Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
navvunaaluguyugaalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

ముక్కు పచ్చలారని కాశ్మీరం - కర్రానాగలక్ష్మి

( శివ ఖోడి )
 

కట్ర నుంచి 80 కిలోమీటర్ల దూరం లో వున్న అధ్భుతమైన గుహాలయం గురించి ఈ వారం తెలుసుకుందాం . ఖోడి అంటే స్థానిక భాషలో గుహ అని అర్దం , అంటే శివుడు నివాసమున్న గుహ అని చెప్పు కోవచ్చు . ఈ గుహాలయాన్ని ' ఛోటా అమర్నాధ్ ' అని ' బుఢా అమర నాథ్ ' అని కూడా స్థానికులు వ్యవహరిస్తూ వుంటారు . 

చాలా కాలం వరకు ఈ గుహాలయాన్ని  శివరాత్రి సమయంలో మాత్రమే భక్తులు దర్శించుకొనేవారు . ఆ సమయం లో మాత్రమే జమ్ము రైల్వే స్టేషను నుంచి ' రన్సూ ( చిన్న గ్రామం , యిక్కడ నుంచే శివఖోడి వరకు నడక దారి మొదలవుతుంది . ) ' వరకు బస్సులు నడప బడేవి , శివరాత్రి తరువాత రన్సూ చేరేందుకు సరి అయిన రవాణా సౌకర్యాలు లేకపోవడంతో భక్తులు వైష్ణవి దేవి ని దర్శించుకొని వెనుతిరిగేవారు .

 శివఖోడి మందిర ట్రస్ట్ యేర్పడ్డాక బస్సు సర్వీసులు మెరుగు పడి యిప్పుడు జమ్ము రైల్వే స్టేషన్ నుంచి , కట్ర నుంచి కూడా బస్సులు , టాక్సీ లు నడపబడుతున్నాయి .

రవాణా సౌకర్యాలు పెరగడంతో శివఖోడి కి భక్తుల రాకపోకలు యెక్కువవడంతో మందిర ట్రస్టు వారు భక్తుల సౌకర్యార్దం వసతి , భోజన సదుపాయాలు సమకూరుస్తున్నారు .

కట్ర నుంచి సుమారు 80 కిలోమీటర్ల దూరం అంతా కొండలు దట్టమైన అడవి కావడంతో చాలా మటుకు మట్టి రోడ్డు దాంతో ప్రయాణం మెల్లగా సాగుతుంది . 

రన్సూ ' నుంచి గుహ వరకు నడవలేని వారి కోసం గుర్రాలు , పల్లకీలు వుచిత ధరలలో లభిస్తాయి .

కొండను ఆనుకొని నడక దారి సాగుతుంది . యెత్తుపల్లాలు లేని దారి కావడంతో 3 కిలో మీటర్ల నడక సునాయాసంగా వుంటుంది . ఈ గుహ ప్రకృతి సిద్దంగా యేర్పడ్డవి .  గుహను చేరడానికి సుమారు ఓ యాభై మెట్లు యెక్కవలసి వుంటుంది . మెట్లు యెక్కిన తరువాత గుహ వెడల్పుగా సుమారు మూడు వందలమంది పట్టేటంత వెడల్పుగా వుంటుంది అక్కడ నుంచి గుహ లోని రెండో ద్వారం లోకి ప్రవేశించడానికి యిరుకైన దారిగుండా శరీరాన్ని కొండ చీలికలకు అనుగుణంగా వంచుతూ పాక్కుంటూ లోపలకు ప్రవేశించాలి . లోపల గుహ కాస్త వెడల్పు అవుతుంది , సుమారు ఒకమీటరు వెడల్పు 200 మీటర్లు పొడవు మూడు మీటర్లు యెత్తు వుంటుంది . కొన్ని చోట్ల కొండ చీలికలలోంచి నీరు కారుతూవుంటుంది . ఒక చోట దారి రెండుగా చీలు తుంది ఒకటి గుహ బయటకు వెళుతుంది మరొకటి అక్కడకి సుమారు మూడు వందల కిలోమీటర్ల దూరం లో వున్న అమర నాధ్ కి వెళుతుంది . అయితే ఆ దారిని పెద్ద రాతితో కప్పేసేరు . ఎందుకంటే ఆమధ్య ఒక సాధువు ఆ మార్గం గుండా అమర నాధ్ కి బయలు దేరి ఆచూకి తెలియకుండా పోవడంతో భద్రతా దృష్ట్యా మూసివేసినట్లు స్థానికుల కథనం . 

లోపల సహజసిద్దంగా యేర్పడ్డ నాలుగు అడుగుల యెత్తున్న లింగాకారం వుంది . అలాగే పార్వతి , వినాయకుడు , నంది , కుమారస్వామి మొదలయిన ఆకృతులు యేర్పడ్డాయి . కొండ పై కప్పు భాగాన ఆది శేషుడు అంటే పెద్ద పాము ఆకారంలో వుంటుంది దాని పడగలా కనిపిస్తున్న చోట్ల నుంచి కిందన వున్న లింగం మీద నీరు బొట్టు బొట్టు లు గా పడుతూ వుంటాయి . ఇలాంటి గుహను మేం ఉత్తరాఖండ్ లో ఆల్మోడా జిల్లాలో బెరినాగ్ దగ్గర చూసేం . ఆ గుహ చాలా పెద్దది , దానిని పాతాళ భువనేశ్వర్ అని అంటారు .

