Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఛండీఘర్ - హైమాశ్రీనివాస్ .

 రాక్ గార్డెన్ ----



1957 లో నేక్ చంద్ అనే ప్రభుత్వోద్యోగి తన ఖాళీ సమయంలో కర్మాగారాలలో , యిళ్లల్లో వుండే పనికి రాని వస్తువులను వుపయోగించి రకరకాలైన ఆకృతులను నిర్మించేడు . ఈ రోజు రాక్ గార్డెన్ గా పిలువబడుతూ 40 యెకరాల స్థలంలో మానవ నిర్మిత జలపాతాలు , సన్నని నీటి కాలువలతో పర్యాటకులను ఆకర్షిస్తోంది . ఈ ఆకృతులు కళాత్మకంగా వుండవు కాని పగిలిపోయు , వుపయోగయుక్తం కాని వస్తువులతో ఒకే మనిషి నిర్మించినదనే తప్ప గొప్పగా వుండదు .  ఈ ప్రదేశాన్ని కళాత్మకత కోసం చూస్తే మాత్రం నిరాశే మిగులుతుంది .

రోజ్ గార్డెన్---

1967 లో అప్పటి మన రాష్ట్రపతి జాకీర్ హాుసన్  గారి పేరు మీద నిర్మింపబడిన ఒక అద్భుతమైన ఉద్యానవనం , అన్ని రకాలయిన గులాబీలను చూడ్డం మనసుకి అహ్లాదాన్నిస్తుంది . సుమారుగా 30 ఎకరాలలో 50 వేల గులాబీ పొదలతో సుమారు 1600 ల గులాబీ రకాలతో నిర్మింపబడ్డ వుద్యానవనం . ఈ ఉద్యానవనంలో గులాబీలే కాక సుమారు 5 వందల రకాలయిన ఓషధి మొక్కలను కూడా పెంచుతున్నారు .  తప్పకుండా చూడవలసిన నగరాలలో చండీఘర్ నగరం ఒకటి .

దీంతో మన ఛండీ ఘర్ దర్శనం పూర్తయింది .

కశ్మీరు లోని ఖీర్భవాని

దేవీ నవ రాత్రులలో దేవీపూజ చేసుకోవడం , అమ్మవారిని రోజుకో అవతారంలో పూజ చేసుకోవడం మనకి ఆచారం . ఈ రోజు  మహారాజ్ఞి మందిరం గురించి తెలియజేస్తాను . మేము అష్టాదశ పీఠాలలో ఒకపీఠం అనివిని వెళ్లేం , అక్కడకి వెళ్లేక కాదు అని తెలిసింది , శక్తిపీఠం కూడా కాదు అన్నారు కాని మహత్తులు కలిగిన మందిరం అని మాత్రం అనిపించింది కాబట్టి మీకు కూడా పరిచయం చేస్తున్నాను .

పిఠాపురం లో పురుహూతికా దేవిని దర్శించుకున్నప్పుడు మందిరం గోడలపైన వున్న చిత్రాల ప్రకారం కాశ్మీరేతు సరస్వతి ని కాశ్మీరులో ఖీర్భవాని అని అంటారు అని చదివి అమర్నాధ్ యాత్రకు వెళ్లినప్పుడు ఖీర్భవానీని కూడా దర్శించుకుందామని బయలుదేరేం .

కాశ్మీరులో మేమున్న ప్రదేశం నుంచి ' తుల ముల ' ( ఖీర్భవాని మందిరం వున్న ప్రాంతం ) కి టాక్సీ మాట్లాడుకున్నాం , వున్న దూరం సుమారు 25 కిలోమీటర్లయినా మందిరం వున్న ప్రాంతం చాలా సెన్సిటివ్ జాగా కాబట్టి రానూపోనూ వెయ్యి రూపాయలు యివ్వవలసిన వచ్చింది . దాల్ లేక్ వెనుకనుంచి  ' హజ్రత్ బల్ ' మీదుగా కారు ఆగినపుడు యెవరు యేమడిగినా సమాధానం యివ్వద్దు అన్న మా టాక్సీడ్రైవరు మాటలు పాటిస్తూ ప్రయాణం చేసేం . చల్లని వాతావరణం లో ఆకాశాన్ని అంటుతున్నట్లున్న దేవదారు , చినార్ చెట్ల పక్కగా మధ్యమధ్య బాదంతోటలు దాటుకుంటూ సాగింది మా ప్రయాణం .

