Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
nagaloka yagam

ఈ సంచికలో >> సీరియల్స్

అతులిత బంధం

 

గతసంచికలో ఏం జరిగిందంటే..... http://www.gotelugu.com/issue170/486/telugu-serials/atulitabandham/atulita-bandham/

 “ఏరా అబ్బాయ్, మధూ కి ఫోన్ చేసారా?” అచ్యుతరామయ్య దగ్గరగా వచ్చి అడిగింది అంజమ్మ.

“గిరి చేస్తానని అన్నాడమ్మా...”

“అది నెల తప్పిందని తెలిసినప్పటి నుంచీ చూడాలని ప్రాణం కొట్టుకుంటోంది రా... ఒక సారి రమ్మని చెప్పండి...”

“గిరి వెళ్లి తీసుకువస్తాడు అత్తా... రా నువ్వు అన్నం తిందూ గాని...”

“ఏం కూర చేశావూ?”

“నీకు ఇష్టమని వంకాయ కూర చేసాను... చల్లారిపోతోంది...రా...”

“సరే వస్తున్నా... అబ్బాయ్ నువ్వు కూడా ఓ సారి వియ్యాల వారితో మాట్లాడు... అది పద్ధతి గా ఉంటుంది...” కొడుకును హెచ్చరించి, భోజనానికి వెళ్ళింది అంజమ్మ.

నిర్మలకి కూడా వేవిళ్ళు కావటంతో, నీరసం వలన  ఏ పనీ చేయలేకపోతోంది... పని భారమంతా పూర్ణమ్మ మీదనే పడింది. ఈ మధ్యనే ఆమె  తమ పాలేరు భార్య పైడితల్లిని ఇంటిపనుల కోసం పెట్టుకుంది. 

ఆ రాత్రి గిరి రాగానే దగ్గరకు పిలిచాడు అనంత రామయ్య. ఒక నాలుగైదు రోజుల్లో పట్నం వెళ్లి కూతుర్ని ఇంటికి ఓ సారి తీసుకురమ్మని చెప్పాడు. 

***

“ఐశూ, నేను అమలను...” అటునుంచి వినిపించిన అమల స్వరం వినగానే చాలా సంతోషంగా అనిపించింది ఐశ్వర్యకు.

“నమస్తే అక్కా, బాగున్నారా?” అంది అప్రయత్నంగా.

“బాగున్నాం ఐశూ... ఒక సారి ఇంటికి రాకూడదూ? రూప చాలా సార్లు అడుగుతోంది...” అంది అమల.

“నేనా? మీ ఇంటికా...” మొహమాటంగా అన్నది ఐశ్వర్య.

“అవును... తప్పక రామ్మా ఓ సారి...” చెప్పింది అమల.

“సరేనక్కా...” అంది అయిష్టంగానే...

“సరే, ఉంటాను మరి... వచ్చే ముందు నాకు ఫోన్ చేయి... ఆదివారం అయితే బెటర్...మరి ఉంటాను...” ఫోన్ కాల్ డిస్కనెక్ట్ అవగానే మనసంతా అదోలా అయిపోయింది...

చదువుకునే రోజుల్లో రూపకి ట్యూషన్ చెప్పినందుకు వాళ్ళిచ్చే జీతం డబ్బు తనకి ఎంతో ఉపకరించేది... అమల చాలా ప్రేమగా ఉండేది తనతో... ఆరోజులు గుర్తు రాగానే, కార్తీక్ తో తన పరిచయం, స్నేహం, ప్రేమ అన్నీ అక్కడినుంచే అయ్యాయన్న విషయం గుర్తు వచ్చి మనసంతా విషాదంగా అయిపోయింది ఐశ్వర్యకు.

