Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నాగలోక యాగం

గతసంచికలో ఏం జరిగిందంటే ..... http://www.gotelugu.com/issue179/514/telugu-serials/nagaloka-yagam/nagalokayagam/

 

‘‘చిత్తము స్వామీ. ఇది తమ ఆనతిగా భావించి ఆచరింతుము గాక’’ అంటూ భద్రా దేవి, ఉలూచీశ్వరి ఇరువురు భక్తితో ఆయనకు పాదాభివందనం చేసి ఆశీస్సు తీసుకున్నారు.

‘‘ఇక నేను పోయివత్తునా?’’ అన్నాడు మాధవ స్వామి.

‘‘చిత్తము స్వామీ. కాని నాదొక్క సందియము. తెలీక అడుగు చుంటి. అన్యధా భావించ వలదు’’ అంది ఉలూచీశ్వరి.

‘‘ఎంత మాట సుదతీ. అన్నుల మిన్నవు, నాగ రాజ తనయవు. నీ జనకుడు మా హరి భక్తుడే గదా. నీ సందియము తీర్చుట నా కర్తవ్యమై యున్నది. అడుగుము బాలికా. ఏమా సందియము?’’ దరహాసంతో అడిగాడు మాధవ స్వామి.

‘‘స్వామీ! హరి హరులు వేరు వేరు గదా. ఆ హరుని తరఫున మా కొరకు హరి భక్తులగు తమరు విచ్చేసి మాకింతటి ఉపకార మొనర్చుట కడు ఆశ్చర్యముననున్నది. దీని మర్మ మేమి స్వామీ’’ అంటూ అంత వరకు మనసును తొలుస్తున్న సంశయాన్ని బయట పెట్టింది ఉలూచీశ్వరి.

ఆ మాటలు వింటున్న భూతం ఘృతాచి ఉలికి పడి చేస్తున్న పని ఆపి పరుగు పరుగున వచ్చింది. ఆ మాటలు విన్న మాధవ స్వామి కూడ ఆమె అమాయకత్వానికి ముచ్చట పడుతూ ఫక్కున నవ్వేసాడు. భద్రా దేవి కూడ ఆయన ఏం చెప్తాడాని ఆసక్తిగా చూస్తోంది.

‘‘అహో.... ఎంతటి అమాయకురాలివమ్మా. రూప భేదమే గాని వారిరువురికిని భేదము లేదన్న సత్యమును నీ జనకుడు నీకెన్నడును చెప్పనే లేదా? భేద భావము మనలోనే గాని ఆ శివ కేశవులకు లేవమ్మా. తాము వేరు వేరనిపిస్తారు కాని ఇరువురును ఒకటే... తోడు దొంగలు. ఒకరిలో ఒకరుంటారు. హహహ’’ అని పెద్దగా నవ్వుతూ రెండు మెట్లు దిగి ఆకాశం వంక చూసాడు మాధవ స్వామి.

అర్థమయ్యీ అర్థం గానట్టున్న ఆయన మాటల సారాంశాన్ని జీర్ణించుకో లేక చేష్టలు దక్కి అలా చూస్తుండి పోయారు భద్రా దేవి, ఉలూచీశ్వరిలు.

మాధవ స్వామి ఆకాశం వంక చూసి మురళితో సైగ చేస్తూ` ‘‘వరుణ దేవా` ఎంత సేపని నీ జల ధారను పగ్గము పట్టి బిగించి ఉంచెదవయ్యా. ఇక చాలును వాటిని విడువుము. వచ్చిన కార్యము ముగిసినది. నేను నిష్క్రమించు తరుణమాసన్నమైనది. కానిమ్ము’’ అన్నాడు. అంతే`