శివ పురాణం ప్రకారం ' భస్మాసురుడు ' ఘోరతపస్సాచరించి శివుని ప్రసన్నుని చేసుకొని మరణం లేకుండునట్లు వరం ప్రసాదించమనగా శివుడు అట్టి వరం యిచ్చే శక్తి తనకు లేదని చెప్పగా దానికి భస్మాసురుడు తను యెవరి తలపైన చేయి వేస్తే వారు భస్మమవాలనే వరం ప్రసాదించమనగా శివుడు ముందువెనుకలు ఆలోచించకుండా  వరాన్ని ప్రసాదిస్తాడు . మూర్ఖుడైన భస్మాసురుడు తన వరప్రభావం పరీక్షించాలని శివుని తలపై చేయి వేయుటకు శివుని వెంటపడగా  శివుడు తప్పించుకొని యీ గుహలో దాక్కున్నాడట , అప్పుడు విష్ణుమూర్తి మోహిని అవతారం ధరించి భస్మాసురుని యెదురుగా నిలువగా ఆమె ముగ్ధమోహన రూపానికి మోహవేశమునకు లోనైన భస్మాసురుడు ఆమెను వివాహమాడవలననే కోరికను వ్యక్త పరుస్తాడు . దానికి మోహిని అతనితో ప్రియపలుకులు పలుకుతూ అతని చేతిని అతని నెత్తిని పెట్టించి భస్మాసురుని అంతమొందించి తిరిగి తన నిజరూపం ధరించి వైకుంఠానికి మరలి పోతాడు . 

భస్మాసురుని నుండి తప్పించు కొనేందుకు శివుడు ఈ గుహలోనే దాక్కున్నాడట . ఈ గుహ లో శివుడు యిప్పటికీ నివశిస్తున్నాడని అంటారు . సంత్సరానికి రెండు నెలల అమర నాధ్ లో వుండి మిగతా సంవత్సరమంతా యీ గుహలో శివుడు నివసిస్తాడట . 

తర్వాత కాలంలో చాలా మంది ఋషులు మునులు యీ గుహలో తపస్సు చేసుకొని భగవంతుడి ప్రసన్నుని చేసుకున్నారని పురాణాలలో వుంది . 

ఇప్పటికీ యీ గుహలో అనేక మంది బాబాలు తపస్సు చేసుకుంటూ కనిపిస్తారు .

ఒక ముస్లిమ్ పశువుల కాపరి యీ గుహ ప్రాంతంలో పశువులు కాచుకోడానికి వచ్చి యీ గుహలో తపస్సులో వున్న మునులను చూసి గ్రామ ప్రజలకు చెప్పాడని అంటారు . ఆ కాపరి కి శివ దర్శనం జరిగినట్లుగాను , తరవాత అతను శివభక్తుడిగా మారి యీ గుహలో తపస్సు చేసుకుని , శివ సాన్నిధ్యం చేరుకున్నాడని అంటారు .

రన్సూ నుంచి ఓ కిలో మీటరు దూరంలో గవర్నమెంటు గెస్ట్ హౌసు కి దగ్గరగా వున్న చిన్న కర్ర పలకను దాటుకొని వెళితే భూమి లోంచి ఉధృతంగా బయటకు వస్తున్న నీటి జల , అంత వేగం తో భూమి లోంచి వస్తున్న నీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది . తెల్లగా పాల నురుగులా బయటకు వురుకుతున్న నీరు ఒక అద్భుతాన్ని చూస్తున్న అనుభూతినిస్తుంది . ఈ కోవెలలో ప్రతి సంవత్సరం శివరాత్రి సమయంలో మూడు రోజుల యాత్ర జరుగుతుంది , దీనికి దేశ విదేశాలనుంచి కశ్మీరీ పండిట్స్ వచ్చి యాత్రను జయప్రదం చేస్తూవుంటారు .

తత్తపాణి----

శివఖోడి నుంచి మరో రెండు కిలో మీటర్లు కొండలమీద నడక దారంట వెళితే వేడి నీటి బుగ్గలు చేరుకోవచ్చు . ఈ నీటికి యెన్నో ఔషధ గుణాలు వున్నాయని , ముఖ్యంగా చర్మరోగాలను నయం చేస్తుందని నమ్మకం , అందుకనే యీ నీటిలో స్నానాలు చేస్తూ చాలామంది కనిపిస్తారు .

కాళిక మందిరం -----

కట్ర లో యీ మధ్య కాలంలో నిర్మింపబడ్డ అందమైన మందిరం కాళీమాత కొరకు నిర్మింపబడింది . చూస్తూ వుంటే చూడాలనే అనిపించేంత అందమైన మందిరం . కట్ర వెళ్లేవారు తప్పకుండా చూడవలసిన మందిరం .

నౌ పిండియా -----

కట్ర నుండి ' రియాసి ' వెళ్లే రోడ్డుమీద కట్రకి 8 కిలోమీటర్ల దూరంలోను రియాసి గ్రామానికి 17 కిలోమీటర్ల దూరం లోను వుంది యీ గుహాలయం . సహజంగా యేర్పడ్డ యీ గుహలో తొమ్మిది పిండి( లింగాకారం ) లు వున్నాయు . ఇవి సాక్షాత్తు పార్వతీ దేవి నవరూపాలని స్థానికులు పూజిస్తూ వుంటారు . రోడ్డు దిగి కాస్త లోపలికి వెళితే యీ గుహలు కనిపిస్తాయి , కొండలపైన ప్రాకృతికంగా యేర్పడ్డ ఆకారాలు , శివుడి జటాఝాటం లాగా  గొలుసులలాగా కనిపిస్తూ వింతగా వుంటాయి . ఇలాంటి గుహలు యీకొండలలో యెన్నో వున్నాయి , మనకి ఓపిక , సమయం వుండాలే గాని . 

మళ్లావారం ఉధమ్ పూర్ , ఆ చుట్టుపక్కల ప్రదేశాల గురించి తెలియ జేస్తాను అంతవరకు శలవు .
మరిన్ని శీర్షికలు
parents need counciling