రూప అమాయకమైన ముఖం కళ్ళ ముందు కదిలింది. చక్కని పాపకు ఆ వైకల్యం... ఎంత ముద్దుగా ఉంటుందో రూప... చదువులో కూడా చురుకుగా ఉండేది... ఇప్పుడు ఎలా ఉన్నదో... వెళ్లి చూస్తే ఎంతో సంతోషపడుతుంది... వెళితే బాగానే ఉంటుంది... కానీ... వాళ్ళంతా కార్తీక్ కుటుంబ సభ్యులు... వాళ్ళతో అనుబంధం ఎందుకు? రకరకాల ఆలోచనలు మనసును తేనెటీగల్లా కుడుతూ ఉంటే కళ్ళు మూసుకుని నిద్రకుపక్రమించింది ఐశ్వర్య.

***

“నేను రానంటే తీసుకువచ్చావ్... నాకిక్కడ ఎవరూ తెలియదు కదరా...” కొలీగ్ రమణతో అన్నాడు వేణుగోపాల్ కొంచెం ఇబ్బందిగా...
రమణ తన ఫ్రెండ్ బర్త్ డే పార్టీ కి వేణును కూడా ఆఫీసు నుంచి లాక్కొచ్చాడు బలవంతంగా...

“అరె, పరిచయం అయితే తెలుస్తారుగా అందరూ... వాళ్ళూ మన లాగే సాఫ్ట్ వేర్ పక్షులేరా...” అని బర్త్ డే జరుపుకుంటున్న తన స్నేహితుడి దగ్గరకు తీసుకువెళ్ళాడు రమణ. 

“మీట్ మై ఫ్రెండ్ వేణూ... వేణూ... వీడేరా అభిషేక్... నా బెస్ట్ ఫ్రెండ్...” పరస్పర పరిచయాలు చేసాడు. ఆనందంగా కరచాలనం చేసాడు అభిషేక్... వేణు అతనికి బర్త్ డే విషెస్ చెప్పి కాసేపాగి అంతా డ్రింక్స్ సేవిస్తూ ఉంటే, అక్కడ ఉండలేక కొంచెం దూరంగా వచ్చి నిలుచున్నాడు. చేతిలో బొకేతో, పక్కన అధునాతనంగా అలంకరించుకున్న ఓ సుందరాంగితో అప్పుడే లోపలికి వస్తున్న గడ్డం యువకుడిని చూస్తూంటే ఎక్కడో చూసినట్టు అనిపించింది వేణుకు. 

కాసేపటి తర్వాత బఫే డిన్నర్ లో అతనే పలకరించాడు, “బాగున్నారా?” అంటూ. తల ఊపాడే కానీ అతన్ని ఎక్కడ చూసాడో మాత్రం ఎందుకో గుర్తు రావటం లేదు వేణుకి... అసహనంగా తల విదిల్చాడు.

“మీరు నన్ను గుర్తు పట్టలేదనిపిస్తోంది...” అన్నాడు అతను మళ్ళీ దగ్గరగా వచ్చి. మొహమాటంగా నవ్వాడు వేణు.

“నా పేరు కార్తీక్... నేను మీ పెళ్ళికి వచ్చాను...” నవ్వుతూ చేయి చాచాడు.

“ఓహ్... అవును... ఇప్పుడు మీరు గడ్డం పెంచారు కదా... అందుకే వెంటనే గుర్తు పట్టలేక పోయాను...” అన్నాడు వేణు నవ్వుతూ...

“మధుబాల గారు బాగున్నారా?”

“యా, బావుంది...మీరు, ఐశ్వర్య...” ఇంకేమని అనాలో తెలియక ఆపేసాడు వేణు...

“అవును... ఆ కథ అయిపోయింది... మేము లివిన్ రిలేషన్ లో ఉండేవాళ్ళం... ఇప్పుడు మరో అమ్మాయితో ఉంటున్నాను... తనే డాలీ...” అంటూ దూరంగా డ్రింక్ సిప్ చేస్తున్న అమ్మాయిని చూపించాడు కార్తీక్. అతని స్వరంలో ఎలాంటి భావమూ లేదు. చాలా కాజువల్ గా చెప్పాడు.

వేణుకు ఐశ్వర్య మీద బోలెడు జాలి కలిగింది... ఆమె పరిస్థితుల గురించి మధుబాల చెప్పినవన్నీ గుర్తు వచ్చి హృదయం ద్రవించింది... 

