Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
different hotels

ఈ సంచికలో >> శీర్షికలు >>

హిమగిరి సొగసులు చూద్దాం రండి ( ఐదవ భాగం ) - కర్రా నాగలక్ష్మి

 మనాలి ---2

జోగిని ఫాల్స్ ---

వశిష్ఠ మందిరం నుంచి సుమారు మూడు కిలో మీటర్లు నడక దారిలో వెడితే అధ్బుతమైన జలపాతం చేరుకోవచ్చు . ఎక్కువ యెగుడుదిగుడులు లేకుండా అహ్లాదకరమైన వాతావరణంలో నడక సాగుతుంది కాబట్టి మనకు అలసట తెలీదు . మబ్బులు శరీరాన్ని తాకుతున్న అనుభూతి , యెత్తైన వృక్షాల మధ్య నుంచి సాగే ప్రయాణం బాగుంటుంది . ఆపిల్ తోటలలోంచి చిన్న చిన్న ధారలను దాటుకుంటూ నడుస్తూ , మబ్బుల తాకిడి చల్లబడ్డ శరీరానికి వేడి టీ తో ఉపశమనం పొందడానికి  మధ్యలో అక్కడక్కడ చిన్నచిన్న రెస్ట్రాంట్స్ వున్నాయి . సెప్టెంబరు అక్టోబరు మాసాలలో వెడితే యాపిల్ తోటలు కోతకు వచ్చిన యాపిల్స్ తో కనువిందు చేస్తాయి . ప్రవహిస్తున్న బియాస్ నది , మంచుతో కప్పబడి తెల్లగా మెరుస్తున్న పర్వతాలను చూస్తూ మన ప్రయాణం సాగుతుంది . సుమారు 30 నిముషాలు పడుతుంది జోగిని  జలపాతం కింద భాగం చేరడానికి . అక్కడ జలపాతం నుంచి పడ్డ నీటితో యేర్పడ్డ కొలను , జోగిని మందిరం వున్నాయి . జోగిని పార్వతీ దేవి అవతారం అంటారు . ఈ మందిరం లో పుట్టుజుత్తులు తీసే ఆచారం వున్నట్లు వుంది . మందిరం లో ఓ పక్క పిల్లలకి జుత్తు తీయిస్తున్నారు . చిన్నచిన్న ట్రెక్కింగులు మన శరీరాన్ని ఛార్జ్ చేస్తాయి . జలపాతం నీరు శరీరం మీద పడి గిలగింతలు పెడుతూ వుండగా జలపాతం దగ్గర కాళ్లు చేతులు తడుపుకున్నాం . నీళ్లు చాలా చల్లగా వున్నాయి . ఔత్సాహికులు అక్కడనుంచి కొండపైకి మరో రెండు కిలోమీటర్ల దూరం నడుచుకొని వెళ్లేరు . అక్కడ జలపాతం యింకా వెడల్పుగా వుండి చాలా బావుంటుందట , మరో 30 నిముషాలు పడుతుందని అన్నారు . అంత యెత్తు యెక్కడానికి మేం వెనుదీసేం . సూర్యుడు పశ్చిమానికి వాలుతున్నప్పుడు ఆ కాంతి నీటి బొట్ల మీద పడి సప్త వర్ణాలు చిమ్మడం నిజంగా మహాధ్బతం . వశిష్ఠ మందిరం , జోగిని జలపాతం తిరిగి రావడానికి  ఆరేడు గంటల సమయం పడుతుంది . ఓ అరగంట జోగినీదేవి మందిరంలో సేదతీరి , అక్కడి అందాలను మా కళ్లల్లో నింపుకొని వెనుతిరిగేం . నడవటానికి భయపడి యిలాంటి అనుభూతి ని పోగొట్టు కోవద్దని పర్యాటకులకు నా సలహా .

హిడింబా దేవి మందిరం ---

హిడింబి పేరు వినగానే మాయాబజారు సినిమా అందులో హిడింబి , ఆమె పుతృడు ఘటోచ్గచుడు పాండవులను అస్మదీయులు అనడం గుర్తొస్తుంది .

