Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kadali serial

ఈ సంచికలో >> సీరియల్స్

అతులితబంధం

గతసంచికలో ఏం జరిగిందంటే.... http://www.gotelugu.com/issue160/456/telugu-serials/atulitabandham/atulitabandham/

 

తన సెక్షన్ కి సంబంధించిన మెయిల్స్ అన్నీ ప్రింట్ తీసి, ఫైల్ చేసుకుంటోంది ఐశ్వర్య. పక్కనే ఎవరో నిలుచున్నట్టు అనిపించి తలతిప్పి చూసింది. అదోలా చూస్తూ, వెకిలిగా నవ్వుతూ మనోహర్. అతడంటే మంచి అభిప్రాయం లేని ఐశ్వర్య “యస్?” అంది భ్రుకుటి ముడిచి.

“ఏంటి పాపా, పెళ్ళవలేదు కానీ అన్నీ అయిపోయాయిట కదా!” అన్నాడు ముందుకు వంగి ముఖంలో ముఖం పెడుతూ... 
చప్పున కుర్చీని దూరంగా జరుపుకుని, “చూడండి మిస్టర్, ఇట్ ఈజ్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్...” అని తిరిగి తన పనిలో నిమగ్నమైంది.

“ఎవడో కార్తీక్ అనే వాడితో ఉంటున్నావటగా... మరి నాకూ ఒక ఛాన్స్ ఇవ్వకూడదూ? ఊరికే కాదులే, డబ్బిస్తా...”
గబుక్కున లేచి బాస్ గంగాధరం  కేబిన్ లోకి వెళ్ళింది ఐశ్వర్య. “యస్, ఏం కావాలి?” అన్నాడు ఆయన ఆమెను చూస్తూనే.

“సర్... మనోహర్ నాతో మిస్ బిహేవ్ చేస్తున్నాడు...” తల వంచుకుని చెప్పింది దుఃఖం గొంతులో సుళ్ళు తిరుగుతుంటే.

“ఈజిట్?” బెల్ కొట్టి వెంటనే మనోహర్ని లోపలికి పిలిచాడు గంగాధరం.

“మిస్ ఐశ్వర్యతో తేడాగా ప్రవర్తిస్తున్నావట? ఉద్యోగం ఊడిపోతుంది జాగ్రత్త...” తీవ్రస్వరంతో అతన్ని హెచ్చరించాడు.

“మిస్ అని మీరు అనుకుంటున్నారు... పెళ్లి కాకుండానే ఎవడికో మిసెస్ గా ఉన్నది ఈవిడ... ఇలాంటి వాళ్లకు ఉద్యోగం ఇచ్చినందుకు మీ పరువే పోతుంది...” రెక్ లెస్ గా చూస్తూ సమాధానమిచ్చాడు మనోహర్.

“ఆమె వ్యక్తిగతజీవితం ఆమెది... వ్యతిరేకించటానికి కానీ, ఆమోదించటానికి కానీ నువ్వెవడివి? ఆఫీసు పనిలో ఎటువంటి అంతరాయం కలుగనంతవరకూ ఎవరి వ్యక్తిగత విషయాల్లోనూ కల్పించుకోను నేను...”

“అయితే నేను ఆఫీసు పని సక్రమంగా చేయటం లేదా? ఆమె కంప్లెయిన్ చేయగానే నన్ను లోపలికి పిలిచి వార్న్ చేస్తున్నారు?” పొగరుగా తలెగరేసాడు మనోహర్.

“నా ఆఫీసులోని  ఒక తోటి ఉద్యోగినితో సరిగ్గా లేదు నీ ప్రవర్తన... నా ఉద్యోగులంతా నాకు ఒక్కటే... ఎవరికీ ఎవరివల్లా హాని కలగకూడదు... అసౌకర్యం జరగకూడదు... నీ వలన ఆమె బాధపడుతోంది... బిహేవ్ యువర్ సెల్ఫ్... ఇట్ షుడ్ నాట్ బీ రిపీటెడ్ వన్స్ అగైన్... నౌ యూ కెన్ గో...” 

పొగరుగా తలెగరేసి డోర్ విసురుగా తీసి, వెళ్ళిపోయాడు మనోహర్.

