Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
andam - chandam

ఈ సంచికలో >> శీర్షికలు >>

రాజస్థాన్ అందాలు చూద్దాం రారండి ( పది+మూడవ భాగం) - కర్రా నాగలక్ష్మి

                                                                                చిత్తోఢ్ గఢ్-2

రణతంభోరు , కాళీమాత మందిరం ----

చిత్తోఢ్ కోటలో మిగిలి వున్న మరో మందిరం కాళీమాత మందిరం . యేడవ శతాబ్దం లో నిర్మించిన సూర్య మందిరం లో 14 వ శతాబ్దంలో కాళీ మాత విగ్రహాన్ని ప్రతిష్టించేరు . చిత్తోఢ్ రాజులు కాళీమాత భక్తులు , దేవినవరాత్రులు అత్యంత భక్తిశ్రద్దలతో జరుపుకొనేవారు .ఇప్పటికి యీ మందిరంలో దశరా నవరాత్రులు జరుపుకొనేవారు ఆచారం కొనసాగుతోంది . ఇవి చిత్తోఢ్ కోటలో వున్న విశేషాలు. ఇప్పుడు చిత్తోఢ్ పట్టణానికి చుట్టుపక్కల వున్న పర్యాటక ప్రదేశాల గురించి చదువుదాం .

మండాల్ గఢ్ -----

చిత్తోఢ్ కి 54 కిలోమీటర్ల దూరంలో వుంది యీ కోట , యీ కోట రాజస్థాన్ లోని అతిపురాతనమైన కోటగా వర్ణిస్తారు . యీ కోట చూసినన్ని యుధ్దాలు మరే కోట చూడలేదని ప్రతీతి . ఈ కోట పొడవు సుమారు ఒక కిలో మీటరు  వుంది . దీనిని సోలంకిరాజులు నిర్మించి నట్లుగా చరిత్రలో లిఖించి బడింది . ఈ కోటలో చాలా శివమందిరాన్నాయి . ఇది ఈ రాజులకు శైవమతం మీద వున్న నమ్మకానికి గుర్తు . ఈ కోట శిధిలావస్థ లో వుంది . కోట మధ్యలో వున్న సరస్సు పూర్వకాలంలో మంచినీటి కొరకు వుపయోగించేవారు .

నగరి ----
' నగరి ' రాజస్థాన్ లో వున్న పురాతనమైన నగరాలలో ఒకటి , యిక్కడ హిందూ , బౌద్ధమతాలు చెందిన అవశేషాలు చూడొచ్చు . బూంది - చిత్తోఢ్ రోడ్డు మీద ' బస్సి ' పట్టణానికి 7 కిలోమీటర్ల దూరంలో వుంది .మౌర్యుల కాలంలో రాజస్థాన్ లో ముఖ్య పట్టణంగా విలసిల్లింది . మౌర్యుల కాలం నుంచి గుప్తుల కాలం వరకు ప్రముఖనగరంగా వుండేది .యిక్కడి శిధిలాలు చూస్తే మనకి హిందూ మతం మీద బౌద్దమత ప్రభావం యెంతలా పడిందో  అనేది మనకు అవగతం అవుతుంది .

మీనల్ ----

రాజస్థాను వేడి నుంచి సేదతీరే ప్రాంతం . దట్టమైన అడవులతో అందమయిన జలపాతాలతో కూడుకున్న  చల్లని ప్రదేశం . దీనిని ' మినీ ఖజురాహో ' అని కూడా అంటారు . యిక్కడ చూడదగ్గ శివమందిరం వుంది .

