Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
navvunaluguyugalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

కథాసమీక్షలు - .

 

               కథ : “మామ్మ  “
రచయిత  పేరు  :  వెంకట  సూర్యనారాయణ  కొమ్ముల
     సమీక్ష :    జీడిగుంట  నరసింహ  మూర్తి. 
        
గోతెలుగు 146 వ సంచిక!

నేను ఈ  మధ్య   చదివిన  గోతెలుగు  కధలలో 146 వ  సంచికలో  ప్రచురింపబడిన  “మామ్మ  “ (కథ  ) నన్ను  విశేషంగా  ఆకర్షించింది. ఈ  రోజుల్లో  పని మనుషులు   (ఇంట్లో  పని చెయ్యడానికి  వచ్చిన  వారు ) అనే  అంశం  ఒక  అంజర్జాతీయ  టాపిక్  గా  మారిపోయింది అనడంలో  సందేహం  లేదు. దాదాపు  ప్రతి ఇంట్లోనూ  వీరి  గురించి ఏదో సందర్భంలో   తము పడుతున్న ఇబ్బందులను  వ్యక్తీకరించకుండా ఎవరూ  ఉండటంలేదు. . మన  ఇంట్లో  పనిమనిషి  ఏ  కారణం  వల్లనైనా ఆ రోజు  పనిలోకి  రాలేదంటే  ఇక  ఆ ఇంట్లో  ఇల్లాలి  పని  మొదలు  నరికిన  వృక్షంలా  అయిపోతుంది. ఆ దెబ్బతో  ఇంట్లో  పనులన్నీ  మూలపడి  పోతాయి . “ ఈ  రోజు  మా  పని  మనిషి  రాలేదు. చెప్పకుండా  మానేసింది. అసలే  నిన్న  చాలామంది  చుట్టాలోచ్చి  సింకునిండా   బండెడు  అంట్ల గిన్నెలు  పడేసి  ఉన్నాయి. అవి  తోముకుంటే  కాని  ఈ  రోజు  ఆయన్ని ఆఫీసుకు, పిల్లల్ని  స్కూళ్ళకు  పంపలేను. దానికి  తెలుసు  నా  ఆరోగ్యం  అంత  మంచిది  కాదని  ..  అయినా కూడా  నిర్లక్ష్యంగా  చెప్పకుండా  మానేసింది. ..”.అంటూనో, “ఈ  రోజు  పని మనిషి  రాదని తెలియక  పిలవక  పిలవక  మా  దగ్గర  బంధువులను  భోజనానికి  పిల్చాం. వాళ్ళ  కళ్ళ ముందు  అంట్లు  తోముకుంటూ  కూర్చుంటే  ఎంత  అసహ్యంగా  ఉంటుంది  ? ముందే  ఈ  విషయం  చెపితే  ఇంకో  సారి  వచ్చే వాళ్ళం  కదా ?”  అంటూ  అవతలి  బంధువుల  దెప్పి పోడుపులు భరించ లేక అవమానంతో ఉన్నాం అంటూ  వాపోయే  వాళ్ళు కొంతమంది,  , ఇంకో  పక్క  ప్రయాణం  పెట్టుకుని  పని  మనిషి  కోసం  ఎదురు  చూసే  ఇల్లాళ్ళు  ...    ఇలా  చాలా  ఇళ్ళల్లో  ప్రహసనం  విపరీతమైన  ఒత్తిళ్ళ మధ్య  సాగిపోతూ  వుంటుంది.

అయితే  వీటికి  భిన్నంగానూ, అతీతంగానూ, కొంతమంది  మానవతావాదులు  అక్కడక్కడ  కనిపిస్తూ  ఉంటారు.వీళ్ళు ఇంట్లో  వారికి  భారం కావడం  ఇష్టంలేక  తమకు  చేతనైన పనిని కేవలం  వ్యాపార  దృక్పధంతో  కాకుండా శ్రమలోనే తమకు  తోచినంత ఇంటి  సేవానిరతిని  చూపిస్తూ  ఉంటారు.  అటువంటి  పాత్రే  రచయిత  సృష్టించిన  “మామ్మ  “. ,తన  బ్రతుకు తెరువుకోసం  ఆ  ఇంట్లో  ప్రవేశించిన  “మామ్మ “  తన  చిన్న కొడుకును ఇంటి యజమాని  పాత్రధారి అన్నగారికి  ఒక  సందర్భంలో రక్తం  అవసరమయ్యి ,   రక్తదానం  చెయ్యడానికి  పంపించడం , ఆమె  ఋణం  తీరుచుకోవడానికా  అన్నట్టుగా  ఆమె  అదే  రోజు  తనువు చాలిస్తే అక్కడున్న  అందరికి  ధైర్యం  చెప్పి ఇంటి యజమాని పాత్రధారి   ఆమె  శవానికి చితి  అంటించడం  లాంటి  సందర్భాలను  రచయిత అద్భుతంగా  పండించి  కధకు  మంచి  బలాన్ని  చేకూర్చారు. అయితే  అక్కడ శవానికి  చితిని  అంటించడానికి అర్హుడిగా  “ మామ్మ”  పెద్ద  కొడుకు  అక్కడే  ఉన్నా కూడా  యజమాని  కేవలం “ మామ్మ”  ఋణం  తీర్చుకోవడానికే  ఆ  చితిని అంటించడానికి  పూనుకోవడంపై  రచయిత  కొంత  క్లారిటీ ఇవ్వవలసి  ఉంది. .ఈ  చిన్న  సందేహాన్ని  పక్కన పెడితే   రొటీనుగా  వస్తున్న ప్రేమ  కథలకు  భిన్నంగా  మానవతా  విలువలను  చాటిచెప్పే అంశాలు  గల  కథగా రచయిత  అణువణువునా మలిచిన  విధానం  నన్ను బాగా  ఆకర్షించింది.  రచయిత  అభినందనీయుడు.

 

 ఈ కథను ఈ క్రింది లింక్ లో చదవచ్చు...http://www.gotelugu.com/issue146/3757/telugu-stories/maamma/

 

మరిన్ని శీర్షికలు
sahiteevanam