Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
amma

ఈ సంచికలో >> కథలు >> పచ్చని ఆశ

pachani aasa

'అమ్మో! అమ్మో! లైకులే లైకులు... అబ్బబ్బా! కామెంట్ల మీద కామెంట్లు! నా పోస్టింగ్ అదిరింది.' ఒకటే కలవరింతలు. రాత్రంతా కలత నిద్రను అనుభవించిన ప్రకాశరావు ఉదయం ఏడు కావస్తుండగా... మెల్లగా లేచాడు. సరాసరి బాత్రూంకి వెళ్ళలేదు. పళ్ళు తోముకోనూ లేదు. కాళ్ళను దగ్గరకు ముడ్చుకుని నడీ మంచంలో కూర్చున్నాడు. క్షణాల్లో లాప్ టాప్ ఆన్ చేశాడు. చిటికెలో ఫేస్ బుక్ లాగిన్ అయ్యాడు. రాత్రంతా ఏదైతే కలవరించాడో.. అది కళ్ళకు కట్టినట్లు తన పోస్టింగ్లో కనబడుతుంటే ఎల్లలు లేని ఆనందం. చేతిలో మొక్కను పట్టుకుని మొక్కలు నాటండి... భూమిని కాపాడండి... అనే క్యాప్షన్ ఉన్న ఫోటోకి వచ్చిన రెస్పాన్స్తో తన ఇమేజ్ ఇంకాస్త పెరిగినట్లయింది.   ఈ సంతోషాన్ని భార్యతో షేర్ చేసుకోవటానికి లాప్ టాప్తో వంట గదిలోకి పరుగులా నడిచాడు.

వాస్తవం చెప్పాలంటే తనకున్న మేథో సంపద, పర్యావరణంపైన అపార అనుభవం ఫేస్ బుక్ ద్వారానే బాగా పాపులర్ అయింది. టౌన్లో ఎక్కడ పర్యావరణ సదస్సు జరిగిన ప్రకాశరావునే ముఖ్య అతిథిగా పిలుస్తుంటారు. చెట్ల మీద తనకున్న విజ్ఞానాన్ని ఉపన్యాసాల్లో దంచుతూ... శ్రోతలను ఇట్టే ఆకట్టుకుంటాడు. ఆ ఫోటోలను ఫేస్ బుక్ లోకి అప్ లోడ్ చేసి, అభినందనల వర్షం కురిపించుకుంటాడు.

గేటు చప్పుడు కావటంతో ఆలుమగల ఫేస్ బుక్ ఆనందానికి బ్రేక్ పడింది. "ఎవరో వచ్చినట్లుంది. చూసొస్తానుండు" గబ గబా బయటకు నడిచాడు ప్రకాశరావు. గేటు ముందు ఓ అపరిచిత బాలుడు. సుమారు పధ్నాలుగు ఏళ్ళు ఉంటాయి. ప్రకాశరావును చూడగానే "నమస్కారం! సార్!" అన్నాడు.

"నమస్కారం! ఎవరు బాబు నువ్వు? ఏం కావాలి?" ఆసక్తిగా అడిగాడు ప్రకాశరావు.

"నా పేరు సంజయ్. ఈ కాలనీ చివర ఉన్న గవర్నమెంట్ స్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్నాను. మీ హెల్ఫ్ కోసం వచ్చాను సార్!"

"నా హెల్ఫా?" ఆశ్చర్యపోతూ "నీకే సాయం కావాలి చెప్పు?" అన్నాడు ప్రకాశరావు.

"నిన్న క్లాసులో మా సార్ పాఠం చెపుతూ పర్యావరణంలో పెను మార్పులు సంభవిస్తున్నాయని, దానికి కారణం భూమిపై అడవులు, చెట్లు అంతరించడమేనని అన్నారు. పెరుగుతున్న  కాలుష్యంతో భావి తరాల జీవనం అనేక కష్టాల పాలవుతుందని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటితే, సకాలంలో వర్షాలు పడ్తాయని, వాతావరణ సమతుల్యత ఏర్పడుతుందని చెప్పారు. మా క్లాస్ మేట్స్ అంతా కల్సి మా స్కూల్ తరుపున వెయ్యి మొక్కలు నాటాలని నిర్ణయించాం! మీరు పర్యావరణ ప్రేమికులని సార్ చెప్పారు. మీ సహాయంతో ఈ పని మొదలుపెట్టాలని అనుకుంటున్నాం సార్!" ఉత్సాహాంగా అన్నాడు సంజయ్.