మహాభారత కాలంలో ఈ ప్రాంతాన్ని హిడింబాసురుడు పరిపాలించేవాడు . అతని సోదరి హిడింబి . హిడింబాసురుడు పరమ బలసాలి , యుక్తవయస్కురాలైన హిడింబి బలపరాక్రమములలో తన అన్నను ఓడించిన వీరుని వివాహమాడాలని నిశ్చయించుకుంటుంది .    పాండవులు  అరణ్య వ్యాసం లో వుండగా ఒకనాడు భీముడు హిడింబాసురునకు యెదురు పడతాడు . హిడింబాసురుడు తన రాజ్యములో ప్రవేశించే వారిని తనతో యుద్ధము చేయవలెనని లేదా ఓటమిని అంగీకరించవలెనని ఒప్పందము విధిస్తాడు . భీముడు హిడింబాసురునితో యుధ్దం చేసి అతనిని సంహరిస్తాడు . హిడింబాదేవి భీముని వివాహమాడి ఘటోచ్గచునకు తల్లి అవుతుంది . పుతృని వీరునిగా , పాండవుల విధేయునిగా పెంచుతుంది . మహాభారతయుద్దంలో పాండవుల పక్షం నుంచి పోరాడి కౌరవసేన ముఖ్యులను మట్టుపెట్టి వీరస్వర్గం పొందుతాడు . జన్మతః హిడింబి అసురురాలైనా మంచి ప్రవర్తనతో ఈ ప్రాంత ప్రజలకు పూజనీయురాలైంది .

ఈ ప్రాంతాలలో వున్న పురాతన మందిరాలలో యిదివొకటి . దేవదారు వృక్షాల మధ్యన వున్న కర్ర మందిరం యిది . స్థానికులలో బాగా పేరు పొందిన మందిరం . స్థానికులు హిడింబా దేవిని అమ్మవారిగా భావించి పూజలు చేస్తారు .

పచ్చని పచ్చిక , చుట్టూరా రంగురంగుల పువ్వులతో వున్న మొక్కలతో వుద్యానవనంలా వుంటుంది యీ ప్రదేశం . హిడింబా దేవి కోవెలకు యెదురుగా యెనభై అడుగుల దూరంలో హిడింబాదేవి కోవెల లాంటిదే మరో కోవెల వుంది , అది ఘటోచ్గచుని కోవెల . పుట్టుకతో పేరు రాదని ప్రవర్తనతో పేరు సంపాదించుకోవాలనే పెద్దల మాట యీ రెండు మందిరాలు చూస్తూవుంటే గుర్తొస్తుంది .

రెండు అరుదైన మందిరాలు చూసేమన్న తృప్తితో వెనుతిరిగేం .

సోలన్ లోయ---

మనాలి రొహతాంగ్ కనుమ కు వెళ్లే దారిలో మనాలీకి సుమారు 14 కిలోమీటర్ల దూరంలో వున్న అందమైన ,  పర్యాటకుల తాకిడి యెక్కువగా  లేని  లోయ .

ఈ మధ్య కాలంలో యీ లోయ లో వున్న కొండవాలులని వుపయోగించుకుంటూ  శీతాకాలంలో స్కీయింగ్ , వేసవిలో పేరాగ్లైడింగు , పేరాచూటింగ్ , జోర్బింగు ఆటలు నిర్వహిస్తూ పర్యాటకులను ఆకర్షిస్తున్నారు . జోర్బింగు అంటే పెద్ద ట్రాన్సపెరంటు బాల్ లో యిద్దరు మనుషులు పట్టణంత పెద్దది , మనిషిని కూర్చో పెట్టి జిప్ వేసి కొండవాలుల పైన వదిలి పెడతారు , బాలు దొర్లుకుంటూ కింద మైదానం చేరుతుంది .బాలు తో పాటు అందులో వున్నవారు కూడా . ఈ ఆటలు వయసులో వున్న వారికి , పిల్లలకి థ్రిల్  గా వుంటాయి . హైట్స్ అంటే భయం వున్నవారికి యీ ఆటలు భయాన్ని కలుగజేస్తాయి .

