Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నాగలోకయాగం

గతసంచికలో ఏం జరిగిందంటే ..http://www.gotelugu.com/issue162/460/telugu-serials/nagaloka-yagam/nagaloka-yagam/

ఎంత గొప్ప విద్యా వేత్త అయినా రాజాదరణ వుంటేనే రాణించగలడు. కాబట్టి తగు సమయం వచ్చినదని భార్య సలహా ననుసరించి బయలు దేరాడు.
అలా మండుటెండలో అడవి దారిన నడిచి పోతున్నాడు. సాయం కాలానికి గాని హస్తినకు చేర లేడు. ఇంతలో`
తన వెనక ఎవరో నడిచి వస్తున్న అలికిడయినది. తల త్రిప్పి చూసాడు. వస్తున్నతలని రూపు రేఖలు చూసి ఆశ్చర్య పడుతూ కొన్ని క్షణాలు అక్కడే ఆగి పోయాడు.
తనే ఎనిమిదడుగుల పొడగరి కాగా`
అతడు తనను మించి పదడుగుల పొడవున్నాడు. కృష్ణ వర్ణంలో సన్నగా రివటలా వున్నాడు. తన లాగే నడి వయసు వుంటుంది. బోడి గుండు వెనుక పొడవుగా పిలక గాలికి రెప రెప లాడుతోంది. ఎగుడు దిగుడు కను బొమలు కాస్త ఎత్తు పళ్ళు, ఛాతీకి అడ్డంగా జంధ్యం పోగు.
ఎరుపు పట్టు పంచె కట్టి భుజాన ఉత్తరీయం వేసుకున్నాడు. వేరే ఏ ఆచ్ఛాదనా లేదు. నుదుట, భుజాల మీద ఛాతీ మీద విభూది రేఖలున్నాయి. చేతి సంచి ఒకటి పుచ్చుకుని పాదుకలు టక టక లాడించు కొంటూ వేగంగా నడిచి వస్తున్నాడు.
అతడు ఎవరనేది అగ్ని భట్టారకుడికి అర్థం కాలేదు. కాని ఎవరో బ్రాహ్మణోత్తముడని వూహించుకున్నాడు. అతడు చాలా వేగంగా నడుస్తున్నాడు. చూస్తూండ గానే తనకు సమీపించేసాడు. దాటి పోబోతూ ఎందుకో అనుమానం వచ్చి అగ్ని భట్టారకుని వంక చూసాడతడు.
‘‘స్వామీ! ఇంత ఎండన బడి పోవు చుంటిరి. ఎవరు మీరు? ఎచటకు పోవు చుంటిరి?’’ అనడిగాడు.
‘‘మీరును ఎండన బడే పోవుచుంటిరి గదా, ఎచటికి?’’ అంటూ ఎదురు ప్రశ్నించాడు అగ్నిభట్టారకుడు.
‘‘నా పయనము హస్తినకు. పరీక్షిత్తు మహారాజును కాపాడవలె’’ అన్నాడతను.
‘‘నేనును ఆ పని మీదే పోవుచుంటి’’ అన్నాడు అగ్ని భట్టారకుడు.
‘‘బాగున్నది. నీవు మంత్ర వేత్తవా?’’
‘‘అవును మహాశయా.’’
‘‘తక్షకుని నుండి ప్రభువును కాపాడ గలవా?’’
‘‘తప్పక కాపాడగను.’’
‘‘నిజముగా కాపాడ గలవా?’’
‘‘నిక్కముగా.’’
‘‘ఓహో! నీ శక్తిని పరీక్షింప వలసినదే.’’
‘‘ఎందుకు మీకీ సందేహము. మీరును మంత్ర వేత్త అయి వుందురు, అందుకే ప్రభువును కాపాడుటకు బయలు దేరితిరి.’’
‘‘కాదు.’’ అంటూ వికటంగా నవ్వాడు ఆ వ్యక్తి.
‘‘కాదా...!’’
