Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఇంతుంటే..ఇంత .. - భమిడిపాటి ఫణిబాబు

exaggerate

సాధారణంగా, మనం మాట్టాడే పధ్ధతిని బట్టి, అవతలివారు, మనల్ని అంచనా వేయగలుగుతారు. అందుకే , ఎప్పుడైనా సరే ఆచి తూచి మాట్టాడుతూండాలి. విషయం ఎంత పెద్దదైనా, చిన్నదైనా, మాటాడే పధ్ధతి ని బట్టి, exaggerate or light చేయొచ్చు. మన మనస్థత్వాన్ని బట్టి ఉంటుంది. జీవితం అంతా, తామే ఎంతో గొప్పవారిననీ, అవతలివారు ఎప్పుడూ, తమకంటే "తక్కువ" వారే అన్న అభిప్రాయంతో, మాట్టాడే వారు, జీవితంలో అవతలివారిలో " మంచి" అనేది ఎప్పుడూ కనిపించదు. ప్రతీదానికీ సణుగుడే.. ఓ అర్ధం పర్ధం అనేది ఉండదు.ఓ సామెత ఉంది, వినే ఉంటారు.." విస్సన్న చెప్పిందే వేదం.." అని.

కొంతమంది అర్భకులుంటారు. ఏ యాత్రకైనా వెళ్ళొచ్చి, ప్రసాదాలూ, వగైరా తెలిసినవారికి వెంటనే, ఇచ్చేస్తే సంతోషించేవాళ్ళు. ఏ కొత్త సంవత్సరమో అయితే, ఏ తెలుగు క్యాలెండరో కూడా జతచేసి, రెండూ కలిపి, ప్రత్యేకంగా, ఏ కారులోనో వెళ్ళి మరీ రావడం. ఇందులో వీళ్ళకి ఒరిగేదేమీ ఉండదు, ఓ రకమైన ఆత్మసంతృప్తి తప్ప. కారులో వెళ్ళారుకదా, అని, మరీ పెట్రోలు డబ్బులు అడుగుతారని కూడా కాదు. ఏదో, ఆనందంగా యాత్ర పూర్తిచేసికుని వచ్చామూ, తెలిసినవారితో విశేషాలు పంచుకుంటే, ఆ ఆనందం ద్విగుణీకృతం అవుతుందనే, కానీ, ఆ అవతలివారు, జీవితంలో యాత్రలే చేయలేదనీ, తెలుగు క్యాలెండర్ల మొహమే ఎప్పుడూ చూసినవారు కాదు అనీ, కాదు. తెలుగు ప్రాంతాల్లో, ఈ తెలుగు క్యాలెండర్లకీ, పంచాంగాలకీ కొదవ లేదు. కానీ, తెలుగేతర రాష్ట్రాల్లో , ఓ తెలుగు క్యాలెండరన్నా, పంచాంగమన్నా, తిథి,వార, నక్షత్రాలు చూసుకునే వారికి, మంచి బహుమతే మరి. ఇదివరకోసారి, మా కాలనీ లో ఉండే తెలుగువారు, ఉగాది సంబరాలు జరుపుకుందామనుకునేసరికి, తీరా కొత్త పంచాంగం, లేదని తెలిసేసరికి, తెలిసున్నవారందరిదగ్గరా అడగడం మొదలెట్టారు. నా దగ్గరుందని తెలిసి, దానితో పని కానిచ్చేశారు. ఏదో ఘనకార్యం చేశాననికాదు, ప్రవాసాంధ్రులకి, తెలుగు క్యాలెండర్లూ, పంచాంగాలూ ఎంత ముఖ్యమో చెప్పడానికి మాత్రమే. ఈ రోజుల్లో అయితే జనవరి ఒకటో తారీకుకి, ఇక్కడ వచ్చే తెలుగువార్తాపత్రికలతోపాటు, ఓ తెలుగు క్యాలెండరుకూడా, దొరుకుతూండడంతో, బాగానే ఉంది. కానీ, ఆ పేపరూ, ఉచిత క్యాలెండరూ ఒకటోతారీకు ప్రొద్దుటే వస్తాయి కానీ, ముందురోజుకు కాదుగా. ఇత్యాది కారణాలవలన, ఈ ఏడాది, మా యాత్రల ప్రసాదమూ, రాజమండ్రీలో మాకు దొరికిన తెలుగుక్యాలెండర్లూ, తీసికుని, మాకు తెలిసినవారి ఇళ్ళకు, ఓ టాక్సీలో వెళ్ళి, ఇచ్చొచ్చాము.