ఒక్క సారిగా కుంభ వృష్టిగా మొదలయింది వాన. మెట్లు దిగి మురళి వాయించుకుంటూ ఆలయ ద్వారం వైపు అడుగులు సారించాడు మాధవ స్వామి. వర్షం హోరును మించి మురళీ రవం మనసును కొల్లగొడుతోంది. వెళుతున్న మాధవ స్వామిని ఆశ్చర్య సంభ్రమాలతో మండపంలో నిలబడి అలా చూస్తుండి పోయారు భద్రా దేవి, ఉలూచీశ్వరిలు. కారణం` అంత వర్షం పడుతున్నా ఒక్క వాన చినుకు కూడ మాధవ స్వామి మీద రాలటం లేదు. ఎవరో గొడుగు పడుతున్నట్టు ఆయన్ని చుట్టి వాన పడుతోంది గాని ఆయన్ని తడపటం లేదు. అంతే కాదు, ఆయన పాదాలను తాకి పులకిస్తూ వెనక్కి జారుతోంది వాన నీరు. ఆవరణ దాటి ప్రవేశ ద్వారం వరకూ వెళ్ళాడాయన. ద్వారానికి బీగాలు వేసున్నాయి. అయినా చూస్తుండగానే ఆయన ఎటు వెళ్ళాడో కన్పించ లేదు. చీకట్ల మాటున గోచరం కాలేదునుకున్నారు యువతులిరువురూ.

ఇంతలో భూతం ఘృతాచి నేలకు పడి పడి దండాలు పెడుతూ చిన్నగా రోదిస్తుంటే అచ్చెరు వొంది అటు చూసారు. ఇంత క్రితం ఎక్కడ మాధవస్వామి నిలబడున్నాడో అక్కడ ఆయన పాదాలు తాకిన చోటును భక్తితో మొక్కుతోంది ఘృతాచి.

‘‘ఘృతాచి... ఏమైనది నీకు?’’ అనడిగింది భద్రా దేవి.

‘‘నాకేమియు కాలేదమ్మా. మీకే అర్థము గాకున్నది’’ అంది ఘృతాచి.

‘‘ఆ స్వామి మాటల మర్మాన్ని తెలుసుకో లేక పోతిరి గదా. ఆయన హరి భక్తుడు కాదమ్మా. సాక్షాత్తూ ఆ శ్రీహరే. ఆయనే కేశవుడు, మాధవుడు, అవతార పురుషుడు, పురుషోత్తముడు సాక్షాత్తూ ఆ వేణు గోపాలుడు’’ అంది.

ఆ మాటలు వింటూనే` పడతులిరువురూ కొయ్యబారి పోయారు.

మాధవ స్వామి మాటల మర్మం ఏమిటో కొద్ది కొద్దిగా అవగతం కాసాగింది. కట్టెదుట ఉన్న స్వామి అసలు రూపాన్ని గుర్తించ లేక పోయిన తమ అవివేకానికి ఖిన్నులయ్యారు.

ఆ పురుషోత్తముని పాదాలు తాకిన చోటును ఇప్పుడు ఘృతాచి తో బాటు భద్రా దేవి, ఉలూచీశ్వరిలు కూడ తాకి భక్తి ప్రపత్తులతో ఆయన్ని స్మరిస్తూ ప్రణమిల్లారు.

బయట కుండ పోతగా వర్షం పడుతూనే వుంది.

*****************************************************

బిల మార్గంలో పడి ఏటవాలుగా జారి పోతున్నాడు ధనుంజయుడు. దిగువకు... ఇంకా దిగువకు... ఎన్నో మెలికలు, మలుపులు తిరుగుతూ చాలా దూరం వెళ్ళి పోయాడు. బిల మార్గం మలుపుల్లో ఇరుకు గోడకు గుద్దుకొని శరీరం హునమై పోతోంది. తనను తాను నిలదొక్కుకునే అవకాశమే లేక పోయింది. అలా చాలా దూరం సాగిన ఆ బిల మార్గం చివరకు ధనుంజయుని ఉన్నట్టుండి బయటకు విసిరేసింది.

శర వేగంతో దూసుకొచ్చిన ధనుంజయుని శరీరం కొద్ది సేపు గాలిలో గిరికీలు కొట్టి కొంత దూరం వెళ్ళి దబ్బున క్రింద పడి పోయింది. పడ్డ చోటు దట్టమైన ఇసుక ప్రదేశం గావటంతో బలమైన దెబ్బలేమీ తగల్లేదు గాని దూసుకొచ్చిన వేగానికి వెంటనే తెలివి తప్పి అచేతనంగా అలాగే ఉండి పోయాడు.

