Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
vishala hrudayam

ఈ సంచికలో >> కథలు >> విజయ దుర్గ

vijaya durga

తెల్లవారుఝాము ఐదు గంటలు.
శివాలయంలో-
హరశ్చ బహురూపశ్చ, త్ర్యంబకశ్చాపరాజితః
వృషాకపిశ్చ శంభుశ్చ, కపర్దీ రైవతస్తథా
మృగవ్యాధశ్చ శర్వశ్చ, కపాలీ చ విశాంపతే
ఏకాదశైతే కథితా, రుద్రాస్త్రిభువనేశ్వరాః

ఏకనాథుడు కంచు కంఠంతో దేవాలయం ప్రతిధ్వనించేలా పాడుతున్నాడు. వింటున్న భక్తుల మనసులు పులకించిపోతున్నాయి.
ఏకనాథుడు ఆ శివాలయంలో తండ్రి తర్వాత వారసత్వంగా పూజారయ్యాడు. కేవలం వంశపారంపర్యంగానే కాదు, శివుడంటే అతనికి భక్తి, వల్లమాలిన అభిమానం. పూజలో లోటు జరగడం మాట అటుంచి కనీసం  ఆ ఆలోచన వచ్చినా తలడిల్లిపోతాడు. అహర్నీశలూ శివుడి చెంతే ఉండాలనుకుంటాడు. ఉంటాడు.

అదే సమయానికి అతనింట్లో-

య ఏకోవర్ణో బహుధా శక్తియోగాద్
వర్ణననేకాన్నిహితార్థో దధాతి
విచైతి చాంతే విశ్వమాదౌ చ దేవ
స నో బుద్ధ్యా శుభయా సంయునక్తు.

శైలు శృతిసుద్ధంగా పాడుతూ పార్వతీ దేవిని షోడశోపచారాలతో, రకరకాల పూలతో పూజిస్తోంది. ఇంట్లోని అత్తమామలు ఆమె నిత్యం చేసే పూజకి భక్తిపారవశ్యంలో మునిగితేలుతుంటారు. శైలు రెండేళ్ల క్రితం ఏకనాథుడి భార్యగా ఆ ఇంట్లోకి అడుగుపెట్టింది. భర్తకు తగ్గ భార్య.
పూజలో సంపూర్ణంగా లీనమైనా, ఆమె మనసును ఒక ఆలోచన దొలుస్తోంది. తన పెళ్లై రెండేళ్లవుతోంది. ఎక్కడికి, ఏ శుభకార్యానికెళ్లినా అందరూ అడిగే మాట ‘ఏమన్నా విశేషమా?’ అని, ఇంట్లో పెద్దవాళ్లు కూడా ‘నీ కడుపున ఓ కాయ కాస్తే చూడాలనుందమ్మా’ అనడమే. తనకూ తల్లి కావాలనే కోరిక ఉంది. కానీ తన భర్తకు సమస్తం శివుడే. పెళ్లయినప్పటి నుంచి ఓ అచ్చటా లేదు ముచ్చటా లేదు. పడక గదిలో కూడా శివుడు..భవుడు..శంకరుడి గురించిన ఆలోచనలే్..నిద్రలోనూ అవే కలవరింతలు! ఇహ ఆ ‘కార్యం’ జరిగేదెలా? తన కడుపున ఓ నలుసు పుట్టేదెలా?

ఆలోచనల్నుంచి బయటపడి శివపార్వతులకు నైవేద్యం పెట్టి, హారతిచ్చింది.

*****

కైలాసంలో-

"..ఏవండీ"

"ఊ.."

"మిమ్మల్నే..ఎప్పుడూ ధ్యానమేనా? కాస్త నా మాట కూడా వినిపించుకోండి"

"చెప్పు పార్వతీ"మూసుకున్న కళ్లను అర్ధనిమీలితం చేసి మంద్రంగా అన్నాడు.

"చూశారా? ఆ భక్తురాలి వేదన. మీరు ఏకనాథుణ్ని కాస్త వదిలితే..అతను భార్యతో కలిసి..ఆమె కడుపు పండిస్తాడు"

"నేను వదలడమేంటి? అతనే నన్ను వదలడం లేదు. భక్తితో కట్టి పడేశాడు"

"మీ మాటల గారడి ఆపి వాళ్లను కలిపే ఉపాయం చేయండీ. ఎప్పుడూ భూలోకం మీద పాపభారం ఎక్కువైతే విష్ణుమూర్తే అవతారాలు ఎత్తుతాడు. భూలోకంలో స్త్రీలను మానసికంగా, శారీరకంగా హింసించేవాళ్లు ఎక్కువైపోయారు. లైంగిక వేధింపులు, నిర్భయా కేసులు ఎన్ని చట్టాలు చేసినా తామరతంపరగా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు నేను అవతారం ఎత్తవలసిన అవసరం ఏర్పడింది. మదాందుల మదమణుస్తాను. స్త్రీ స్వాతంత్ర్యమర్హతి అని చాటి చెబుతాను. లోకానికి చూపుతాను. నా జననానికి శైలు గర్భమే సరైనదని ఎంచుకున్నాను. మీరు మన్మధుణ్ని పిలిచి, అతనితో ప్రియ సంభాషణలు గావించి అతని చెరకు వింటితో, విరుల బాణాలు ఏకనాథుడి మీద ప్రయోగింపచేస్తే..ఓ సృష్టి కార్యం జరుగుతుంది. ఏమంటారు?"అంది.

