Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
nidhi chaalaa sukhamaa.

ఈ సంచికలో >> కథలు >> ప్రఙ్ఞ్నాన్

pragnan

ప్రశాంతి పుర  రాజ్యానికి  మహారాజు  ప్రవీణ వర్మ . పేరుకు తగ్గట్లే  అతడు చాలా తెలివైన వాడు. ప్రజలకు ఏ లోటూ లేకుండా కన్నబిడ్డల్లా పాలించ సాగాడు. అంతా అతడ్ని తమ పాలిటి దేవునిలా ప్రేమించే వారు. ప్రవీణ వర్మకు ఒకే ఒక లోటు, అదేమంటే సంతాన లేమి. మహా రాణి  మల్లిక ఎన్నో పూజలూ వ్రతాలు, దాన ధర్మాలు చేసింది. చివరకు ఒక యోగి సలహాతో ప్రవీణ వర్మ  పుట్టిన రోజు  పండక్కి తమ రాజ్యం లోని  పిల్లలలందరినీ రప్పించి తమ రాజ ప్రాంగణం లోని  విశాల  మైదానంలో పందిళ్ళు  వేయించి  రోజంతా వారితో గడుపుతూ వారి ముద్దు మాటలు  వింటూ ఆటలు ,పాటలకు  ఆనందిస్తూ రోజంతా గడిపేవారు  రాజూ, రాణి.

పిల్లలందరకూ నవకాయ పిండి వంటలతో భోజనాది కాలు ఏర్పాటు చేసేవారు.  వారు సంతోషంగా తింటూ ఉంటే స్వయంగా  అడిగడిగీ  , వడ్డిస్తూ తమకున్న లోటును  ఆ రోజు మరచేవారు. ఇలా కొంత కాల మయ్యాక  ఇహ తమ కు సంతానం  కలుగదేమో అనే భావన ప్రవీణ వర్మ కు వచ్చింది. ఆ పుట్టిన రోజు నాడు పిల్లలకు వడ్డిస్తున్న సమయంలో తమ   మహా మంత్రి, కుల గురువూ  కూడా అక్కడ ఉండగా వారితో తన మనస్సులోని భావనను  వెలి బుచ్చాడాయన. అపుడు వారిరువురూ ప్రవీణ వర్మ తో ఒక మాట చెప్పారు. పిల్లలంతా  రాత్రి  భోజనాలు చేస్తుండగా మహామంత్రి  ఆ మధ్యలోకి వచ్చి ఇలా ప్రకటించాడు.

"బాలలారా! మీరంతా  మహారాజు కోసం ఒక పని  చేయాలి. ఆయన ఇంత కాలంగా మిమ్ములనందరనూ తన పుట్టు పండుగ రోజు ఆహ్వానించి విందు చేస్తున్నారు కదా! వారి కోసం మీరు ఒక పని  చేస్తారా ! అనగానే పిల్లలంతా , ”  చేస్తాం , తప్పక  చేస్తాం, చెప్పండి " అన్నారు. మహా మంత్రి " బాలలారా! మీరు ఇప్పుడు తింటున్న ఆహారం లోని  ఒక  గింజను  తీసి ఉంచుకుని   ,  ఇంటికెళ్ళి  అలాంటి  గింజలను  సేకరించి నాటి  వచ్చే సం. మహారాజు  గారి పుట్టిన రోజుకు  ఆ మొక్కను, దాని పూలూ, కాయలతో సహా తెచ్చి చూపాలి. ఎవరి మొక్కైతే బాగా పెరిగి , పూలూ కాయలూ ఇస్తుందో వారికి మహారాజు గారు మంచి బహుమతి ఇస్తారు." అని ప్రధాన మంత్రి  ప్రకటించగానే , పిల్లలంతా వారు తింటున్న పదార్ధాలలోని  మిరప గింజలను, ఆవ గింజలను, పులుసులోని గుమ్మడి గింజలను, కూరల్లోని చిక్కుడు గింజలనూ అన్నింటినీ తీసి నీళ్ళలో కడిగి భద్ర పరుచు కున్నారు. ఆ తర్వాత  ఇళ్ళాకెళ్ళి పోయారు.

ప్రవీణ  వర్మ రాచ కార్యకలాపాల్లో పడి ఆ విషయం మనస్సులో అడుగున పడింది. ఐతే తర్వాతి సం. పుట్టిన రోజుకు పిల్లల్లంతా వారి తల్లిదండ్రుల సాయంతో తలా ఒకటీ రెండూ, మూడూ చొప్పున మొక్కలున్న మట్టి తొట్లు పట్టుకొచ్చి  ఆ మైదానంలో వరుసగా పెట్టి  , వాటి వద్దే తాము కూర్చున్నారు.

ఇంతలో మహారాజు  ప్రవీణ వర్మ, రాణి, ప్రధాని, కులగురువూ  అంతావచ్చి వరుసగా వాటిని చూడసాగారు . ఆ పిల్లలంతా  తాము ఎంత కష్టపడి ఆ మొక్కలను పెంచిందీ చెప్పసాగారు.   మధ్యలో  ఉన్న ఒక  పిల్లవాడు తాను తెచ్చిన మామిడి మొక్కను చూపాడు ."మహారాజా! గత సం. తమ పుట్టిన రోజునాడు తాము మాకిచ్చిన విందులోని మామిడి పండు తిని  ఆ టెంకను  నేను ఇంటికి తీసు కెళ్ళి ఈ మట్టి తోట్టిలో  నాటాను. అది మెల్లిగా మొలిచి ఈ రోజుకు ఈ మాత్రం పెరిగింది. దీని కోసం నేను  పెద్దగా  చేసిందేంలేదు. రోజూ ఉదయం సాయంకాలం  నేను స్నానం  చేసేప్పుడు ఒక చెంబు నీరు పోసానంతే.  మా ఇంట్లో ఉన్న ఆవు పేడ ఎండి నది అప్పుడప్పుడూ  వేసేవాడ్ని.ఐతే మహారాజా! ఈ మామిడి మొక్క పూలూ, కాయలూ ఇవ్వాలంటే మరో నాలుగై దేళ్ళు పట్ట వచ్చు, ఐతే  మామనవలూ, మునిమనవలూ  కూడా ఈ  చెట్టు పండ్లు తింటారు. ఇది చాలా సం. రాలు ఫలాల నిస్తుంది, ఎందరో  తిని సంతోషిస్తారు. " అని చెప్పాడు.   
ప్రవీణ వర్మ మహారాజు  ఆ పిల్లవాని మాటలకు  చాలా సంతోషించి  " నీపేరేంటి ?" అని అడిగాడు. దానికతడు "మహారాజా ! నా పేరు ప్రఙ్ఞ్నాన్   “ అని చెప్పగానే  మహారాజు  సంతోషంతో " నేను ఈ పిల్లవానిని నా తదుపరి పాలకునిగా స్వీకరిస్తూ ,  దత్తత తీసుకుని,  విద్యాబుధ్ధులు చెప్పించి , రాచ విద్యలు నేర్పిస్తాను. ఇలా పది కాలాల పాటు మదిమంది మేలు కోరే వారే నిజమైన పాలకు లవుతారు. " అని చెప్పి దానికి తగు ఏర్పాట్లు చేయించాడు.

నీతి -ఏ పని చేసినా  కేవలం స్వార్ధాన్నే కాక అందరి కోసం  ఆలోచించే వాడే నిజమైన మానవుడవుతాడు. భగవంతుని  ఆశీర్వాదాలు  అలాంటి వారికే  దక్కుతాయి.

మరిన్ని కథలు
saputrasya gatirnasthi