Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
melkolupu

ఈ సంచికలో >> కథలు >> సూర్యప్రతాపం

surya pratapam

మండు వేసవి భానుడు తన ప్రతాపాన్ని భూమి పై చూపిస్తున్నాడు ,మండే అగ్నిగోళం లా  భగభగ మంటూ నిప్పులు చెరుగుతున్నాడు ,ఆ నిప్పు కణికల వేడిమిని తట్టుకోలేక ప్రజలు విలవిలలాడుతున్నారు .సూర్యుడు తన వేడిమి తాపాన్ని తీర్చుకోవడానికి భూమి పైన ,నదులలోన,చివరికి మానవుని శరీరము లో ఉన్న నీటిని సైతం హరిస్తున్నాడేమో  అన్న తలంపు వస్తున్నది.భూమికి అతి చేరువుగా వస్తూ అత్యంత కాంతితో ,ప్రకాశవంతముగా ,అత్యంత వేడిమి కలిగిన బుసలు కొడుతూ దేదీప్యమానముగా వెలిగిపోతున్నాడు .            సూర్యుని వేడిమి భరించలేని ప్రజలు కొందరు గృహానికే పరిమితమయిపోయారు. విధి లేని పరిస్థితులలో కొందరు బయటకు సాగుతున్నారు .రోడ్లమీద జనసంచారము మందగించింది .వీధి కోళాయిల వద్ద ఆడపడుచులు బిందెడు నీటి కోసము పడిగాపులు కాస్తున్నారు .డబ్బు ఉన్న వాళ్ళందరూ ఏ‌సిల కింద కాలము వెళ్ళబుచ్చుతున్నారు .పానీయాలు ,ఐస్క్రీమ్ల బండ్ల వ్యాపారం జోరుగా సాగుతున్నది .తోపుడుబల్ల వ్యాపారస్థుల పరిస్థితి అత్యంత భాదాకరము, ఎండలో వెళ్ళలేరు వెళ్ళక పోతే పూట గడవదు .రిక్షా అబ్బి  పరిస్థితి గడ్డుకాలమనే చెప్పాలి, బతుకు జీవుడా అంటూ మండుటెండలో సూర్యుడు తన శక్తి ని  హరిస్తున్నా కాళ్లలో శక్తినంతా కూడా గట్టుకుని పయనం సాగిస్తున్నాడు.

మొత్తానికి ప్రతీ ఒక్కరి నోటా ఒకటే మాట ‘’బాబోయి ఎండలు భరించలేకపోతున్నాము మా వల్ల కాదు బాబోయి ‘’. స్కూల్లకి సెలవులివ్వడముతో పిల్లలందరూ ఇంటిపట్టునే ఉంటున్నారు. అమ్మ వద్దని చెప్పినా దొంగచాటుగా వీధిలోకి వెళ్ళి పిల్లలందరూ ఆడుకుంటున్నారు .ఆ వీధిలో పిల్లలందరూ క్రికెట్టు ఆడుతున్నారు .అంతా ఒకేసారి నిశ్శబ్దం అయ్యారు. సూర్య  వేసే బంతికి ప్రతాప్  సిక్స్ కొడతాడలేక అవుటవుతాడా అని అందరిలో ఒకటే ఆరాటం .సూర్య బంతిని తన నిక్కరుకి రుద్దుతూనే ఉన్నాడు ప్రతాప్  వెనుక సురేశ్ బంతిని పట్టుకుని అవుట్ చేద్దామా అని సిద్దముగా ఉన్నాడు.మిగిలిన వారందరూ బంతిని ఆపడానికి ఉత్సుకతతో ఉన్నారు .మొత్తానికి సూర్య  బంతిని వేయడము ప్రతాప్  సిక్స్ కొట్టడము జరిగిపోయాయి .ప్రతాప్ ని అందరూ హేయ్ అంటూ తమ మోచేతుల పైన ఎక్కించుకుని పైకి ఎత్తుతూ హాహాకారాలు చేశారు .తరువాత రెండు నిమిషాలకే ఉన్నపలముగా ప్రతాప్  కుప్పకూలిపోయాడు .అందరూ ప్రతాప్  చుట్టూ గుమిగూడారు .ఏమయింది ప్రతాప్  కి అనికంగారు పడ్డారు .అక్కడ పక్కనే ఆడుకుంటున్న ప్రతాప్ చెల్లి మల్లి పరుగెత్తు కుని వెళ్ళి విషయం అమ్మకి చెప్పింది .అందరూ కలిసి ప్రతాప్  ని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు .డాక్టరు వడదెబ్బ తగిలిందని ,ఎండలు తీవ్రముగా ఉన్న ఈ సమయములో పిల్లలని ఎందుకు బయటకి పంపారని డాక్టరు ప్రతాప్  తల్లిని మందలించారు .