"వెరీగుడ్! మంచి ఆలోచన. ఊరికి వెళుతున్నాను. రెండ్రోజుల తర్వాత కలువు" అంటూ సంజయిని అభినందన పూర్వకంగా భుజం తట్టాడు ప్రకాశరావు.

సంజయ్ సంబరం ఎన్నో రోజులు నిలవలేదు. పదిసార్లు ప్రకాశరావును కలిసినా ఏదో ఒక సాకుతో తప్పించుకోసాగాడు. విసిగిపోయిన సంజయ్ మరో ఇద్దరు, ముగ్గురిని కలిసాడు. ఫలితం శూన్యం. పైగా అవమానాలు. "బుద్దిగా చదువుకోక, రోడ్లెంట తిరగటానికి ఇలాంటి పనులు చేస్తావురా!" అంటూ ఎత్తి పొడిచారు. 'సాయం చేయకపోగా అనవసరంగా తిట్టారే!' లోపల మధనపడ్తూ... దిగులుగా ఇంటికి చేరాడు సంజయ్.

*  *  *

మూడ్రోజులు అన్నం కూడా సరిగా తినలేదు. 'ఎలాగైనా మొక్కలు నాటాలి? దాని కోసం ఏం చెయ్యాలి?' పదే పదే ఆలోచించాడు. క్లాస్ మేట్స్ తో చర్చించాడు. పది రోజుల తర్వాత వచ్చే వేసవి సెలవుల్లో ఎవరికి వారే ఏదో ఒక పని చేసి, కొంత డబ్బును పోగు చెయ్యాలని అందరూ కల్సి తీర్మానించారు.

చూస్తుండగానే వేసవి సెలవులు వచ్చాయి. ఒక రోజు తండ్రితో స్కూల్లో జరిగిన విషయమంతా చెప్పి, తెలిసిన దగ్గర ఎదైనా పని ఇప్పించమని అడిగాడు.

కొడుకు మాటలకు ఆశ్చర్యం కలిగినా, వాడిలోని పట్టుదల, మొండితనానికి ముచ్చటేసి... షావుకారు దుకాణంలో కుదుర్చటానికి సంజయిని తీసికొని, బయలుదేరాడు తండ్రి. మార్గం మధ్యలో వారికి ఎదురుగా ఓ కారు వచ్చి ఆగింది. అందుల్లోంచి ప్రకాశరావు దిగాడు. సంజయిని చూశాడు. కానీ పలకరించలేదు. "రామయ్య ఎక్కడికి వెళుతున్నారు. వీడు నీ కొడుకా?" అడిగాడు ప్రకాశరావు.

"అవును బాబుగారు! బడికి సెలవులొచ్చినయ్! ఏదైనా పనికిపోతా నాన్నా! అంటే షావుకారు దగ్గర దుకాణంలో పెడదామని తీసుకుబోతున్నా బాబు!"

"అవునా! నేను నీ దగ్గరకే వస్తున్నా! మా తోటమాలి మల్లయ్య ఊరికిపోయాడు. నెల దాకా రాడు. నువ్వేమైనా పనికి వస్తావేమోనని అడగటానికి వస్తున్నా!" అన్నాడు ప్రకాశరావు.

"నాకు తీరికలేదు గానీ, తమరు కావాలంటే నా కొడుకును పంపుతా" అన్నాడు రామయ్య.

"సరేలే ఎవరైనా ఫర్వాలేదు. పని బాగా చేస్తే చాలు"

"పని బ్రహ్మాండంగా చేస్తాడు బాబు. మీకిష్టమైతే రేపటి నుంచే పనికితోల్తా!" సంజయ్ వైపు చూస్తూ అన్నాడు రామయ్య.

"సరే! రామయ్య పంపించు!" అంటూ కారు రివర్స్ చేసుకొని వెళ్ళిపోయాడు ప్రకాశరావు.

*  *  *

నెల రోజులు గడిచాయి. చెప్పిన పనల్లా చేసి శభాష్ అనిపించుకున్నాడు సంజయ్. ఒప్పందం ప్రకారం మూడు వేల అయిదొందలు జీతం ఇచ్చాడు ప్రకాశరావు. ఈ నెల రోజుల వ్యవధిలో ప్రకాశరావు ఒక్కసారి కూడా మొక్కల సాయం గురించిన ప్రస్తావన తీసుకరాకపోవటం సంజయిని చాలా బాధించింది.  ప్రకాశరావు మాటల మనిషి తప్ప, చేతల మనిషి కాదు అని గ్రహించాడు. ఇలాంటి వ్యక్తుల వల్లే మంచి ఆశయాలు ఆచరణకు నోచుకోవడం లేదని బాధపడ్డాడు. తను ఏదైతే అనుకున్నాడో అది సాధించడానికి... మిత్రులను కల్సి తగిన ప్రణళికలు తయారు చేయడానికి... జీతం డబ్బులు జేబులో దాచుకొని... సంతోషంగా ఇంటికి బయలుదేరాడు సంజయ్.