‘‘అవునయ్యా! నేను బయలు దేరినది ప్రాణము కాపాడుటకు గాదు. పరీక్షిత్తు ప్రాణము తీయుటకు. నేనెవరో తెలుసా? హాలాహలముతో సమమగు అతి భయంకరమైన విషము గ్రక్కు సర్ప శ్రేష్టుడను, తక్షకుడను.’’
‘‘తక్షకుడవా...!’’ నివ్వెర పోయాడు అగ్ని బట్టారకుడు.
‘‘అవును. నేనే తక్షకుడను. నా శక్తి నీకు ప్రదర్శించి చూపెద.’’ అంటూ తన సర్ప రూపాన్ని ధరించాడు తక్షకుడు.
సన్నగా పది బారల పొడవున చిక్కటి కాటుక రంగులో ఎండకు నిగ నిగా మెరిసి పోతోంది కృష్ణ సర్పం. సర్పం సన్నగా వున్నప్పటికీ పడగ చేటంత వుంది. అటు యిటు చూసి చరచరా బాట పక్కకు వెళ్ళాడు తక్షకుడు.
పెద్ద మోదుగ వృక్షం ఒకటి అక్కడ ఏపుగా పెరిగి వుంది. భీకరంగా బుసలు కొడుతూ వెళ్ళి ఆ చెట్టు మాను మీద కాటేసి విషం గ్రక్కాడు తక్షకుడు. అంతే`
పిడుగు పాటుకు గురైనట్టుగా జవ జవ లాడిందా మోదుగ వృక్షం. చూస్తూండగానే భగ భగ మంటలు వ్యాపించి కొద్ది సేపట్లోనే పచ్చని చెట్టు కాస్తా భగ్గున కాలి బూడిదయినది. తిరిగి బ్రాహ్మణ రూపు ధరించి అగ్ని భట్టారకుడి ముందు నిలబడి తన ఎత్తు పళ్ళతో వికారంగా నవ్వాడు తక్షకుడు.
‘‘జూచితివి గదా నా విష ప్రభావము. ఇక చూపించు నీ మంత్ర ప్రభావము. ఏదీ... కాలి బూడిదైన ఆ వృక్షమును తిరిగి సజీవముగా నిలుప గలవా?’’ అనడిగాడు.
‘‘తక్షకా...! ఓసారి వెను తిరిగి చూడుము’’ అన్నాడు నవ్వుతూ అగ్ని భట్టారకుడు.
చూసిన తక్షకుడు నివ్వెర పోయాడు.
తన కళ్ళను నమ్మ లేక పోయాడు.
కట్టెదుట ఎప్పటిలా సాక్షాత్కరించి వుంది మోదుగ వృక్షం. ఆకులు కూడ కాలిన గుర్తు లేదు. ఇంత వరకు తన విషానికి తిరుగు లేదని గర్వించే వాడు, అలాంటిది కాలి బూడిదైన పచ్చని చెట్టును యధా తథంగా నిలపటం సాధ్యమేనా? తను వెను తిరిగే లోపలే తన మంత్ర ప్రయోగంతో వృక్షాన్ని సజీవంగా యధా తథంగా నిలిపిన ఇతడి మంత్ర శక్తిని ఎంత పొగిడినా తక్కువే గదా. ఇలాంటి వాడు హస్తినకు వస్తే తను పరీక్షిత్తును వేటు వేయ గలడా? వేసి ప్రాణం తీయ గలడా? ఇతను తప్పక పరీక్షిత్తు మహా రాజును రక్షింప గల సమర్ధుడు. ఇతన్ని ఏదో విధంగా వెనక్కి పంపించకుంటే తన లక్ష్యం నెర వేరదు. ముని బాలకుని శాపాన్ని నిర్విఘ్నంగా నెర వేర్చ లేడు.
ఈ విధముగా యోచించిన తక్షకుడు అగ్ని భట్టారకుడి ముందు సాష్టాంగ పడి నమస్కరించి లేచాడు.
