Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

అతడు..ఆమె.. ఒక రహస్యం

atadu..aame..oka rahasyam

గత..సంచికలో ఏం జరిగిందంటే ..... http://www.gotelugu.com/issue188/541/telugu-serials/atadu-aame-oka-rahasyam/atadu-aame-oka-rahasyam/

 

(గతసంచిక తరువాయి) .సిర్నాపల్లి  రాజమహల్ ముందర ఇసకేస్తే రాలనట్టుగా ఉన్నారు జనం.   చిన్న రాజావారి మరణవార్త  మధ్యాహ్నానికల్లా సంస్థానం  చుట్టుపక్కల గ్రామాలన్నింటిలోనూ  పాకిపోయింది. జనాలు తండోప తండాలుగా రాజమహల్ దగ్గరకి రావడం మొదలు పెట్టారు.

కోట ప్రధానద్వారం వద్ద కాపు కాసిన పోలీసు బలగాలు ముఖ్యమైన వ్యక్తులని తప్ప ఎవర్నీ లోపలకి వెళ్ళనివ్వడం లేదు. లోపలేం జరుగుతోందో బయటకి తెలియడం లేదు.  పోలీసులు ఎంత వారిస్తున్నా వచ్చిన జనం తిరిగి వెళ్ళడానికి ఒప్పుకోవడం లేదు.  రాజావారి మరణ వార్త విన్న షాక్ నుంచి వాళ్ళింకా కోలుకో లేకపోతున్నారు.  రాజావారు ఆత్మహత్య చేసుకున్నారని కొందరూ, ఆయన్నెవరో హత్య చేసారని కొందరూ... ఆ నోటా ఈ నోటా రకరకాల వార్తలు బయటికి వస్తుండడంతో అందరికీ మరింత అయోమయంగా అనిపిస్తోంది.

పోలీసులు వెళ్ళిపొమ్మని చెబుతున్నా వినకుండా ‘రాజావారి భౌతిక కాయాన్ని చూడనిదే అక్కడ్నించి కదలమని’  భీష్మించుకుని కూర్చున్నారు ప్రజలు.  వాళ్ళని చూస్తుంటే పోలీసు అధికారులకి విస్మయంగా అనిపించింది.  చనిపోయిన రాజేంద్ర వర్మ రాజకీయ నాయకుడు కాదు.  అతడికి ఎటువంటి పదవులూ లేవు.  ఎప్పుడో ఆ సంస్థానాన్ని  ఏలిన మహారాజు వారసుడు అంతే...   ఆ సంస్థానాధీసుల పరిపాలనలో ఆ గ్రామాలు చల్లగా ఉండేవని జనం ఇప్పటికీ కథలు కథలు గా చెప్పుకోవడం తప్ప  ఇప్పుడు అక్కడ ఉన్న జనాలలో ఎవరికీ  వారి పరిపాలన ఎలా ఉండేదో ప్రత్యక్ష్యంగా తెలియదు.   అయినా, అతడి మరణానికి చలించి  అంతమంది జనాలు తమంతట తాముగా అక్కడ వచ్చి చేరారంటే,  అతడిలో ఏదో తెలియని ఆకర్షణ శక్తి ఉండి ఉండాలి అనుకుంటున్నారు పోలీసులు. ‘ఇతడు కనుక రాజకీయాల్లోకి వచ్చి ఉంటే గొప్పగా పైకి  వచ్చి ఉండేవాడు’  అనుకుంటున్నారు పరామర్శించడానికి వచ్చిన రాజకీయ నాయకులు.

అక్కడున్న అందరి మనసుల్లోనూ ఉమ్మడిగా  తొలుస్తున్నది మాత్రం ఒకటే  ప్రశ్న... అసలు  నిజంగా రాజేంద్ర వర్మ ఆత్మహత్య చేసుకున్నాడా?  ఆత్మహత్య చేసుకోవాల్సిన అగత్యం అతడికి ఏమొచ్చింది?  పోనీ ఎవరో హత్య చేసారనుకుందామన్నా, అజాత శత్రువులాంటి అతడ్ని హత్య చేయాల్సినంత అవసరం ఎవరికి ఉంటుంది?

