స్థంభము మాత్రము పొడవుగా నిలబడి కన్పిస్తోంది.

‘‘సందేహమేల ప్రభూ! పోయి చూచెదము గాక’’ అంటూ తన మచ్చల గుర్రాన్ని గుట్టల పైకి పరుగెత్తించింది. ఏటవాలుగా వున్న గుట్టల పైకి అశ్వాలు రెండూ చేరు కొనే సరికి అంత వరకూ అక్కడ తిష్ట వేసి చెలగాటమాడుతున్న అడవి పందులు గుట్ట దిగి పారి పోయాయి.
ఇద్దరూ అశ్వాలు దిగి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఒకప్పుడు ఏకాలంలో ఎవరు నిర్మించారో గాని బాటసారుల వసతి కోసం చక్కటి విశాలమైన రాతి మండపాన్నే నిర్మించారు. కాని కాల క్రమంలో స్థంబాలు, పై కప్పు శిథిలమై  కొంత పక్కకు పడి పోగా, ఒకే ఒక స్థంభం మాత్రం నాటి వైభవానికి గుర్తుగా ఎత్తుగా నిల బడుంది. మండపానికి తూర్పు వైపున కాస్త దూరంలో శాఖలు విస్తరించిన పెద్ద వట వృక్షం వుంది.

సమీప కాలంలో ఆ మండపం మీద ఎవరూ మజిలీ చేసిన గుర్తులు లేవు. మండపం ఎత్తుగా సువిశాలంగా ఇప్పటికీ చెక్కు చెదరకుండా వుంది దూళి ధూసరితో.

‘‘ఏం చేద్దాం?’’ అడిగాడు ధనుంజయుడు.

‘‘ఇంత కన్నా అనువైన చోటు మనకు దొరుకుతుందనుకోను ప్రభూ!’’ అంది భద్రా దేవి.

అశ్వాలను మర్రి వృక్షం ఊడలకు బంధించారు. మండపం అరుగును తగినంత మేర శుభ్రం చేసుకుని కంబళి పరిచి కూచుని వెంట తెచ్చుకున్న రొట్టెలు తిని నీరు త్రాగారు. అరు బయట చంద్రుడి వెన్నెల చల్లటి కొండగాలి అన్నిటికీ మించి తమకు చక్కని ఏకాంత ప్రదేశం.
భద్రా దేవిని ఒడి లోకి లాక్కున్నాడు.

ప్రేమగా బుగ్గలు నిమిరి ముద్దాడాడు. ‘‘ఇప్పుడైనా నీ వివరములు చెప్ప వలె. నీ గురించి తెలియ గోరుచున్నాను.’’ అనడిగాడు.
సున్నితంగా విడిపించుకుంది భద్రా దేవి.

‘‘భద్రా! ఏమైనది?’’ లాలనగా అడిగాడు.

‘‘ఇక్కడ ఎవరో వున్నారు ప్రభూ!’’ అంది భద్రా దేవి.

‘‘లేదే... ఎవరును లేరు.’’

‘‘ఉన్నారు. మనను గ్రుచ్చి చూస్తున్నట్టున్నాది.’’

‘‘ఎవరు?’’ అంటూ ఫక్కున నవ్వాడు ధనుంజయుడు.

‘‘ఓ అర్థమైనది ప్రియా. చంద్రుడు చూచుచున్నాడనియే గదా నీ సంశయము. ప్రేమికులకు ఆప్తుడే గదా జాబిలి.’’

‘‘కాదు ప్రభూ! నెల రాజు కాదు.’’

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
kadali serial