Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kadali

ఈ సంచికలో >> సీరియల్స్

అతులిత బంధం

 

గతసంచికలో ఏం జరిగిందంటే.... http://www.gotelugu.com/issue179/512/telugu-serials/atulitabandham/atulitabhandham/


“అత్తయ్యా, బాబుని మీ చేతుల్లో పెడుతున్నాను. తప్పని సరి కావటం వలన, మీరు మరీ మరీ రమ్మని చెప్పటం వలనా ఇక్కడికి వచ్చాను... నా మనసు ఇంకా కుదుట పడలేదు... అంచేత... అంచేత...”

“చెప్పమ్మా మధూ... ఏమీ సంకోచ పడకు...”

“కొన్నాళ్ళపాటు మీ గదిలో పడుకుంటాను... ఈ విషయంలో నన్ను బలవంత పెట్టకండి...” దీనంగా అన్నది మధుబాల.

అర్థం చేసుకున్నట్టుగా తల పంకించింది సుగుణమ్మ. కొడుకు మీద రవంత జాలి వేసింది కానీ, ‘కాలమే అన్ని సమస్యలకూ పరిష్కారం చూపించగలదు’ అనుకొంది.

మనవడు ఇంటికి వచ్చిన శుభ సందర్భంగా ఆరోజు భోజనంలోకి పాయసం చేసింది.

వేణుకి కూడా, కొడుకును ఎత్తుకుని మధు ఇంటికి వచ్చేసినందుకు ఎంతో సంతోషం కలిగింది. మధు తనతో మాట్లాడకపోయినా పెద్దగా బాధ అనిపించలేదు... ఇద్దరి మధ్యా అపార్థాలు పోవటానికి కొంచెం సమయం పడుతుంది. ఆమె ఇంట్లో మళ్ళీ తిరుగుతూ ఉంటే హాయిగా అనిపిస్తోంది.  ఇక తాను బాబుకి దూరంగా ఉండిపోనక్కర లేదు... బాబిని ఎత్తుకుంటుంటే అతని గుండె పితృ గర్వంతో ఉప్పొంగుతున్నది.

అతనికి చాలా చికాగ్గా ఉంది. ఆ రోజు కూడా బిల్డర్ అర్జెంట్ గా డబ్బు తెచ్చి కట్టమంటేనే బావమరిదిని డబ్బు కోసం తొందర చేసి తీసుకున్నాడు.    ఇప్పుడు సగం సగం అపార్ట్మెంట్ కట్టి, డబ్బు తీసుకుని ఆ బిల్డర్ పరారీ అయిపోయాడు. మొత్తం యాభై లక్షలు తానిచ్చినవి... వాడు ఎప్పుడు దొరుకుతాడో, అసలు తన డబ్బు వెనక్కి వస్తుందో లేదో తెలియదు... డబ్బు పోయినందుకు చాలా బాధగా ఉంది కానీ, దాన్ని అధిగమించేందుకు, కోపాన్ని చిరాకును అణచుకోవటానికి ధ్యానం చేయటం అలవాటు చేసుకుంటున్నాడు.

మధుబాలను చూస్తూంటే అతనికి పెళ్ళైన తొలిరోజులు గుర్తు వస్తున్నాయి. తమ హనీమూన్ గుర్తు వచ్చింది. మధు కోడలిగా ఆ ఇంట అడుగుపెట్టిన రోజుల్లో, మహాలక్ష్మిలా ఆమె ఇంట్లో తిరుగుతూ ఉంటే, ఆమ పద మంజీర నాదాలు తన గుండెల్లో మ్రోగుతూ ఉంటే...  ఎంత బావుండేవో ఆ రోజులు... తనకి వేరే అమ్మాయిలు  తెలియరు. నిజానికి తాను అంత రొమాంటిక్ పర్శన్ కాదు కూడా... అలాంటిది మధు సంబంధం వచ్చిన వెంటనే బిర్లా మందిర్ లో ఆమెను కలిసిన తొలి క్షణాలు ఏమిటో కానీ, మనసు ఆమె వశం అయిపోయింది... కాకపోతే తన  నెత్తి మీదనే తిష్ట వేసుకున్న ‘కోపం’ అనే దేవత వలన, వినత చెప్పిన మాటలు విని, ఆ గుడ్డి ప్రేమ వలన మధును దూరం చేసుకున్నది తానే... వేణు మనసు బాధగా మూల్గింది.