మనోహర్ వెళ్ళిపోగానే, “ఐశ్వర్యా, ఏమిటమ్మా అతను చెబుతున్నది?” అని అడిగాడు గంగాధరం. “సర్... నేనూ, నా స్నేహితుడు కార్తీక్ పరస్పరం ఒకరినొకరం కోరుకుని ఒకే ఇంట్లో సహజీవనం చేస్తున్నామండి. అంతకన్నా ఏమీ లేదు...” అంది ఐశ్వర్య తేలికగా...
ఆయనకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఆమె కళ్ళలోని పసితనాన్ని గమనిస్తూ, “సరేనమ్మా, ఈ విషయం గురించి ఎప్పుడేనా తీరికగా చర్చిద్దాము... నువ్వెళ్ళి నీ పని చేసుకో...” అని తన పనిలో మునిగిపోయాడు.

“అలాగే సర్, థాంక్ యు వెరీ మచ్...” అంటూ కేబిన్ లోంచి బయటకు వచ్చేసింది ఐశ్వర్య.

***

ఇంటికి వచ్చింది కానీ ఐశ్వర్యను రకరకాల ఆలోచనలు చుట్టుముట్ట సాగాయి. ఆఫీసులో ఒక్క మనోహర్ ప్రవర్తనే కాదు., సాటి లేడీ కొలీగ్స్  ప్రవర్తన  కూడా అదోలా ఉంటోంది. ఇదివరలో కలిసే లంచ్ చేసేవారు తామంతా... ఇప్పుడు ఏదో తెలియని దూరాన్ని వాళ్ళే మెయిన్ టైన్ చేస్తున్నారు. బాధగానే ఉన్నా, తనేం తప్పు చేయలేదన్న ధీమాతో తన సీట్ లోనే లంచ్ తీసుకుని, తన పనేదో తాను  చూసుకుని వస్తోంది. ఈ రోజు ఈ కొత్త సమస్య.

కార్తీక్ టూర్ వెళ్ళాడు మళ్ళీ. వారానికి కనీసం ఒకటి రెండు రోజులు వెళ్ళిపోతున్నాడు... ఒంటరిగా అనిపిస్తుంది తనకు. అక్కడికీ పిన్నిగారి ఇంటికి వెళ్ళి ఆవిడతో కబుర్లు చెబుతూ, ఆవిడ పాటలు వింటూ, కొత్త పాటలు నేర్చుకుంటూ గడుపుతూనే ఉంది... పిన్ని గారు చెప్పటం వల్లనో ఏమో ఆవిడ శిష్యురాళ్ళు అందరూ, అంటే ఈ ఫ్లాట్ లోని అమ్మాయిలు తనతో స్నేహం కలుపుకున్నారు. పై ఇంటి పాపలూ,  క్రింది ఫ్లాట్ అబ్బాయిలూ ‘అక్కా, కొంచెం ప్రాజెక్ట్ వర్క్ లో హెల్ప్ చెయ్యి,’ ‘అక్కా, వ్యాసం రాయాలి పాయింట్స్ చెప్పు...’ అంటూ వస్తారు. 
పై ఫ్లాట్ లోని ప్రసన్నకి కొడుకు పుట్టాడు. వాడిని ఇరవై ఒకటో రోజు ఉయ్యాలలో వేసి, పేరు పెట్టినప్పుడు ఆ ఫంక్షన్ కి ప్రసన్న చెల్లెలు వచ్చి బొట్టు పెట్టి మరీ పిలిచింది. ప్రసన్న ఫోన్ చేసి ఐశ్వర్యను ఆహ్వానించింది. ఆ ఫంక్షన్ హడావుడి, సంబరం ఎప్పటికీ మరువలేదు తాను. ఆడపిల్లలంతా కలిసి బోలెడు పాటలు పాడారు. తాను నిర్వహించిన అంత్యాక్షరి కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని, తనిచ్చిన బహుమతులు పొంది సంతోషంగా కేరింతలు కొట్టారు. 