అలా ఎంతసేపు గడిచిందో అతడికి తెలీదు. ఎప్పటికో నెమ్మదిగా స్పృహలో కొచ్చాడు. కాని తను ఎవరు, ఏం జరిగింది ఏదీ గుర్తు లేకుండా పోయింది. నాలుక పిడచ కట్టుకు పోయి విపరీతమైన దాహం వేస్తోంది.

నెమ్మదిగా శక్తి కూడ దీసుకుని` లేచి కూచున్నాడు.

కను మూసుకుని తదేకంగా ఆలోచించాక అప్పుడు క్రమంగా ఒక్కటొక్కటిగా జరిగిన సంఘటనలు గుర్తుకు రానారంభించాయి. ఎప్పుడైతే గతం గుర్తుకొచ్చిందో చట్టున కనులు తెరిచి పరిసరాల మీద దృష్టి సారించాడు.

అది ఏ ప్రాంతం?

తను ఎక్కడున్నాడు?

పైన సూర్యుడు గాని చంద్రుడు గాని తారకులు గాని కాన రావటం లేదు. చిమ్మ చీకటి. కాని ఎచటి నుండో నక్షత్రాల వెలుగుల వంటి నీలి రంగు కాంతి రేఖలు చీకటి కల గలిసి పరిసరములన్తటా వ్యాపించి ఉంది. కనులు చికిలించి కొద్ది సేపు ఆ వెలుతురుకి అలవాటు పడ్డాక కొంత మేర వీక్షింప గలుగుతున్నాడు.

చూడ్డానికి అదేదో ఎడారి ప్రాంతంలా వుంది.

ఎక్కడా చెట్టు చేమ జాడ లేదు.

తన వెనుక తట్టున చాలా ఎత్తు వరకు వరుసగా పేర్చినటుల అనేక రాతి పొరలు దర్శనమిస్తున్నాయి. వాటిలో ఎక్కడో పైన బిల మార్గం గుండా వచ్చి తనిక్కడ పడ్డాడు. వెలుగు అతి తక్కువగా వున్నా గాలి మాత్రం ధారాళంగా వీస్తోంది. చల్లటి శీతల గాలులు సేద తీరుస్తున్నాయి. కాని దాహం తీర్చుకునేందుకు ఎక్కడా నీటి జాడలు కన్పించటం లేదు.

కొంత సమయం తర్వాత`

తనకు ఎడం పక్కగా సుదూరంలో అనేక దీప కాంతులతో కూడిన సౌధాలు గోచరమయ్యాయి. అక్కడేదో నగరం వుంది. తను అక్కడికి చేరుకో గలిగితే ఇది ఏ ప్రాంతమో తెలిసే అవకాశం వుంది. అలాగే ఇక్కడి నుండి బయట పడేందుకు సాయం లభించవచ్చు. ఖచ్చితంగా ఇది భూలోకం మాత్రం కాదు. ఆ ధూర్తుడు వక్ర దంతుడు తిరిగి తను భూ లోకం చేరకుండా నిరోధించేందుకు తెచ్చి అధో లోకాల్లో ఎక్కడో పడేసి పోయాడు.

శివాలయమున ఏమి జరిగినదో ఇప్పుడిప్పుడే గుర్తుకొస్తోంది. దైవ సన్నిధి లోనే వాళ్ళు ఇంతకు తెగించెదరని తను వూహించ లేక పోయాడు. ముందుగా పొట్టి వాడొకడు తన వెనక నుంచి పిలిచాడు. వాడి నెత్తిన శంఖం బోర్లించినట్టు విచిత్రమైన కొమ్ము వుంది. వాడే తన ముఖం మీద చేయి ఆడించి తెలివి తప్పించాడు. చివరి క్షణంలో తనను భుజాన వేసుకుంటున్న వక్ర దంతునీ గుర్తించాడు. కాని తను వాళ్ళని ఏమీ చేయ లేని నిస్సహాయుడయ్యాడు. భద్రా దేవి తన  పక్కనుంటే యిలా జరిగేది కాదేమో. కాని వాళ్ళిద్దరూ స్త్రీ వరుసలో ముందుండి తనను గమనించ లేదు.

