Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
exaggerate

ఈ సంచికలో >> శీర్షికలు >>

ముక్కు పచ్చలారని కాశ్మీరం - కర్రా నాగలక్ష్మి

beauty  of kashmir

( అఖనూర్ -1 )

కిందట సంచికతో హిమాచల్ ప్రదేశ్ ను గురించిన నా వ్యాసాల పరంపర ముగిసింది .

ఈ సారి యే రాష్ట్రం గురించి రాయాలి అనేది ప్రతీసారి లాగే నా ముందున్న సమస్య .

సరే ఈ సారినాలాగే ప్రతీ భారతీయ నాగరికుడికీ యిష్టమైన జమ్ము - కాశ్మీరు లో నేను తిరిగిన ప్రదేశాలు , తీర్థస్థానాల గురించి పరిచయం చేస్తాను .

ముందుగా  రోజూ పాకిస్థానీ చొరబటుదారుల దాడులకు గురయే ప్రాంతమైన అఖనూర్ పట్టణం గురించి పరిచయం చేస్తాను .

సామాన్యంగా చాలా శాంతంగా వుండే ప్రాంతం , చొరబాటుదారులు ప్రవేశించినప్పుడు మాత్రం యీ చిన్న పట్టణం లో అలజడి చెలరేగుతుంది కాల్పుల శబ్ధాలతో ఆ ప్రాంతమంతా పతిధ్వనిస్తూ వుంటుంది . ఈ ప్రాంతం లో తరచుగా చొరబాటుదారులు మనదేశపు సరిహద్దులో ప్రవేశించడానికి ప్రయత్నిస్తూనే వుంటారు . సరిహద్దులలో జరిగే అలజడులను చాలా వరకు బయటి ప్రపంచానికి తెలియకుండా మన ఆర్మీ జాగ్రత్త పడుతూ వుంటుంది . అందుకనే మనకు న్యూస్ లో చొరబటుదారుల గురించి చూపించేది చాలా తక్కువ . ఇక్కడి ప్రాంతీయులకు యీ దాడులగురించి తెలుస్తాయి .

అందుకే యీ ప్రాంతాలలో పర్యటించాలంటే స్థానిక టాక్సీ వాళ్లు యెప్పుడో గాని రారు . తెలిసిన వాళ్లు గాని ఆర్మీ వారు గాని వుంటే యీ ప్రదేశాలు చూడ్డానికి వీలువుతుంది .

జమ్ము నగరానికి సుమారు 28 కిలో మీటర్ల దూరంలో జమ్ము రాష్ట్రం లో చినాబ్ నదికి దక్షిణ  తీరంలో వున్న అఖనూర్ పట్టణం గురించి చెప్తాను . ఈ పట్టణం పౌరాణికంగానూ చారిత్రికంగానూ కూడా ప్రసిధ్ది పొందింది .

అఖనూర్ హిమాలయాల పాదాలవద్ద వుండడం తో పచ్చని ప్రకృతి , చల్లగా స్వచ్చంగా ప్రవహించే సెలయేళ్లు , మంచుతో కప్పబడి కనువిందుచేసే హిమాలయాలకు కొదవలేదు . అలాగే ప్రకృతి సిద్దంగా యేర్పడ్డ గుహలు , వాటిని బయటకు కనిపించకుండా చేస్తూ పెరిగిన వృక్షాలు , వాటిపై అల్లుకున్న పెద్ద పెద్ద ఆకులతో వున్న తీగలు మనలను మంత్ర ముగ్ధులను చేస్తాయి . వేదకాలం నుంచి యీ గుహలలో యెందరో మునులు తపస్సులు చేసుకునే వారట , యిప్పటికీ చాలా మంది యీ గుహలలో ధ్యానం చేసుకుంటూ వుంటారు

మహాభారతం ప్రకారం పాండవులు కౌరవులతో జూదం లో ఓడి షరతు ప్రకారం పదమూడు సంవత్సరాల అరణ్యవాసం తరువాత అజ్ఞాత వాసానికై విరాటకొలువుకు వస్తారు . అఖనూరు ప్రాంతం 1627 లో మొఘల్ చక్రవర్తి జహంగీరు మరణం వరకు   విరాటనగరమనే పిలువబడేది . దీనికి నిదర్శనంగా పాండవులు నివశించిన గుహలను చూడొచ్చు . రాజస్థాన్లో వున్న ' బైరత్ ' పట్టణమైన విరాటనగరమనే వాదన వుంది . వాదనల జోలికి మనం పోవద్దు , విరాటుడు యే ప్రాంతం వాడని కాదు ముఖ్యం , మనం విహరించిన  ప్రదేశం మనకు ఆనందం యిచ్చిందా ? లేదా ? అనేది ముఖ్యం .