తరువాత ప్రసన్న బుజ్జిగాడిని తన ఒడిలో పడుకోబెట్టినప్పుడు వాడి ముఖంలోకి అలాగే చూస్తూ ఉండిపోయింది ఐశ్వర్య. లేత గులాబీ రంగు జుబ్బా, డ్రాయర్ వేసారు వాడికి. నల్లని ఉంగరాల జుత్తు పట్టులా మెరిసిపోతోంది... ఆ జుత్తు లోంచి కమ్మని సాంబ్రాణి పరిమళం... వంటినిండా వేసిన బేబీ పౌడరు వాసన,  బుగ్గన పెట్టిన నల్లని దిష్టి చుక్కతో, కాళ్ళకు కట్టిన మువ్వల పట్టీలు ఘల్లు ఘల్లు మని మ్రోగుతూ సవ్వడి చేస్తూంటే, ముద్దులొలికి పోతూ ఉన్న ఆ చిన్న బాబును చూస్తూ ఉంటే ఆమెలో మాతృత్వం పెల్లుబికినట్టు అయింది. అప్రయత్నంగా వాడిని పైకి ఎత్తి గుండెకు హత్తుకుని మురిసిపోయింది. ఒక్కసారిగా ఆమె గుండెలు బరువెక్కాయి. కళ్ళలోకి నీళ్ళు వచ్చాయి... తానూ తల్లి అయితే... ఆహా... ఆ భావనే ఎంత అపురూపంగా ఉంది? 

మొత్తానికి అన్నపూర్ణ గారి నేతృత్వంలో, సప్తగిరినిలయంలోని అమ్మాయిలంతా ఒక్కటై ఆ వేడుకను ఎంతో వైభవంగా జరిపించారు. ఐశ్వర్య అందరికీ దగ్గరయింది.

కార్తీక్ కి తనకూ ఎడం పెరుగుతున్నట్టు అనిపిస్తోంది. ఇంటికి వచ్చినా ఎపుడూ లాప్ టాప్ పెట్టుకొని పని చేసుకుంటూ ఉంటాడు తప్ప తన గురించి పట్టించుకోవటం మానేసాడు. ఎక్కడికైనా వెళదామని అనిపించి అడిగితే, తనకు టైం లేదని అంటాడు. గంటలు గంటలు ఫోన్ లో ముచ్చట్లు... అవతలి వాళ్ళు ఆడ ఫ్రెండ్స్ అని తనకు తెలుస్తూనే ఉంటుంది. ఆడదానికి సహజంగా ఉండే ‘అసూయ’, ‘పొసెసివ్ నెస్’ తనను బాధ పెడుతున్నాయి. కానీ అన్నీ ముందే తెలుసు. తాను విలాస పురుషుడనని, వెరైటీ కోరుకుంటానని, అందుకని తన ఒక్కదానికే పరిమితం కాలేనని ముందే చెప్పాడుగా... అతని కాంపుల్లో బోలెడు అనుభవాలు... తిండి, తాగుడు, విలాసంగా పక్కనే ఒక యువతి ఉంటే చాలు అతనికి ఇంట్లో ఉన్న ఐశ్వర్య తలపులలోకి కూడా రాదు. 

ఐశ్వర్య మనసు భారంగా మూల్గింది. అంతలోనే మధుబాల ఊరినుంచి మధ్యాహ్నం కొరియర్ లో వచ్చిన శుభలేఖ గుర్తుకు వచ్చింది.
ఎంతో ఆనందంగా తెరిచి చూసింది. మధుబాల ప్రస్తుతం లీవ్ పెట్టి ఇంటికి వెళ్ళింది. శుభలేఖ పైన అందమైన ఆర్ట్. ధనుర్ధారి అయిన రాముడి మెడలో తల వంచుకొని వరమాల వేస్తున్న మేలిముసుగులో  సీతాదేవి. ముగ్ధురాలే అయింది ఐశ్వర్య. లోపల వివరాలు చూసింది. ఇదివరకే ఊరికి వెళ్లేముందు వేణుగోపాల్ ని తనకు పరిచయం చేసింది మధు. మంచివాడు, యోగ్యుడులానే అనిపించాడు. మధు జీవితం ఆనందంగా గడవాలి అనుకుంది మనస్ఫూర్తిగా... పెళ్ళికి తప్పక వెళ్ళాలి. ఇంకా మూడు వారాలుంది... అనుకుంది. మధుబాల గురించి, తమ స్నేహం గురించీ, హాస్టల్లో తాము గడిపిన చక్కని మధుర జీవితం గురించీ, పంచుకున్న కష్టసుఖాల గురించీ ఆలోచిస్తూంటే ఆమెకు ప్రశాంతంగా నిద్ర పట్టింది.

