Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly horoscope28th october to 3rd november

ఈ సంచికలో >> శీర్షికలు >>

ముక్కు పచ్చలారని కాశ్మీరం ( అఖనూర్ -2 , జమ్ము ) - .

అఖనూర్ కోట ---
రాజా మైన్ సింగ్ ద్వారా క్రీస్తుశకం 1762 లో మొదలు పెట్టి అతని తరువాత రాజ్యానికి వచ్చిన ఆలం సింగ్ పరిపాలన కాలంలో  1802 లో పూర్తి చెయ్యబడింది . ఈ కోటలో చాలా భాగం శిధిలమవగా రెండతస్థుల వాచ టవర్ మాత్రం యిప్పటికీ మిగిలి వుంది . చినాబ్ నదీ తీరాన కట్టబడి యెన్నో యుధ్దాలను , వేర్పాటు వాదుల దాడులను యెదుర్కొని , యీ రోజు శిధిలావస్థకు చేరుకొంది .

ఈ శిధిలాలు మానవ క్రూరత్వానికి ప్రతీకలేమో అనిపించేయి .

సుమాదేవి ---
         శివాలిక్ పర్వత పాదాలవద్ద వున్న సుంగల్ గ్రామం లో వున్న మందిరం యిది . డోగ్రి జాతీయుల ఆరాధ్య దేవత . అఖనూర్ కి సుమారు 12 కిలో మీటర్ల దూరం లో సుమహ్ సెలయేటి వొడ్డున వున్న మందిరం . పచ్చని ప్రకృతి మధ్య , స్వచ్ఛమైన సెలయేటి ప్రవాహాల పక్కన ప్రశాంత వాతావరణం తో అప్పుడూ యిప్పుడూ కూడా తాపసులకు యిష్టమైన ప్రదేశమే . ఇప్పుడు కూడా కొందరు తపస్సు చేసుకోడానికి యిక్కడకు వస్తూవుండడం గమనించవచ్చు , ఇక్కడ  ప్రాకృతికంగా యేర్పడ్డ గుహలు చాలా వున్నాయి . వీటిల్లో పాండవ గుహలను కూడా యీ మందిరం దగ్గర నుంచి చూడొచ్చు . ప్రకృతి సిధ్దమైన నీటి బుగ్గలు , సెలయేళ్లతో యీ ప్రదేశం మనోహరంగా వుంటుంది .

స్థానికుల కధనం ప్రకారం కొన్ని వందల సంవత్సరాల క్రిందట యీ ప్రాంతం లో నీటికొరత యేర్పడి , మనుషులు , పశువులు మృత్యువాత పడుతూ వుండగా యీ ప్రాంతం లో తపస్సు చేసుకుంటున్న ఓ ముని తన కమండలం లోని నీటిని కొండపై నుంచి కిందకు జార విడువగా ఆ నీరు సుమహ్ జలపాతం గా మారి ప్రజల దాహం తీర్చిందని చెప్తారు . అందుకే యిక్కడ సుమా దేవి తో పాటు సమహ్ సెలయేటిని కూడా పూజిస్తూ వుంటారు .

సుమా దేవి ' బ్రాల్ ' అనే కశ్మీరీ బ్రాహ్మణ శాఖ వారికి కులదేవత .

ఈ కోవెల ప్రాంగణం లో వున్న ఓ వృక్షం కొన్ని వందల సంవత్సరాలుగా అక్కడ వుందట , దీనిని యింగ్లీషులో ' Frangipani ' అని అంటారు ఈ వృక్షం ప్రతికూల పరిస్థితులలో కూడా నిదొక్కుకొని బ్రతికే వృక్షం కావడంతో చాలా ప్రాంతాలలోనూ , పార్కులలోనూ ప్రభుత్వం నాటించింది . ఈ మందిరం 1947 లో జరిగిన వేర్పాటు వాదుల దాడిలో బాగా దెబ్బతినగా చేసిన రిపైర్ వర్క్ అతుకుల బొంత లా వుంది . మరమ్మత్తు పని కాస్త శ్రద్ధగా చేసుంటే బాగుణ్ణు అని అని పించక మానదు .