‘‘ఆహా... ఏమి నా అదృష్టము. తమ దర్శన భాగ్యముతో నా జన్మ తరించినది గదా. ఏమి మీ మంత్ర మహిమ! మీ విద్వత్తును గుర్తించ నేరని మీ ప్రభువు పరీక్షిత్తు మిక్కిలి దురదృష్టవంతుడు గదా. పేదరికమున యిట మండు టెండన కాలి నడకన పోవు దుస్థితి ఆయ్యెను గదా తమకు. భూ సరోత్తమా! పోనిండు, పరీక్షిత్తు గుర్తించ కున్న ఏమాయె. ఈ తక్షకుడు మీ శక్తిని గుర్తించినాడు.’’ అంటూ మోయ గలిగినంత రెండు గంపెడు సంచుల నిండుగా వెల కట్ట లేని మణి మాణిక్యాది నవ రత్నాలు, బంగారు నాణెములను అతడి ముందుంచాడు.
‘‘ఇవి నేను మీకిస్తున్న కానుక. విప్ర వర్యా! మీ దారిద్య్రము తొలగి పోవుటకు ఈ సంపద చాలదా? మిము గుర్తించని పరీక్షిత్తును మీరు కాపాడనేల? యోచింపుము. ఈ సంపద తీసుకుని గృహము చేరుకొని నిశ్చింతగా వుండండి. నేను వెళ్ళి నా కార్యమును నెర వేర్చుకొని పోయెద... ఏమందురు? నా విన్నపము మన్నించి గృహమున కేగుట మంచిది. శ్రమదమాదుల కోర్చి హస్తిన పోనే? పరీక్షిత్తు ఇంత కన్నా అధిక సంపద నిచ్చునా?’’ అంటూ తెలివిగా వేడుకున్నాడు.
అంతటి అగ్నిభట్టారకుడు కూడ తక్షకుని ప్రలోభానికి లొంగి పోయి హాయిగా ఆ రెండు సంచులు తీసుకుని కొంప చేరుటే ఉచితమని భావించాడు. మారు మాటాడక కను చెదిరిన మణులతో కూడిన సంచుల్ని అందుకుని గృహోన్ముఖుడయ్యాడు. తక్షకుడు సంతోషంగా ముందుకు సాగి పోయాడు.
ఆ రోజు సాయం కాలానికే`
హస్తినకు చేరుకున్నాడు తక్షకుడు.
అది సూర్యుడస్తమించు వేళ.
బ్రాహ్మణ వేష ధారి యగు తక్షకుడు నిరాటంకముగా భద్రాతా ఏర్పాట్లను అగ్నివలయాల్ని దాటు కొని పరీక్షిత్తు కొలువై వున్న ఒంటి స్థంభం మేడలో ప్రవేశించాడు. లోన విశాలమగు సభా మందిరంలో సింహాసనాన్నధిష్టించి వున్నాడు పరీక్షిత్తు మహారాజు. ఎటు చూసినా బ్రాహ్మణులే కన్పిస్తున్నారు.
ప్రభువు పరీక్షిత్తు క్షేమం కోరి ఋత్త్విక్కులు అక్కడ గొప్ప యాగం నిర్వహిస్తున్నారు. కొందరు తమ రేడును తక్షకుడి నుండి కాపాడమని ప్రత్యేకంగా రుద్ర పూజు చేస్తూ ప్రార్థిస్తున్నారు.
తక్షకుడు నేరుగా పరీక్షిత్తు మహారాజు ముందుకు వెళ్ళాడు. వినయంగా ప్రణామం చేసాడు పరీక్షిత్తు. తక్షకుడు స్వస్తి వాచకం పలికి ఆశీర్వదించి చక్కటి ఒక నిమ్మ పండును కానుకగా పరీక్షిత్తు చేతిలో వుంచాడు.
