Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

ఇజం చిత్రసమీక్ష

ijam movie review

చిత్రం: ఇజం 
తారాగణం: కళ్యాణ్‌రామ్‌, అదితి ఆర్య, జగపతిబాబు, పోసాని కృష్ణమురళి, గొల్లపూడి మారుతీరావు, తనికెళ్ళ భరణి, అజయ్‌ ఘోష్‌, అలీ, వెన్నెల కిషోర్‌ తదితరులు. 
సినిమాటోగ్రఫీ: ముఖేష్‌ జి 
నిర్మాణం : ఎన్టీఆర్‌ ఆర్ట్‌ 
నిర్మాత: కళ్యాణ్‌రామ్‌ 
దర్శకత్వం: పూరి జగన్నాథ్‌ 
సంగీతం: అనూప్‌ రుబెన్స్‌ 
విడుదల తేదీ: 21 అక్టోబర్‌ 2016 

క్లుప్తంగా చెప్పాలంటే 
స్ట్రీట్‌ ఫైటర్‌ క(కళ్యాణ్‌రామ్‌) బ్యాంకాక్‌లోని ఓ దీవిలో ఫైట్లు చేసేస్తుంటాడు. అది అతనికో వ్యాపకం. కష్టపడకుండా డబ్బులు సంపాదించే మార్గం గురించి ఆలోచిస్తుండే కళ్యాణ్‌రామ్‌, అలియా (అదితి ఆర్య)ని చూసి మనసుపారేసుకుంటాడు. అలియా, చీకటి సామ్రాజ్యానికి అధినేత జావెద్‌ భాయ్‌ (జగపతిబాబు) కుమార్తె. ఇక్కడే ట్విస్ట్‌. స్ట్రీట్‌ఫైటర్‌ అసలు పేరు సత్య మార్తాండ్‌. అతను ఓ జర్నలిస్ట్‌. జావెద్‌ భాయ్‌ కోసం వచ్చి, అతన్ని పట్టుకోడానికి అలియాని ట్రై చేస్తాడు. ఇంతకీ సత్య మార్తాండ్‌ ఎవరు? జావెద్‌ భాయ్‌ని సత్య మార్తాండ్‌ పట్టుకోగలిగాడా? జర్నలిస్ట్‌, చీకటి సామ్రాజ్యాధినేత భాగోతాన్ని బయటపెట్టే క్రమంలో ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడు? అనేవి తెరపై చూడాల్సిందే. 

మొత్తంగా చెప్పాలంటే 
నటుడిగా కళ్యాణ్‌రామ్‌ మెచ్యూరిటీ లెవల్స్‌ ఈ సినిమాలో చాలా బాగున్నాయి. క్లయిమాక్స్‌ సీన్స్‌లో కళ్యాణ్‌రామ్‌ పెర్ఫామెన్స్‌ కట్టి పడేస్తుంది. పూరి సినిమాల్లో హీరోకి ఓ డిఫరెంట్‌ బాడీ లాంగ్వేజ్‌ ఉంటుంది. దాన్ని కళ్యాణ్‌రామ్‌ సరిగ్గా ఆపాదించుకున్నాడు. ఆ పాత్రలో ఒదిగిపోయాడు. స్టైలింగ్‌లో చాలా కేర్‌ తీసుకున్నాడు. నటుడిగా చాలా మంచి మార్కులు ఈ సినిమాతో కళ్యాణ్‌రామ్‌కి దక్కుతాయి. ఎమోషన్స్‌ పండించడంలోనే కాదు, కేర్‌లెస్‌ క్యారెక్టర్‌లోనూ చాలా బాగా నటించాడు. 

హీరోయిన్‌ అదితి ఆర్యకి ఇదే తొలి సినిమా. బాగానే చేసిందంతే. జగపతిబాబు స్టైలింగ్‌ బాగున్నా సరిగ్గా దర్శకుడు అతన్ని వాడుకోలేకపోయాడనిపిస్తుంది. పవర్‌ఫుల్‌ డాన్‌ అనే బిల్డప్‌ తప్ప, సరిగ్గా ఆ పాత్రను డిజైన్‌ చేయలేదు. మిగతా పాత్రధారులంతా తమ పాత్రల పరిధి మేర బాగా చేశారు. 

ఈ తరహా కథల్ని చాలానే చూసేశాం. వికీలీక్స్‌, నల్లధనం వంటి అంశాల్ని కథలో జొప్పించడం కొత్తదనం అనుకోవాలి. పూరి మార్క్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా మాత్రమే సినిమాని చూడాల్సి ఉంటుంది. స్క్రీన్‌ప్లే విషయంలో పూరి మార్క్‌ కన్పిస్తున్నా, ఇంకాస్త బెటర్‌గా ఉంటే బాగుండేదనిపిస్తుంది. మాట బాగున్నాయి. పాటలు వినడానికే కాదు, తెరపై చూడ్డానికీ బాగున్నాయి. ఆర్ట్‌, కాస్ట్యూమ్స్‌ సినిమాకి హెల్పయ్యాయి. ఎడిటింగ్‌ అక్కడక్కడా అవసరమనిపిస్తుంది. నిర్మాణం విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. నిర్మాణపు విలువలు అద్భుతంగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. 

ఫస్టాఫ్‌లో హీరో, హీరోయిన్‌ వెనకాల పడటం, టీజింగ్‌ సన్నివేశాలు, అప్పుడప్పుడూ యాక్షన్‌ సీన్స్‌, అక్కడక్కడా కామెడీ ఇలా సాగిపోతుంది. సెకెండాఫ్‌ చివర్లో, ప్రీ క్లయిమాక్స్‌ దగ్గర సినిమాలో జోరు పెరుగుతుంది. ఇంట్రెస్టింగ్‌ మూడ్‌లోకి తీసుకెళుతుంది. ఆ సన్నివేశం సినిమాకే హైలైట్‌. పేద్ధ డాన్‌తో హీరో ఎదుర్కొంటున్నప్పుడు, ఆ డాన్‌ని పవర్‌ఫుల్‌గా చూపించాలి. పవర్‌ఫుల్‌ డాన్‌ అనే పేరు తప్ప ఆ పవర్‌ ఆ డాన్‌ ప్రదర్శించిన సందర్భాలుండవు. తద్వారా హీరో డైనమిజం చూపించడానికి తగిన స్కోప్‌ దక్కలేదు. కళ్యాణ్‌రామ్‌ సినిమా మొత్తాన్నీ తన భుజాలపైన మోసేశాడు. యాక్షన్‌ సీన్స్‌, బాడీ లాంగ్వేజ్‌, డాన్సులు, పెర్ఫామెన్స్‌ ఇలా అన్నిటితోనూ కట్టిపడేశాడు. అక్కడక్కడా పూరి మార్క్‌ స్క్రీన్‌ప్లే చమక్కులు, డైలాగ్‌ పవర్‌ కనిపిస్తాయి. ఓవరాల్‌గా సినిమా మాస్‌ని ఓ మోస్తరుగా మెప్పిస్తుంది. 

ఒక్క మాటలో చెప్పాలంటే 
'ఇజం' ఓకే 

అంకెల్లో చెప్పాలంటే: 3 / 5

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka