Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kadali

ఈ సంచికలో >> సీరియల్స్

అతులితబంధం

గతసంచికలో ఏం జరిగిందంటే....http://www.gotelugu.com/issue177/506/telugu-serials/atulitabandham/atulita-bhandham/


స్టీలు ప్లేట్ లో మిక్స్చర్ పోసిచ్చి, వేడి వేడి చిక్కని కాఫీ స్టీలు గ్లాసునిండా ఇచ్చింది సుగుణమ్మ. ఆకలి మీద ఉండటం చేతనూ, అత్తగారిని బాధ పెట్టకూడదనీ త్వరత్వరగా తినేసి, కాఫీ తాగేసింది మధుబాల. ఇంతలో లోపలికి వచ్చింది సుచిత్ర, “ఏమ్మా మధూ, ఎలా ఉన్నావు?” అంటూ...

“నేను బాగానే ఉన్నాను వదినా, మీరు ఎలా ఉన్నారు? ఎప్పుడు వచ్చారు??” అడిగింది మధు.

“ఉదయం వచ్చాను. రేపు వెళ్ళిపోతాను... ఇక్కడ మా దూరపు బంధువులుంటే అక్కడికి వెళ్ళి వస్తున్నాను. బాబు చాలా బాగున్నాడు మధూ... హార్టీ కంగ్రాట్స్...” అభిమానంగా భుజం చుట్టూ చేయివేసింది సుచిత్ర.

ఇంతలో ఉయ్యాల్లోంచి బాబు ఏడుపు వినపడింది... త్వరత్వరగా అక్కడికి వెళ్ళింది మధుబాల. బాబు పక్క తడిచేసి ఏడుస్తున్నాడు... త్వరత్వరగా వాడిని ఎత్తుకుని పాడైన నేపీని తీసి పక్కనే ఉన్న పొడి టవల్ తో తుడిచింది మధుబాల.

ఉయ్యాలలో తడిసిన బట్టలను తీసి బాత్రూమ్ లో బకెట్ లో వేసి వచ్చింది. సుగుణమ్మ అందించిన పొడి నేపీని వాడి మొలకు కట్టి, నేల మీదనే కూర్చుని, వాడిని అడ్డాలలో వేసుకుని జాకెట్ హుక్స్ విప్పి పాలివ్వసాగింది మధుబాల. అలవాటైన తల్లి పరిష్వంగం, స్పర్శ వాడికి భద్రతను కలిగిస్తున్నట్టు... ఉంగా ఉంగా శబ్దాలు చేస్తూ, ఆనందంగా పాలు తాగసాగాడు బాబి.

వాడిని మరీ మరీ ఎదకు హత్తుకుంటూ, కన్నీటిని అదుపులో పెట్టుకుంటూ... వాడి తల నిమురుతూ, కాళ్ళూ చేతులూ సవరిస్తూ కూర్చుంది మధుబాల. అరగంట తరువాత, వేణు వంటగదిలోకి వెళ్ళి తల్లితో ఏదో గుసగుసగా చెప్పి బయటకు వెళ్ళాడు. అతని బైక్ స్టార్ట్ చేసిన శబ్దం వినిపించింది.

“అమ్మా, మధూ... ఇదే మంచి తరుణం... వాడు ఏదో ఫోన్ కాల్ వచ్చిందనీ, అర్జెంట్ గా వెళ్లాలని, గంటలో వస్తానని, నిన్ను కదలనీయవద్దనీ చెప్పి వెళ్ళాడు... వాడికిప్పుడు  వెళ్ళటం ఇష్టం లేదు కానీ తప్పనిసరి అయిందట. నువ్వు బాబును తీసుకుని, టాక్సీ లో వెళ్ళిపో అమ్మా... మళ్ళీ నీ దగ్గరకు వచ్చి గొడవ చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తానని చెప్పు... తల్లిని, బిడ్డను విడదీసే హక్కు ఎవ్వరికీ, చివరికి ఆ బిడ్డ కన్నతండ్రికి కూడా లేదు. కొన్ని రోజులు సెలవు పెట్టి బిడ్డను కనిపెట్టుకో... వీలైతే మీ అన్నగారిని పిలిపించుకొని పుట్టింటికి వెళ్ళు... గొడవలన్నీ పోయి, మీ ఇద్దరి మధ్యా సామరస్యమంటూ ఏర్పడితే అప్పుడు ఇక్కడికి రావచ్చు... ఇంతకన్నా నేనేమీ చెప్పలేను... ఇదిగో వేడివేడిగా అన్నం తినేసి వెళ్ళు...” అంటూ కంచం లో అన్నం పెట్టి చారు పోసి, కూర పెట్టి అందించింది సుగుణమ్మ.