పసిమి రంగులో వూరిస్తున్న ఆ నిమ్మ పండును యధాలాపంగా వాసన చూసాడు పరీక్షిత్తు మహారాజు. అప్పుడు` సరిగ్గా అప్పుడు జరిగింది ఎవరూ వూహించని ఘోర సంఘటన. ఎప్పుడైతే మహారాజు నిమ్మ పండు ఆఘ్రాణించాడో ఆ మరు లిప్తలో అక్కడ బ్రాహ్మణడు అదృశ్యమై నిమ్మ పండును చీల్చుకొని బయటి కొచ్చి పరీక్షిత్తు నాసిక మీద కాటు వేసాడు. తన పని పూర్తి గావటంతో అక్కడి నుండి అదృశ్య మయ్యాడు. పరీక్షిత్తు పొలి కేకతో ఆ ఒంటి స్తంభం మేడ మారు మ్రోగింది. అంతే` ఒక్క సారిగా హాహా కారాలు చెల రేగాయక్కడ. అటు సూర్యుడు అస్తమిస్తూండగా యిటు పరీక్షిత్తు కూడ తక్షకుని కాటుతో అస్తమించాడు. క్షణాల్లో ఈ ఘోర వార్త హస్తిన అంతటా ప్రాకి పోయింది. నగరాన్ని చీకట్లు మూసురుకునే సరికి నగర వాసులంతా శోక సముద్రంలో మునిగి పోయారు.
******************************
తమ ప్రభువును కాపాడ ఉదయం వెళ్ళిన తన భర్త అగ్నిభట్టారకుడు చీకటి పడక ముందే ఇంటికి చేరటం చూసి అతడి భార్య ఆశ్చర్య పోయింది. పిమ్మట జరిగింది తెలుసుకుని ఆగ్రహంతో మండిపడింది.
‘‘ఏమిది స్వామీ! మీరు చేసిన పని? సిరి సంపదలు కోరి ఎన్నడైననూ మిమ్ము సతాయించితినా? పేదరికము మనకు కొత్త కాదు గదా. ప్రభువును కాపాడిన సిరి సంపదలు కీర్తి ప్రతిష్టు లభించునని ఆశ పడితిని గాని యిలా ప్రలోభమునకు లోబడి పుచ్చుకున్న సంపత్తి కోసము గాదు. ఈ మాత్రపు సంపద మనకు పరీక్షిత్తు వారు యివ్వరా?
ప్రభు భక్తి దేశ భక్తి లేని ప్రజలు రాణించరు. అయ్యో... ప్రజలను కన్నబిడ్డల్లా పాలించు ధర్మ ప్రభువు పరీక్షిత్తు వారిని కాపాడిన కీర్తి ప్రతిష్టలు మీకు చెందకుండా పోయినవే. మీరు చాలా గొప్పవారు. అది నాకు తెలుసు. ఇంత కాలము గొప్ప గాను ధర్మ బద్ధం గానే జీవించినాము. ప్రభువును కాపాడ లేని మీ విద్వత్తు మంత్ర శక్తి నిరుపయోగము గదా... మనకీ సంపద వలదు. ఆ తక్షకుడు హస్తినకు పోయి ప్రభువును ఏమి చేయునో గదా... స్వామీ! ఆలస్యమేల. మరలి పొండు. హస్తినకు పోయి పరీక్షిత్తు వారిని కాపాడి రావలె. మీరా పని చేయకున్న భూదేవి ఆనగా పలుకు చుంటిని. జీవిత కాలం ఇక మీతో మాటలాడు దానను గాను.’’ అంటూ హెచ్చరించింది.
భార్య మాటలాలకించిన అగ్నిభట్టారకుడు ఖిన్నుడైనాడు. అప్పటి గ్గాని తను చేసిన పొర బాటు ఏమిటో అర్థం గాలేదు. ఆ చీకటి రేయి ఎలా వచ్చిన వాడు అలా తిరిగి హస్తినకు బయలు దేరాడు. ఈసారి తండ్రిని ఒంటరిగా రాత్రి వేళ పంపించటం ఇష్టం లేక కొడుకు లిద్దరూ తోడుగా వెంట నడిచారు.