బిజోలియా----

బూందీ - చిత్తోఢ్ రోడ్డుమీద బిల్వాడా జిల్లాలో వున్న బిజోలియా లోశివమందిరాల సముదాయం చూడదగ్గది . పూర్వకాలంలో దీనిని వింధ్యావళి గా కూడా వ్యవహరించేవారు .యిక్కడ చాలా శివమందిర శిధిలాలు వున్నాయి . ఇవి చౌహానుల కాలంలో నిర్మింపబడ్డాయి . ఒక పక్కనున్న ప్రహారీ గోడ పూర్తిగా కూలిపోయింది . ఇందులో వున్నవి ముఖ్యంగా చెప్పుకోదగ్గ మందిరాలు హజారేశ్వర ,  మహాకాళ , వైధ్యనాథ్ .  హజారేశ్వర మందిరం లో యెత్తైన పెద్ద లింగం తో పాటు వందల సంఖ్యలో చిన్న చిన్న శివలింగాలు వున్నాయి . అందుకనే దీనిని హజారేశ్వర మందిరం అని సహస్రేశ్వర్ మందిరం  అని అంటారు . ఇక్కడ వున్న మరో మందిరం అండేశ్వర మహదేవ్ , యీ మందిరం స్థానికులలో ప్రాచుర్యం పొందింది . స్థానికులు యిక్కడ వున్న మందాకిని తీర్థం లో పుణ్యస్నానాలు చేస్తారు .

ఇక్కడి స్థానిక బజారులో వెండి తో చేసిన నగలు , రాగి పాత్రలు చెప్పుకో తగ్గవి .

ఈ ప్రాంతంలో 'ఒపియం ' ( పొపిసీడ్స్) పంట కొన్ని వందల యెకరాలలో  కనిపిస్తుంది . ఇక్కడ ఈ పంట ప్రభుత్వ అనుమతి మేరకు పండిస్తున్నారో లేక దొంగ పంటో తెలీదు . మరునాడు మేము సవాయ్ మాధోపూర్ కి బయలుదేరేం . చిత్తోఢ్ నుంచి సుమారు 304 కిలో మీటర్ల ప్రయాణం . దారంతా పచ్చని అడవులమీదుగా ప్రయాణం అహ్లాదకరం గా సాగింది . ఆరోజు విశ్రాంతి తీసుకొని మరునాడు రణతంభోరు చూడ్డానికి వెళ్లేం .

సవాయ్ మాధోసింగ్ --2  

1763 లో యీవూరిని నిర్మించడంతో యీ వూరుని అతని పేరు మీదుగా సవాయి మాధోపూరుగా పిలువబడసాగింది . రైల్వే స్టేషన్లకు సుమారు 11 కిలోమీటర్ల దూరంలో రణతంభోర్ కోట వుంది .  ఈ కోట వింధ్య ఆరావళీ పర్వతాల మధ్య నిర్మింప బడింది . ' రణ్ ' అనే పర్వతానికి యెదురుగా వున్న ' తంభోరు ' అనే పర్వతం మీద నిర్మింపబడడం తో  కోటను ' రణతంభోరు కోట ' గా పిలువబడుతోంది .సుమారు తొమ్మిదవ శతాబ్దంలో యీకోట నిర్మాణం జరిగినట్లుగా చరిత్రకారుల అంచనా . మొత్తం సుమారు నాలుగు కిలో మీటర్ల విస్తీర్ణం లో నిర్మింప బడ్డ కోట . కోట చుట్టూరా  యేడు కిలోమీటర్ల ప్రహారీ గోడను చూడొచ్చు . 12 వ శతాబ్దంలో పృథ్వీ రాజ చౌహాన్ పరిపాలనలో వుంది అతికొద్దికాలం యీ కోట ఢిల్లీ సుల్తానుల పరిపాలనలో కూడా వుంది . 15 వ శతాబ్దం లో మేవాడ్ రాజుల పాలనలోకి వచ్చింది . 