"ఇక్కడైనా(కైలాసం)..అక్కడైనా(భూలోకం)..ఎక్కడైనా(ఏ లోకమైనా) భార్య కరణేషు మంత్రే. చక్కటి మాట చెప్పావు" అని మన్మధుణ్ని మనసులో తలుచుకున్నాడు.

మన్మధుడు ప్రత్యక్షం అవగానే..కాసేపు సరదాగా మాట్లాడి.. అతని చెవిలో ఏదో చెప్పాడు.

మన్మధుడు తన చెరుకు వింటి నారిని సవరించుకుంటూ, నవ్వుతూ వెళ్లిపోయాడు.

అతను వెళ్లిపోయినా ఆప్రాంతం శోభాయమానంగా..సుగంధభరితంగా మారి..శివపార్వతుల మనసుల్లో ఏదో మధుర భావనలు రేకెత్తించింది. శివుడు పార్వతివంక చూశాడు. ఆమె సిగ్గుల మొగ్గ అయింది. కైలాసం సృష్టి కార్యానికి మరోసారి వేదికయ్యింది.

****

రాత్రి పదిగంటలు. శివాలయం తలుపులు మూసి ఇంటికి బయల్దేరాడు ఏకనాథుడు. చల్లగాలితో కూడిన వర్షపు జల్లుపడుతోంది. ఇంటికెళ్లే దారిలో పెద్ద పూలతోట ఉంది. గాలి అలలపై పూల సువాసనలు తేలివస్తూ అతని ఘ్రాణేంద్రియముద్వారా మనసులోకి ప్రవహించి ఏవేవో మధురోహలకు ప్రాణం పోస్తోంది. ‘ఎప్పుడూ లేంది ఇదేమిటా?’ అని ఓ పక్క ఆశ్చర్యం కలుగుతున్నా..మరోపక్క తెలియని వివశత్వం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

ఇంటికొచ్చిన ఏకనాథుడు బావి దగ్గరికెళ్లి శుభ్రంగా స్నానం చేశాడు. భర్తకు తుండుగుడ్డ తెచ్చిచ్చింది శైలు. వెన్నెల వెలుగులో భార్య అందం అతనిలోని మగాణ్ని సవాలు చేస్తోంది. శుభ్రంగా ఒళ్లు తుడుచుకుని పొడి బట్టలు కట్టుకుని ఇంట్లోకి నడిచాడు. అప్పటికే పెద్దవాళ్లు తిని నిద్రపోయారు.

భర్తకు కంచం పెట్టి తను చేసిన పదార్ధాలను కొసరి కొసరి వడ్డించి తినిపించింది. అమృతంలా ఉన్న పదార్ధాలను కడుపునిండా తిని తమ గదిలోకి వెళ్లాడు.

తనూ ఇంత తిని వంటిల్లు సర్ది తమ గదిలోకి అడుగెట్టింది. అంతే..

తలుపు చాటుగా నుంచున్న ఏకనాథుడు ఆమెని ఉద్రేకంతో..ఆవేశంతో..సునామీలా చుట్టేశాడు. అదేమాత్రం ఊహించని శైలు మొదట కంగారు పడినా..తర్వాత భర్తలో వచ్చిన మార్పు వల్ల హృదయ్యోల్లాసాన్నందింది. ఆమెలోని స్త్రీత్వం పురులు విప్పుకుంటోంది. అతనిలోని కాముడు విజృంభిస్తున్నాడు. ఆ రాత్రి వాళ్లు అనుభూతుల వర్షంలో తడిసి ముద్దయ్యారు. సృష్టికార్యాన్ని సఫలం చేశారు. ఆది దంపతులైనా..ఆ దంపతులైనా సృష్టి మనుగడకు కార్యసాధకులవవలసినదే!

*****

ఆ దంపతులకు సరిగ్గా విజయదశమినాడు పాప పుట్టింది. పేరు విజయ దుర్గ. ఆ ఇంట్లో వాళ్లకే కాదు ఊరు ఊరందరికీ ఆమె అంటే ప్రాణం. సాక్షాత్తు కనకదుర్గ.

ఆ ఊళ్లోనే కాదు చుట్టుపక్కల పది ఊళ్ల వరకు ఏ మగాడైనా ఆడపిల్ల జోలికి వచ్చాడంటే..ఎక్కడ్నుంచి వస్తుందో..ఎలా వస్తుందో తెలియదు కాని కళ్లలో నిప్పులు కురిపిస్తూ, సింహవాహినియై కదిలివచ్చి తాట ఒలుస్తోంది. మదకీచకుల కుత్తుకలు తెగనరుకుతోంది. ఫేస్ బుక్, వాట్సప్, పేపర్లలో, ఛానల్ టీ వీల్లో వార్త హల్ ఛల్ చేస్తోంది.

మహిళల్ని రక్షించాలని ప్రభుత్వాలు ఎన్నిప్రయత్నాలు చేసినా, చట్టాలుచేసినా అనుకున్న ఫలితాన్నివ్వకపోయినా, ఇప్పుడు మాత్రం మగాళ్లు తలొంచుకుని "స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం" అంటున్నారు.  ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో..అక్కడ దేవతలుంటారు..అన్న మాటను నిజం చేస్తూ..కైలాసంలోని పార్వతి భూలోకంలోని మార్పుకి మానసికోల్లాసినియై మనస్ఫూర్తిగా దసరా పూజలందుకోవడానికి తరలివస్తోంది. సిద్ధంగా ఉండండి.

సర్వేశాం స్వస్థిర్ భవతు
సర్వేశాం శాంతిర్ భవతు
సర్వేశాం పూర్ణం భవతు
సర్వేశాం మంగళం భవతు                           

మరిన్ని కథలు
dasara ante