చినార్ అడవుల మధ్య వున్న చక్కని చిన్న మందిరం . కాలు కింద పెట్టగానే చలి శరీరాన్ని వణికించింది . గేటులోంచి లోపలికి వెళుతూ చిన్న నీటి కాలువను దాటుకొని లోనికి  వెళ్లేం . లోపల తటాకం మధ్యలో సప్తకోణ మందిరం , ఆ నిర్మాణం కొత్తగా అనిపించింది . చిన్న పాలరాతి మందిరం లో లింగాకారం లో వున్న అమ్మవారే మహరాజ్ఞి , రాజ్ఞి , రంజని , రాజ్ఞ భగవతి అనే నామాలతో పిలువబడే ఖీర్భవానీని దర్శించుకున్నాం .

మందిరం వున్న తటాకం నీటికాలువతో కలుపబడి వుంది . భక్తులు తమతో తెచ్చిన పసుపు కుంకుమ , పూలు , పాలు , చెక్కర తటాకం లో విడిచి పెడుతున్నారు . అదే అమ్మవారిని ఆరాధించుకొనే విధానం అన్నారు . అమ్మవారు తటాకంలోనే లభించేరు కాబట్టి అమ్మవారికి తటాకం మధ్యలోనే మందిరం నిర్మించేరని చెప్పేరు 

పూజారిని ' కాశ్మీరేతు సరస్వతి ' అంటే యీమేనా ? అని ప్రశ్నిస్తే కాదు అని సమాధానం వచ్చింది . సరస్వతి పాక్ ఆక్యుపైడ్ కశ్మీరులో వుందని ఖీర్భవాని శక్తిపీఠం కాదని చెప్పేరు .

మందిరం బయట ఖీర్ ( పాయసం ) అమ్మవారి ప్రసాదంగా యిచ్చేరు . ఇక్కడ అమ్మవారికి పాయసం నైవేద్యంగా సమర్పిస్తారు కాబట్టి స్థానికులు అమ్మవారిని ఖీర్భవాని అని పిలుస్తారు

చాలా మంది భక్తులు మందిర ప్రాంగణంలో వున్న చినార్ చెట్టుక్రిందన కూర్చొని ధ్యానం చేసుకోవడం కనిపించింది . ధ్యానం చేసుకోడానికి యింతకంటె మంచి ప్రదేశం మరొకటి వుండేదేమో అనిపించింది .

స్థానికులను మందిరం గురించిన వివరాలు అడుగగా తెలిసిన విషయాలు యేమిటంటే తటాకంలో నీరు రోజుకో రంగులో కనిపిస్తూ వుంటాయట , కాని యెప్పుడైతే నీరు ముదురు బురద రంగుకాని , నల్ల రంగు లోకి గాని మారితే దేశానికి అరిష్టం సంభవిస్తుందని నమ్ముతారు . 1984 లో ఇందిరాగాంధీ గారి హత్యజరిగడానికి ముందు యీ తటాకంలో నీరు నలుపు రంగులోకి మారడం కాశ్మీరులో ప్రజలు చూసేరని చెబుతారు .

తులముల అంటే కాశ్మీరు భాషలో మల్బరీ చెట్టు అని అర్దం , పూర్వకాలంలో యీ ప్రాంతమంతా మల్బరీ తోటలు వుండేవట అందుకని యీ గ్రామాన్ని తులముల అని పిలుచేవారట . కాశ్మీరీ పండితులు యీ ప్రదేశాన్ని అమూల్య తుల్యమని ( వెల కట్టలేనిది ) పిలువబడేదని కాలక్రమేణా గ్రామస్తుల నోళ్లల్లో పడి తులముల గా మారిందని అంటారు .

ఈ మందిర స్థలపురాణం గురించి చెప్పుకుందాం .

