Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

అతులితబంధం

గతసంచికలో ఏం జరిగిందంటే....  http://www.gotelugu.com/issue172/492/telugu-serials/atulitabandham/atulita-bandham/

 

“సుగుణా, నువ్వు వినతతో మాట్లాడావా?” ప్రశ్నించాడు గోవర్ధనరావు. అవునన్నట్టు తలూపింది సుగుణమ్మ.

“అయితే కోడలు అనుమానించింది నిజమే కదూ?” సూటిగా ప్రశ్నించాడు గోవర్ధనరావు. జవాబుగా నిస్సహాయంగా, మౌనంగా తల దించుకుంది సుగుణమ్మ... ఆమె కనుల వెంట కన్నీరు...

“అర్థమైంది సుగుణా... అది చిన్నదీ, మంకుదీ అనుకున్నానే కానీ ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుందని నేను ఎన్నడూ ఊహించలేదు... అరె... అక్కడ సయోధ్యగా కాపురం చేసుకోవటం ఎప్పుడూ లేదు... అంత ఉత్తముడికి దీన్ని కట్టబెట్టి అన్యాయం చేసామన్న బాధ ఎప్పుడూ తొలుస్తూనే ఉన్నది నన్ను... ఇప్పుడీ సంఘటన! తెలిసి కానీ, తెలియక కానీ చీమకైనా అపకారం చేయకూడదు...

చూడు, పెద్ద దాన్నీ, వేణు గాడినీ కూడా ఈ చేతులతోనే పెంచాము కదా... వీళ్ళిద్దరిలో లేని విపరీత బుద్ధి  దానిలో ఎలా వచ్చింది?  ఎప్పటికప్పుడు దాని తప్పులన్నీ కప్పేస్తూ, దాన్ని వెనకేసుకు వస్తూ దానిలో బీజమెత్తిన ఆ స్వార్థమనే  విషవృక్షాన్ని పెంచి పెద్ద చేసిన దానివి నువ్వే కదా...

ఇక్కడ ఉన్నన్నాళ్ళూ దాని షోకులకి, షికార్లకి నన్ను అడక్కుండానే డబ్బు ఇచ్చేదానివి. దాని ఇష్టప్రకారం నువ్వుండే దానివి... నేను ఉన్నప్పుడు ఒకలాగ, లేనప్పుడు ఒకలాగా ఉండేది దాని ప్రవర్తన... అయినా కాలమే దానిలో మార్పు తీసుకువస్తుందని, ఎదిగిన పిల్లలని స్నేహితులుగా భావించి, మెత్తగా చెప్పే వాడిని... అది విన్నట్టే విని నా మాటలన్నీ గాల్లో కలిపేసేది... పెళ్ళయ్యాకైనా మారుతుందని అనుకున్నాను... ఉహు...

దురదృష్టవశాత్తూ మంచం పట్టిన అత్తగారు, ఆవిడని కంటికి రెప్పలా చూసుకునే మనసున్న భర్త... దీనికి మాత్రం ఆవిడని, మొగుడిని లెక్కచేయని తలబిరుసుతనం. ఆ పెద్దావిడని చూసుకోవటానికి ఒక మనిషి, దీనికి ఇద్దరు పనిమనుషులు, ఒక వంట మనిషి... అయినా దానికి ఇల్లు సమర్థించుకోవటం రాదు... అత్తగారి దగ్గర అయిదు నిమిషాలు కూర్చుని గడిపే సంయమనం, మంచితనం లేవు... భర్తతో సయోధ్య లేనే లేదు... ఎంతసేపూ క్లబ్బులూ, స్నేహితులూ, షికార్లు, షాపింగులూ... అయినా దానికి తృప్తి లేదు... పిచ్చి మానవుడు పవన్ కాబట్టి దాంతో కాపురం చేస్తున్నాడు... ఏడు సముద్రాల అవతల ఎక్కడో అమెరికాలో ఉన్న ఆడబిడ్డను అప్పుడప్పుడూ  పలకరించాలనే ఇంగితం అసలే లేదు... ఎప్పుడూ  అందరినీ దూషిస్తూ, ద్వేషిస్తూనే ఉంటుంది... విపరీతమైన అహంకారం!

