Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kamanuveedhikathalu

ఈ సంచికలో >> కథలు >> చేదునిజం.

chedunijam

  “ నీ నిర్ణయం మారదా రాజేష్ “ పేలవంగా అడిగాడు చక్రవర్తి. “ఇది వెంటనే తీసుకున్న నిర్ణయం కాదు నాన్న. బాగా ఆలోచించిన తరువాత తీసుకున్న నిర్ణయం” అన్నాడు చక్రవర్తి కొడుకు రాజేష్.

“నాకు మాత్రం నువ్వు తప్ప ఇంకేవరు ఉన్నారు. నిన్ను కొడలికి విడిచి పెట్టి ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఎలా ఉండ గలను. నాకు మాత్రం మీతో కలసి ఉండాలని ఉండదా. దయ చేసి ఇంకో సారి ఆలోచించు. నా వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మిమ్మల్ని ఏ విధం గాను ఇబ్బంది పెట్టను. నాకు పదిహేను వేలు పెన్షన్ వస్తుంది. ఆ డబ్బంతా మీకే ఇస్తాను. నన్ను మాత్రం మీతో ఉండనివ్వండి. ఒక్క రోజ కూడా నిన్ను చూడకుండ ఉండ లేను” అన్నాడు చక్రవర్తి బ్రతిమాలుతున్న దోరణిలో.

“లేదు నాన్న. నాకు నీతో ఉండటం ఇష్టమే. కాని నీ కోడలుకు రాధకు ఇష్టం లేదు. దానికి కారణం ఆమెకు మంచి కంపెనిలో ఉద్యోగం వచ్చింది. పొద్దున లేచి వంట పని చేసి ఎనిమిది గంటలకు ఆఫీసుకు వెళ్ళాలి. అంతటితో అయితే ఫర్వాలేదు. నిన్ను కూడా చూసుకోవాలి. వేళకు నీకు అన్ని  అమర్చి పెట్టాలి. నీకు హోటల్ భోజనం సరి పోదు. ఖచ్చితంగా రోజు వంట చెయ్యాలి.  ఒక్కోక్కో సారి ఆఫీసు నుంచి ఆలస్యంగా ఇంటికి వస్తుంది. అది నీకు చాల ఇబ్బంది కలగ వచ్చు. టైంకు భోజనం పెట్ట లేదని నువ్వు బాధ పడ వచ్చు. ఒక వైపు నిన్ను ఇబ్బంది పెడుతూ ఇంకో వైపు తను బాధ పడటం ఆమెకు ఇష్టం లేదు. అందుకే మిమ్మల్ని ఓల్డ్  ఏజ్ హోంకు పంపించాలని నిర్ణయించుకుంది. రాధ నిర్ణయం నాకు సబబు గానే తోచింది. మేమిద్దరం ఉదయం వెళ్ళి పోతాం. రాత్రి తొమ్మిది గంటలకు కాని తిరిగి రాము. అంత వరకు నువ్వు ఒంటరిగా బిక్కు బిక్కు మంటి ఇంట్లో ఒక్కడివే ఉండాలి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. దీని వల్ల ఎవరికి ఇబ్బంది ఉండదు. నీకు హోం లో వేళకు కాఫీ టిఫిన్ భోజనం దొరుకుతుంది. ప్రతి నెల డాక్టర్ వచ్చి మీ ఆరోగ్యం సరిగ్గా ఉందో లేదో చూస్తాడు. నీతో మాట్లాడటానికి నీ వయస్సు వాళ్ళు తోడుగా ఉంటారు. నీకు టైం పాస్ అవుతుంది. వారానికి ఒక రోజు వచ్చి మేము చూసి వెళతాం. సరేనా.”అన్నాడు రాజేష్.

“ఎవరు ఉన్నా నా అన్న వాళ్ళు లేని లోటు తీరుతుందా. దయ చేసి ఇంకో సారి కోడలు పిల్లకు చెప్పు. ఆమెకు సర్ది చెప్పటానికి ప్రయత్నించు.”

“సారి నాన్న మా ఆలోచనలో ఎలాంటి మార్పు ఉండదు. రేపే నీ ప్రయాణం. సామానులు సర్దుకుని రెడిగా ఉండు” అని ఇంకో మాటకు అవకాశం ఇవ్వకుండ వేగంగా వెళ్ళి పోయాడు రాజేష్.

చక్రవర్తి హతాశుడయ్యాడు, నిస్సహాయంగా తన భార్వ ఫోటో వైపు చూశాడు. ఆ మహా తల్లి అదృష్టవంతురాలు. ఈ దారుణం చూడకుండానే వెళ్ళి పోయింది. రాజేష్ కు అయిదు సంవత్సరాలు ఉన్నప్పుడు చక్రవర్తి భార్య హఠాత్తుగా చని పోయింది. అప్పటి నుంచి అతను తనే తల్లి తండ్రి అయి కొడుకును అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశాడు. ఏది కోరిన కాదనకుండ తెచ్చి ఇచ్చాడు. తన నోరు కోరికలను అదుపు  చేసుకుని కొడుకును బి.టెక్ చదివించాడు. ఉద్యోగం వచ్చిన సంవత్సరం తరువాత రాధను ఇచ్చి పెళ్ళి చేశాడు.

పెళ్ళి చూపులలో రాధను చూసి చక్రవర్తి కి సదభిప్రాయం ఏర్పడింది. చక్కగా సంప్రదాయంగా ఉన్న ఆమెను చూసి అతను చాల ముచ్చట పడ్డాడు. తన కొడుకుకు తగిన భార్య అని అప్పటికప్పుడే నిర్ణయించు కున్నాడు. రాజేష్ కూడా తండ్రి మాట కాదన లేదు. నెల రోజుల తరువాత రాజేష్ రాధ పెళ్ళి వైభవంగా జరిగింది.

