Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kadali

ఈ సంచికలో >> సీరియల్స్

నాగలోక యాగం

గతసంచికలో ఏం జరిగిందంటే .....http://www.gotelugu.com/issue172/490/telugu-serials/nagaloka-yagam/nagaloka-yagam/

 

‘‘ఆపండి మీ వినయము’’ అనరిచాడు.

‘‘ఏమి ధైర్యము? ఏమి ఈ దుస్సాహసము. కేవలము మానవ మాత్రులు మాతో సరియా? ధనుంజయా... నీవు మా తనూజను చేపట్టునంతటి గొప్పవాడివా? నీకు నాగ లోకపు దివ్య నాగమణి కావలెనా? ఈ మాయలాడి మంత్ర గత్తెను నమ్ముకొని మిడిసి పడుచున్నావా... నీకు ప్రాణము మీద ఆశ వున్నచో తక్షణమే మా పుత్రికను మాకు వప్పగించి మీ రాజ్యమునకు మరలి పొమ్ము. లేకున్న తగిన శాస్తి అనుభవించగలవు. ఇదియే నా చివరి హెచ్చరిక’’ అనరిచాడు.

ఆ మాటలకు ధనుంజయుడు ఆవేశ పడలేదు. ఎందుకంటే భద్రా దేవి అతడ్ని ముందే హెచ్చరించింది ఆవేశకావేశము వలదని. దరహాసంతో శాంత గంభీర స్వరంతో యిలా అడిగాడు.

‘‘నాగ రాజా! తమరు పెద్దలు, సర్వం  తెలిసిన వారు. మేము కేవలం మానవులమా... అల్పులమా. మీలో ఇలాంటి అల్ప అభిప్రాయము మా పట్ల కలుగుటకు కారణమేమి? మానవులందు మహనీయులు గలరన్న సత్యము మీరు ఎరుంగనిదా? నేనేమీ అనామకుడనుగానే.

పాండు వంశజుడను, అర్జన అభిమన్య పరీక్షిత్తు జనమేజయాది వీరపురుషుల వారసుడను. వారి రక్తమే నాలోనూ ప్రవహించు చున్నది. చంద్ర వంశము గురించి మీకు తెలియదా లేక గతమును మరచితిరా.

నా ప్రాణ సఖి భద్రా దేవి ఒక మాయలేడా, మంత్రగత్తెయా? ఎవరికి హాని జేసినది? నోటి నిండా విషం పెట్టుకొని మీ జాతివారు మానవులకు హాని జేస్తుంటే తన మంత్ర శక్తితో వారిని కాపాడుతుంది. ఈమె శక్తి మీకు తెలియాలంటే అదో... మీ ముందున్న అగ్నిరేఖను దాటి గుట్ట పైకి రండు. చూచెదము గాక’’ అంటూ సవాల్ విసిరాడు.

నాగ రాజుకి ఏం చెప్పాలో అర్థం గాక గింజుకొంటున్నాడు. అంతలో భద్రా దేవి అందుకుంది.

‘‘స్వామీ! మీరు నా తండ్రి లాంటి వారు. దయ జూపవలసిన మీలో ఈ కాఠిన్యమేల? మేం మానవులమే. మీ నాగ జాతి పట్ల మాకు చెప్ప రాని గౌరవం`భక్తి. అందుకే నాగుల చవితి యని ఒక పర్వ దినమే ఏర్పరచి మీకు పూజలు చేస్తుంటాం. ధనుంజయుడు నా ప్రాణ సఖుడు. అతని కోసం నా శక్తిని యుక్తిని వెచ్చించుట దోషమెలా అవుతుంది?

నా సఖుడు మీ తనయ యువ రాణి ఉలూచీశ్వరిని బలిమిని గొని రాలేదు. ఈమె తానుగా వలచి వరించి మా వద్ద కొచ్చి మాలో ఒకటైనది. ఇందులో వీరి దోషమేమున్నది?’’ అనడిగింది సూటిగా.

‘‘అధిక ప్రసంగము’’ అనరిచాడు అసహనంగా నాగరాజు.