పౌరాణికంగా యేవిధమైన ప్రాముఖ్యత లేని మందిరమైనా యిక్కడి ప్రశాంత వాతావరణానికి , ప్రకృతి సమకూర్చిన అందానికి యీ మందిరం మంచి పేరు సంపాదించుకుంది .

జియ పొటా ఘాట్ ---

చంద్రభాగానదికి ( చినాబ్ ) దక్షిణ గట్టుని ' జియ పొటా ఘాట్ ' అని అంటారు . మహా రాజా రంజిత్ సింగ్ జమ్ము ప్రాంతానికి అధికారిగా యీ ఒడ్డున వున్న 'పొటా ' వృక్షం క్రింద పట్టాభిషిక్తుడిని చెయ్యడం వల్ల యిది ఒక పర్యాటక స్థలంగా రూపు దిద్దుకుంది . స్థానిక భాషలో పొటా గా పిలువబడే ఈవృక్షాన్ని మేం మొదటిమారుగా చూసేం , దాని పేరు మాకు తెలీదు . అక్కడవున్న వారిని విచారిస్తే వారికి యీ వృక్షాన్ని పొటా వృక్షం గానే తెలుసు . డోగ్రా జాతివారు యీ వృక్షాన్ని పూజిస్తూ వుంటారు . ఆ వృక్షం 1957 లో యీ ప్రాంతం లో సంభవించిన వరదల వల్ల కూలిపోగా యిప్పుడు వున్న వృక్షాన్ని వరదల తరువాత నాటేరు . ఈ వృక్షం మీద వున్న పూజ్య భావం తో ప్రభుత్వం వారు పార్కులలోనూ , ప్రభుత్వపు ప్రదేశాలోనూ పాతించేరు .           అఖనూరు ప్రాంతం దేశ సరిహద్దుకు చాలా దగ్గరగా వుండడం తో తరచు చొరబటుదారుల తాకిడికి గురి అవుతూ వుంటుంది .
జమ్ము ----

     
    ట్రైను పఠాన్ కోట దాటిన నుంచి శివాలిక్ పర్వతాలు , నదులు , సెలయేళ్లు దాటుతూ చేసే ప్రయాణం మనలో కొత్తదనాన్ని నింపుతుంది .
         నదులలోని , సెలయేళ్ల లోనూ దొర్లుకుంటూ పోతున్న గుండ్ర టి చిన్న , పెద్ద , అతి పెద్ద రాళ్లు ఆశ్చర్యాన్ని కలుగ చేస్తాయి . ఈ రాళ్లను యిక్కడి కట్టడాలలో వుపయోగించడం గమనించవచ్చు .
            కశ్మీరు లోయ కు చేరడానికి ఆఖరు రైలు స్టేషను గా చాలా సంవత్సరాలు వుండి గత కొద్ది కాలంలో యంత్ర విజ్ఞానం పెరగడం తో కొండల మీదుగా రైలు పట్టాలు వేసి సుమారుగా శ్రీనగరు వరకు రైలు నడపబడుతోంది . హిమాలయాలకు మొదటి మెట్టుగా చెప్పుకొనే జమ్ము గురించి కాస్త తెలుసుకుందాం .
     1846 నుంచి జమ్ము ప్రోవిన్స్ కి శీతాకాలపు రాజధాని గా వుంటూ స్వాతంత్రం తరువాత జమ్ము - కశ్మీరు రాష్ట్రం యేర్పడ్డాక కూడా శీతాకాలపు రాజధానిగా కొనసాగుతోంది .
         మహాభారత కాలం నాటి నుంచి జమ్ము నగరం వున్నట్లు ఆధారాలు వుండడం , హరప్ప నాగరికత ఆనవాలు లభించడంతో చారిత్రికంగానూ కూడా జమ్ము నగరం చాలా పురాతనమైనదిగా గుర్తింపు పొందింది .
         మౌర్యులు , ఖుషానులు , ఖుషానుషాలు మరియు గుప్తుల పరిపాలనలో వుండి అనంతరం  , కాబూలు పఠానుల ఆధీనంలో వుండి , తరువాత మొఘల్ ఆధిపత్యం లో వుండి  తరువాత సిక్కుల పరిపాలనలోకి వచ్చింది . మొగలులకు , సిక్కులకు అనేక ఆధిపత్యపు పోరుల అనంతరం యిది సిక్కుల పాలనలోకి వచ్చింది .
          స్వాతంత్రం తరువాత కూడా కశ్మీరు లోయ నుంచి కశ్మీరీ పండిట్లను తరిమి వేయడం వల్ల , తరచుగా చొరబాటుదారుల ఆక్రమణల తోను యెప్పడూ జమ్ము నగరం వార్తలలో వుంటూ వచ్చింది . కొన్నాళ్లు అంతర్గత కారణాల వల్ల  , కొన్నాళ్లు చొరబాటుదారుల దారుల వల్ల బందులు , కర్ఫూల తో ప్రజలు గడుపుతూ వుంటారు . అల్లర్లను అణిచడానికి మిలటరీ యెల్లప్పుడూ తయారుగా వుంటుంది . తరచూ జరిగే ఆటంకవాదుల దాడుల వల్ల జనజీవనం అస్తవ్యస్తం అవుతూ వుంటుంది .