***

“కార్తీ... వచ్చే శుక్రవారమే మధు పెళ్ళి వాళ్ళ ఊరిలో. మనం తప్పక పెళ్ళికి వెళ్ళాలి...” ఆఫీస్ కి తయారవుతూ చెప్పింది ఐశ్వర్య.
“శుక్రవారమా? నాకు వేరే పనుంది ఐశూ... నువ్వు వెళ్ళి వచ్చేయ్...” అద్దంలో చూసుకుంటూ కాజువల్ గా చెప్పాడు కార్తీక్.
“అదేమిటి కార్తీ, మధూ నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అని నీకూ తెలుసు కదా... ఇద్దరం కలిసి వస్తామని మాటిచ్చాను నేను... ప్లీజ్ కార్తీ...”
“ఏమిటి ఐశూ, నన్నడిగి ఇచ్చావా ఏమిటి నీ మాట? మీ మధుబాల అంటే నాకు కోర్ట్ లో జడ్జ్ గారు గుర్తు వస్తారు. నేనేదో తప్పు చేసినట్టు, ఆవిడ చూపులతోనే నిలదీస్తున్నట్టు అనిపిస్తుంది నాకు...”

“ఛ! ఏదో నేనంటే ఉన్న ప్రేమ కొద్దీ, మనం అవలంబించబోయే కొత్త జీవితం పట్ల ఉన్న వ్యతిరేకత వలనా ఆరోజు అలా మాట్లాడింది కానీ, ఆమెకు నువ్వంటే చాలా గౌరవం కార్తీ... అలాంటివేవీ మనసులో పెట్టుకోకు. గురువారం బయలుదేరి, శుక్రవారం సాయంత్రం పెళ్ళి చూసుకుని, శనివారం ఉదయమే బయలుదేరి వచ్చేద్దాం... ఈ ఒక్కసారీ నా మాట కాదనకు...” వేడికోలు గా అంది ఐశ్వర్య.
ఐశ్వర్య ముఖం చూస్తూంటే కార్తీక్ కి ఎంతో జాలి వేసింది. తన గురించి సర్వం తెలిసీ, తన బలహీనతలను అర్థం చేసుకుంటూ, ఆమె  మాత్రం తనను ప్రేమిస్తూనే ఉంది... తనకే లోటూ లేకుండా చూసుకుంటూనే ఉంది... అలాంటి ఐశ్వర్య కోసం ఈ ఒక్కసారి తనను పెళ్ళికి తీసుకు వెళితే ఏం? పిచ్చిపిల్ల! ఎంతో సంతోషపడిపోతుంది. అతని హృదయం మెత్తబడింది.

“సరే... బాగ్ సర్దుకో... మంచి చీరలు పెట్టుకో... సరేనా?” ఉప్పొంగిన ప్రేమతో ఆమెను దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకున్నాడు.
“థాంక్ యు కార్తీ... థాంక్స్ అ లాట్! అందుకే నువ్వంటే నాకింత ఇష్టం...” ప్రేమగా అతని బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది ఐశ్వర్య. 
***

“అమ్మాయ్ ఐశ్వర్యా...” అంటూ వచ్చింది అన్నపూర్ణ.

తలుపు తీసిన కార్తీక్, “ఐశూ, పిన్ని వచ్చారు చూడు...” అంటూ బెడ్ రూమ్ లోకి వెళ్ళిపోయాడు. పెళ్ళికని మధుబాల వాళ్ళూరు బయలుదేరబోతున్న ఐశ్వర్య హడావుడి గా లోపలినుంచి వచ్చింది.

“పిన్నీ... చెప్పండి... ఏమైనా కావాలా?” అంది అమాయకంగా.