అక్కడ చేరిన జనమంతా అలాంటి ఆలోచనల్లో తలమునకలై ఉంటే,  రాజావారి మరణం గురించి కాక మరో విషయాన్ని ఆలోచిస్తున్న వ్యక్తి అక్కడ ఒకే ఒక్కరు ఉన్నారన్న సంగతి ఎవరికీ తెలియదు... అది ఎస్సై ఇంద్రనీల !

అతడి మరణ వార్తని అందుకుని హుటాహుటిన అక్కడికి చేరిన  ఎస్సై ఇంద్రనీల మనసులో మాత్రం వేరే ఆలోచనలు తొలుస్తున్నాయి. రాజేంద్రవర్మ మరణానికన్నా ఆమెని కలవరపెడుతున్నది వేరే విషయం ఉంది. అయినా తన మనసులోని ఆలోచనలని బయటికి తెలియనివ్వకుండా  చకచకా తన పనులు తను చేస్తోంది.  

శవం పొజిషన్ని ఫోటో  తీయించడం,  ఫోరెన్సిక్ నిపుణులతో వేలిముద్రలని సేకరించడం, ఆధారాలు దొరికే అవకాశం ఉందని  అనుకునే మహల్లోని ఇతర  ప్రదేశాలని  సీజ్ చేయించడం, అక్కడి మనుషులని ప్రశ్నలు వెయ్యడం ఎంతో అనుభవమున్నదానిలా ఒక్కచేత్తో అన్నీ తానై నడిపిస్తోంది.

ఐదడుగుల ఆరంగుళాల పొడవుతో, ఎత్తుకు తగ్గ విగ్రహంతో,   ఆకట్టుకునే ముఖవర్చస్సుతో, అన్నింటినీ మించి  చూడగానే ఎదుటి వ్యక్తిని తన  చూపులతోనే ‘కమాండ్’ చెయ్యగల ఏదో అద్భుతమైన శక్తి ఆమెకి ఉందేమోననిపించేట్టుగా ఉన్న ఆమె అందరినీ ఆకట్టుకుంటూ అక్కడికి అడుగు పెట్టిన కొద్ది సేపటికే  సిట్యుయేషన్ని మొత్తం తన కంట్ర్లోల్‍లోకి తీసుకుంది.

రాజమహల్లో ఉన్న ప్రతివారూ, తమకి తెలిసిన విషయం ఆమెకి చెప్పాలని, తమ అనుమానాలని ఆమెతో మాట్లాడి నివృత్తి చేసుకోవాలనీ ఉవ్విళ్ళూరుతున్నారు.  ఆమె మాత్రం ఎవరితో ఎప్పుడు ఎంత వరకూ మాట్లాడాలో అంతవరకే మాట్లాడుతూ  తన దృష్టినంతా  చేస్తున్న పని  మీదే కేంద్రీకరిస్తోంది.

ఒక అనుమానాస్పద మరణం జరిగిన ప్రదేశంలో చేయాల్సిన ప్రాధమిక పనులన్నీ చేసేసాక,  అన్నీ  ఒక కొలిక్కి వచ్చాయనుకున్న తరువాత అప్పుడు ఆమె డి ఎస్పీ ప్రసాద్ కి ఫోన్ చేసింది. 

“చెప్పు” అన్నాడు ఆమె ఫోస్ కోసమే ఎదురు చూస్తున్న ప్రసాద్.  ఆ రాజ కుటుంబానికి ఆ ప్రాంతంలో ఎంతటి  పలుకుబడి ఉందో అతడికి బాగా తెలుసు.    అత్యుత్సాహంతో గ్రామంలో పోస్టింగ్ తీసుకున్న ఆమెకి మొదటి రోజే ఇలాంటి  మిస్టీరియస్ కేసు దొరకడం, అదీ పెద్ద కుటుంబంలోని కేసు కావడంతో, ఆమె ఎలా డీల్  చేస్తుందోనని ఆందోళనగా ఉంది అతడికి.