అందరూ సుర్యుడిని ఒకటే నిందిస్తూ ఉన్నారు .మాయదారి ఎండలు మా జీవితాలతో ఆడుకుంటున్నాయి భరించలేక పోతున్నాము ఆ సూర్యుడు మా పేదోళ్ళ మీద కన్నెర్ర చేశాడు ఇలా మనిషోమాట అంటూనే ఉన్నారు ప్రతాప్  పరిస్థితికి  కారణమయిన ఎండను ,సూర్యుడిని అందరూ తప్పు పడుతున్నారు .అంతా విన్న మల్లి మాత్రం ఇంటిలో ఉన్న గుప్పెడు పువ్వులను తీసుకుని సూర్యుడి ఫోటో ముందు పెట్టి ‘’ఓ సూర్య భగవానుడా ,అందరూ నిన్ను నిందిస్తున్నారు ఎందుకు ....నువ్వు అంతా చెడ్డవాడివా ,మంచివాడివా ........,చెడ్డవాడివి అయితే చలిగా ఉన్నప్పుడు ,వర్షాలు పడినపుడు నిన్ను ఎందుకు తలుస్తారు,పిలుస్తారు,పూజిస్తారు.మంచివాడివయితే మా అన్నను   ఇలా ఎందుకు చేశావు ,అందరూ నిన్ను ఎందుకు తిడుతున్నారు ‘’ అని ప్రార్దించింది .

అందరూ సూర్యుణ్ణి నిందిస్తున్న సమయములో మల్లి మాత్రమే సూర్యుణ్ణి ప్రార్దించింది .వెంటనే మల్లి అనే పిలుపు వినబడేసరికి మళ్ళీ కంగారు పడింది ,’’నేనమ్మ సూర్యుణ్ణి పిలిచావుగా నన్ను ప్రశ్నించావుగా’’ అన్న మాటలు సూర్యుని ఫోటో నుండి వినిపించసాగాయి .భయపడకు నీ ప్రశ్నలకి సమాదానమిస్తాను వింటావా మరి అన ప్రశ్నకు అలాగే అన్నట్టుగా మల్లి తల ఊపింది .

చూడు మల్లి ఈ రోజున ప్రతీ ఒక్కరూ తప్పు నాదే అన్నట్లుగా నా మీదే విరుచుకుపడుతున్నారు .కానీ ఒక విషయము మాత్రము నిజం. నేను పుట్టినపుడు నుండి ఈ రోజు వరకు ఒకేవిధముగా ఉన్నాను అప్పుడు ఏ కాలములో  ఎలా ప్రకాశించేవాడినో ఇప్పుడూ అలాగే నా విధి నిర్వర్తిస్తున్నాను .మద్యలో  మార్పు వచ్చినదంతా మీ మానవుడి చర్యలవలనే అన్న మాటలకు ,అవునా అన్నట్లు మల్లి  ఆశ్చర్యముగా చూసింది .ఇంతకు ముందు అడవులు ,కొండలు,చెట్లు అన్నీ కూడా బాగా ఎత్తుగా ,ఎక్కువుగా ఉండేవి .అవి నా వేడిమిని మీ వరకు చేర్చకుండా అడ్డుకునేవి .కాని ఇప్పుడేమీ జరిగింది మానవులు చెట్లను అన్నింటిని కొట్టేశాడు కొండలను తవ్వేసాడు అడవులలో ఉన్న చెట్లను నరికేశారు మరి నా వేడి నుండి మీకు రక్షణ ఎలా వస్తుంది .సరే చెట్లను ,కొండలను,అడవులను అవసరార్దము తవ్వేశారు అనుకుందాము .మరి నాకు మీకు మద్యన ఉండే రక్షణ కవచము ఓజోను పొరను మీ మానవులు దెబ్బతీశారు .