“ఇదిగో ఈ పాకెట్ మధుబాలకి ఇవ్వమ్మా... ఇందులో పసుపు, కుంకుమ, అక్షింతలు, కొత్తచీరా ఉన్నాయి... నావీ, బాబాయివీ ఆశీస్సులతో పాటు అందించు...” అని ఒక పాకెట్ అందించింది.

ఐశ్వర్య వెర్రిదానిలా అన్నపూర్ణ వైపు చూస్తూ ఉండిపోయింది. తనతో కొంత అనుబంధం ఉన్నది అన్నపూర్ణకు, కానీ మధుబాలను కలిసింది రెండు మూడు సార్లు మాత్రమే... అయినా ఎంత ఆపేక్ష దాని మీద? ఒక్క క్షణం ఆవిడలో తన తల్లి కనిపించింది. అంతే కాదు, అమ్మకు దూరంగా ఉన్నానన్న భావన కలుగగా, కళ్ళలోకి నీళ్ళు వచ్చాయి.

“అరె, ఏమిటిరా, శుభమా అని పెళ్ళికి వెళ్ళబోతూ, ఈ కన్నీళ్లు? తుడుచుకో...” మందలింపుగా అంటూనే తన కొంగుతో ఐశ్వర్య కళ్ళు తుడిచింది అన్నపూర్ణ. 

“పిన్నీ... మీరు నాకు మా అమ్మే అనిపిస్తున్నారు...ఇంత మంది కూతుళ్ళ పట్ల మీకున్న ప్రేమను తలచుకుంటే... ఏడుపు వచ్చేస్తోంది...” అన్నపూర్ణ గుండెల్లో గువ్వలా ఒదిగిపోయింది ఐశ్వర్య.

“ఛ, చిన్నపిల్లవి అయిపోతున్నావు రోజురోజుకీ... సరే సరే... టైమవుతోంది... బయలుదేరండి... జాగ్రత్తమ్మా, డ్రైవింగ్ చేసేటప్పుడు... అబ్బాయికి చెప్పు... అసలు  డ్రైవర్ ని పెట్టుకోవలసింది... రాత్రిపూట కారు నడపటం కష్టమే కదా... మరి నేను వస్తాను, మీ బాబాయికి త్వరగా అన్నం వడ్డించేయాలి...త్వరగా వచ్చేయ్... సరేనా?” అంటూ ఐశ్వర్య తల నిమిరి, వెళ్ళిపోయింది అన్నపూర్ణ.

“ఐశూ... రెడీనా? ఐదు నిమిషాల్లో బయలుదేరాలి...” లోపలినుంచి కేక పెట్టాడు కార్తీక్.

***

కొన్ని గంటల ముందు మధుబాల ఇంటిలో...

పిన్నులూ, అత్తయ్యలూ, అక్కయ్యలూ, వదినా  అంతా వచ్చి మధుబాలను పెళ్ళికూతుర్ని చేసారు. వంటికి, ముఖానికి  పసుపు, నూనె  రాసి, నలిచి, ఒకరి తర్వాత మరొకరు తల మీదుగా నీళ్ళు పోసి, తలంటారు. పాదాలకు పసుపు పూసి, పారాణి తో అలంకరించారు. 
నిడుపాటి జుత్తుకు చిక్కు తీసి అందమైన జడ అల్లి, దానికి పూలజడను కుట్టారు. చెవుల నుంచి చెంపలవరకూ ఊగుతున్న జూకాలతో, పాపిటలో పాపిడి బిళ్ళతో, నుదుట కళ్యాణ తిలకంతో, బుగ్గన అమరిన చక్కని నల్ల చుక్కతో, మెడకూ, చేతులకూ బంగారు నగలతో, పట్టు చీరతో, పాదాలకు మంజీరాలతో లక్ష్మీదేవి పెళ్ళికూతురు అయిందా అన్నట్టుంది మధుబాల.

“అబ్బా, ఎంత అందంగా ఉన్నావే చెల్లాయ్... మా దిష్టే తగిలేట్టుంది...” అని మురిసిపోయారు అక్కలిద్దరూ. నాయనమ్మ దగ్గరికి వచ్చి కళ్ళ నిండుగా మనవరాలిని చూసుకుంది. 