***

“ఏమిటిది  బావా, కూరగాయలతో యుద్ధమా?” పరిహాసంగా అన్నాడు పవన్ ఎదుట కూర్చంటూ వేణు. ఉల్లిపాయలు చాకుతో కోస్తున్న పవన్ కళ్ళ వెంబడి నీళ్ళు కారుతున్నాయి. కళ్ళు నులుముకుంటూ అవునన్నట్టు నవ్వాడు.

“ఏమైంది, మీ వంటామె  సావిత్రి లేదా?”

“లేదు బావా... వాళ్ళ తల్లిగారు చనిపోతే ఊరికి వెళ్ళింది...”

“మరి వినత? వినతను తరిగి ఇమ్మనలేక పోయావా?”

“వినత ఎక్కడుంది బావా? నాలుగు రోజులు అయింది ఫ్రెండ్స్ తో 'అరకువేలీ టూర్ కి వెళ్ళి... రేపు అక్కయ్య వస్తోంది... నేను ఆఫీస్ కి లీవ్ పెట్టి వంట చేస్తున్నాను... వినతను టూర్ పోస్ట్ పోన్ చేసుకోమని ఎంత బ్రతిమిలాడినా వినలేదు...” శుష్కంగా నవ్వాడు పవన్.

మొట్టమొదటి సారిగా పవన్ వైపు నుంచి ఆలోచిస్తే వినత ప్రవర్తన చాలా విరుద్ధంగానూ, తనకు  అవమానకరంగానూ  అనిపించింది వేణుకు. తనూ, తల్లీ కలిసి అతి గారాబం చేసి వినతకు ఆడింది ఆటా, పాడింది పాటా అయ్యేలా చేసారు. దాంతో మొండిగా తయారైంది... తన గురించే తప్ప ఎదుటివారి గురించి ఆలోచించటం మానేసింది.

“అయామ్ సారీ బావా... అదిలా తయారవటానికి కారణం తొంభై శాతం నేనే... నన్ను క్షమించు...” పవన్ రెండు చేతులూ పట్టేసుకున్నాడు పశ్చాత్తాపంతో వేణు.

“ఇట్స్ ఆల్రైట్ బావా... మా ఖర్మ ఇలా ఉంటే నువ్వు మాత్రం ఏం చేస్తావ్?” అని తరిగిన కూరలతో పాటుగా వంటింట్లోకి నడిచాడు పవన్.

“అత్తయ్య ఎలా ఉన్నారు?” గిల్టీ గా ఫీల్ అవుతూనే అడిగాడు వేణు.

“ఫర్వాలేదు... నిద్రపోతున్నట్టుంది...” ముక్తసరిగా చెప్పాడు పవన్.

వేణుకి మాత్రం, ‘ఇంక నువ్వు వెళ్ళొచ్చు’ అని చెప్పినట్టు అయింది. బరువుగా నిట్టూరుస్తూ లేచి వెళుతున్నానని చెప్పి, అక్కడనుండి ఇంటికి వచ్చేసాడు.

ఇంటికి వచ్చేసరికి, సోఫాలో కూర్చుని టీవీ లో రామాయణ ప్రవచనం వింటున్న తల్లీ, వంటింట్లో నిలబడి, స్టవ్ మీద గిన్నెలో  కూర కలుపుతున్న భార్యా కనిపించారు. వినతకీ, మధుకీ ఉన్న వ్యత్యాసం బాగా అర్థమైంది వేణుకి.

