Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

వీక్షణం - పి.యస్.యమ్. లక్ష్మి

 

మిచిగన్ లో మాల్స్

మిచిగన్ రాష్ట్ర రాజధాని లేన్సింగ్ లోనూ, చుట్టు పక్కల ప్రాంతాలలోనూ మేము చూసిన మాల్స్ చాలా ఆకర్షణీయంగా వున్నాయి.  మనము రోజూ ఉపయోగించే వస్తువుల్లోనే  మనకి తెలియని ఎన్ని రకాలో అక్కడ కనిపిస్తాయి.  వాటిలో కొన్నింటి గురించి చెబుతాను.  అన్నీ మేము వివరంగా చూడలేదు గనుక ముఖ్యాంశాలు మాత్రమే సుమా.

హోమ్ డిపో, లేన్సింగ్



ఆ డిపోలో వున్న సామాన్లతో కొన్ని వందల ఇళ్ళు కట్టుకోవచ్చు.  అన్నున్నాయి డిస్ ప్లే లోనే.  అంత పెద్ద స్టోర్.  ఇల్లు కట్టుకోవటానికి కావాల్సిన అన్ని సామాను, కలప, కిటికీలు, ద్వారాలు, రకరకాల స్క్రూస్, మేకులు, రంగులు, ఫాల్స్ రూఫ్ షీట్స్,  ఇంటి నిర్మాణానికి సంబంధించిన ఏ వస్తువు కోసం మీరు వేరే షాపుకి వెళ్ళక్కరలేదు.  కొంత మంది ఇక్కడ వస్తువులు కొనుక్కెళ్ళి ఇంట్లో చిన్న చిన్న రిపేర్లే కాదు, ఏకంగా ఇళ్లే వాళ్లంతట వాళ్ళే కట్టుకుంటారుట.  అక్కడ చెక్క ఇళ్ళు ఎక్కువ కదా మరి.  బాగుందండీ, ఇసుక, సిమెంట్, మేస్త్రీల గోల లేకుండా హాయిగా.

బెడ్ అండ్ బాత్ స్టోర్స్

పేరు  చూస్తేనే అర్ధమయిపోయింది కదా.  నిద్రకి కావాల్సిన మంచాల దగ్గరనుంచీ, మంచం పక్కన వేసుకునే కాళ్ళు తుడుచుకునే పీచు దాకా (ఎంత ఇంగ్లీషు స్టోర్ అయినా మన భాషలో మనం చెప్పుకోవద్దూ), మీకు తెలిసినవే కాక తెలియనివి కూడా చాలా చూసి, సరదా పడి కొనుక్కోవచ్చు.  అంత ఆకర్షణీయంగా వుంటాయి మరి.

ఆఫీస్ మేక్స్

గుండు సూది దగ్గరనుంచీ ఆఫీసులకి  కావాల్సిన వస్తువులన్నీ ఒకే చోట దొరికే ప్రదేశం ఇది.

బెస్ట్ బై

అన్నీ ఎలక్ట్రానిక్స్ ఐటమ్సేనండీ.  పిల్లలు ఒక పట్టాన బయటకి రారు.

రోగర్స్, డెట్రాయిట్

చాలా పెద్ద స్ధలంలో పక్క పక్కనే రక రకాల షాపులు.  ఎక్కువగా బ్రాండెడ్ బట్టల షాపులు.  అన్నట్లు మనకి బాగా నచ్చే విశేషం ఒకటి చెప్పనా?  ఇక్కడి బట్టల షాపుల్లో మనం కొన్న బట్టలు తర్వాత నచ్చలేదనుకోండి, కొన్ని షాపుల్లో నెల, కొన్నింటిలో 3 నెలలలోపు తిరిగి ఇచ్చేయచ్చు.  కావాలంటే వేరేవి తీసుకోవచ్చు, లేకపోతే డబ్బులు వాపస్.  పండగే కదా. మనం అనుమానాల పుట్ట కదా..ఒకటి రెండు సార్లు సరదాగా వేసుకుని ఇచ్చే వాళ్ళు కూడా వుంటారేమో!?

12 ఓక్స్ మాల్

ఇది బ్రహ్మాండంగా వుందండీ.  మీరేదో కొనేవాళ్ళకిమల్లే షాపుల్లోకి వెళ్ళి పోజివ్వక్కరలేదు.  ఏ షాప్ లోకీ వెళ్లకుండానే షాప్స్ ముందే ఎన్ని గంటలైనా గడపవచ్చు.  కూర్చునేందుకు రక రకాల సీటింగ్ ఎరేంజ్ మెంట్స్.  ఎంత సేపు కూర్చున్నా ఎవ్వరూ అడిగే వారుండరు.  హాయిగా వచ్చే పోయే వాళ్ళని చూస్తూ కూర్చోవచ్చు.  కావాలంటే ఒక కూల్ డ్రింకో, స్టార్ బక్స్ కాఫీనో చేతిలో పెట్టుకుని మరీ.  అవి తాగటానికెటూ చాలా సమయమే పడుతుంది...అంత పెద్ద గ్లాసులుంటాయి.

ఇంకా కావాలంటే అక్కడి స్తంభాలలో మన ఆకారాలను రక రకాలుగా చూసుకోవచ్చు.

ఇలాంటి మాల్స్ ఇండియాలో వుంటేనా జనాలెవరూ ఇళ్ళల్లో వుండరేమో!!  ఎక్కడబడితే అక్కడ ఇన్ని షాప్స్ వున్నాయి, మనుషులేమో తక్కువ, వ్యాపారాలెలా సాగుతాయో,  ఆ భగవంతుడికే ఎరుక.  నిజంగా అదొక ప్రపంచం.

గిఫ్ట్ ఆఫ్ ఇండియా

మన వాళ్ళు ముద్దుగా ఇండియన్ స్టోర్స్ అంటారు.  మన దేశం సరుకులన్నీ దొరుకుతాయి.

వచ్చేవారం ఇంకొన్ని ముచ్చట్లు.

మరిన్ని శీర్షికలు
pounch patas