వదులు వదలని ప్రియసఖిలిరువురూ వారించినా వినక శివ దర్శనార్థం వచ్చినందుకు తనకు యిలా జరిగినదేమిటి? ఆ నీల కంఠుని దయ తప్పినదా. ఇంత జరుగుతున్నా మిన్నకుండినాడు? ఆలయాన తనను గానక భద్రా దేవి, ఉలూచీశ్వరిలు ఎంతగా దుఖ్ఖించారో గదా. ఎంతగా తత్తరిల్లుచున్నారో. ఏమైనదో గదా. అహో...

తనకు కొద్ది దినముల కిందట ఏర్పడిన దుస్స్వప్నము ఇంతగా యదార్థము గావలెనా! ఇప్పుడేమిటి తనకు దారి? వలచి వలపించుకొని తననే నమ్ముకున్న ప్రాణ సఖియలకు దూరమైతినే... దివ్య నాగమణి కోసం బయలు దేరిన తను ఈ తెరంగున భ్రష్టుడ నైతి నేమి?

పుట్ట వ్రణ బాధ నుండి జనకుని విముక్తుని గావించి కన్న రుణము తీర్చుకోలేని అ శక్తుడనైతినే. దైవమా... నిరంతరము పూజలు సలుపుచూ క్షణమొక యుగంగా తన కొరకు ఎదురు చూచు కన్న తల్లిని తిరిగి దర్శించ లేని అభాగ్యుడ నైతినే. హతవిధీ! ఇప్పుడు నాకు దారేది? ఏ తెరంగున తిరిగి భూలోకము చేర గలను? హే శంకరా ఎందుకిలా జేసినావు. హే ప్రభూ మాధవా మధుసూధనా వేణుగోపాలా... సదా నిను ఆరాధించు వాడనే... నేనేం కావాలని మౌనం వహించితివి’’ అంటూ అందరినీ తలచుకొని చాలా సేపు పరిపరి విధాలా రోధించాడు.

కాని ఎంత ఏడ్చినా ఏమి ప్రయోజనం లేదు.

కన్నీళ్ళు కష్టాలను తీర్చవు.

త్వరితమున ఇట నుండి బయట పడు మార్గము చూడ వలె. అయిననూ మేరు నగ సమాన ధీరుడగు తనేమిటి ఇలా భీరువులా తల్లడిల్లుట ఏమి? మహా వీరుడనిపించుకున్న ధనుంజయుని కంట కన్నీరా! అంతా మన మంచికే అనుకుంటే ఏ కష్టము బాధించదు గదా. ఏమో! ఆ జగన్నాటక సూత్ర ధారి మురళీ మోహనుడు ఏ ప్రయోజనము నాశించి తన చేయి విడిచినాడో... చూచెదను గాక. ముందు ఈ దాహార్తి తీరవలె...

తనకు తానే ధైర్యం చెప్పుకొంటూ` కన్నీరు తుడుచుకున్నాడు.

చిన్నగా శక్తి కూడదీసుకుని లేచి నిల బడ్డాడు. ఒడంతా హీనమై శక్తి హీనుడుగా వున్నాడు. ఆ పైన క్షుద్బాధతో బాటు దాహార్తి. అలానే పడుతూ లేస్తూ దూరంగా గోచరిస్తున్న దీప కాంతులతో కూడిన నగరం దిశగా బయలు దేరాడు.

ఇప్పుడు తను నిరాయుధుడు.

ఉదయం దైవ దర్శనార్థం పోతూ కృపాణంతో సహా ఆయుధాన్నీ తన అశ్వం గరుడ చెంతనే ఉంచేసాడు. రానున్నది ప్రమాదమైనా, ప్రమోదమైనా ఎదుర్కొనక తప్పదు. అసలిచట పగలు రాత్రియను బేధమున్నదా? అలాంటి సూచనలే అగు పట్టకున్నవే... ఆలోచిస్తూ ముందుకు సాగి పోతూనే వున్నాడు. ఆ చిరు చీకట్ల లోనే సుమారు వేయి ధనువుల దూరం వచ్చేసాడు.