           సంత్సరంలో రెండు నెలలు మాత్రమే దర్శనం యిచ్చే అమర నాథ్ మందిరానికి వెళ్లే భక్తులకు  మిలిటరీ భద్రత కల్పించి , రవాణా సౌకర్యాలు కలుగజేసే ప్రాంతం కావడం తోనూ , యీ యాత్ర దేశ వ్యాప్తంగా వున్న హిందువులలో పవిత్ర యాత్ర గా పేరు పొందడం తోనూ ఆ రెండు నెలలు జమ్ము నగర స్వరూపమే మారిపోతూ వుంటుంది .
      అందుకే స్టేషన్ దాటి బయటకు రాగానే అన్ని తరగతుల వారికి అందుబాటులో వుండే రకరకాలైన  యాత్రీ నివాసాలు దర్శన మిస్తాయి .
         అష్టాదశ పీఠాలలో ఒకటైన ' వైష్ణవ దేవీ ' దర్శనార్ధులు యిక్కడ నుంచి రోడ్డు దారిన వెళ్ల వలసిరావడం తో జమ్ము రైల్వే స్టేషను బాగా రద్దీగా వుంటుంది . గత కొద్ది సంవత్సరాలుగా కొన్ని ట్రైనులు కట్రా ( వైష్ణవీ దేవి కి నడక దారి ప్రాంరంభమయే ప్రదేశం )వరకు ట్రైను సర్వీసులు నడుప బడడంతో జమ్ము కి కాస్త రద్దీ తగ్గిందనే చెప్పవచ్చు .
          భూతల స్వర్గంగా పిలువబడే కశ్మీరు లోయ భారతదేశ ప్రజలకు యెప్పుడూ ' డ్రీమ్ హాలీడే స్పాట్ ' అని అనడంలో అతిశయోక్తి యెంత మాత్రం లేదు .
        కిందట వారం చదివిన అఖనూరు పాండవ గుహలను గురించి మీ అందరికీ తెలియ చెయ్యాలనే ఆతృతలో ముందుగా జమ్ము గురించి రాయలేదు .
        జమ్ము చుట్టుపక్కల చూడవలసిన ప్రదేశాలు చాలా వున్నాయి . అవి ఒక్కొక్కటిగా పరిచయం చేస్తాను .
 ముందుగా ఆడవాళ్లకు యిష్టమైన షాపింగ్ గురించిన వివరాల  తెలియ చేస్తాను .
   కశ్మీరు అనగానే బాదం , కుంకుమ పువ్వు , అక్రోటు , పష్మిన షాల్స్ , కశ్మీరీ వర్క్ బట్టలు , తివాసీలు , కశ్మీరీ సిల్క్స్ యివన్నీ మనని యెంతో మురిపిస్తాయి . యెవరెంత వద్దని చెప్పినా మనం వినం కాబట్టి నేను యీ వ్యాసం లో యే ప్రాంతం లో షాపింగ్ చేసుకోవాలో కూడా మీకు వివరంగా తెలియజేస్తాను .
     అన్ని వివరాలతోను పై వారం మీ ముందుకు వస్తాను , అంత వరకు శలవు .

మరిన్ని శీర్షికలు
story review