ఈ ఒకటో తారీకున, కొత్తసంవత్సరం తో పాటు, వైకుంఠఏకాదశికూడా కలిసొచ్చింది. ఈవేళ ప్రొద్దుటే ఓ ఫోనూ--" మీరిచ్చారుకదా అని, నమ్మకంతో, ఏకాదశి ఘడియలు ఎప్పటిదాకా ఉన్నాయో, అని చూసి మావారిని కంగారు పెట్టేశానూ, తీరా ఈవేళ్టి పేపరుతో వచ్చిన క్యాలెండరు చూస్తే, తెలిసిందీ, మీరిచ్చిన క్యాలెండరులో చాలా తప్పులున్నాయీ.." అంటూ.అక్కడికేదో, మా ఇంటావిడ, ఉద్దేశపూరకంగా, ఆవిడని misguide చేసిందనే అర్ధం వచ్చేటట్టు. మా ఇంటావిడ, తెగబాధపడిపోయింది, "అయ్యో పాపం.. అలాగా.." అంటూ. అప్పుడే, నేనూ, బయటకెళ్ళొచ్చి, ఈవారపు తెలుగు వారపత్రికలూ అవీ తెచ్చాను. వచ్చీరాగానే, తను విషయం చెప్పింది. బహుశా మేమిచ్చిన క్యాలెండరంతా తప్పుల తడకేమో. రాజమండ్రీ లో క్యాలెండర్లిచ్చిన పెద్ద మనిషికి ఫోను చేద్దామా అనుకుంటూ, పోనీ ఇంట్లో ఉన్న పంచాంగాలూ, "కాలనిర్ణయ్" తెలుగుక్యాలెండర్లూ, చూస్తే తెలిసిందేమిటంటే, ఆ ఏకాదశి ఘడియల విషయంలో , అన్నిటిలోనూ. ఏదో ఓ అరా, నిముషం తేడాగా, ఒకే టైమిచ్చారు. మా ఇంటావిడ ఊరుకోక, తిరిగి ఆవిడకి ఫోను చేసి, ఇంట్లో ఉన్న తెలుగుక్యాలెండర్లూ, పంచాంగాలూ ముందరేసికుని, విషయం చెప్పింది.ఏదో మొత్తానికి, సమస్య తీరిందనుకోండి. ఇక్కడ విషయం ఎవరి క్యాలెండర్లూ రైటూ, ఎవరివి తప్పూ అని కాదు. గతేడాది జరిగిన almost ప్రతీ పర్వదినం విషయంలోనూ, మన పండితులు కొట్టుకుంటూనే ఉన్నారు, టీవీ ల్లో చర్చలోటీ. అయినా పండగలూ ఆగలేదు, పబ్బాలూ ఆగలేదూ, ఎవరి పాండిత్యం వారు చెప్పుకున్నారు. అంతదాకా ఎందుకూ, గోదావరి పుష్కరాల విషయంలోనూ ఇదే తంతు. చెప్పొచ్చేదేమిటంటే, controversy ముందరా, తెలుగువాడు తరువాతా పుట్టారు, ఈ లోకంలో... ఏది తీసికోండి, ఏదో ఒక సమస్యే..అవతలివాడు చెప్పింది, మనం ఎందుకు వినాలీ ? That is the bottomline...

పైన వ్రాసిన విషయం అంటే ఘడియల తేడా, ఎప్పుడో కలిసినప్పుడు కూడా చెప్పొచ్చు.. అలా చెప్పడంవలన విషయం dilute కూడా అవొచ్చు, లేదా ఇంకో పండగ/ తిథి విషయంలో మేమిచ్చిన క్యాలెండరులో ఎన్నెన్ని "తప్పులు" ఉన్నాయో పరిశీలించి, ఏదో మాటల్లో ప్రస్తావించొచ్చు. కానీ, మా ఇంటావిడ చూస్తూన్న క్యాలెండరంతా "తప్పుల తడక " అని ఏకంగా నిర్ధారించేయడం,పనికట్టుకుని ఫోను చేయడం వగైరాలు అంతగా బాగుండలేదు. ఏదో "పుణ్యానికి వెళ్తే..." అన్నట్టు తయారయింది, మా ఇంటావిడ పరిస్థితి. దీనికంతా మూలకారణం ఏమిటంటారూ-- over enthusiasm. పైగా దీనివలన కొత్తగా నేర్చుకున్నదేమిటయ్యా అంటే, ఏ యాత్రలకైనా వెళ్ళొచ్చినా, ఎగరేసికుంటూ వెళ్ళఖ్ఖర్లేదని. ఏదైనా అనుభవం మీదే కదా తెలిసేదీ? ఈ ఇచ్చేవారికున్న అత్యోత్సాహం, తీసికుంటున్నవారికేమీ ఉండాలని లేదు.

ఉదాహరణకి ఎవరింటికైనా వెళ్ళినప్పుడు, పెళ్ళి ఫొటో ఆల్బమ్ములు తెచ్చి పడేస్తారు. అందులో ఉన్నవారెవరో మనకు తెలియదాయె, అలాగని చూడనంటే అదో గొడవా. ఇచ్చే కాఫీ మానేస్తారేమో అని ! అలాగే, ఇంట్లో ఉండే ఏ చిన్నపిల్లాడో, వాడికొచ్చిన విద్యలన్నీ ప్రదర్శింపచేస్తారు. ఈ ఇవతలివారు ఆ phaseలన్నీ దాటొచ్చినవారే అనికూడా గ్రహించకుండా. గ్రహించినా, "అన్ దేఖీ" చేసేయడం."ప్రతీరోజూ మనం భరించడంలేదేమిటీ.. ఒక్కరోజు ఏమీ ముంచుకుపోతుందేమిటీ.." అనే అభిప్రాయమైనా కావొచ్చు.

చివరగా చెప్పేదేమిటంటే, ఎవరైనా అభిమానంతో ఏదైనా తెచ్చిస్తే, దాని లోటుపాట్లు వివరించడానికి , ఓ సమయమూ, సందర్భమూ ఉండేలా చూసుకోండి.. వెంటనే అఘమేఘాలమీద చెప్పాల్సిన అవసరం లేదు.  ఇలాటి అనుభవాలు ఇంకోరికి "పాఠాలు" అయే అవకాశం కూడా ఉంటుంది..

సర్వేజనా సుఖినోభవంతూ…

మరిన్ని శీర్షికలు
beauty  of kashmir