జమ్ము నగరం దాటేక అంతా పచ్చని ప్రకృతిలోనే సాగిన మా ప్రయాణం ఓ మోస్తరుగా వున్న గ్రామం దగ్గర నుంచి సన్నని తారు రోడ్డు పైకి మరలింది . అక్కడ ముందుగా ఆర్మీ వారు అమర్చిన బోర్డు  మా దృష్టిని ఆకర్షించింది . " పాండవోంకా తపో భూమి కో హార భరా బనా యే ( పాండవులు తపస్సు చేసుకున్న నేలను పచ్చగా చేయండి ) " అనే బోర్డు అక్కడి వరి పొలాలను చూపుతూ వుంది . మరి కొంత దూరం వెళ్లేక " గులిస్థాన్ బనా రహేగా నూర్జహాన్ కి ఆంఖోం క నూర్ అఖ నూర్ ( నూర్జహాన్ కన్నీరు జారిపడిన ప్రదేశం అఖనూరుని వుద్యానవనం గా వుంచుదాం ) .

చినాబ్ నది వొడ్డున వున్న అఖనూర్ కోటకు చేరుకున్నాం . పాడుబడిన కోట , యెన్ని యుధ్దాలు చూసిందో , యేమో . ఈ దారిగుండానే పఠానులు , మొఘలులు , యిరానీలు మన దేశంలో ప్రవేశించేరు . భారతదేశం రెండుగా చీలినపుడు మతోన్మాదుల దాడులకు తీవ్రంగా గురయినది కూడా యీ ప్రాంతమే .

1762 లో చినాబ్ నది వొడ్డున మహారాజా తేజ సింగ్ చే ప్రాంభించబడి 1802 లో రాజా ఆలం సింగ్ కాలం లో పూర్తి చెయ్యబడింది .
అవి దాటుకొని చీనాబ్ నదీ తీరం వెంట నడుస్తూ పాండవ గుహలు చేరుకున్నాం . అక్కడ యెన్నో చిన్న పెద్ద గుహలు వున్నాయి . జమ్ము కశ్మీరులో ప్రవేశించినప్పటినుండి యిక్కడి నదులలోని , పక్కలన వున్న రాళ్లు నన్ను ఆకర్షిస్తున్నాయి . నున్నగా లింగాకారంలో వున్నాయి , కొన్ని సంవత్సరాలుగా నీళ్లల్లో దొర్లుతూ ప్రవహిస్తూ వుండడం తో ఆ ఆకారాలకు వచ్చి వుంటాయి . చిన్న పెద్ద అన్ని రాళ్లు అలాగే వున్నాయి . యెంతగా నచ్చాయంటే బరువుకు వెనుదీయక చెరొకటి  అందరం మోసుకొచ్చేంత .

చీనాబ్ నది గలగల మని శబ్దం చేస్తూ ప్రవహిస్తోంది , కొన్ని గజాలదూరం వెళ్లేక నది ప్రవాహ వేగం తగ్గలేదు కాని నది నిశ్శబ్దం గా మారింది యెంతో ఆశ్చర్య మనిపించింది . అక్కడ వున్న గుహలు చూసుకొని వెనుతిరిగేం . అక్కడ వున్న గుహలలో కాల్చిన యిటుకలతో నిర్మించిన గుహ పాండవులు నివశించినది అని మాతో వచ్చిన మాకు తెలిసినతను చెప్పేరు . ఇక్కడ పర్యాటకులు తక్కువే , నది దగ్గరకి వచ్చే స్థానికులు తక్కువే . మనకి వచ్చే సందేహాలు తీర్చడానికి అక్కడ యెవరూ లేరుకూడా , యిప్పటికీ ఆ గుహలలో యిద్దరో ముగ్గురో ధ్యానం చేసుకుంటూ కనిపిస్తారు .

ఆ ప్రాంతం దాటుకొని కాస్త ముందుకు వెళ్లగా తిరిగి నది గలగలలు వినిపించ సాగాయి . గుహలున్న ప్రాంతానికి దగ్గరగా వెళితే శబ్దాలు లేవు , కొన్ని గజాల దూరం ముందుకు వెళ్లినా వెనుకకువెళ్లినా నదీ ప్రవాహ శబ్ధం వినిపిస్తోంది , కాని గుహ ప్రాంతంలో నది నిశ్శబ్దం గా వుంది . మాతో వచ్చినతను పాండవులు అజ్ఞాతవాసానికి ముందు యీ గుహలలో చాలా సమయం ధ్యానం చేస్తూ గడిపేవారని , గుహకు పహారా యిస్తున్న భీముడు నది చేసే శబ్ధంవల్ల తన తల్లికి సహోదరులకు ధ్యాన భంగం కలుగుతుంది కాబట్టి నిశ్శబ్దం గా ప్రవహించిన కోరగా చంద్రభాగానది భీముని కోరికను మన్నించి నిశ్శబ్దం గా ప్రవహించసాగిందట . పురాణ కాలంలో చంద్రభాగా నదిగా పిలువబడ్డ యీనది కాలాంతరాన చినాబ్ గా మారింది .