‘‘ఇప్పుడు సమస్య దోషములెన్నుట గాదు. మా ప్రియ పుత్రికను మాకు వప్పగించ వలె. లేకున్న పోరు తప్పదు’’ హెచ్చరించాడు.

‘‘ఎవరు వప్పగించవలె? నేనా? ఉలూచీశ్వరి ఇప్పుడు నా మనోహరి. నా ప్రాణములో ప్రాణం. వలచి వచ్చిన కన్యను నేనుగా పొమ్మని జెప్పు కఠినాత్ముడను గాను. తను వచ్చిన నిరంభ్యంతరముగా మీతో గొని పో వచ్చును. రాకున్న వెను దిరిగి పోవలె. కాకున్న పోరు తప్పదందురా. వియ్యానికయినా, నెయ్యానికయినా, కయ్యానికయినా నేను సిద్ధమే. నిర్ణయం మీది. తను వస్తుందేమో అడిగి చూడండి. నా ధనస్సు శక్తి మీకు తెలియదు’’ అంటూ చట్టున విల్లు లేపి ధనుష్టంకారం జేసాడు. అంతే`

ఒక్క పెట్టున వేలాది తుమ్మెదలు మైదానమున జేరి ఝుంకార నాదము సలుపు తున్నట్టు గాలిలో చెల రేగిన రొదకు తట్టుకో లేక చెవులు మూసుకున్నారంతా. నిలువెత్తున వున్న ధనుంజయుని వింటి నారి నుంచి పుట్టిన టంకార నాదం కొన్ని లిప్తల కాలం వరకు ఆ ప్రాంత మంతటా మారు మ్రోగుతూనే వుంది. ఆ శబ్ధం నాగా ఆటవిక వీరుల  గుండెల్లోనే కాదు, నాగ భటుల గుండెల్లోనూ దడ పుట్టించింది. బహుశ గుట్టను చుట్టి భద్రా దేవి గీచిన అగ్ని వలయం లేకుంటే స్వయంగా నాగ రాజే గుట్ట పైకి వచ్చి తన తనయను బలవంతంగా వెంట తీసుకు పోయే వాడేమో. ముఖా ముఖిని సమస్య ఎటూ తేలేట్టు లేదు. యుద్ధం ప్రస్తుతం అవాంఛ నీయం. ఆలోచిస్తున్న నాగ రాజు సహనం కోల్పోతూ` ‘‘చాలు... ఇక చాలును’’ అనరిచాడు.

‘‘జరిగినది చాలును. నీ వీరము బీరము వినుటకు రాలేదు. అమ్మా ఉలూచీశ్వరి... నా కొమరితగా పరువు నిలపాల్సిన బాధ్యత నీ మీద వున్నది. అయినదేదో అయినది నీ కొరకు వరుని అన్వేషించి ఉంచితిమి. ఈ తరుణంలో నీవిలా జేసి మమ్ము ఏడేడు పదునాలుగు లోకములందు నగు బాటు చేయ తగదు. నీ జనని నీ కొరకు బెంగటిల్లి ఎదురు చూచుచున్నది. జరిగినది మరిచి పొమ్ము. రమ్ము. మన లోకమునకు పోవుదము’’ అంటూ ఉలూచీశ్వరిని పిలిచాడు.

ఉలూచీశ్వరి తన అయిష్టతను వ్యక్తం చేస్తూ బదులు చెప్పకుండా ధనుంజయుని వెనక్కు జరిగింది.

‘‘నీ మౌనమునకర్థమేమి? వచ్చు ఉద్దేశమున్నదా లేదా? బదులు చెప్ప వలె’’ గర్జించాడు నాగ రాజు.

‘‘వూహు! ఈ మౌనము తగదు దేవీ. నిర్భయముగ నీ నిర్ణయమును మీ జనకునకు తెలియ జెప్పుము’’ అంటూ ధనుంజయుడు ఉలూచీశ్వరిని ముందుకు లాగాడు.

వంచిన శిరస్సు ఎత్తకుండానే`

బదులిచ్చింది ఉలూచీశ్వరి.