కొత్త కోడలుగా రాధ ఇంట్లో అడుగు పెట్టినప్పుడు చాల మర్యాదగా ప్రవర్తించేది. చక్రవర్తిని చాల గౌరవంతో చూసుకునేది. అతనికి వేళకు కాఫీ టిఫిన్ భోజనం అమర్చేది. ఏది చెయ్యాలన్నా ముందు చక్రవర్తి అనుమతి అడిగేది. కట్టుకున్న భర్త కంటే అతని బాగోగులు గమనించేది. కోడలు ప్రవర్తన చక్రవర్తికి ఎంతో సంతోషం కలిగించింది. ప్రపంచంలో తన కంటే అదృష్టవంతుడు ఇంకోకడు లేడని లోపల మురిసి పోయాడు. ఎంతో అనుభవం జీవితం చూసిన చక్రవర్తి ఒక చిన్న విషయం మరచి పోయాడు. ఇంగ్లీష్ లో “న్యూ బ్రూమ్ స్టిక్ స్వీప్స్ వెల్ “అని సామేత ఉంది. దాని అర్ధం కొత్త  చీపురు బాగా ఉడుస్తుందని.

ఆ మాటలు రాధకు చక్కగా సరి పోతాయి. ఆరు నెలల తరువాత ఆమె ప్రవర్తన మారి పోయింది. అసలు రంగు బయట పడింది. ప్రతి క్షణం అతన్ని చూసి విసుకునేది. అతను తమతో కలిసి ఉండటం వల్ల ఎంతో కష్టపడి పోతున్నట్టు ప్రవర్తించేది. అంతకు ముందు లాగా వేళకు టిఫిన్ కాఫీ ఇవ్వటం లేదు. చక్రవర్తి కిచెన్ లోకి వెళ్ళి  తనే అడగాలి. భోజనం కూడా సమయానికి వడ్డించేది కాదు. ఆకలితో అతను నక నక లాడి పోతున్న పట్టించు కునేది కాదు. అన్ని పనులు పూర్తి చేసుకున్న తరువాత తీరికగా అతనికి వడ్డించేది.

కోడలు ప్రవర్తనకు బాధతో కుమిలి పోయేవాడు చక్రవర్తి. ఆమె ఎంత అవమానించిన తన లోనే దాచుకునే వాడు కాని కొడకుకు చెప్పేవాడు కాడు. అన్ని అవమానాలు చీదరింపులు తన లోనే దాచుకునే వాడు. కొడుకు తనతో ఉంటున్నాడన్న సంతోషం అతని బాధలను డామినెట్ చేసింది.  ఇంకో ఆరు నెలల తరువాత ఆ సంతోషం కూడా అతనికి దూరమైంది. ఉన్నట్టుండి రాధకు ఉద్యోగం చెయ్యాలనే కోరిక కలిగింది. ఆ విషయం వెంటనే భర్త చెవిలో వేసింది. సంతోషంతో సరే అన్నాడు రాజేష్.  ఆమె అదృష్టమో చక్రవర్తి దురదృష్టమో ఆమెకు వెంటనే మంచి కంపెనిలో ఉద్యోగం వచ్చింది. అదే చక్రవర్తిని కోడుకుకు దూరం చెయ్య బోతుంది.

ఆ రాత్రంతా చక్రవర్తి నిద్ర పోలేదు. కొడుకు ప్రవర్తన తలుచుకుని కుమిలి పోయాడు. మరునాడు ఉదయం అందురు టాక్సిలో ఓల్డ్ ఏజ్ హోంకు బయలు దేరారు. మేకను బలి ఇచ్చే ముందు బాగా అలంకరించి మంచి తిండి పెడ్తారు. అలాగే చక్రవర్తిని ఓల్డ్ ఏజ్ హోంకు పంపించటానికి కావల్సిన బట్టలు సామానులు రాజేష్ స్వయంగా కొనుక్కుని వచ్చాడు.

అర గంట తరువాత కారు ఒక ఓల్డ్ ఏజ్ హోం ముందు ఆగింది. చక్రవర్తి ముందు దిగి లోపలికి వెళ్ళాడు. రెండు నిమిషాల తరువాత రాజేష్ రాధలు అతని సామానులు తీసుకుని లోపలికి వెళ్ళారు. లోపల చక్రవర్తి ఆ ఓల్డ్ ఏజ్ హోం యజమానితో నవ్వుతూ మాట్లాడుతున్నాడు. ఇద్దరికి చాల కాలం నుంచి పరిచయం ఉన్నట్టు కనిపిస్తోంది.

“ఫాదర్ డానియల్ మీరిద్దరికి చాల కాలం పరిచయం ఉన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. చక్రవర్తిగారు మీకు ముందే తెలుసా”ఆశ్చర్యంగా అడిగాడు రాజేష్.

“సరిగ్గా పదిహేను సంవత్సరాలకు ముందు చక్రవర్తి గారు ఈ హోంనుంచి ఒక అయిదుసంవత్సరాల పిల్లవాడిని పెంచుకోవటానికి తీసుకువెళ్ళారు. ఇప్పుడు ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడని అడుగుతున్నాను”అన్నాడు డానియల్. నెత్తిమీద అటంబాంబు పడినట్టు కట్రయిలా బిగుసుకుపోయాడు రాజేష్.  రాధ మొహం సున్నం కొట్టినట్టు తెల్లగా పాలిపోయింది.

మరిన్ని కథలు
kalpana