ఇంతలో దవ్వుల అలికిడి విన్పించి ఆగి పోయి చుట్టూ చూసాడు. తనకు ఎడం పక్కగా రెండు అశ్వాలు దుమ్ము తెరలు రేపుతూ తన వైపు దూసుకు రావటం కన్పించింది. బాహుశ అక్కడి భద్రతా దళాలకు చెందిన అశ్వికు కావచ్చనుకున్నాడు. వారిని అడిగితే వివరాలు తెలుస్తాయి. ఆ పైన దాహార్తికి మంచి నీరు లభిస్తుందన్న ఆశతో అలా నిలబడి చూడ సాగాడు.

క్రమంగా అశ్వాలు సమీపిస్తున్నాయి.

చిరు చీకట్లు నీలి రంగు కాంతి కలగలిసిన వెలుగులో అవి సమీపించే వరకు స్పష్టంగా చూడ లేక పోయాడు. చూడ గానే ఆశ్చర్య సంభ్రమాలతో నిశ్చేష్టుడై కను రెప్పలు మూయటం కాసేపు మరిచి పోయాడు.

అవి రెండూ అశ్వాలే. కాని వాటి మీద అశ్వికులు విడిగా లేరు. అశ్వ శిరస్సులకు బదులు ఆ స్థానంలో పురుషాకృతి కన్పిస్తోంది. అంటే` అశ్వం జూలు భాగం నుండి పైన నడుం వరకు పురుష రూపం వుంది. శిరస్సు మెడ భుజాలు రెండు చేతు ఛాతీ భాగాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. అసలిది ఏ లోకము? వీళ్ళని ఏమనాలి? అశ్వాలు అనాలా పురుషులు అనాలా లేక అశ్వ పురుషులని పిలవాలా. విచిత్రమైన రూపాలు. అబ్బుర పడి వీక్షిస్తున్నంత లోనే ధనుంజయుని సమీపం లోకి వచ్చేసాయి అవి. వాళ్ళ తల పైన తల పాగా చుట్టుకున్నారు. ఆ తల పాగా మీద బంగారు నక్షత్రం బిళ్ళ గుచ్చ బడి తళతళ మెరుస్తోంది. ఒక చేతిలో కొరడా రెండో చేతిలో బరిసె ఆయుధాలుగా ధరించి వున్నారు. ఇరువురికీ మెడలో సొర కాయ బుర్ర లాంటి వెండి పాత్ర వేలాడుతోంది. బహుశ త్రాగేందుకు వెంట నీరు తెచ్చుకొనుండాలి. ఆ అశ్వ పురుషు ముఖాలు వికృతంగా వున్నాయి. చూపు కౄరంగా వున్నాయి. వస్తూనే కొరడాలు ఝుళిపిస్తూ ధనుంజయుని చుట్టూ వృత్తాకారంలో మూడు సార్లు పరుగెత్తి పరిశీలిస్తూ చెరో పక్క ఆగి గ్రుచ్చి చూసారు. ఒక అశ్వ పురుషుడు ఏదో అడిగాడు. డబ్బాలో గులక రాళ్ళు పోసి ఆడిస్తున్నట్టు కంఠ స్వరం వికారంగా వుంది.

ధనుంజయుడు తనకు తెలిసిన నాలుగయిదు భాషల్లో చెప్పి చూసాడు. వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళ భాష ధనుంజయునికి అర్థం కాలేదు. తనకు దాహంగా వుందని మంచి నీరు కావాలని సైగతో సూచించాడు. వాళ్ళు మంచి నీరు యివ్వటానికి బదు కొరడాలు లేపారు. వూహించని పరిణామం. కొరడా వంటిని చుట్టి వచ్చే సరికి చుర్రు మంది ఒళ్ళు. భగ్గున మండింది ధనుంజయుని ఆగ్రహం. రెండో వాడి కొరడా మీది కొస్తుంటే దాన్ని ఒడిసి పట్టుకున్నాడు. దాన్ని అలానే పట్టుకుని ముందుగా తనను కొట్టిన వాడి అశ్వ శరీరం కాళ్ళ మీద ఎగిరి తన్నాడు. అంతే` ప్రాణం పోతున్నంత బాధతో విరుచుకు పడి నాలుగు కాళ్ళు తన్నుకుంటూ పెడ బొబ్బలు పెట్టాడు వాడు.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
kadali