అలా ఆ రేయంతా వారు అడవి దారుల్లో అష్టకష్టాలు పడి నడుచుకుంటూ తెల్ల వారే సరికి హస్తినకు ఆమడ దూరానికి చేరుకున్నారు. వారు హస్తినలో ప్రవేశించే సరికి పొద్దు చాలా పైకి వచ్చేసింది. నగరమే శోక సముద్రంలో వుంది.
ఆ ఉదయమే సూర్యోదయం తోనే చందన కట్టెల చితి పేర్చి ఆవు నెయ్యి సుగంధ ద్రవ్యాలు వేసి శాస్త్రోక్తంగా పరీక్షిత్తు మహా రాజు చితికి రాజ లాంఛనాలతో అగ్ని సంస్కారం చేయటం జరిగింది. అప్పటికి ఏడేళ్ళ పసివాడైన పరీక్షిత్తు కుమారుడు జనమేజయుని చేత చితికి నిప్పు ముట్టింప జేసారు. అగ్ని భట్టారకుడు స్మశాన వాటికకు చేరేప్పటికే పరీక్షిత్తు భౌతిక కాయం బూడిదయి పోయింది. అంతా అయి పోయినది.
తమ ప్రియతమ ప్రభువు అంతిమ యాత్రకు తరలి వచ్చిన హస్తినా పురి ప్రజలు పొగిలి పొగిలి రోదిస్తున్నారు. కొందరు నేల బడి దొర్లుతూ గుండెలు బాదుకుంటున్నారు. స్త్రీ పురుష వయో బేధం లేకుండా రాజ కుటుంబంతో బాటు ప్రజలూ శోక సముద్రంలో మునిగి వున్నారు. అదంతా చూస్తున్న అగ్ని భట్టారకుడు కనులు చెరువులై కన్నీరు ప్రవహిస్తుండగా కూల బడి పోయాడు.
అయి పోయింది.
ఇప్పుడు తను చేయ గలిగింది ఏమీ లేదు.
ఈ అనర్థాన్ని ఆపగల శక్తి వుండీ ఆప లేక పోయిన తన అసమర్థత మీద రోత పుట్టింది. ఏ ముఖం పెట్టుకుని ఇంటికి పోగలడు. తన భార్య తనను క్షమిస్తుందా? ఈ విషయం తెలిసిన రాజ్య ప్రజలు క్షమించ గలరా? ధన హినుడైనా బాధ లేదు గాని ఈ విధముగా చరిత్ర హీనుడ నైతి నేలయని రోదించాడు అగ్ని భట్టారకుడు. ఎలాగో తండ్రికి నచ్చ జెప్పి ఆయన్ని వెంట బెట్టు కొని గృహోన్ముఖులయ్యారు కొడుకు లిద్దరూ.
*****************************************
అంత వరకు చెప్పిన పిమ్మట`
కొద్ది సేపు మౌనం వహించింది భద్రా దేవి.
యువ రాజు ధనుంజయుడు ఆసక్తిగా విన్నాడు గాని ఆ అగ్ని భట్టారకునికి భద్రా దేవికి గల సంబంధం ఏమిటో అర్థం కాలేదు. అంతే కాదు`
ఇంటికి చేరిన అగ్ని భట్టారకునితో అతని భార్య మాట్లాడినదా? తక్షకుడు యిచ్చిన రెండు సంచుల మరకత మాణిక్యాది రత్నాలు పసిడి కానుకలు ఏమయ్యాయి? ఆ సంపత్తిని వారు వినియోగించుకుని ధనవంతులైనారా లేక పేదరికం లోనే వున్నారా? అగ్ని భట్టారకుడు ఇంటికి చేరాక ఏమి జరిగింది? ఏ విషయమూ తెలీదు. ఇవే సందేహాలను అడిగినప్పుడు ఒకింత విరామం తర్వాత తిరిగి మాట్లాడింది భద్రా దేవి.

 

 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
atulitabandham