‘‘క్షమించు జనకా. నేను తప్పు జేసితినో ఒప్పు జేసితినో నాకే తెలియదు. మీరు నా అభీష్టము నెన్నడును కాదన లేదు. నా మనసు ఈ రాకుమారుని వరించినది. మా ప్రేమ స్థిరమైనది, శాశ్వతమైనది. నా ప్రాణము సర్వస్వము ఇతడే. వీరిని విడిచి మన జాలను. నేను వీరి తోనే మన లోకమునకు వత్తును. ఇప్పుడు మీ వెంట రాజాలను. జనకా... మీరు మాయందు కరుణ జూపి మన నాగ లోకపు ఒక్క దివ్య నాగ మణిని నొసంగిన చాలును. మేము రత్న గిరికి పోయెదము.’’ అంటూ చేతులు జోడించి తండ్రిని కన్నీళ్ళతో అర్థించింది.

అంత స్పష్టంగా ఉలూచీశ్వరి తన నిర్ణయాన్ని చెప్పాక ఇక ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాలేదు నాగ రాజుకి. యుద్ధమంటూ ఆరంభిస్తే ఆ యిద్దరే కాదు, తన కుమార్తెకూ హాని తప్పదు. ఆ యువతి భద్రా దేవి వద్ద ఇంకా ఎన్ని మంత్ర శక్తులున్నాయో తెలీదు. ప్రస్తుతానికి ఆశ వదులుకొని మరలి పోవుటే మంచిది. నేరుగా జయింప సాధ్యము గానపుడు యుక్తితో జయింప వలె. చూచెద గాక అనుకుంటూ`

ఓ సారి గుట్ట పైన ముగ్గురినీ క్రోధావేశంతో చూసాడు. అంతే` ఇంకేమీ మాట్లాడ కుండా గదాయుధాన్ని భుజాన వేసుకొని గిరుక్కున వెను తిరిగి చర చరా తన పరివారం వైపు వెళ్ళి పోయాడు. వాళ్ళతో ఏదో చెప్పి చీకట్లలో ముందుకు సాగాడు.

క్షణాల్లో ఆయన ఆనతి`

మైదానమంతటా ప్రాకి పోయింది.

వచ్చిన నాగా జాతి వీరులు నాగ లోక భటులు అంతా ఎలా వచ్చిన వాళ్ళు అలాగే మైదానం వదిలి వెళ్ళి పో సాగారు. చూస్తూండ గానే మైదాన మంతా ఖాళీ అయింది. కాగడాలు మూడు వరుసల్లో క్రమంగా దూరమవుతూ అదృశ్యమయ్యాయి.

ధనుంజయ, భద్రాదేవి, ఉలూచీశ్వరిు మాత్రం గుట్టపైన బొమ్మల్లా అలాగే నిలబడున్నారు. దుఖ్ఖిస్తున్న ఉలూచీశ్వరిని భద్రా దేవి ఓదార్చినది.

‘‘నా జనకుడు ఎందుకింత మానవ ద్వేషిగా మారినారో తెలియకున్నది. నను అర్థము జేసు కొని మన నాశీర్వదింతురని భావించితి. క్రోధమున వెడలినారు’’ అంటూ బాధ పడుతోంది.

‘‘బాధ పడకుము సోదరీ. ఇప్పుడేమైనది. ఇవాళ గాకున్న రేపు అర్థము జేసు కొని మననాశీర్వదించెదరు’’ అంది అనునయంగా భద్రా దేవి.

సరిగ్గా ఇదే సమయంలో`

భూతం ఘృతాచి రివ్వున గాలిలో ఎగురుతూ వచ్చి భద్రా దేవి ఎదుట నిబడింది. నాగ స్వరము బుర్రను అందించి చేతు కట్టు కుంది వినయంగా.

‘‘తల్లీ! మీరు చెప్పినటులేజేసితి. ఒక్క సర్పమును మిగుల లేదు. అన్నియు లోయలో పడినవి’’ అంది ఉత్సాహంగా.

ఇంతలో భద్రా దేవి భుజం తట్టి` ‘‘అక్కా! అటు చూడుము’’ అంటూ చేయెత్తి పశ్చిమంగా చూపించింది  ఉలూచీశ్వరి. అంతా అటు చూసారు.