*  *  *

అది జూన్ ఐదవ తారీఖు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం. టౌన్లో పేరుమోసిన పెద్ద ఆడిటోరియంలో పర్యావరణంలో చెట్ల ప్రాముఖ్యత గురించి నరాలు తెగేలా ప్రసంగం చేస్తున్నాడు ప్రకాశరావు. అతని ప్రసంగానికి స్పందనగా ఆడిటోరియమంతా ఈలలు, చప్పట్లు, కేరింతలు. అనందంలో తడిసి ముద్దవుతూ... ప్రసంగం ముగించి, తనకు కేటాయించిన కుర్చీలో కూర్చున్నాడు ప్రకాశరావు.

సభ సమన్వయ కర్త మైక్ అందుకొని, ప్రేక్షకులారా! ఇప్పుడు ప్రత్యేక కార్యక్రమం అంటూ సంజయిని వేదిక మీదకు ఆహ్వానించాడు.సంజయ్ వేదిక మీదకు వస్తుంటే ప్రకాశరావు ముఖంలో రంగులు మారసాగాయి.

"నేను ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదవ తరగతి విద్యార్థిని. నాదొక ప్రశ్న?" అంటూ కాసేపు మౌనంగా ఉండిపోయాడు సంజయ్.

"ఏమిటా ప్రశ్న?" అందరిలో ఉత్కంఠ మొదలైంది. సభా నిర్వాహకులతో పాటు, అతిథిలు సైతం ఉపిరి బిగబట్టి సంజయ్ వైపు చూడసాగారు.
మళ్ళీ మాట్లాడటం మొదలెట్టాడు. "పర్యావరణంపై సదస్సులు పెడుతున్న ఈలాంటి పెద్ద మనషులకు నమస్కారం చేస్తున్నాను. కానీ, ఎంతమంది ఇప్పటి వరకు ఎన్ని మొక్కలు నాటారు?"

అందరి గుండెల్లో రైళ్ళు పరుగెత్తసాగాయి. సభంతా నిశ్శభ్ధం అలుముకుంది. ఆ ప్రశ్నతో ప్రకాశరావుకి తల కొట్టేసినట్లే అనిపిస్తోంది. అంతరాత్మ కలుగజేస్తున్న ఒత్తిడికి తట్టుకోలేక తల దించుకున్నాడు.

"మాటలు చెప్పడం తేలిక. ఆచరణలో పెట్టడం చాలా కష్టం. కానీ, మేము వేయి మొక్కలు నాటతాం అనగానే, వెంటనే స్పందించి, మాకు ధన సాయం చేసి, ఇంత గొప్ప పనికి అండగా నిలబడిన మంచి మనిషి ప్రకాశరావు గారికి మ స్కూల్ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాము" అనగానే సభంతా ప్రకాశరావు పేరు మారు మోగింది. ప్రకాశరావులో పశ్చాత్తపం కురుస్తుండగా... పరుగున వెళ్ళి సంజయిని కౌగిలించుకున్నాడు. "మనిషి ఎలా నడుచుకోవాలో చిన్నవాడివైనా... చాలా చక్కగా చెప్పావు. నా కళ్ళు తెరిపించావు.

దు:ఖంతో పూడుకుపోతున్న గొంతుని సవరించుకొని... "మాటలతో బ్రతికేవాడు మనిషి... చేతలతో బ్రతికితే మనీషీ అవుతాడని" నాకిప్పుడు పూర్తిగా అర్థమైంది. వచ్చే పర్యావరణ దినోత్సవం లోపు లక్ష మొక్కలను నాటుతాను. దానికి మా లీడర్ గా సంజయిని నియమిస్తున్నాను" అంటూ తనకు అత్యంత ఇష్టమైన పదం.. అనేక సభల్లో పలుమార్లు చెప్పిన పదం. "వృక్షో రక్షితి రక్షిత:" అని బిగ్గరగా నినాదం చేసి, సంజయ్ తో పాటు పచ్చని ప్రపంచాన్ని సృష్టించేందుకు గర్వంగా వేదిక దిగసాగాడు ప్రకాశరావు. సంజయ్ కళ్ళనిండా పచ్చని ఆశలు పరుగులు తీయడం మొదలు పెట్టాయి.

మరిన్ని కథలు