***

ఆఫీసుకు రాగానే ఐశ్వర్యకు బాస్ నుంచి కబురు వచ్చింది.

“నిన్న రాత్రి మీ కొత్త టీం లీడర్ జాయిన్ అయాడు... వెళ్లి కలిసి రా ఐశ్వర్యా...”

“ష్యూర్ సర్...” చెప్పి టీం లీడర్ డెస్క్ దగ్గరికి వచ్చి వెయిట్ చేస్తూ  కూర్చుంది. సీట్ ఖాళీగా ఉంది...

“యస్... వాట్ కాన్ ఐ డూ?” చిరపరిచితమైన గొంతు వినగానే చివ్వున తలెత్తి చూసి ఆశ్చర్యపోయింది. అటు అతని పరిస్థితీ ఇంతే...

“ఐశూ... నువ్వు... నువ్విక్కడ?”

“నేను వారం క్రితం ఇక్కడ జాయిన్ అయ్యాను... అయితే నువ్వు కూడా...”

“అవును... రాత్రి జాయిన్ అయ్యాను...” నవ్వాడు కార్తీక్.

“పాత కంపెనీలో బోర్ కొట్టేసింది... కొత్త ఫర్మ్ లో చేరి, కొత్త జీవితం ప్రారంభించాలని...” గంభీరంగా అన్నాడు.

“సరే... ఆల్ ది వెరీ బెస్ట్... మిమ్మల్ని కలవమని యం డీ చెప్పారు...”

“అందరూ రానీ... కొన్ని డిస్కషన్స్ చేయాలి... అందాకా నువ్వు నీ సీట్ లోనే కూర్చో... నేను పిలుస్తాను...” చేతిలోని ఫైల్ తీసి స్టడీ చేయసాగాడు కార్తీక్.

అతని వైపు ఓ సారి చూసి తన సీట్ కి వచ్చేసింది ఐశ్వర్య.

‘ఇప్పుడు ఈ ఫర్మ్ లో కంటిన్యూ అవటమా? మరో జాబ్ చూసుకోవటమా?’ డైలమాలో పడింది...

‘ఎందుకు మరో జాబ్ చూసుకోవాలి? కష్టపడి, అన్ని రౌండ్స్ దాటి వస్తే, జాబ్ చేతికి వచ్చింది. అతనికోసం దీన్నెందుకు వదులుకోవాలి? అతని పని అతనిది, నీ పని నీది... నువ్వు అనవసరమైన టెంప్టేషన్స్ పెట్టుకోకుండా నిగ్రహం గా పని చేసుకో...’ ఎవరో చెప్పినట్టు అనిపించింది... సిస్టం ఆన్ చేసి, వర్క్ మొదలు పెట్టింది ఐశ్వర్య... రెండు నిమిషాల్లో పనిలో లీనమై పోయింది.

***

డాలీ కార్తీక్ కి ఉద్వాసన చెప్పేసింది. తాను మరొక ఫ్రెండ్ ఫ్లాట్ కి షిఫ్ట్ అవుతున్నానని, నెలాఖరు కల్లా ఇప్పుడున్న ఫ్లాట్ ఖాళీ చేయాలి కాబట్టి, ‘నీ దారి నీవు చూసుకో...’ అని చెప్పింది. మన రిలేషన్షిప్ బ్రేక్ అవుతుంది అని చెబుతున్నప్పుడు ఆమె ముఖంలో ఎలాంటి భావమూ లేదు... చాలా మామూలుగా చెప్పింది. అంత తేలికగా తీసుకోలేకపోయాడు కార్తీక్.

“నిజంగా మనం విడిపోవాలంటే నీకేమీ బాధగా లేదా డాలీ?” అని అడిగాడు బాధగా...