రావణాసురుడు కైలాసంలో ఘోరతపస్సుచేసి శివుని మెప్పించి శివుని ఆత్మలింగం పొంది లంకా పురికి తీసుకొని పోతూవుంటే దేవతల కుట్ర వలన ఆత్మలింగాన్ని పోగొట్టుకుంటూ వుంటాడు . ఒకమారు శివుని తన తపస్సు వలన మెప్పించి , శివుని ఆత్మలింగానికి బదులుగా పార్వతీదేవి ఆత్మస్వరూపాన్ని యిప్పంచమని అడుగుతాడు . అమ్మవారి ని లంకకు తీసుకొని పోతే పార్వతిని విడిచి వుండలేని శివుడు ఆమె వెనుకనే లంకకు వస్తాడనేది రావణాసురుని వ్యూహం . అలా అమ్మవారిని స్వరూపమైన మహరాజ్ఞి స్వరూపాన్ని లంకలో ప్రతిష్టించి పూజలు చెయ్యసాగేడు .  రోజు రోజుకు రావణాసురుని అకృత్యాలు చూస్తూవుంటే మహరాజ్ఞి అతనిని వారించలేక ఆ పాప భూమిలో వుండలేక  సీతమ్మవారి జాడ కోసం  వచ్చిన హనుమంతుని తనను అక్కడనుంచి తీసుకొని పోయి పవిత్ర నీటిజల వద్ద విడిచి పెట్ట మని కోరగా హనుమంతుడు దేవిని తీసుకొని వచ్చి తులముల ప్రాంతంలో విడిచి పెట్టేడట . ఆ ప్రాంతం లో సంభవించిన వరదల వలన అమ్మవారిని విడిచి పెట్టిన జల యెక్కడ వుందో తెలియరాలేదట .  క్రీశ్తు పూర్వం 5 వేల సంవత్సరాలకు ముందు కృష్ణ పండిట్ అనే యోగికి స్వప్నంలో  అమ్మవారు కనిపించి తానున్న ప్రదేశం యెరుక పరచగా అతను ఆ ప్రదేశానికి వచ్చి వెతుకుతూ వుండగా పెద్ద కృష్ణసర్పం నీటి ప్రవాహమునకు యెదరు యీదుతూ పోతూవుండడం చూసి ఆశ్చర్యముగా సర్పమును వెంబడించెనట . ఆ సర్పము ఖీర్భవాని ప్రస్తుత మందిర ప్రాంతంలో అంతర్ధానమైందట . ఆ ప్రాంతం లో మహరాజ్ఞి లింగరూపం లభించింది . అక్కడే మందిర నిర్మాణం గావించి పూజలు చేయనారంభించేడు .

క్రీశ్తు పూర్వం 1969 లో మహారాజా ప్రతాప్ సింగు పరిపాలన కాలంలో  తటాకంలో నీళ్లు శుభ్రపరుస్తూ వుండగా కిందన మందిర శిథిలాలు దేవతా మూర్తులు వుండడం చూసి వాటిని బయటకు తీయించి తిరిగి మందిర నిర్మాణం చేసేరు .

దుర్గా అవతారమే మహరాజ్ఞి . కశ్మీరు లో మహరాజ్ఞి ని వైష్ణవీ రూపంగాను , లంకలో శ్యామలా దేవి లేక సీత అవతారంగానూ భావిస్తారు .  ' రాజ్ఞీయ మహత్మ్యం ' ప్రకారం నవరాత్రులలో పంచదశి మంత్రం జపిస్తే అమ్మవారు భక్తులు కోరిన వరాలు ప్రసాదిస్తుందిట .

కల్హణుడు రచించిన ' రాజతరంగిణి ' లో తులముల ప్రాంతం పరమపవిత్రమైనదిగా వర్ణన వుంది .
స్వామి రామతీర్ధ , స్వామి వివేకానంద ఖీర్భవానీని దర్శించుకుని అమ్మవారి అనుగ్రహాన్ని పొందేరు . వేల సంవత్సరాల పూర్వం నుంచి కశ్మీరు పండిట్లకు ఆరాధ్య దైవంగా పూజలందుకుంటోంది మహారాజ్ఞీదేవి .

శీతాకాలంలో పూర్తిగా హిమపాతం జరిగే ప్రాంతం , అయినా నిత్యపూజలు జరుగుతూ వుంటాయి . యేడాది పొడువునా భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తూ వుంటారు .

చైత్ర నవరాత్రులు , దేవీ నవరాత్రులలో విశేషపూజలు జరుగుతూ వుంటాయి . భక్తులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారికి పూజలు నిర్వహిస్తూవుంటారు  .

ఎంతసేపు గడిపినా తనివి తీరని ఆ పరిసరాలను వదిలి రాలేక బలవంతంగా వెనుతిరిగేం .

పై సంచికలో మరో అద్భుతమైన అనుభవాలతో మీ ముందుంటానని మనవి చేస్తూ శలవు తీసుకుంటున్నాను .

మరిన్ని శీర్షికలు
stress reliefment tips