ఇప్పుడు  ఈ సంఘటన... వినత తల్లి కాలేకపోవటానికి కారణం దాని స్వయంకృతమే తప్ప అది ప్రచారం చేస్తున్నట్టు పవన్ లో లోపం మాత్రం కాదు... మధుబాల తల్లి కాబోతుంటే దీని ద్వేషం పడగ విప్పి, విచక్షణ పూర్తిగా నశించి... ఓ మై గాడ్! చెప్పు సుగుణా, దీనికి ఏం జవాబు చెబుతావో చెప్పు... ఇప్పుడు కూడా క్షమాపణే లేని దాని తప్పుల్ని నీ కొంగుతో కప్పేస్తావా?

అందరినీ మంచి బుద్ధులూ, సుద్దులూ చెబుతూనే పెంచాను కదా... దేవుడా, నా పెంపకంలో తేడా ఉన్నదా?” సోఫాలో కూలబడిపోయాడు గోవర్ధనరావు. ఆయన వళ్ళంతా చెమటలు పట్టేసాయి...

వేణు గబగబా ఫాన్ స్పీడు పెంచాడు... సుగుణమ్మ వెంటనే చల్లని నీళ్ళు తెచ్చిచ్చింది...

“మీరు ఆలోచనలతో బుర్ర పాడు చేసుకోకండి ప్లీజ్... తప్పు నాదేనండి...దాని మాటకు వత్తాసు పలుకుతూ, అది ఏదంటే దానికి వంత పాడుతూ దాని మొండి తనాన్ని నాకు తెలియకుండానే పెంచి పోషించిన పాపిష్టి దాన్ని... నన్ను క్షమించండి దయచేసి...” తన చేత్తో ఆయన పాదాలు తాకింది సుగుణమ్మ ఏడుస్తూ...

“ఇటీజ్ టూ లేట్ సుగుణా! సరే, జరిగిందేదో జరిగింది... జరగబోయేది ఆలోచించండి... నేను రేపు ఉదయమే వినత ఇంటికి వెళ్ళి వస్తాను... ఒక సారి మాట్లాడి రావాలి...”

“నాన్నా... మీరు అక్కడ ఆవేశపడితే కష్టం... మీకు బీపీ పెరగకుండా చూడమని డాక్టర్ మరీ మరీ చెప్పారు... మధు వచ్చేస్తుంది లెండి... మీరు ప్రశాంతంగా ఉండండి...” నచ్చజెప్పాడు వేణుగోపాల్.

“సరేలే వేణూ... ఇద్దరమూ వెళదాం వీలుంటే... అక్కయ్య గారిని చూసి కూడా చాలా రోజులు అయింది కదా... నేను కాసేపు పడుకుంటాను...” అలసటగా తమ బెడ్ రూమ్ వేపు నడిచాడు గోవర్ధనరావు.

***

“నాన్నగారూ... నేను మనింటికి వచ్చిన మాట నిజమే కానీ, ఆ పని నేను చేయలేదు...” గట్టిగా చెప్పింది వినత.

“వినతా... నా సహనాన్ని పరీక్షించకు... అమ్మ దగ్గర ఒప్పుకున్నావుగా? నేను అడుగుతుంటే అలా బ్లఫ్ చేయటానికి బుద్ధి లేదూ?”

“నాన్నా, మధుబాల మీద నాకేం కోపం ఉంటుంది చెప్పండి? నేను చేయలేదు...” మరింత గట్టిగా అన్నది వినత.

ఆమెను చూస్తూంటే, చిన్నప్పుడు ‘నేను ఒట్టుగా  చాక్లెట్ తినలేదు నాన్నా...’ అని చాక్లెట్ పాకంతో నిండిన ముఖంతో అమాయకంగా చెప్పే పసి వినత గుర్తు వచ్చింది.