“మధూ పెళ్ళి అయిపోతోంది.. ఇక నాకు ఏమైనా ఫర్వాలేదు...” తృప్తిగా అనుకున్నాడు ఆమె తండ్రి అనంత రామయ్య. ఆమె అన్న గిరి సంబరానికి అంతే లేదు. 

బంధువులూ, చుట్టుప్రక్కల ఇరుగుపొరుగు వారూ వచ్చి అక్షింతలు వేసాక, మధుబాల, నాయనమ్మకూ  అమ్మా నాన్నలకూ, అక్కలు, బావలకూ, అన్నా వదినలకూ,  పాదాలంటి నమస్కరించింది. వారు వేసిన పచ్చని అక్షతలతో ఆమె జుట్టు అంతా నిండిపోయింది. 
“నీ ఫ్రెండ్ ఎవరో వస్తారని చెప్పావు కదా మధూ?” అడిగింది నిర్మల.

“అవును వదినా, సాయంత్రం బయలుదేరి రేపు ఉదయానికి వస్తారు వాళ్ళిద్దరూ...” చెప్పింది మధుబాల.

***

“పిచ్చిపిల్ల! ఐశ్వర్యను చూస్తూంటే చాలా బాధ కలుగుతోందండీ...” విశ్వనాథం ప్లేట్ లో చపాతీలూ కూరా వడ్డిస్తూ దిగులుగా అన్నది అన్నపూర్ణ.

“నిజమే అనూ... కానీ మనమేం చేయగలం... ఈ నాటి యువతకు మనం దిశా నిర్దేశం చేయలేము... వాళ్ళు ఎన్నుకున్న జీవన విధానం అది... అంతే...” 

“కానీ... అతను చాలా మంచి వాడండీ... ఆ పిల్లంటే ప్రేమ కూడా...”

“కానీ స్వేచ్చా పురుషుడు... అలాంటి వారికి తమ తర్వాతే ఎవరైనా... అయినా ఈ పద్ధతి ఇప్పుడిప్పుడే ఇండియా లో బాగా ప్రాచుర్యమౌతోంది... ఇద్దరికీ ఇష్టమయ్యే కదా అలా కలిసి ఉంటున్నారు?”

“కాదండీ, కార్తీక్ తో ఓ సారి మాట్లాడండి... మీరు చెప్పిన మాట కాదని అనడు...”

“పిచ్చి అనూ... నువ్వు పాతకాలం దానివి... ఈ కాలం పిల్లలు తాము నమ్మిన దాన్ని ఆచరిస్తారు తప్ప ఎవ్వరి మాటా వినరు...”
“ఐశ్వర్య...ఆడపిల్లండీ... అమాయకురాలు... ఉన్నన్నాళ్ళు ఉండి రేపు అతను ఆమెను విడిచి వెళ్ళిపోతే...”

“వెళ్ళనీ... ఐశ్వర్య దానికి సిద్ధపడే ఉంటుందిలే...” 

“మీరు మగవాళ్ళు... ఆడదాని మనసు మీకేం తెలుసు?” ఉక్రోషంగా మజ్జిగ గ్లాసును టపీ మని శబ్దం అయ్యేలా టేబుల్ మీద పెట్టింది అన్నపూర్ణ.

గలగలా నవ్వేసాడు విశ్వనాథం... 

“ఎందుకు తెలియదు? నలభై సంవత్సరాలనుంచీ నీతో కాపురం చేస్తూ... ఇంకా తెలుసుకోలేకుండా ఉన్నానా? పిచ్చి అనూ... పిచ్చి ఆలోచనలు మానేసి, ప్రశాంతంగా ఉండు... ప్రస్తుతం వాళ్ళిద్దరూ ఆనందంగానే ఉన్నారుగా... తర్వాత ఆలోచిద్దాం... సరేనా?” ఆమెను అనునయించాడు.

కోపంగా ఆయన వైపు చూస్తూ, ముడుచుకున్న ముఖంతో మూతిని ముప్పై ఆరు సార్లు తిప్పింది అన్నపూర్ణ, వజ్రాలు పొదిగిన ఆమె బేసరి తళుకు తళుక్కున మెరిసిపోతుండగా...

***

 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్