అనేక ఫ్యాక్టరీలు పెట్టి వాటినుండి కాలుషాన్ని నా పైకి పంపించారు అది ఓజోను పొరను దెబ్బతీసింది అందుకే నానుండి వెలువడే వేడి మీకు అత్యంత సమీప మయ్యింది .రోడ్లమీద పాదాచారులు తగ్గిపోయారు అందరూ వాహనాల మీద వెళ్ళేవారే ఎక్కువయ్యారు దాని వలన వాహన ఇందన కాలుష్యం ఎక్కువయింది అది ఒక కారణమే మరి .సరే అన్నీ తెలుసుకుని కొంతమంది మేలుకుని మొక్కలు నాటే కార్యక్రమము అని మొక్కలు నాటి వెళ్లిపోతున్నారు కానీ తరువాత వాటి సంరక్షణ బాధ్యత వదిలేస్తున్నారు .మీ మానవులు కనిపెట్టిన అధునాతన వస్తువులు వాటి నుండి వెలువడే వాయువులు వలన ఓజోను పొర దెబ్బతిని నా నుండి వెలువడే అతినీలలోహిత కిరణాలు భూమి మీద మీ మనుష్యల మీద నేరుగా పడుతున్నాయి వాటి ప్రభావాన అనేక సమస్యలకు మీరు గురియవుతున్నారు ఇలా ఎన్నని చెప్పను మీ మనుషులు చేసిన తప్పిదాలు ఒకటా రెండా ......మీ సౌక్యము కోసము విలాసవంతమైన జీవితము జీవించడము  కోసము పరిణామాలను పరిగణలోకి తీసుకోకుండా ఎన్నో వస్తువులను కనిపెట్టి వినియోగిస్తున్నారు. బొగ్గు , పెట్రోల్ లను వివిధ అవసరాల నిమిత్తము వినియోగాన్ని బాగా పెంచారు .కానీ వాటి నుండి వెలువడే వాయువుల పరిణామాలను ఆలోచించడము లేదు .ఇలా ఎన్నో తప్పిదాలను చేస్తూ ,తప్పు తన వైపు ఉంచుకుని నన్ను నిందిస్తున్నారు .


ఇప్పుడు చెప్పు మల్లి  నన్ను పూజిస్తావో,  నిందిస్తావో .......నీ ప్రశ్నకు జవాబు లభించింది అనుకుంటాను  అన్న మాటలు వినిపించాయి మల్లికి తరువాత ఏమీ వినబడలేదు .మల్లికి విషయము అవగతమైంది అన్నట్లుగా అక్కడి నుండి వెళ్ళి మొట్టమొదట తన ఇంటి ముందు చిన్నచిన్న మొక్కలు నాటింది ,మల్లిని గమనించిన అందరూ తన వైపు ఆశ్చర్యముగా చూసారు .మల్లి అందరికీ విషయాన్ని తనకు  అర్దంయినరీతిలో వర్ణించింది,మల్లిని చూసి అందరూ మొక్కలు నాటారు.మరి ఎందుకు ఆలస్యం పదండి మనము మల్లిని అనుసరిద్దాము

మరిన్ని కథలు