నిస్సహాయంగా నిట్టూర్చాడు గోవర్ధనరావు... పెళ్ళయిన కూతురు తల్లిదండ్రులకి ఎప్పటికీ పరాయిదే... కమ్మరి ఇనుమును వంచినట్టు వంచే అధికారం తనకిప్పుడు లేదు... సాభిప్రాయంగా వేణు వైపు చూసాడు.

“వినతా, నువ్వు లోపలికి  వెళ్ళు...” చెల్లెల్ని లోపలికి  వెళ్ళమని సైగ చేసి, “ఏమిటిది నాన్నా, ఇక్కడ దీని అత్తవారింట్లో పంచాయితీ?” అన్నాడు వేణు తగ్గుస్వరంతో...

“నువ్వు కూడా దాన్ని చాలా చెడగొట్టావురా... ఎంతగా అంటే, నీ బిడ్డని నాశనం చేయాలని అది అనుకున్నా ఏమీ అనలేనంత, అననీయనంతా...” ఆవేదనగా అన్నాడు గోవర్ధనరావు.

“మామయ్యా, నేను వినతకు నచ్చజెబుతాను. మీ దగ్గర భయపడి అలా మొండిగా మాట్లాడుతోంది కానీ, తనలో ఈ సంఘటన తప్పక మార్పు తీసుకువస్తుంది...” చెప్పాడు పవన్. తలపంకించాడు ఇక ఏమీ చేయలేక గోవర్ధనరావు.

“అమ్మ దగ్గరకు వెళదాం పవన్...” అన్నాడు గోవర్ధనరావు.

“సరే మామయ్యా, రండి...” తల్లి గదిలోకి తీసుకువెళ్ళాడు పవన్.

అప్పుడే జావ తాగి, మందులు వేసుకుని విశ్రాంతిగా మంచం మీదనే కూర్చుని, వాల్మీకి  రామాయణం చదువుతోంది సుందరమ్మ. పక్కనే విమలమ్మ కుర్చీలో కూర్చుని, ఆవిడ పైకి చదువుతూ ఉంటే తానూ వింటూ ఆనందిస్తోంది. ఇప్పుడిప్పుడే ప్రతీ రోజూ ఫిజియోతెరపిస్ట్ వచ్చి చేయించే ఎక్సర్ సైజుల వల్లా, పవన్, విమలమ్మా తీసుకునే కేర్ వల్లా సుందరమ్మ మంచం మీద లేచి కూర్చోగలుగుతోంది.

“నమస్కారం అక్కయ్యా... ఎలా ఉన్నారు?” రెండు చేతులూ జోడించి నమస్కారం పెట్టాడు గోవర్ధనరావు.

“రా తమ్ముడూ... అంతా కులాసానా? నేను బాగున్నాను...” చిరునవ్వుతో చెప్పి, “పవన్, నాన్నా, మామయ్య గారికీ, బావగారికీ కుర్చీలు వేయించు...” అని కొడుకుతో చెప్పింది.

“సారీ అక్కయ్యా... ఈ మధ్యన బాగా బిజీగా ఉండి రాలేకపోయాను...” క్షమాపణగా చెప్పి, “మందులు అవీ సక్రమంగా వాడుతున్నారు కదా...” అన్నాడు గోవర్థనరావు.

“వాడుతున్నాను తమ్ముడూ... సుగుణ రాలేదా? నీ ఆరోగ్యం ఎలా ఉంది?”

“ఫర్వాలేదు అక్కయ్యా... అందరం బాగానే ఉన్నాము. సుగుణ రాలేదు... చాలా రోజులైందని మిమ్మల్ని చూడాలని వచ్చాను...” అబద్ధం చెప్పినందుకు కించిత్ గిల్టీగా ఫీలయ్యాడు గోవర్థనరావు.

“కాఫీ తాగారా? పవన్...”

“చెప్పానమ్మా, సావిత్రి తయారు చేస్తోంది...” వినమ్రంగా చెప్పాడు పవన్.