“సర్, ఈ రాజా వారికి మనం అనుకున్నదానికన్నా ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. బయట జనాలు తండోపతండాలుగా ఎదురు చూస్తున్నారు ఆయన  భౌతిక కాయాన్ని చూడడానికి.  ఇలాంటి పరిస్థితుల్లో మనం బాడీని పోస్టు మార్టమ్ కోసం నిజామాబాద్   పపించాలంటే, బయట ఉన్న జనాన్ని అదుపు చెయ్యడం  కష్టమౌతుంది.  అందుకే, డాక్టర్లని ఇక్కడికే  పిలిపించి పోస్టు మార్టమ్ రాజమహల్లోనే  చేయించడం మంచిదని నాకనిపిస్తోంది” అంది.

“నాకు తెలుసు. డాక్టర్ల బృందం, మెజిస్ట్రేట్  నిజామాబాద్ నుంచి బయలు దేరారు.  మరి కొద్ది సేపట్లో అక్కడికి చేరుకుంటారు. అది సరే, అసలు ఆయన ఎలా మరణించాడు? నీ అబ్జర్వేషన్  ఏమిటి?  అందరూ అనుకుంటున్నట్టుగా ఇది ఆత్మహత్యేనంటావా?”   అన్నాడు ప్రసాద్.  రాజేంద్ర వర్మ మరణ వార్త విన్న దగ్గరనుంచీ అందరిలోనూ పుట్టిన ప్రశ్నలే అతడి మనసులోనూ పుట్టాయి.

అతడి ప్రశ్నకి మనసులో సంతోషంగా అనిపించింది ఇంద్రనీలకి.  పోలీస్ డిపార్టుమెంట్లో ఎవరూ క్రింద అధికారికి ఆదేశాలివ్వడమే తప్ప  ఏ విషయంలోనూ  ‘నువ్వేమనుకుంటున్నావు?  నీ అభిప్రాయం ఏమిటి?’ అని అడగరు.   అలాంటిది  డి ఎస్పీ తనని అలా అడిగాడంటే   చేరిన రెండు రోజుల్లోనే  డిపార్ట్‍మెంట్లో  ‘ఇమేజ్’ సంపాదించడంలో తను కృతకృత్యురాలైందన్న సంగతి అర్ధమైంది ఆమెకి. ‘మనతో ఎలా ప్రవర్తించాలో ఎదుటి మనిషికి మన ఇమేజ్ ద్వారా మనమే నేర్పిస్తామన్నది’ సైకాలజీలో ఆమె నమ్మే  సిద్దాంతం.  మనసులోనే తనని తాను అభినందించుకుంది. మాట్లాడబోయే మాటలని  ముందుగానే మెదడులో ఫ్రేమ్ చేసుకుంటూ  నెమ్మదిగా గొంతు సవరించుకుంది.

“ఇక్కడ కనిపిస్తున్న ప్రాధమిక ఆధారాలని బట్టి చూస్తే రాజేంద్ర వర్మ ఆత్మహత్య  చేసుకున్నాడనే భావించాల్సి వస్తుంది.  సూసైడ్ నోట్ కూడా ఉంది,  కాళ్ళ మీదా చేతుల మీదా ఉన్న నరాలని స్వయంగా కోసుకుని ఆత్మహత్యా ప్రయత్నం చేసాడాయన. ఆ గాయాలలోంచి అత్యధికంగా రక్తస్రావం కూడా జరిగింది.  గదిలోకి అడుగు పెట్టగానే మంచం మీద రక్తం మడుగులో ఉన్నట్టున్న  శవం భయంకరంగా కనిపిస్తోంది.  ఆ దృశ్యం ఎంత భయంకరంగా ఉందంటే, గదిలోకి అడుగు పెట్టి మొదటిసారిగా  ఆ దృశ్యాన్ని చూసిన పనిమనిషి భయంతో గట్టిగా కేకపెట్టి   స్పృహతప్పి పడిపోయింది”

“రాజమహల్లో ఇంకా ఎవరెవరు ఉన్నారు?”