“కార్తీక్, మీరు మళ్ళీ ఐశ్వర్యను కలవలేదా?”

“ఉహు... ఆమె కూడా నన్ను కలవలేదు... ఇన్ ఫాక్ట్ ఆ అవసరమేముంది?”

“అదేమిటి? బేసికల్లీ యు బోత్ ఆర్  గుడ్ ఫ్రెండ్స్...”

“అఫ్ కోర్స్... బట్ అంత టైం ఎక్కడ దొరుకుతుందండీ? మన ప్రొఫెషన్ ఎంత బిజీయో మీకూ తెలుసు కదా...”

“కానీ ఆ అమ్మాయి...”

“కార్తీ... కమ్  హియర్...” అంటూ డాలీ పిలవటంతో, “ఎక్స్ క్యూజ్ మీ... మళ్ళీ కలుస్తా...” అంటూ అటువైపు వెళ్ళిపోయాడు, కార్తీక్.

“ఈ దేశంలో అత్యంత చవకయినది ఆడదాని శరీరం...” బాధగా అనుకున్నాడు వేణుగోపాల్. వికలమైన మనసుతో ఏమీ తినకుండానే తన స్నేహితుడు రమణకి చెప్పేసి బయటపడ్డాడు.

పార్టీలో కార్తీక్ ని కలిసినట్టు మధుబాలతో మాత్రం చెప్పలేదు వేణు. ఐశ్వర్య పరిస్థితి మీద తనకి ఎంత జాలి కలిగినా ఆమెతో స్నేహాన్ని మధుబాల కొనసాగించటం అతనికెంత మాత్రమూ ఇష్టం లేదు... ఎందుకంటే సమాజంలో ఐశ్వర్య లాంటివారిని అందరూ ఎలా ట్రీట్ చేస్తారో అతనికి  తెలుసు... 

***

ఆఫీసు నుంచి వచ్చిన వెంటనే, తమ బెడ్ రూమ్ లోని  వాష్ రూము లోకి అడుగుపెట్టి, గోడకు ఉన్న లైటు  స్విచ్ వేసేలోపున మధుబాలకు కాలు జర్రున జారిపోయింది. “అమ్మా!” అని గట్టిగా, భయంగా  అరిచింది...

 గబుక్కున కొళాయి గొట్టాన్ని పట్టుకుంటూ కిందికి జారిపోయింది...

వాష్ రూమ్ అంతా ఒకటే జిడ్డు, చిరపరిచితమైన వాసన... అదేమి వాసనో తెలియటంలేదు... కిందికి జారిపోగానే నడుము కలుక్కుమంది... జాగ్రత్తగా వెనక్కి ఆనుకుంటూ గోడకి జేరబడిపోయింది మధుబాల. మోకాలు వంకర తిరిగిపోయి గోడకు కొట్టుకుంది... అంతే ప్రాణం పోయినంత పని అయింది...

గట్టిగా “అత్తయ్యా...” అని గావుకేక వేసింది మధుబాల.

సుగుణమ్మ పరుగున వచ్చింది...

“అయ్యో, అమ్మాయ్, ఏమైందీ?” అంటూ...

“లోపలికి రాకండి...  ఇక్కడంతా ఏదో ఒలికింది... బయటినుంచే స్విచ్ అందుకుని లైట్ వేయండి...” వగరుస్తూ అన్నది మధుబాల.
లైట్ వేసిన సుగుణమ్మ నిశ్చేష్టురాలై నిలబడిపోయింది. షాంపూ సీసా, కొబ్బరి నూనె సీసా కిందపడి ఉన్నాయి. రెండింటికీ మూతలు లేవు... రెండింట్లోంచీ వరదలా ప్రవహించి నేలంతా పరచుకున్నాయి షాంపూ, నూనె... 

లోపల బట్టల మూటలా ఉండ చుట్టుకుపోయి  పడి ఉంది మధుబాల... లేవలేక పోతోంది...

***

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
kadali