నాలుగయిదు మార్లు వెనక్కి ముందుకు నడిచి పరీక్షించి వేరే కారణం మాకు కనిపించక పోవడంతో ఆ కథను మేం కూడా చాలా మందికి చెప్పేం . చాలా ప్రశాంతంగా వున్నా కూడా మా స్థానిక స్నేహితుని సలహా మేరకు అక్కడ నుంచి బయలుదేరేం .

మహాభారత కాలానికి చెందిన పట్టణమా  కాదా అనే విషయం పక్కన పెడితే అఖనూరు శివాలిక్ పర్వత ప్రాంతం కలిసే ప్రదేశం లో చరిత్రకు దొరికిన ఆధారాల ప్రకారం యీ ప్రాంతం హరప్పా నాగరికత నాటిదని తేలింది  . హరప్ప నాగరికత లోని చివరగా వున్న పట్టణం కావొచ్చునని చరిత్ర కారుల అంచనా . ఇక్కడ దొరికిన టెర్రకొటా ఆధారాల ప్రకారం యీ ప్రాంతం లో హరప్ప నాగరికత వుండేదని తేలింది . అంబరన్ - పంబెర్వన్ త్రవ్వకాలలో దొరికిన బౌద్ద అవశేషాలు ఖుషాను , గుప్తులకాలం నాటివిగా చరిత్ర కారులు గుర్తించేరు . బౌద్ద మత గ్రంథాలలో యెనిమిది రకాలుగా వర్ణించిన బౌద్ద స్థూపం దొరికింది . యీ స్థూపాన్ని చూసేందుకు 14 వ దలైలామా యీ ప్రాంతాన్ని 2012 లో వచ్చేరు . ఖుషానుల కాలానికి చెందిన వెండి నగల పెట్టలు , గుప్తుల , ఖుషానుల కాలానికి చెందిన బంగారు వెండి నగలు , ముత్యాలు పగడాలు కాక గుప్తుల కాలానికి చెందిన రాగి నాణాలు కూడా లభించేయి . గుప్తుల కాలంలో పాటలీపుత్ర ( పాట్నా -బిహారు ) నుంచి తక్షశిల ( పాకిస్థాన్ లో పంజాబు ప్రోవిన్స్ ) కు వెళ్లే రాజ మార్గం అఖనూరు మీదుగానే వుండేదట .

విరాటనగరంగా 1627 వరకు పిలువబడి తరువాత అఖనూరుగా మారడం వెనుకనున్న కథ తెలియజెయ్యాలిగా మరి . ఇప్పడు ఆ కథ చెప్తాను .

మొఘల్ చక్రవర్తి జహంగీరు కశ్మీరు నుంచి ' శదబార్ ' కు ప్రయాణిస్తూ వుండగా మధ్య మార్గం లో మరణిస్తారు . రాజ్యకాంక్ష గల అతని పుతృలు జహంగీరు మరణ వార్త తెలియగానే తిరుగుబాటు చేసి రాజ్యాన్ని అల్ల కల్లోల పరుస్తారనే భయం తో  మంత్రులు అతని మరణవార్తను రహస్యంగా వుంచి అతని శరీరం లోని  ముఖ్య భాగాలను తీసి వాటిని ' ఛింగస్ ' కోటలో ఖననం చేసి ( ఈ కోట జమ్ము కశ్మీరు లోని  ' రాజోరి ' ప్రాంతం లో వుంది ) అతని పార్థివ శరీరాన్ని లాహోరుకి దగ్గరగా వున్న  ' షహదారా ' కు తరలించే టప్పు డు యీ ప్రాంతం గుండా వెళుతుండగా అతిలోక సౌందర్యవతిగా పేరు పొందిన నూర్జహాను అంతటి చక్రవర్తి పార్థివ శరీరం అతి సామాన్యంగా , అతి రహస్యంగా తీసువళ్ల వలసి వచ్చిందిగదా అని , జహంగీరు వియోగమునకు దుఃఖంచగా ఆమె కంటినుంచి కారిన నీరు పడిన ప్రదేశం కాబట్టి అఖనూరు గా పిలువబడసాగింది . స్థానికులు ' జహా గిరే నూర్జహాను కి ఆంఖోం కి నూర్ వాహ బసా షెహర్ అఖనూర్ ( ఎక్కడైతే నూర్జహాను కంటినీరు చిందిందో అక్కడ వున్న పట్టణమే అఖనూర్ '  , అఖ అంటే కళ్లు అని నూర్ అంటే నీరు ( నూర్ అంటే నూర్జహాను అని కొందరు అంటారు ) స్థానిక భాషలో అర్దం .

అఖనూర్ లో చూడదగ్గ ప్రదేశాలు 1) సుమ దేవత మందిరం 2) జియ పొటా ఘాట్  వీటి గురించి పై సంచికలో తెలుసుకుందాం . అంతవరకు శలవు .

మరిన్ని శీర్షికలు
kantini kapade shuklaalu