ఆమె సౌజన్యానికి మనసులోనే వేయి దండాలు పెట్టుకొని, రెండు నిమిషాల్లో అన్నం తినేసి, ఆమె పాదాలకు మ్రొక్కింది మధుబాల.
“వెళ్ళిరా మధూ... బాబు, నువ్వూ జాగ్రత్త...” ఆప్యాయంగా భుజం తట్టింది సుచిత్ర...

“థాంక్ యూ వదినా...” అప్రయత్నంగా ఆమె భుజమ్మీద తలవాల్చింది.

కాబ్ బుక్ చేసుకోగానే ఐదు నిమిషాల్లో వచ్చేసింది. అత్తా, ఆడబిడ్డలకు చెప్పేసి, బాబుతో సహా కారెక్కింది మధుబాల.

***

“నేను చెప్పిందేమిటి, మీరు చేసిందేమిటి అమ్మా?” ఆగ్రహంగా అరవయ్యో సారి ప్రశ్నించాడు వేణుగోపాల్. అప్పటికి అరగంట అయింది అతను ఇంటికి వచ్చి. రాగానే ఉయ్యాలలో బాబు, ఇంట్లో మధుబాల లేకపోవటంతో ఏం జరిగిందో అతనికి అర్థమై పోయింది. తల్లిని భస్మం చేసేలా చూసాడు. ఆవిడ లెక్క చేయలేదు. నిర్లక్ష్యంగా తనను కానట్టు ఊరుకుంది. అక్క మీద అరిచాడు. అభావంగా చూసి మౌనంగా ఉండిపోయింది సుచిత్ర.

బిడ్డను అడ్డం పెట్టుకుని మధుబాలను అట్టి పెట్టుకోవచ్చు అన్న అతని ఆలోచన ఇలా భంగపడేసరికి తట్టుకోలేక తల్లిని దూషించటం మొదలు పెట్టాడు. కడుపున పుట్టిన సంతు కన్నా బయటి నుంచి వచ్చిన వాళ్ళపై చూపే ప్రేమ తన తల్లికి తగదని చెప్పాడు. ఈ రోజు తప్పించుకున్నా, మళ్ళీ వెళ్లి బిడ్డను తీసుకువచ్చేస్తానని చెప్పాడు. అన్నీ వింటూ ఊరుకుంది సుగుణమ్మ.

గంట గడిచింది. అలసిపోయి, కుర్చీలో వెనక్కు జారగిల బడి కూర్చున్నాడు వేణుగోపాల్. అనుక్షణమూ కనుల ముందు పసివాడి ముద్దు ముఖం, బోసి నవ్వులూ కదలాడుతున్నాయి. రాక్షసి... తన బిడ్డను తన నుంచి వేరు చేయటానికి ఆమెకి ఏం హక్కుందని? ఎందుకో అకస్మాత్తుగా తండ్రి గుర్తు వచ్చి ఏడుపు ముంచుకు వచ్చింది... రెండు చేతుల్లో ముఖం దాచుకొని కన్నీరు కార్చసాగాడు...

అన్నీ చూస్తూనే ఉన్న సుగుణమ్మ మనసు నీరైపోయింది... చటుక్కున దగ్గరకు వచ్చి, దగ్గరగా నిలబడి, అతని ముఖాన్ని తన పొట్టలో దాచుకుంది.

“అమ్మా...” ఏదో తెలియని దుఃఖంతో రోదించాడు వేణు.