శిధిలా వస్థలో వున్న అనేక భవనాలను చూడొచ్చు . ఈ కోటలో యెన్నో మానవ నిర్మిత సరస్సులు వుండేవి . కోట నిర్మాణానికి కావలసిన రాయి ని కోట లోపలే తవ్వి కట్టేరు ,  ఆ తవ్వకాల వల్ల యేర్పడ్డ గోతులను సరస్సులగానూ , తటాకాలగానూ మార్చేరు . కోటకు నాలుగు వైపులా నాలుగు ద్వారాలు వుండేవి , ప్రస్తుతం ' మిశ్ర ధర ' ద్వారం మాత్రమే మిగిలి వుంది .చాలా కట్టడాలు కూలిపోగా కొన్ని సగం మిగిలివున్న భవనాలలో హమీర్ రాజు యొక్క న్యాయస్థానం , బాదల్ ఘర్ , ధూపాన్ని మహల్ , ఫాసీ ఘర్ వున్నాయి . ఈ కోట నిర్మాణాన్ని గురించిన చారిత్రిక ప్రమాణాలు లేవు . 1296 ప్రాంతాలలో రావు హమీర్ యీకోటను పరిపాలించిన రాజులలో సమర్ధుడిగా లెక్కిస్తారు . ఈ కోటను గెలవడమే కాదు చేరుకోడం కూడా ఒక ఛాలంజ్ గా వుండడంతో మధ్యకాలపు రాజులను ఆకర్షించేది . చాలా పటిష్ఠమైన కోట అయినా కూడా రాజులకు ప్రశాంత జీవనాన్ని యివ్వలేక పోయింది .

ఈ కోటలో మూడు హిందూ ముందిరాలు , ఒక జైనమందిరం వున్నాయి . 

2013 లో ఊణ్శ్ఛో వారు ఈ కోటను హెరిటేజ్ సైట్ గా ప్రకటించేరు .

రణతంభోరు కోట కాకుండా యిక్కడవున్న మరో ఆకర్షణ ' రణతంభోర్ టైగర్ రిజర్వ్ ' ఉత్తరాన ' బనస్ ' నది , దక్షిణాన చంబల్ నదులు సరిహద్దులుగా గల ఈఅరణ్యాన్ని 1955 లో అభయారణ్యంగా గుర్తించేరు . 1973 లో దీనిని " రణతంభోర్ టైగర్ ప్రాజెక్ట్ " గాను 1980 లో చుట్టుపక్కల వున్న అవీ ప్రాంతాన్ని కలిపి సవాయ్ మాన్ సింగ్ సాంచురీ లేక కేలాదేవి సాంచురీ గా పిలువసాగేరు . 1991 లో కనుమరుగవుతున్న ' పులి ' జాతిని రక్షించే క్రమంలో దీనిని టైగర్ రిజర్వ్ గా ప్రకటించేరు .

యిక్కడ నాలుగు గంటల సఫారి టిక్కెట్టు తీసుకుంటే టాపులేని బస్సులో గాని జీపులలో గాని పర్యాటకుల సంఖ్యను బట్టి తీసుకు వెళతారు . సాధారణంగా ఉదయం 6-30 గంటలకు , మధ్యాహ్నం 2 గంటలకు యీ టూరు మొదలవుతుంది . అడవిలో చాలాభాగం తిప్పుతారు . ఆ సమయంలో ఒకటో రెండో పులులు కంట పడడం జరుగుతుంది . బోనులలో మాత్రమే చూడగలిగిన క్రూర జంతువుల ఆవాసాలకి వెళ్లి చూడడం అనే అనుభూతి వర్ణనాతీతం . క్రూర జంతువు కనబడగానే అడవిలోని కోతి వింతగా అరచి మిగతా జంతువులకు సంకేతాలు పంపడం , ఆ అరుపుకు బదులుగా సాంబారు లేడి వింత వింత శబ్దాలు చేసి మిగతా జంతువులను హెచ్చరించడం అవన్నీ అనుభవిస్తూ వుండగా యింతలో మా ముందునుంచి పరుగెత్తుతూ పులి కనుమరుగవడం నిజంగా మాటలలో చెప్పలేని అనుభూతి . రణతంబోరు అడవి దట్టమైన అతి పెద్ద చెట్లతోనూ , చెట్లతో నిండిన కొండలతోనూ కూడుకొని వుంటుంది . అడవిలో జంతువులు యెక్కడెక్కడ తిరుగుతున్నదీ యెప్పటికప్పుడు సమాచారం బస్సు డ్రైవర్ల దగ్గర వుండడం తో వారు జంతువులు వున్నచోట్లకి తీసుకు వెళతారు . మేము వెళ్లినప్పుడు మేము నిలుచున్న కొండకు యెదురుగా వున్న కొండ పైన చెట్లలో వేటాడిన జంతువు మాంసం తింటున్న పులిని చూసేం , ఫొటోలు తీసుకున్నాం . ఈ అడవిలో సాధారణంగా పులులు కనిపిస్తాయి . నవ్వంబరు , మే మాసాలలో పులులు బాగా తిరుగుతూ కనిపిస్తాయి .