మేము పేరాచూటింగ్ చేసేం . ముందు భయమనిపించినా తరవాత థ్రిల్ అనిపించింది . సమయమున్న వాళ్లు సోలన్ లోయ చూసుకోండి .

బృగు సరస్సు ----

పీర్ పంజాల్ పర్వత శ్రేణులలో  సముద్ర మట్టానికి సుమారు 4,300 మీటర్ల యెత్తులో వున్న సరస్సు యిది .సంత్సరమంతా చాలా భాగం గడ్డకట్టుకొని వుంటుంది .

వశిష్ఠ మందిరం నుంచి సుమారు 6 కిలో మీటర్ల నడక తో చేరుకోవచ్చు . లేదా గులాబా పల్లెమీదుగా కూడా చేరుకోవచ్చు . కొండలలో నడక కష్టమే , ఆయాసం కలిగిస్తుంది కాని ప్రకృతి అందాలను చూస్తూ స్వఛ్చమైన అడవి గాలులను పీలుస్తూ  నడవడం చాలా బాగుంటుంది .  కొత్త ప్రదేశాలు తిరగడం , నచ్చిన ప్రదేశాలకి మరలమరల వెళ్లడం మాకు అలవాటుగా మారింది . మరలమరల అదే ప్రదేశాలకి వెళ్లడం వల్ల అప్పటికీ యిప్పటికి ఆయా ప్రదేశాలలో వచ్చిన మార్పులను గమనించడం అలవాటు .

అంత చలిలోనూ  చెమటలు పట్టిస్తుంది నడక . సరస్సు చేరిన తరువాత అక్కడి దృశ్యం మనసుకి అహ్లాదాన్నిస్తుంది . చుట్టూరా మంచు పర్వతాల మధ్య చాలా భాగం గడ్డకట్టి మధ్యలో కొంతభాగంలో నీళ్లు వున్నసరస్సు ని చూస్తున్నప్పుడు ఒక అద్భుతాన్ని చూస్తున్న ఆనందం కలిగింది .

పురాణ కాలంలో బృగు మహర్షి యీమంచు పర్వతాల మధ్య తపస్సు చేసుకున్నాడట , ఆ వేడికి మంచుకరిగి సరస్సు యేర్పడిందట , యిప్పటికీ బృగు మహర్షి మానవులకు కనపడకుండా తపస్సు చేసుకుంటున్నాడని , అందుకే యీ సరస్సు పూర్తిగా గడ్డకట్టదని  స్థానికులు యూ సరస్సును గురించి చెప్పే కథ .

తిరిగి వచ్చేటప్పుడు అంతా దిగడము కాబట్టి అంత కష్టం అనిపించలేదు .

మనాలి యాపిల్స్ మనదేశంలో బాగా ప్రసిద్ధి పొందేయి . సిమ్లా యాపిల్ అని అనేసినా యివి నిజానికి కులులోయలోని  ' కిన్నోర్ ' నుంచి వస్తాయి .

మనాలీ " అంగూర " స్వెటర్స్ కి ప్రసిధ్ది పొందింది . అసలు అంగూర స్వెటర్స్ , షాల్స్ చాలా ఖరీదుగా వుంటాయి . వీటిని కుందేలు నుంచి తీసిన ఊలుతో చేస్తారు , కాబట్టి చాలా మెత్తగా వుంటాయి . అంగూర ఫార్మ్ కి వెళ్లేం . వారు పెంచుతున్న కుందేళ్లను , ఊలు తయారీ మొదలయినవన్నీ చూసేం . ఒక పూట అంగూర ఫార్మ్ లో గడిపేం .

ట్రెక్కింగ్ చెయ్యడం యిష్టపడేవారికి హిమాచల్ ప్రదేశ్ లో చాలా ప్రదేశాలు వున్నాయి .

కులు మనాలి యాత్ర పూర్తయింది .

మరిన్ని శీర్షికలు