“నిన్న రాత్రి ఇంట్లో రాజేంద్ర వర్మ తాతగారైన పెద్ద రాజా వారు  నరేంద్ర వర్మ తప్ప మరెవ్వరూ లేరు!  రాజేంద్ర వర్మ మేడమీదకి పడుకోవడానికి వెళ్ళాక  సాధారణంగా ఎవరూ మేడమీదకి వెళ్ళరు. నిన్న రాత్రి కూడా ఆయన పడుకోవడానికి మేడమీదకి వెళ్ళగానే ఇంట్లోని పనివాళ్ళంతా  వాళ్ళ గదుల్లోకి వెళ్ళిపోయారట. ఉదయం పనిమనిషి మేడ మీదకి వెళ్ళి శవాన్ని చూసేదాకా ఇంట్లో వాళ్ళకి ఆ విషయం  తెలియదు”

“పెద్ద రాజావారికి ఎవరిమీదైనా అనుమానం ఉందా?”

“పెద్దరాజావారితో నేనింకా మాట్లాడలేదు సర్, ఈ వార్త వినగానే ఆయన స్పృహ కోల్పోయారు.  డాక్టర్లు వచ్చి చూసాక ఇప్పుడే కోలుకున్నారు. ప్రస్తుతం ఆయన ఏమీ మాట్లాడే పరిస్థితుల్లో లేరు.   చనిపోయిన రాజేంద్ర పక్కనే సూసైడ్ నోట్ ఉండడంతో  అందరూ ప్రస్తుతానికి  ఆయన ఆత్మహత్య చేసుకున్నారనే అనుకుంటున్నారు.  ఈ ఇంట్లో  ఉండే మరో ముఖ్యమైన వ్యక్తి  రాజా సురేష్ వర్మ. పెద్దరాజా నరేంద్ర  వర్మ గారి  కూతురి కొడుకు.  చనిపోయిన  రాజేంద్ర వర్మ కి మేనబావ అవుతాడు. ఈ సంస్థానంతో  అతడికి ఏ విధంగానూ సంబంధం లేకపోయినా సంస్థానంలోనే ఉంటున్నాడు.  ఒక దారుణమైన యాక్సిడెంట్లో  పదేళ్ళ క్రితం  సురేష్ వర్మ తల్లిదండ్రులూ, రాజేంద్ర వర్మ తల్లి దండ్రులూ మరణించారు.  అపట్నుంచీ తల్లి దండ్రులు లేని సురేష్ వర్మ కూడా ఇక్కడికే తీసుకొచ్చి పెంచుతున్నారు పెద్ద రాజావారు.  ఆ సురేష్ వర్మ  రాజేంద్ర వర్మ మరణించే సమయంలో  ఇక్కడ లేడు.  ఏదో  పని మీద హైదరాబాద్ వెళ్ళాడు. ఆయనకి కబురు అందింది. బయలు దేరి వస్తున్నారని ఫోన్ చేసాడు. అతడు వస్తే మనకి  ఏమైనా సమాచారం తెలియచ్చు.   ప్రస్తుతానికి  ఎక్కడా ఏ ఆధారాన్ని వదలకుండా సేకరిస్తున్నాను”  

“గుడ్.  బయట జనం ఎక్కువగా ఉన్నారంటున్నావు. ఎలాంటి అలజడులూ రేగకుండా చూసుకో”

“సరే సర్”  అని ఫోన్ పెట్టేసింది ఆమె. 

ఫోన్ పెట్టేసాక ఆమెకెందుకో  సంతృప్తిగా అనిపించింది.  తన మాటల ద్వారా డిఎస్పీ నమ్మకాన్ని  చూరగొనగలిగిందని అర్ధమైంది ఆమెకి అతడు మాట్లాడే విధానం చూస్తే.   తను ఏ లక్ష్య సాధనకోసం మొదటి పోస్టింగ్  ఇక్కడికి వేయించుకుని వచ్చిందో, ఆ లక్ష్య సాధన సుగమమవుతుందన్న నమ్మకం ఆమెకి కలుగ సాగింది.

(ఇంద్రనీల సిర్నాపల్లికి  ప్రత్యేకంగా పోస్టింగ్  వేయించుకు వచ్చిన కారణం ఏమిటి? రాజమహల్లో ఆమె అడుగు  పెట్టడం వెనుక అసలు రహస్యం ఏమిటి? … వచ్చేవారం !)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
nagaloka yagam