“ఎందుకు? ఎందుకమ్మా ఇలా అయింది? నాన్న మనల్ని విడిచి ఎందుకు వెళ్ళిపోయారు? ఇప్పుడు బుజ్జిగాడు కూడా మనకి దూరమై పోయాడా? మధూ ఎందుకమ్మా వెళ్ళిపోయింది? బాబును ఇక నేను ఎప్పటికీ చూడలేనా?” అంటూ ఏదేదో అడుగుతూ ఉంటే, ఆ ఉధృతి తగ్గే వరకూ అతని క్రాఫ్ లో చేతివేళ్లు దూర్చి, రాస్తూ ఉండిపోయింది సుగుణమ్మ.

“వేణూ, ఏదైనా స్నేహంతో సాధించాలి బాబూ... మధుబాల మీద పగ పెట్టుకుని నువ్వు చేసేదేం ఉండదు. చూడు, మొన్న  బేబీ కేర్ సెంటర్ నుంచి బాబును తీసుకు వచ్చేశావు. అది ఎంత నేరమో తెలుసా? నీ మీద కిడ్నాపింగ్ నేరం క్రింద మధు కేస్ పెడితే? మంచి అమ్మాయి కాబట్టి చట్టం ద్వారా కాకుండా తనంతట తాను  ఇక్కడికి వచ్చి బాబును తనతో తీసుకుపోయింది. కన్నతండ్రివి అయినంత మాత్రాన ఆ తల్లిని మానసిక క్షోభకు గురి చేసి పిల్లాడిని ఎత్తుకురావటం సబబు కాదు, గొప్ప కాదు...

చూడు, రెండు రోజుల స్పర్శకు నువ్వే బాబును వదిలి ఉండలేకపోతే, కన్న కడుపు... పాలిచ్చే తల్లి... తనకి ఎంత బాధాకరంరా ఆ వియోగం? వినత మాటలు వినకు... దానికి వంటి నిండా స్వార్థం నిండిపోయింది... అది చెప్పిన ప్లాన్లు అన్నీ అర్థరహితాలు... వివేకంతో ఆలోచించు నాయనా... పగతో సాధించలేనిది ప్రేమతో సాధించవచ్చు... అనవసరమైన పంతాలకు పోయి ఆఫ్టర్ ఆల్ రెండు లక్షల రూపాయల కోసం మధుకి పగవాడివి అయ్యావు... ఆ పిల్ల ఎంతో ఉత్తమురాలు... మీరిద్దరూ విడిపోతే, నువ్వే దురదృష్టవంతుడివి అవుతావు కానీ ఆ పిల్ల కాదు...

నేనూ నీకు శాశ్వతం కాదురా... మీ నాన్నగారి వెంటే నేనూ వెళ్ళిపోవలసిన దాన్ని... తల్లిలా నిన్ను చూసుకునే నీ భార్యను దూరం చేసుకోకురా బాబూ... తనకు  దగ్గరవటానికి ప్రయత్నించు... నీ తప్పులు ఎలా సరిదిద్దుకోవాలో, ఆమెకి ఎలా చేరువ కావాలో నువ్వే నిర్ణయించుకో... నీ తల్లిగా ఇంతకన్నా ఇంకేమీ చెప్పలేను...” కొంగుతో కన్నీరు తుడుచుకుంది సుగుణమ్మ.

ఏమీ మాట్లాడలేనట్టు కళ్ళు మూసుకుని అలాగే ఉండిపోయాడు వేణు.

***

మూడు నెలల అనంతరం ఆరోజు...

బయట బాగా వర్షం పడుతోంది.

డాలీ ఫ్లాట్ లో కూర్చుని తాగుతున్నాడు కార్తీక్. మనసును ఎవరో రంపం పెట్టి కోసేస్తున్నట్టుగా అనిపిస్తోంది. చిత్రం ఏమిటంటే ఎంత తాగినా అతని మనసులోని బాధ తగ్గటం లేదు.