ఈ అడవి లో పులులు కాక చిరుతపులులు , సాంబార్లు , అడవి పందులు , దుమ్మలగుండ్లు , జింకలు , నీల ఘాయీలు , ఎలుగుబంట్లు , లంగూరు కోతులు , నెమళ్లు చూడొచ్చు . 

త్రినేత్ర గణేశపర్వతం మందిరం ----

1299 లో యీ కోట ' హమీర్ సింగ్ ' పాలనలో వుండగా ఢిల్లీ ని పరిపాలించే అల్లావుద్దీను ఖిల్జీ దండెత్తి వస్తాడు . ఆరువారాలు పరుసతీవ్రంగా సాగుతుంది . గెలుపు యెవరిని వరించదు . కోటలోపలకు వచ్చే అన్ని దారులు ఖిల్జీ సైనికులు మూసి వేస్తారు . కోట ధనాగారం , ధాన్యా గారం అన్నీ ఖాళీ అయిపోతాయి . ఆ రాత్రి ' హమీర్ సింగ్ ' చాలా నిరాశకు గురౌతాడు . కలలో రాజుకు వినాయకుడు  యుధ్దం ముగిసిపోయినట్లు , గెలుపు ' హమీర్ సింగ్ ను  వరించినట్లు గా చూస్తాడు . మరునాడు ఆశ్చర్యకరంగా రాత్రి ఖిల్జీ తనసైన్యానని ఉపసంహరించుకొని మరలిపోయునట్లు తెలుస్తుంది . కోట గోడమీద మూడుకళ్ల వినాయకుని  విగ్రహం అచ్చు కనిపిస్తుంది . ' హమీర్ సింగ్ ' వినాయకునికి తనమీద అనుగ్రహం కలిగిందని తలచి ఆ విగ్రహానికి భక్తి శ్రద్దలతో పూజలు చేయనారంభించేడు . 

1300 సంవత్సరంలో కోటలో మందిరం నిర్మించి త్రినేత్ర వినాయకుని విగ్రహం తయారుచేసి , దానితో పాటు సిధ్ద , బుధ్ది , వినాయకుని పుతృలుగా చెప్పే శుభ్ లాభ్ , మూలకాల విగ్రహాలను ప్రతిష్టించి భక్తి శ్రధ్దలతో పూజలు నిర్వహించేవాడు . 

అప్పటినుండి ఈ వినాయకుడు భక్తుల కోరికలు తీరుస్తున్నాడు . వినాయకుని దర్శనార్థం వచ్చే భక్తులు యెడమవైపునుంచి వస్తారు . తూర్పువైపున అంతా దట్టమైన అడవి దారి గుప్తగంగ వొడ్డునుంచి వుంటుంది . ఈ పారంతం లో చాలా జాతులకు చెందిన పక్షులు , కోతులు , అడవి పిల్లులు , చిరుతలు సంచరించరిస్తూ వుంటాయి . ప్రపంచంలోనే అతి అరువుగా వుండే ' ఫిషింగ్ కేట్స ' మనదేశం లో యిక్కడ మాత్రమే కనిపిస్తాయి . బుగధవారం వినాయకునికి ప్రీతీకరమైన రోజు కావటం తో ఆ రోజు మందిరం భక్తులతో నిండి వుంటుంది .

తమ యిళ్లల్లో జరిగే శుభకార్యాలకు త్రినేత్ర గణపతికి ఆహ్వానం పంపుతారు . వినాయకుడు శుభకార్యానికి వచ్చి నిర్విఘ్నంగా శుభకార్యం జరిగేట్టుగా చేస్తాడని స్థానికుల నమ్మకం .   

మరిన్ని శీర్షికలు
sarasadarahasam