“అమ్మాయి ఎప్పుడు వస్తుంది అక్కయ్యా? చూసి చాలా కాలం అయింది!”

“రెండు మూడు నెలల్లో వస్తానని ఫోన్ చేసింది తమ్ముడూ... పిచ్చి పిల్ల! దాని మనసంతా ఎప్పుడూ ఇక్కడే ఉంటుంది...” కూతుర్ని తలచుకుని తృప్తిగా నిట్టూర్చింది సుందరమ్మ.

“అవును అక్కయ్యా, మీ పిల్లలిద్దరూ మణి మాణిక్యాలు!”

ఈలోగా సావిత్రి ట్రే లో కాఫీలు పట్టుకుని వచ్చింది.

“అమ్మా, మీ వంట పూర్తి  అయింది, భోజనం వడ్డించమంటారా?”

“లేదు సావిత్రీ... ఇందాకే టిఫిన్ అయింది కదా... కాసేపాగి తింటాను... చూడు తమ్ముడూ, అల్లుడు గారూ  వచ్చారు కదా, భోజనం లోకి మంచి కూరలు, స్వీటు చేయి...” చెప్పింది సుందరమ్మ.

“అబ్బే, లేదు అక్కయ్యా... అక్కడ సుగుణ ఒక్కతే ఉంది కదా, మేము వెళతాము... మళ్ళీ అందరం కలిసి వచ్చినపుడు భోజనం చేస్తాము...” కాఫీ తాగి  లేచాడు గోవర్ధనరావు.

“నువ్వు వెళ్ళు వేణూ... పవన్, నేను అమ్మతో కాస్త మాట్లాడాలి... పర్శనల్...” అన్నాడు గోవర్థనరావు. వేణు తండ్రివైపు కించిత్ కోపంగా చూస, పవన్ తో  బయటకు వెళ్ళాడు.

సావిత్రి, విమలమ్మా కూడా గదిలోంచి వెళ్ళిపోయాక, “అక్కయ్యా... వినత మీతో ప్రవర్తించే తీరు నాకు తెలుసు... ఎన్నిసార్లు ఎంతగా చెప్పినా అది మారలేదు... ఇక మారుతుంది అన్న ఆశా లేదు... అలాంటి దాన్ని కన్న ఈ నికృష్టుడిని క్షమించండి...” ఆర్తిగా సుందరమ్మ చేతులు పట్టుకున్నాడు గోవర్ధన రావు.

“తమ్ముడూ... ఛ, ఇదేమిటి? నాకు వినత రెండో కూతురు... దాని ప్రవర్తన నన్ను ఎన్నడూ బాధించదు. ఫర్వాలేదు... అయినా నన్ను చూసుకోవటానికి ఇంత మంది ఉన్నారు... అది చిన్నపిల్ల... జీవితాన్ని ఎంజాయ్ చేయనీ... నువ్వు క్షమాపణ అడిగేంత పెద్ద విషయమేమీ కాదు...” మనస్ఫూర్తిగా అంది సుందరమ్మ.

“మీరంతా చాలా పెద్ద మనసున్న వాళ్ళు అక్కయ్యా... నేనే అల్పుడిలా కనబడుతున్నాను మీ మంచితనం ముందు...” గిల్టీ గా అన్నాడు గోవర్థనరావు.

“సరే, నీ ఆరోగ్యం జాగ్రత్త తమ్ముడూ... బీపీ తగ్గించుకునే ప్రయత్నం చేయి... అనవసరంగా ఆదుర్దా పడకు... అన్నీ సర్దుకుంటాయి... వినత కూడా తన బాధ్యత తెలుసుకుని మసలుకుంటుంది... నువ్వేమీ హైరానా పడుతూ ఆరోగ్యం చెడగొట్టుకోవద్దు... సరేనా?”

“సరే అక్కయ్యా.. నేను వస్తాను మరి...” రెండు చేతులూ జోడించి మరోసారి నమస్కరించాడు గోవర్ధనరావు.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
kadali