అక్కడ నేలకు ఎత్తుగా`

ఒక దివిటీ గాలికి రెప రెప లాడుతూ మండుతోంది. బహుశ నేలకు గుచ్చిన ఈటెకు అది కట్టబడి వుండాలి. ఆ ఒక్కటీ తప్ప గుట్టను చుట్టి వేరెక్కడా మరో దివిటీ లేదు.

ఆ ఒక్క దివిటీ ని వాళ్ళు`

ఎందుకు వదిలి వెళ్లినట్టు?

ఇందులో ఏదన్నా మోసం వున్నదా?

సందేహం రానే కూడదు.

వస్తే తక్షణమే సందేహ నివృత్తి చేసు కోవాలి. లేదంటే సమస్యలు తప్పవు. ‘‘ఘృతాచి వెళ్ళుము. ఆ దివిటీ సంగతేమిటో చూసి రమ్ము.
దాన్ని ఆశ్రయించు కొని ఎవరు వున్నను వదలకుము. పట్టి నా ఎదుటకు తెమ్ము’’ అంది భద్రా దేవి.

‘‘చిత్తము. ఇప్పుడే పోయి జూచి వచ్చెద’’ అంటూ ఎలా వచ్చిందో అలాగే రివ్వున గాలిలో ఎగురుతూ మండుతున్న దివిటీ వైపు వెళ్ళి పోయింది ఘృతాచి.

అది తిరిగి వచ్చు లోపల ఏవో మంత్రాలు పఠిస్తూ తను రాతి గుట్టను చుట్టి గీచిన అగ్ని రేఖను ఉపసంహరించింది భద్రా దేవి. అప్పటికి పశ్చిమాకాశాన` శుక్రుడు అస్తమించాడు.తూర్పు ఆకాశం తెల్లబడుతోంది.

తెల్లవారడానికి అట్టే సమయం లేదు.

‘‘ఆ దివిటీ వద్ద ఎవరో వుండి వుంటారా?’’ అటే చూస్తూ అడిగాడు ధనుంజయుడు.

‘‘ఏమో... వుండే వుంటారు. లేకున్న ఆ ఒక్క దివిటీని వాళ్ళు విడిచిపోనేల?’’ అంది భద్రా దేవి.

ఈలోపల భూతం ఘృతాచి దివిటీ వద్దకు చేరు కొని చూసింది. ఒక ఈటెను నేలలో గ్రుచ్చి దాని పై భాగన దివిటీ కట్టబడుంది. దాని పరిసరాల్లో పురుగు కూడ కదులుతున్నట్టు లేదు. ‘ఏమున్నదిచట?’ అనుకొంటూ వెను తిరిగ బోయి ఏదో అనుమానం వచ్చి మరోసారి ఈటెను
పరికించి చూసింది. అది అసహజంగా వుంది. ఒకటి కాదు రెండు ఈటెలు నిలబెట్టినట్టుంది. అసలివి ఈటెలేనా లేక వేరే ఏమన్నానా? అనుమానంతో ఈటెను పట్టి చూసింది. నిజంగానే అవి ఒకటి కాదు, రెండు. ఒక ఈటె గట్టిగా వుంది. రెండోది మెత్తగా తగిలింది. ఆ ఈటెను నిలువునా ఏదో సర్పం ఆశ్రయించు కొని ఈటెలా భ్రమ కలిగిస్తూ మోసం చేస్తోందని అర్థం కాగానే ఘృతాచికి పట్ట రాని కోపం వచ్చింది.

‘‘ఆహాఁ! పాములన్నిటిని తీసుకెళ్ళి లోయలో పారవైచితి. నీవు మాత్రం తప్పించు కొని నన్నే ఏమార్చెదవా? వదల... నిను వదల’’ అంటూ దాని నడుం పుచ్చుకుని ఈటె నుండి బలంగా లాగింది.