డాలీ మీద ఉన్న మోహం కొద్దీ, ఐశ్వర్యను వదిలి ఇక్కడికి వచ్చేసాడు. డాలీకి ఉన్న స్నేహాలు, అఫైర్స్  తనకు తెలుసు. తనకూ డాలీ కాకుండా నిమ్మీ, సిమీ లతో అఫైర్స్ ఉన్నాయి. కానీ అవి కేవలం కాలక్షేపం మాత్రమే. డాలీ అందం, శరీరం మీదున్న మోహం తనకి ఇంక ఎవరి మీదా కలగలేదు... ఈ మధ్య డాలీ ప్రవర్తన మరీ విశృంఖలంగా తయారైంది. నిన్న పబ్ కి తామిద్దరూ వెళ్ళారు. అక్కడ డాన్స్ చేస్తూ తన కళ్ళ ముందే ఇద్దరు కొలీగ్స్ తో చాలా విచ్చలవిడిగా ప్రవర్తించింది డాలీ... అంతే కాక, వాళ్ళతో కలిసి కారులో ఎక్కడికో వెళ్ళిపోయింది...
తన జీతం, సేవింగ్స్ అంతా డాలీ కోసమే ఖర్చు పెట్టాడు తను. ఆమె కోసం రోజూ వంటలు చేసి పెట్టాడు. ఇతర స్త్రీల వంక చూడటం మానేసాడు కూడా. అయినా   ఆమెకి ఈ మధ్య తనంటే నిర్లక్ష్య ధోరణి ప్రబలమై పోయింది.

‘నిజం చెప్పు, డాలీని నువ్వు ప్రేమించావా?’ మనసు అతన్ని నిలదీసింది.

‘ఊ... ఏమో నాకు తెలియదు...’

‘కాదులే, నిజం చెప్పు... ఆమె బావుంటుంది... ఎక్కడి అవయవాలు అక్కడ అమర్చినట్టు సొంపుగా ఉంటాయి... ఆమెతో శారీరక అనుభవం మరింత బాగుంటుంది... సిగ్గు అనేది పడకుండా, మగవాడికి ఎలా ఇష్టమైతే అలా ప్రవర్తిస్తూ, శృంగార పూరితమైన మాటలతో రెచ్చగొడుతూ... నిన్ను సుఖాల అంచున నిలబెడుతుంది అని నీ భావన... ఆ ఒక్కటే నీవు ఆమెను ఇష్టపడటానికి కారణం తప్ప, నీది ప్రేమ కానే కాదు... కేవలం వ్యామోహమే...’

‘ఏమో మరి... కావచ్చు...’

‘మీరంతా పలాయన వాదులు... పెళ్ళి అనే బంధంలో చిక్కుకుంటే ఇలా ఇష్టం వచ్చినట్టు వ్యభిచరించకూడదు... ఇష్టం వచ్చినవాళ్ళతో కోర్కెలు తీర్చుకోవటానికి వీలు కాదు. బంధాలు, బాధ్యతలు ఏర్పడతాయి... ముద్దైనా, ముచ్చటైనా భార్య ఒక్కరితోనే... పిల్లా, పాపా పుట్టుకు వస్తారు... ఇల్లూ, సంసారం, పిల్లల చదువులూ, తిండీ తిప్పలూ... ఇలా ఎన్నో పనుల్లో రకరకాల విధులు నిర్వర్తించాల్సి వస్తుంది... అది తప్పించుకోవటానికే మీ యువత ‘లివిన్’ అంటూ పారిపోతున్నారు... మీకంటూ స్వంత అభిప్రాయాలు లేవు... లేవు గాక లేవు...’
మనసు రెచ్చిపోయి తనను నిలదీస్తుంటే, ఆ ఆలోచనలను ఆపుకోవటానికి టీవీ ఆన్ చేసాడు కార్తీక్. అతని తలపుల్లో ఐశ్వర్య కదలాడింది.
ఐశ్వర్య ఇలాగే ఉండేదా? ఉహు... ఐశు తనను నిజంగా ప్రేమించింది. ఎప్పుడూ తన డబ్బును ఆశించలేదు... ఎన్నో రకాల వంటలు చేసి, ఏ సమయంలోనైనా సరే కొసరి కొసరి వడ్డించేది... ప్రతీ వారం తలకు నూనె రాసి, నలుగు పెట్టి, తల అంటి స్నానం చేయించేది... తనకు ఎప్పుడేనా జ్వరం వస్తే అల్లాడి పోయేది.  ఆమెను ఒంటరిని చేసేసి తన దారి తాను చూసుకుని వచ్చేసాడు. తనసలు మనిషేనా? కనీసం స్నేహధర్మాన్ని అయినా పాటించలేదే!  ఆమె పేరు తలవటానికి అయినా తనకి అర్హత లేదు గాక లేదు...

***

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
nagalokayagam