“ఉహు... మనం కలిసి ఉండేది కొద్దికాలమే అని మనం కలిసినప్పుడే ఇద్దరికీ తెలుసు కదా కార్తీక్? నేను అలాంటి సెంటిమెంట్స్ పెట్టుకోను. నాకు నా ఆనందమే ముఖ్యం... అయినా... నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడు ఐశ్వర్య ఎలా ఫీల్ అయిందో నువ్వూ పట్టించుకుని ఉండవు కదా...” అంది తేలికగా తీసేస్తూ...

ఎవరో చెళ్ళు మని చెంప మీద కొట్టినట్టు అయింది కార్తీక్ కి.

‘నిజమే... ఎదుటి వారిని నొప్పించకుండా ఉండలేని తనకు ఇప్పుడు డాలీ తనను నొప్పించిందనే అర్హత లేదు... ఎల్లప్పుడూ బలవంతులదే రాజ్యం... అప్పుడు తనూ, ఇప్పుడు డాలీ మానసికంగా బలవంతులు...’ తనలో తానే అనుకున్నాడు.

ఆ రాత్రి అరుణ్ కి ఫోన్ చేసి, తాను కొద్ది రోజుల పాటు అమ్మా నాన్నలతో పాటుగా అరుణ్ ఇంట్లోనే ఉంటానని రిక్వెస్ట్ చేసాడు. సంతోషంగా ఆహ్వానించాడు అరుణ్. అమల కూడా కార్తీక్ కి ఫోన్ చేసి, త్వరగా వచ్చేయమని కోరింది. వాళ్ళ మంచితనం ముందు తానెంతో అల్పుడిలా తోచాడు తనకు తానే కార్తీక్.

***

వినతా, ఆమె స్నేహితురాళ్ళు అరకువేలీ వచ్చి రెండు రోజులు అయింది.  హైదరాబాద్ నుంచి ఫ్లైట్ లో విశాఖ వచ్చి అక్కడి నుంచి రెండు కార్లు తీసుకుని అరకు వచ్చారు. ఘాట్ రోడ్ లోకి ప్రవేశించ గానే రెండువైపులా చిక్కని, చక్కని పచ్చదనం... నీలి రంగు ఆకాశంలో తేలియాడే తెల్లని మబ్బులు... అనంతమైన ప్రకృతి సౌందర్యం. ప్రతీ పది నిమిషాలకీ ఆగి ఫోటోలు తీసుకున్నారు. దారికి రెండు వైపులా ఆకాశాన్ని అంటే పెను వృక్షాలు... వాటిని అల్లుకున్న బలమైన అడవి తీగలు... నిలువెల్లా ఆకు లేకుండా పూచిన రంగు రంగుల తరువులు...పసుపు రంగులో కొన్ని, నారింజ రంగులో కొన్ని... ఊదా రంగులో కొన్ని... వాటి అందం మనసును దోచేస్తూ ఉంటే, ఆ సొగసులను కెమెరాలో బంధించటంతో పాటుగా,  గుండెల్లో నింపేసుకోవటం మొదలు పెట్టారు వాళ్ళంతా...

ఆగుతూ ఆగుతూ బొర్రా గుహలు చేరే సరికి మధ్యాహ్నం అయిపోయింది. ప్రకృతి సహజంగా ఏర్పడ్డ గుహలు బొర్రా గుహలంటే...దట్టమైన దండాకారణ్యం లో కొండను తొలిచినట్టు ఏర్పడ్డ ఈ గుహలలో సున్నపు రాయి నుంచి వెలువడే కాల్షియం కార్బొనేట్ ద్రావణం గుహ పైకప్పు నుంచి నేల వరకూ రకరకాల ఆకృతిలో వ్యాపించి సుమనోహరమైన దృశ్యాలను ఏర్పరచింది.

ఇప్పుడంటే యాత్రా దర్శన శాఖ వారు దీపాలంకరణను లోపల ఏర్పాటు చేసారు కానీ, ముప్పై నలభై ఏళ్ళ క్రితం చీకటి గుయ్యారం లా ఉండేది లోపల...

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్