అది రక్త పింజేరిలా ఎర్రగా వుంది. కాని అంత కన్నా బలంగా పొడవుగా వుంది. ఇవతలకు లాగిన వెంటనే వికటాట్టహాసం చేస్తూ ఘృతాచి చేతికి తన తోక భాగాన్ని చుట్టేసింది. తల భాగాన్ని పైకి లేపింది. ఆశ్చర్యం`

దాని శరీరం పాము శరీరమే గాని త పాము తల కాదు, ఒక పురుషుని తల. ఎర్రటి ముఖ వర్ఛస్సు, పెద్ద కళ్ళు ఆ వింత పాము భూతం ఘృతాచి చేతికి చిక్కింది గాబట్టి సరి పోయింది. అదే మనిషయితే అదిరి పడి ప్రాణాలు వదిలేసే వాడు. ఆ సర్ప శరీరుడైన పురుషుడు వికృతంగా నవ్వుతూనే తల లేపి ఘృతాచి ముఖంలో ముఖం పెట్టి చూస్తూ` ‘‘ఏయ్ భూతమా. నీవు నన్నేమీ చేయ గలవు? విడిచి పెట్టుము. లేకున్న నా శరీరంతో నిను చుట్టి, బంధించి దారుణముగా హింసించెద’’ అనరిచాడు.

ఆ మాటలకు వళ్ళు మండిన ఘృతాచి వాడి తల మీద ఒక్క దెబ్బ వేసింది. ‘‘నేను మామూలు భూతాన్ని కాదురా నీవు హింసించుటకు. నిను వదల. నా నుంచి తప్పించుకో లేవు’’ అంటూ దివిటీని లాగి వాడి శరీరానికి తాకించింది. అంతే`

ఒళ్ళు కాలిన బాధతో కెవ్వున అరిచాడా నాగ లోక వాసి. భూతం చేతిని వది లేసి వేలాడుతూ` ‘‘వద్దు... నను కాల్చకు. వదిలెయ్’’ అంటూ అర్థించాడు.

‘‘వదులుతా కాని ఇక్కడ కాదు సుమా. నీ సంగతేమిటో వాళ్ళు చూచు కొనెదరు గాక’’ అంటూ ఓ చేత్తో ఆ వింత పాముని రెండో చేత్తో ఈటెతో సహా దవిటీని పుచ్చుకొని ఎలా వెళ్ళిందో అలాగే గాలిలో రివ్వున ఎగురుతూ వచ్చి భద్రాదేవి ఎదుట నిలిచింది. ఈటెను నేలలో గుచ్చగానే దివిటీ వెలుగులో ఇప్పుడు ముఖాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి.

ఘృతాచి తెచ్చిన వింత పామును జూచి ధనుంజయ, భద్రా దేవిలు విభ్రాంతి చెందగా యువ రాణి ఉలూచీశ్వరి మాత్రం వాడ్ని చూసి` ‘‘నువ్వా?’’ అనరిచింది.

‘‘వీడు నీకు ముందే తెలుసునా?’’ అడిగింది భద్రా దేవి.

‘‘అవును అక్కా. వీడు మా నాగ లోక వాసి. అందునా మా జనకుని మంత్రి వర్గ మందు ఒక మంత్రి కుమారుడు. వీడు బహు మాయావి, టక్కరి. కుయుక్తులు పన్నుట లోను మోసము చేయుట లోను నేర్పరి. వీడి నామ ధేయము వక్ర దంతుడు. అంతా ఇచ్చోటు వదలి వెడలి పోయినా వీడు మాత్రము ఎందుకు ఇచట వుండి పోయినాడో అర్థము గాకున్నది’’ అంది ఉలూచీశ్వరి.

‘‘గాదు... నీకు అర్థము గాదు యువ రాణీ. నీవు తెలుసు కొన వలసిన విషయము అనేకమున్నవి.’’ అంటూ తన వంకర పళ్ళు బయట పెట్టి మళ్ళీ వెకిలిగా నవ్వాడు వక్ర దంతుడు.

‘‘ఏమా విషయము?’’ వాడి చూపుతో వేడిగా అడిగింది ఉలూచీశ్వరి. భూతం ఘృతాచి చేతిని చుట్టు కొనే అలా గర్వంగా తల పైకెత్తి యువ రాణి వంక చూసాడు వాడు.

‘‘ఏమందువా? నా జనకుడు నీ కొరకు ఎంపిక జేసిన వరుడు ఎవరో నీకు తొసునా? నీకు తెలియదు. హ...హ...హ... అది నేనే’’ అన్నాడు.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్